‘సెమీకాన్ ఇండియా 2024’లో ప్రధాని మోదీ
భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సెమీకండక్టర్ల డిమాండ్‌ను భారత్ తీరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ విభాగంలో భారత్‌లో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరిగిన ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
‘సమీప భవిష్యత్తులో భారత కంపెనీలకు సెమీకండక్టర్ల కొరత తీరనుంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వీటికి ఏర్పడే డిమాండ్ భర్తీ చేసే సత్తా భారత్‌కు ఉంది. విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలి. ఈ రంగంలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇన్ని విధాలా సహకరిస్తుంది. దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీ విభాగంలో దాదాపు 85,000 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఆర్ అండ్ డీ నిపుణులు పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిప్‌ల తయారీకి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నాం. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పెరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువవుతుంది’ అని ప్రధాని మోదీ తెలిపారు.
సెమీకండక్టర్ తయారీలో దేశాన్ని గ్లోబల్ హబ్‌గా మర్చే లక్ష్యంతో ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్‌ను 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారి ఆవిష్కరణల గురించి తెలియజేస్తారు. దాంతో స్థానికంగా చిప్‌ల తయారీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సదస్సులో 250 మందికి పైగా వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.
భారత సెమీకండక్టర్ మార్కెట్ ప్రస్తుతం సుమారు 23.2 బిలియన్ డాలర్ల(రూ.1.93 లక్షల కోట్లు) విలువను కలిగి ఉంది. 2028 నాటికి ఇది దాదాపు రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ విభాగం 17.10% వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఇన్వెస్ట్ ఇండియా సంస్థ నివేదించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దాంతోపాటు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సిలికాన్ ఫోటోనిక్స్‌లో ప్రత్యేకత కలిగిన మరిన్ని కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.
ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్‌కు చుక్కెదురు!
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్‌సోర్స్‌డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్‌ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐదు కంపెనీలకు వీటి తయారీ కోసం కేంద్రం అనుమతులు జారీ చేసింది. అందులో టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ఫ్యాబ్, మైక్రాన్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సీజీ పవర్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, కేన్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment