విత్తన శుద్ధి కేంద్రం ఇలా...
* పరిశోధనలకు దూరంగా సామర్లకోట వ్యవసాయ క్షేత్రం
* అధికారులూ లేరు.. సిబ్బంది కరువు
* శిథిలస్థితిలో క్వార్టర్లు
* రైతులకు చేరని సేవలు
సామర్లకోట : సామర్లకోట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఒకప్పుడు రాష్ట్రంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తన పరిశోధనలతో ప్రత్యేక స్థానం నిలుపుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పరిశోధనలు లేవు సరికదా భవనాలు శిథిలమైపోయి.. క్వార్టర్లు పాడైపోయి.. సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే నిరుపయోగంగా మారింది. సాంకేతికతకు దూరం అయింది.
ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి..
1902లో గోదావరి, ఏలేరు కాలువ ముఖ్య కూడలి ప్రదేశంలో 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశారు. సిబ్బంది క్వార్టర్లు కోసమే సుమారు 10 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 30 ఎకరాల్లో వివిధ పంటలు పండించి రైతులల్లో అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలో 40 ఏళ్ల క్రితం సన్న బియ్యం పరిశోధనలో భాగంగా ఎస్‌ఎల్‌ఓ (సామర్లకోట) అక్కుళ్లు వరి వంగడాన్ని ఉత్పత్తి చేశారు. అప్పట్లో ఎస్‌ఎల్‌ఓ అక్కుళ్లుకు రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది. అయితే ఆ తరువాత నుంచి ఇక్కడ పరిశోధన లు కరువయ్యాయి. శాస్త్రవేత్తలు, అధికారులు దృష్టి పెట్టడం మానేశారు.
దీంతో ఈ కేంద్రం రైతులకు విత్తనాలు ఉత్పత్తి చేయడానికే పరిమితం అయింది. అప్పట్లో ఇక్కడ ఏడీఏతో పాటు ముగ్గురు వ్యవసాయ అధికారులు, ఇద్దరు వ్యవసాయ విస్తరణాధికారులు, ఇతర సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ఇన్‌చార్జి ఏడీఏతో పాటు ఒక వ్యవసాయాధికారి మాత్రమే పని చేస్తున్నారు. కేంద్రంలో పంటలను పర్యవేక్షించేందుకు సిబ్బంది ఉండేలా నిర్మించిన క్వార్టర్లు శిథిలమయ్యాయి. వీటిల్లో ఎవరూ ఉండడం లేదు. క్వార్టర్లలో తుప్పలు పెరిగిపోయి పాములకు నిలయంగా మారాయి.
సాంకేతికకూ దూరం
గతంలో వ్యవసాయ ఉత్పత్తిలో వచ్చిన సాంకేతిక పద్ధతులను అవలంబించి వాటి ఫలితాలను రైతులకు వివరించేవారు. 2008లో వరినాట్ల యంత్రాలు, వరి కోత యంత్రాలు తీసుకువచ్చి రైతులకు ఆర్భాటంగా పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం సాంకేతిక పద్ధతుల గురించి అధికారులు పట్టించుకోవడం మానేశారు. వెదజల్లు పద్ధతి, డ్రమ్ము సీడర్లు ద్వారా వరి విత్తనాలు వేసి ఖర్చు తగ్గించుకోవడం, అధిక దిగుబడులు సాధించడం తదితర వాటి గురించి అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ కేంద్రంలో మాత్రం వ్యవసాయ కూలీలతో వరినాట్లు వేయిస్తున్నారు. అలాగే కేంద్రంలో వర్మి కంపోస్టు తయారీ కేంద్రాన్ని ప్రారంభించి వదిలేశారు. వర్మి కంపోస్టు తయారు చేసుకునే రైతులకు వానపాములు అందజేసే నిమిత్తం వానపాముల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి పట్టించుకోవడం మానేశారు.
భూముల ఆక్రమణ
వ్యవసాయ క్షేత్రానికి చెందిన 30 ఎకరాల భూమిలో కొంత మేర ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆక్రమణలు జరినట్టు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రంపై ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థకావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అభివృద్ధి పథంలో పెట్టాలని కోరుతున్నారు.