విత్తనం విఫలమైనా..  రాయల్టీ దగా! | Monsanto company conspiracy to exploit | Sakshi
Sakshi News home page

విత్తనం విఫలమైనా..  రాయల్టీ దగా!

Published Sun, Feb 11 2018 2:43 AM | Last Updated on Sun, Feb 11 2018 2:43 AM

Monsanto company conspiracy to exploit - Sakshi

మోన్‌శాంటో కంపెనీ కుట్ర

సాక్షి, హైదరాబాద్‌: ఆ విత్తనం విఫలమైందనీ తెలుసు.. దానికి పురుగులను తట్టుకునే శక్తి లేదనీ తెలుసు.. అసలు ఆ విత్తనంతో పంటంతా నాశనమైందనీ, రైతులు తీవ్రంగా నష్టపోయారనీ తెలుసు.. అయినా మళ్లీ అదే విత్తనం.. అడ్డగోలు రాయితీ వసూలు.. దేశవ్యాప్తంగా పత్తి రైతుల ఉసురుపోసుకుంటున్న ‘బీజీ–2’పత్తి విత్తనం వ్యవహారం ఇది.. దానిని అంటగట్టేందుకు మోన్‌శాంటో సంస్థ చేస్తున్న ప్రయత్నమిది. బీజీ–2 పత్తి విత్తనం విఫలమై, గులాబీరంగు పురుగు సోకడంతో గతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట నాశనమైంది. అయినా వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో అదే విత్తనాన్ని రైతులకు అంటగట్టేందుకు మోన్‌శాంటో రంగం సిద్ధం చేసింది. రాయల్టీ కూడా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. దేశంలో పత్తి విత్తన ధరలపై ఈ నెల 22న ఢిల్లీలో పత్తి విత్తన ధరల నిర్ణాయక కమిటీ సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో బీజీ విత్తనాల ధర, రాయల్టీని ఖరారు చేయనున్నారు. అందులో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ కె.కేశవులు వెళుతున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో బీజీ–2 విత్తన వాడకం, రాయల్టీపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 

ప్రత్యామ్నాయాలు సృష్టించకుండా ఎలా? 
మోన్‌శాంటో 2002లో బీటీ–1 టెక్నాలజీని ప్రవేశపెట్టింది. పత్తిని పట్టిపీడించే గులాబీరంగు పురుగును తట్టుకునేలా అభివృద్ధి చేసిన జన్యుమార్పిడి విత్తనాలను బీజీ–1గా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ 2006 నాటికి బీజీ–1 విత్తనం గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. దాంతో మోన్‌శాంటో మరోసారి జన్యుమార్పిడి చేసి బీజీ–2 పత్తి విత్తనాన్ని ప్రవేశపెట్టింది. 2012 నాటికి దీనికి కూడా గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి నశించింది. తర్వాత ఆ సంస్థ పత్తి విత్తనంలో ప్రమాదకరమైన హెర్బిసైడ్‌ టోలరెంట్‌ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువును ప్రవేశపెట్టి బీజీ–3 పత్తి విత్తనాన్ని రూపొందించింది. దానికితోడు పత్తి పంటలో కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసైట్‌ అనే పురుగు మందును తీసుకొచ్చింది. ఈ బీజీ–3, గ్లై్లఫోసైట్‌లతో పర్యావరణానికి నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తంకావడంతో కేంద్రం వాటిని దేశంలో ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వలేదు. అయినా ఈ బీజీ–3ని రహస్యంగా రైతులకు అంటగడుతున్నారు. అయితే వచ్చే ఖరీఫ్‌లో రైతులు పత్తి వేయాలంటే అధికారికంగా ప్రస్తుతం బీజీ–2 విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా ఏ పత్తి విత్తనమూ రాలేదు. దాంతో ఏ విత్తనం వేయాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. 

పనిచేయని ‘విత్తు’కు రాయల్టీ కూడా.. 
ఇప్పటికే బీజీ–2 పత్తి విఫలమైనా.. దానికి రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మోన్‌శాంటో అభివృద్ధి చేసిన విత్తనాన్ని విక్రయించుకుంటున్నందుకుగాను.. ఇక్కడి కంపెనీలు ఆ సంస్థకు చెల్లించే సొమ్మే రాయల్టీ. గతేడాది బీజీ–2 విత్తన ప్యాకెట్‌ (450 గ్రా.) ధరను రూ.781గా నిర్ణయించారు. దానికి రాయల్టీ రూ.49 కలిపి రూ.830 గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)గా ఖరారు చేశారు. ఇలా వసూలు చేస్తున్న రాయల్టీ సొమ్ము మొత్తం మోన్‌శాంటోకు వెళుతుంది. అయితే బీజీ–2ను మోన్‌శాంటోయే అభివృద్ధి చేసినా.. ఇప్పుడది ప్రభావవంతంగా లేదు. దీంతో రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని వ్యవసాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ నెల 22న ఢిల్లీలో జరిగే సమావేశంలో ఈ ఏడాది కూడా రాయల్టీ ఉండేలా మోన్‌శాంటో పావులు కదుపుతోంది. 

రాష్ట్రానికి కోటి విత్తన ప్యాకెట్లు 
ప్రపంచంలో పత్తి పండించే 80 దేశాల్లో మన దేశం 32వ స్థానంలో ఉంది. దేశంలో 2.92 కోట్ల ఎకరాల్లో పత్తి పండిస్తారు. గత ఖరీఫ్‌లో ఒక్క తెలంగాణలోనే ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ఇందుకోసం దాదాపు కోటి పత్తి విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు. అయితే గులాబీరంగు పురుగుసోకడంతో రాష్ట్రంలో పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయింది. 3.2 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. తాజా అంచనాల మేరకు 2.3 కోట్ల క్వింటాళ్లే దిగుబడి వచ్చే అవకాశముందని తేలింది. బీజీ–2 పత్తి కారణంగా రైతులు భారీగా నష్టపోయారు. 

రాయల్టీని రద్దు చేయాలి
బీజీ–2 పత్తి గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. బీజీ–3 జీవ వైవిధ్యానికి ముప్పు తెస్తుంది. పత్తిపై మోన్‌శాంటో రాయల్టీని రద్దు చేయాలి. ఇప్పుడు ఏ పత్తి విత్తనమూ రైతులకు శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈసారి పత్తికి ప్రత్యామ్నాయంగా ఆహార పంటల సాగును ప్రోత్సహించాలి..
– నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు 

కేంద్ర నిర్ణయం మేరకే.. 
పత్తి విత్తనంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 15న ఖరీఫ్‌ ప్రాంతీయ సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది..
– జగన్‌మోహన్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ 

ఏ నిర్ణయమూ తీసుకోలేదు 
ఈ నెల 22న ఢిల్లీలో పత్తి విత్తన ధరల నిర్ణాయక కమిటీ సమావేశం జరుగనుంది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. బీటీ–2 పత్తికి రాయల్టీ ఉండాలా, వద్దా అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు కలసి నిర్ధారిస్తారు. ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి..’’         – పార్థసారథి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement