ఐటీ గుబులు! | Income Tax Department searches during elections | Sakshi
Sakshi News home page

ఐటీ గుబులు!

Published Mon, Nov 20 2023 4:32 AM | Last Updated on Mon, Nov 20 2023 4:32 AM

Income Tax Department searches during elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత నెల రోజులుగా ఆదాయపన్నుశాఖ అధికారుల వరుస సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల పోటీలో హోరాహోరీగా పోరాడుతున్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల్లో ఐటీ గుబులు ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల్లో తమకు ఆర్థిక ‘సర్దుబాట్లు’ చేసే బంధువులు, సన్నిహితులపైనా ఆదాయపన్నుశాఖలోని ఐటీ ఇంటెలిజెన్స్‌ ఫోకస్‌ పెట్టడం నాయకులను కలవరపెడుతోంది. అధికా రులు పక్కా సమాచారంతో క్షేత్ర స్థాయిలో సోదాలు చేస్తు న్నారు. రానున్న రోజుల్లో ఎప్పుడు..ఎవరిపైన  సోదాలు జరుగుతాయోనన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.

ఇటీవల ఐటీ  చేపట్టిన ప్రధాన తనిఖీలు ఇలా...
అక్టోబర్‌ 5న ఫైనాన్స్, చిట్‌ఫండ్, ఈకామర్స్‌ వ్యాపారుల ఆర్ధికలావాదేవీలలో అవకతవకలపై ఆదాయపన్నుశాఖ  వంద బృందాలతో ఏక కాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని సుమారు 24 ప్రాంతాల్లో ఆక స్మిక సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడులకు చెందిన ఐటీ అధికారులు సైతం ఈ సోదాల్లో పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్‌పల్లి హిందు ఫారŠూచ్యన్‌ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్‌ వరప్రసాద్‌  ఇళ్లు,  వీరి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ బంధువులు, స్నేహితుల వ్యాపారాల లక్ష్యంగానే నాటి సోదాలు జరిగినట్టు మీడియాలో ప్రచారం జరిగింది.

నవంబర్‌ 2న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్‌), బడంగ్‌ పేట్‌ మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వీరి బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. మహేశ్వరం టికెట్‌ కోసం భారీ ఎత్తున లాబీయింగ్‌ జరగడంతో కేఎల్‌ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఆర్థికలావాదేవీలపై ఐటీ నిఘా పెట్టింది.

ఇద్దరికీ చెందిన కంపెనీలు, సంస్థలకు చెందిన వివరాలు సేకరించింది. ఈ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున డబ్బు సమీకరించారనే సమాచారంతో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్టు ప్రచారం జరిగింది. అదే రోజు బాలాపూర్‌ లడ్డును వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.

నవంబర్‌ 2న కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు గిరిధర్‌ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా ఉన్న గిరిధర్‌ రెడ్డికి చెందిన కోకాపేట హిడెన్‌ గార్డెన్‌ లోని నివాసంలో సోదాలు  చేపట్టిన విషయం తెలిసిందే.

ఈనెల 9, 10 తేదీల్లో పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని పొంగు లేటి నివాసంతో పాటు నందగిరిహిల్స్‌ వంశీరామ్‌జ్యోతి హిల్‌ రిడ్జ్‌లోని ఫ్లాట్, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని రాఘవ ప్రైడ్, బేగంపేటలోని ఆఫీసుల్లో   దాడులు చేశారు. అదే సమయంలో ఖమ్మంలోని ఆయన నివాసంలోనూ సోదాలు కొనసాగాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన రోజే ఐటీ సోదాలు జరగడం కొంత కలకలం సృష్టించింది.

ఈనెల 13న నుంచి వరుసగా రెండు రోజులపాటు నగరంలోని  ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధులు ప్రదీప్‌రెడ్డి, కె నరేంద్రరెడ్డి ఇళ్లల్లో ఐటీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సంగారెడ్డి,మేడ్చల్‌ జిల్లాల్లోని మొత్తం13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు నిర్వహించిన ఈ సోదాల్లో ఎలాంటి లెక్కల్లో లేని రూ.7.50 కోట్లు సీజ్‌ చేసినట్లు సమాచారం. ఐటీ సోదాలు జరిగిన ఫార్మా వ్యాపారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులని ప్రచారం జరిగింది. ఆ కోణంలోనే ఐటీ దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి.

తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్ల వారుజాము వరకు అజీజ్‌ నగర్‌లోని శ్రీనిధి విద్యా సంస్థ చైర్మన్‌ కేటీ మహి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొన సాగాయి. ఆయనకి  సంబంధించిన ఫుట్‌ బాల్‌ అకా డమీ, క్రికెట్‌  అకాడమీ  కార్యాలయాల్లో సైతం ఐటీ అధి కారుల తనిఖీలు కొనసాగాయి.

ఓఆర్‌ఆర్‌ అప్పా కూడలి వద్ద శనివారం సాయంత్రం పోలీసులు తనిఖీల్లో ఆరు కారులలో  తరలిస్తున్న సరైన పత్రాలు లేని రూ.7.50 కోట్ల నగదును పోలీసులకు పట్టుబడడం, ఈ సొమ్మును ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కోసం తరలిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే  శ్రీనిధి విద్యా సంస్థ చైర్మన్‌ కే టీ మహి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆదివారం తెల్లవారు జాము వరకు సోదాలు చేసిన అధికారులకు రూ.12 లక్షల నగదు, విలువైన పత్రాలు లభించాయి. 

నోటీసులు జారీ  
శ్రీనిధి గ్రూప్‌ చైర్మన్‌ ఇంట్లో నుంచి నగదు పట్టుబడిన కేసు లో పోలీసులు 10 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సమీప బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రధాన పార్టీ నేత కోసమే ఈ నగదును తీసుకెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీజ్‌ చేసిన నగదును పోలీసులు సోమవారం కోర్టులో డిపాజిట్‌ చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement