
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తంగా 32లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా 27 లక్షల మేర సేకరణ పూర్తయింది. మరో 5లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను ఈ నెలాఖరు వరకు ముగించాలని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. ఖరీఫ్ సాగు ఆలస్యమైన జిల్లాల్లో సేకరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ఏడాది విస్తారంగా జరిగిన పంటల సాగు దృష్ట్యా 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా 3,284 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. అక్టోబర్ తొలివారం నుంచే ధాన్యం సేకరణను ముమ్మరం చేసింది.
ఇప్పటివరకు 3,147 కేంద్రాలను తెరిచి, శనివారం నాటికి 27లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సేకరణ పూర్తి చేసింది. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.4,700 కోట్ల వరకు ఉంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 4.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కామారెడ్డిలో 3.17లక్షలు, కరీంనగర్‌లో 2.24 లక్షలు, నల్లగొండలో 2లక్షలు, జగిత్యాలలో 2.31లక్షలు, మెదక్‌లో 1.54 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తి చేసింది. సేకరణ అధికంగా జరిగిన జిల్లాలో ఇప్పటికే వెయ్యికి పైగా కేంద్రాలను మూసివేశారు.
గత ఏడాది ఇదే సమయానికి 14లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరగ్గా, ఈ ఏడాది డిసెంబర్‌లోనే కొనుగోళ్లు ముగింపుకు రావడం గమనార్హం. ఇక ఆలస్యంగా ఖరీఫ్‌సాగు జరిగిన ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లిలో నెలాఖరు వరకు సేకరణ సాగనుంది. ఈ జిల్లాల్లోనే దాదాపు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాల్సి ఉంది. సేకరించిన ధాన్యంలో ఇప్పటికే 20 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment