Investigations
-
రెప్పవాలితే చాలు!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో అల్వాల్ వెంకటాపురానికి చెందిన నవ దంపతులు బాల కిరణ్, కావ్య సహా ఐదుగురు.. ఉత్తరాంధ్రలోని కాశీబుగ్గ వద్ద చైతన్యపురికి చెందిన వేదవతి, వెంకటయ్య..ఇలా ఎందరో డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘ ప్రయాణం, తగినంత విశ్రాంతి లేకుండా వాహనాలు నడపడం వల్ల నిద్ర మత్తులోకి జారుకుంటున్న డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఏటా లక్షలాది మంది డ్రైవర్లు, ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం నిద్రమత్తు వల్లే చోటు చేసుకుంటున్నాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా డ్రైవర్ల పని వేళలకు సంబంధించిన చట్టం అమలు కావడంతో పాటు సాంకేతికంగానూ అనేక మార్పులు వస్తేనే ఈ ప్రమాదాలకు ఫుల్స్టాప్ పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలసటే ప్రధాన కారణం దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులు..అలాగే హైదరాబాద్‌లోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వంటి కీలక రోడ్లపై ప్రయాణించే వాహనాల్లో అత్యధికం ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందినవే అయినప్పటికీ.. వ్యక్తిగత రవాణా వాహనాలు, ప్రైవేటు వాహనాలు సైతం పెద్ద సంఖ్యలోనే రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి గమ్య స్థానాలకు సరుకు రవాణా చేసే వాహనాల డ్రైవర్లకు అవసరమైన విశ్రాంతి ఉండదు. ఎన్ని ట్రిప్పులు ఎక్కువ వేయిస్తే అంత ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే ధోరణితో యాజమాన్యాలు పని చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతుంటాయి. రిలీవర్ రాకపోవడం, ఇతరత్రా కారణాలతో విశ్రాంతి ఇవ్వకుండా పని చేయిస్తుంటాయి. ఇక వివిధ పనులపై వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే వారు సైతం వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలనుకుంటారు. త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోవాలనుకుంటారు. తగినంత విశ్రాంతి లేకుండా వేగంగా డ్రైవ్ చేస్తుంటారు. అలసటతో నిద్రమత్తుకు గురై వాహనంపై నియంత్రణ కోల్పోతారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టునో, నిలిపి ఉంచిన లారీ లాంటి ఏ భారీ వాహనాన్నో ఢీకొట్టేస్తారు. ఇలాంటి ఘటనల్లో ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రోడ్డు పక్కన ఆపినా.. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లలో కొందరు కాస్త అలసట తీర్చుకుందామనో, టీ తాగుదామనో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఉంచడం ప్రమాదాలకు కారణమవుతోంది. డ్రైవర్లు తామ వాహనాలను పార్కింగ్ చేసుకుని సేద తీరేందుకు అవసరమైన స్థలాలు అన్నిచోట్లా అందుబాటులో ఉండట్లేదు. చాలావరకు దాబాలు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల వద్దే వీరు తమ వాహనాలను ఆపి ఉంచుతున్నా.. మరికొందరు వెంటనే వెళ్లిపోదామనో, ఇతరత్రా కారణాలతోనో రహదారికి పక్కగానే ఆపుతున్నారు. ఇది అనేక సందర్భాల్లో ఎదుటి వారికి, కొన్నిసార్లు వారికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ వాహనాలు సరిగా కనబడక పోవడం, అలసట, నిద్రావస్థలో ఆదమరిచి ఉండటం లాంటి కారణాలతో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీ కొంటున్నాయి. బ్లాక్ స్పాట్స్ వద్ద నిలుపుతున్న సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారులపై తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను పోలీసులు గుర్తిస్తుంటారు. వీటినే సాంకేతిక పరిభాషలో బ్లాక్‌స్పాట్స్ అంటారు. ఇలాంటి బ్లాక్‌స్పాట్స్ హైవేలపై ఎక్కువగా ఉంటున్నాయి. ఎంవీ యాక్ట్ ఏం చెబుతోందంటే... ప్రతి రవాణా వాహనంలో డ్రైవర్‌తో పాటు ఖచ్చితంగా కో–డ్రైవర్ ఉండాలని మోటారు వాహనాల చట్టం స్పష్టం చేస్తోంది. డ్రైవర్లు రోజుకు కేవలం పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలి. డ్రైవర్ విధులు నిర్వర్తించే ఎనిమిది గంటల కాలంలో ఖచ్చితంగా రెండు గంటల విశ్రాంతి ఉండాలి. తన వాహనం ద్వారా ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఆ సమాచారాన్ని పోలీసులకు తెలిపి తీరాలి. రహదారుల పక్కన నిర్దేశిత ప్రాంతాల్లో మినహా ఎక్కడా వాహనాలను పార్క్ చేయకూడదు. ఈ నిబంధనలు కేవలం రవాణా వాహనాలకే కాదు.. వ్యక్తిగత వాహనాల డ్రైవర్లకూ వర్తిస్తాయి. అయితే ఇవి ఎక్కడా అమలుకాని కారణంగానే హైవేలు, ఇతర మార్గాలపై ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రమాదాల నివారణకు పరిశోధనలు ఏటా లక్షల మందిని మింగుతున్న కారు ప్రమాదాల నివారణకు ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ సంస్థలు దశాబ్దాలుగా ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. వీటి ఫలితంగానే 1948లో రోడ్ గ్రిప్, ఆ తర్వాత రేడియల్ గ్రిప్ టైర్లు అందుబాటులోకి వచ్చాయి. 1958లో ఓల్వో కంపెనీ సీటుబెల్ట్‌ను కనుగొంది. తర్వాత ఎయిర్ బ్యాగులూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రధానంగా మూడు అంశాలపై ఆటోమొబైల్ కంపెనీల పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి కూడా సాకారమైతే కారు ప్రమాదాలకు దాదాపు ఫుల్స్టాప్ పెట్టొచ్చని మోటారు వాహన రంగ నిపుణులు చెప్తున్నారు. ఆటో బ్రేకింగ్ ముందున్న వాహనాలు/వస్తువులు కారుకు సమీపంలోకి రాగానే కారులో ఉండే సెన్సర్లు పని చేస్తాయి. బ్రేకులు వాటంతట అవే పడేలా చేస్తాయి. ఈ టెక్నాల జీ ప్రస్తుతం స్వీడన్లో ప్రయోగాల దశలో ఉంది. ఇంటెలిజెంట్ విండ్ స్క్రీన్ డ్రైవర్ కారు నడిపేప్పుడు అతడు నిద్రలో జోగకుండా, అతని దృష్టి మళ్లకుండా ఇది ఉపకరిస్తుంది. డ్రైవర్ సరిగా చూస్తున్నాడా? ఎటు చూస్తున్నాడనే దాన్ని గమనిస్తూ అప్రమత్తం చేస్తుంది. రోడ్ల అంచులు, వాహనం స్థితి తదితరాలను సూచిస్తుంది. క్రాష్ టెస్ట్ డమ్మీ కారు నడిపే వ్యక్తి పర్సనాలిటీ ఆధారంగా ఎక్కడ ఢీ కొంటే ఏ అవయవాలు దెబ్బతింటాయి అనేది నిర్థారిస్తుంది. ఇప్పటికే 100కు పైగా నమూనాలు రూపొందించిన ఈ టెక్నాలజీతో వ్యక్తికి తగ్గట్టుగా భద్రతా ప్రమాణాలను కారులో ఏర్పాటు చేసేందుకు వీలుగా పరిశోధనలు సాగుతున్నాయి. మానవ తప్పిదాలను నివారించాలి వాహనం ఎంతటి భద్రతా ప్రమాణాలతో కూడినదైనా, ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అతి ఎక్కువగా ప్రమాదాలకు కారణమయ్యే మానవ తప్పిదాలను నివారించకపోతే ఫలితం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరిగా రాకపోయినా వాహనం నడపడం, హైవే డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగం, వాహనాన్ని అదుపు చేయలేక పోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్ ధరించడంలో నిర్లక్ష్యం వహించడం లాంటివి నివారిస్తేనే ఏ టెక్నాలజీతోనైనా పూర్తి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. -
ఐటీ గుబులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత నెల రోజులుగా ఆదాయపన్నుశాఖ అధికారుల వరుస సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల పోటీలో హోరాహోరీగా పోరాడుతున్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో ఐటీ గుబులు ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల్లో తమకు ఆర్థిక ‘సర్దుబాట్లు’ చేసే బంధువులు, సన్నిహితులపైనా ఆదాయపన్నుశాఖలోని ఐటీ ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టడం నాయకులను కలవరపెడుతోంది. అధికా రులు పక్కా సమాచారంతో క్షేత్ర స్థాయిలో సోదాలు చేస్తు న్నారు. రానున్న రోజుల్లో ఎప్పుడు..ఎవరిపైన సోదాలు జరుగుతాయోనన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఇటీవల ఐటీ చేపట్టిన ప్రధాన తనిఖీలు ఇలా... ♦ అక్టోబర్ 5న ఫైనాన్స్, చిట్‌ఫండ్, ఈకామర్స్ వ్యాపారుల ఆర్ధికలావాదేవీలలో అవకతవకలపై ఆదాయపన్నుశాఖ వంద బృందాలతో ఏక కాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని సుమారు 24 ప్రాంతాల్లో ఆక స్మిక సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడులకు చెందిన ఐటీ అధికారులు సైతం ఈ సోదాల్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్పల్లి హిందు ఫారŠూచ్యన్ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లు, వీరి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బంధువులు, స్నేహితుల వ్యాపారాల లక్ష్యంగానే నాటి సోదాలు జరిగినట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ♦ నవంబర్ 2న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వీరి బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఆర్థికలావాదేవీలపై ఐటీ నిఘా పెట్టింది. ఇద్దరికీ చెందిన కంపెనీలు, సంస్థలకు చెందిన వివరాలు సేకరించింది. ఈ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున డబ్బు సమీకరించారనే సమాచారంతో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్టు ప్రచారం జరిగింది. అదే రోజు బాలాపూర్ లడ్డును వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ♦ నవంబర్ 2న కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న గిరిధర్ రెడ్డికి చెందిన కోకాపేట హిడెన్ గార్డెన్ లోని నివాసంలో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ♦ ఈనెల 9, 10 తేదీల్లో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని పొంగు లేటి నివాసంతో పాటు నందగిరిహిల్స్ వంశీరామ్‌జ్యోతి హిల్ రిడ్జ్‌లోని ఫ్లాట్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని రాఘవ ప్రైడ్, బేగంపేటలోని ఆఫీసుల్లో దాడులు చేశారు. అదే సమయంలో ఖమ్మంలోని ఆయన నివాసంలోనూ సోదాలు కొనసాగాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లిన రోజే ఐటీ సోదాలు జరగడం కొంత కలకలం సృష్టించింది. ♦ ఈనెల 13న నుంచి వరుసగా రెండు రోజులపాటు నగరంలోని ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధులు ప్రదీప్‌రెడ్డి, కె నరేంద్రరెడ్డి ఇళ్లల్లో ఐటీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లోని మొత్తం13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు నిర్వహించిన ఈ సోదాల్లో ఎలాంటి లెక్కల్లో లేని రూ.7.50 కోట్లు సీజ్ చేసినట్లు సమాచారం. ఐటీ సోదాలు జరిగిన ఫార్మా వ్యాపారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులని ప్రచారం జరిగింది. ఆ కోణంలోనే ఐటీ దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ♦ తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్ల వారుజాము వరకు అజీజ్ నగర్‌లోని శ్రీనిధి విద్యా సంస్థ చైర్మన్ కేటీ మహి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొన సాగాయి. ఆయనకి సంబంధించిన ఫుట్ బాల్ అకా డమీ, క్రికెట్ అకాడమీ కార్యాలయాల్లో సైతం ఐటీ అధి కారుల తనిఖీలు కొనసాగాయి. ఓఆర్ఆర్ అప్పా కూడలి వద్ద శనివారం సాయంత్రం పోలీసులు తనిఖీల్లో ఆరు కారులలో తరలిస్తున్న సరైన పత్రాలు లేని రూ.7.50 కోట్ల నగదును పోలీసులకు పట్టుబడడం, ఈ సొమ్మును ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కోసం తరలిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీనిధి విద్యా సంస్థ చైర్మన్ కే టీ మహి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆదివారం తెల్లవారు జాము వరకు సోదాలు చేసిన అధికారులకు రూ.12 లక్షల నగదు, విలువైన పత్రాలు లభించాయి. నోటీసులు జారీ శ్రీనిధి గ్రూప్ చైర్మన్ ఇంట్లో నుంచి నగదు పట్టుబడిన కేసు లో పోలీసులు 10 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సమీప బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రధాన పార్టీ నేత కోసమే ఈ నగదును తీసుకెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన నగదును పోలీసులు సోమవారం కోర్టులో డిపాజిట్ చేయనున్నారు. -
‘నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ దాడులు’
భోపాల్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లో కూడా వచ్చే నాలుగు రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు సోదాలు జరిపే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఇటీవలే రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై సోదాలు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఆదివారం భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ఈ దాడులను ప్రస్తావించారు. ఒకపక్క అధికారులను వేధిస్తున్న బీజేపీ నేతలు, మరోపక్క రాజస్తాన్ లో మాదిరిగా మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ సోదా లు జరిపిస్తారని అన్నారు. దాడులు జరగటానికి అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లను ఆయన పేర్కొన్నారు. -
బెంగాల్ మంత్రి నివాసాల్లో ఈడీ సోదాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతిప్రియో మల్లిక్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు ప్రారంభించారు. బెంగాల్లో రేషన్ సరుకుల పంపిణీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు కోల్‌కతాలో మంత్రికి చెందిన రెండు నివాసాల్లో సోదాలు ప్రారంభించారు. ఆయన మాజీ వ్యక్తిగత సహాయకుడి ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. జ్యోతిప్రియో మల్లిక్ గతంలో ఆహార శాఖ మంత్రి పనిచేశారు. ఆ సమయంలోనే రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో మంత్రితో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. మంత్రి బ్యాంకు ఖాతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, అనుమానాస్పద లావాదేవీలపై ఆయనను ప్రశి్నస్తున్నామని అధికారులు వెల్లడించారు. -
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్‌లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్‌లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్‌లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్‌నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్‌లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్‌ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్‌తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్‌కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పవన్ ముంజాల్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ ముంజాల్‌తోపాటు ఇతరుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుర్గావ్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు. పవన్ ముంజాల్‌తోపాటు ఇతర నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ గతంలోనే కేసు నమోదు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్(సీబీఐసీ) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తునకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని హీరో మోటో కార్ప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్లో పవన్ ముంజాల్ నివాసం, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిగాయని తెలియజేసింది. పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ గత ఏడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. -
మున్సిపల్ నియామకాల్లో అవకతవకలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మున్సిపల్ కార్పోరేషన్లలో నియామకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. డమ్ డమ్, హలీసహర్, బడా నగర్ మున్సిపల్ కార్పొరేషన్లుసహా మొత్తం 14 కార్పోరేషన్ల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అయాన్ సిల్, అతని ఆఫీస్, మరో ముగ్గురికి చెందిన ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. సాల్ట్ లేక్ ప్రాంతంలోని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. ముడుపులు తీసుకుని కొలువులు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సీబీఐ రంగప్రవేశం చేసింది. అయితే ఇదంతా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలో భాగమని పశ్చిమబెంగాల్ రాష్ట్ర మన్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యానించారు. -
టెక్ ప్రపంచంలో పంచేంద్రియాలు!
దొడ్డ శ్రీనివాసరెడ్డి మనిషి సృష్టించిన టెక్నాలజీ ఇప్పుడు మరో మనిషిని సృష్టించబోతోంది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మనిషి మెదడును అనుకరించేందుకు ప్రయత్నిస్తు్తంటే.. దాని సాయంతో మన పంచేంద్రియాలకు ప్రత్యామ్నాయాలను సృష్టించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం చేసే పనులైన చూపు, వాసన, వినికిడి, రుచి, స్పర్శలను ఆస్వాదించగల కృత్రిమ పరికరాల తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలు అవుతున్నారు. జ్ఞానేంద్రియాల్లోని లోపాలను సరిచేయడం, వాటి పనితీరును మెరుగుపర్చడంతోపాటు పూర్తిస్థాయిలో కృత్రిమంగానే.. మరింత సమర్థంగా రూపుదిద్దేందుకు ప్రత్యామ్నాయ పరికరాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. లక్షల మంది చూపులేని అంధులు, కోట్ల మంది దృష్టి లోపాలతో బాధ పడుతున్నవారు ప్రపంచంలో ఉన్నారు. చేతులు, కాళ్లు కోల్పోయి, కృత్రిమ అవయవాలతో కాలం గడుపుతున్న వికలాంగులూ ఉన్నారు. కరోనా బారినపడిన కోట్లాది మంది బాధితులు రుచి, వాసన జ్ఞానం కోల్పోవడం మనం గమనించాం. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి, మరింత సమర్థంగా జ్ఞానేంద్రియాలు పనిచేసేలా కృత్రిమ మేధతో ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలను అవలోకనం చేసుకుందాం. చూపు మనిషి కళ్లు, కంటిచూపుపై చిరకాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చూపులేని, కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ సాగుతోంది. ఇలాంటి వారి కోసం ‘ఆర్‌కామ్ మైఐ’అనే పరికరం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరాన్ని కళ్లజోడుకు అమర్చుకుంటే మాటల ద్వారా అవసరమైన సమాచారాన్ని అంధులు, కంటిచూపు సరిగా లేనివారు పొందవచ్చు. చిన్న వైర్లెస్ కెమెరా కలిగిఉన్న ఈ పరికరం ద్వారా మన ముందున్న ఏ వస్తువునైనా మాటల ద్వారా అభివర్ణిస్తుంది. మనం తెలుసుకోవాల్సిన వస్తువు వైపు చూస్తూ పరికరాన్ని ఆన్ చేస్తే చాలు... దానికి అమర్చి ఉన్న స్పీకర్ ద్వారా ఆ వస్తువు గురించి వివరిస్తుంది. వార్త, కథనం గురించి తెలుసుకోవాలన్నా ఈ ఆర్నమ్ మై ఐ ద్వారా చదివి వినిపించుకోవచ్చు. వినియోగ వస్తువుల బార్ కోడులను చదివి వాటి వివరాలను కూడా అందిస్తుంది. దాంతో అంధులు కూడా ఎవరి సాయం లేకుండా ధైర్యంగా షాపింగ్ చేయవచ్చు. ► కంటిచూపు సమస్యలు ఉన్న వారికోసం జార్జియా యూనివర్సిటీ ‘మిరా’అనే పరికరాన్ని రూపొందించింది. కృత్రిమ మేధతో పనిచేసే ఆ పరికరాన్ని వీపు భాగంలో తగిలించుకుంటే చాలు... అంధులు కూడా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఈ పరికరం నిరంతరాయంగా మన పరిసరాల గురించి వివరిస్తూ సురక్షితంగా గమ్యం చేరుస్తుంది. ► కంటికి ప్రత్యామ్నాయంగా ‘బయోనిక్ ఐ’త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ‘బయోనిక్ ఐ’పై పరిశోధనలు జరుగుతున్నాయి. ‘బయోనిక్ ఐ’... ఎదుట ఉన్న దృశ్యాలను గ్రహించి, వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌గా మార్చి మెదడుకు సంకేతాలు పంపడం ద్వారా దీన్ని ధరించిన వ్యక్తికి ఆయా దృశ్యాలు ఆవిష్కృతం అయ్యేలా చేస్తుంది. సిడ్నీ వర్సిటీ ఇటీవల ‘బయోనిక్ ఐ’ను గొర్రెలకు అమర్చి పరీక్షించగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేల్చింది. ఫీనిక్స్99గా పిలిచే ఈ పరికరాన్ని ఇక మనుషులపై పరీక్షించాల్సి ఉంది. సెకండ్ సైట్, ఆస్ట్రేలియాకే చెందిన మోనాష్ విజన్ గ్రూప్, ఫ్రాన్స్‌కు చెందిన పిక్సిమ్ గ్రూప్ లాంటి సంస్థలు కంటి రెటినాకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ‘బయోనిక్ ఐ’పై పరిశోధనలు చేస్తున్నాయి. భవిష్యత్తులో ‘బయోనిక్ ఐ’కు 40 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంటుందని అంచనా. వాసన స్కాట్లాండ్లో నర్సుగా పనిచేసిన జాయ్ మిన్ని వాసన ద్వారా రోగికి నరాలకు సంబం«ధించిన పార్కిన్సన్ వ్యాధి ఉన్నదీ లేనిదీ చెబుతూ సంచలనం సృష్టించారు. పార్కిన్సన్ వ్యాధి కారణంగా శరీరం నుంచి వచ్చే వాసనల్లో తేడాను ఆమె పసిగట్టగలదు. జాయ్ మిన్ని స్ఫూర్తితో యూరప్‌కు చెందిన అనేక యూనివర్సిటీలు పరిశోధనలు నిర్వహించి పార్కిన్సన్ రోగుల నుంచి వెలువడే పది రకాల రసాయనాలను గుర్తించారు. దీని ఆధారంగా చైనాకు చెందిన జె జియాంగ్ యూనివర్సిటీ కృత్రిమ మేధను ఉపయోగించి ఒక కృత్రిమ నాసికను అభివృద్ధి చేసింది. రోగి శరీరం నుంచి వెలువడే రసాయనాల వాసనను గ్రహించి వ్యాధి లక్షణాలను చెప్పగలిగే ఈ పరికరం 70.8 శాతం కచ్చితత్వం కలిగి ఉంది. శ్వాస ఆధారంగా పని చేయగలిగిన సెన్సర్లు ఉన్న పరికరాల ద్వారా ఇప్పుడు కొన్ని రకాల కేన్సర్లను, మూత్రపిండాల వ్యాధులు, స్లెరోసిస్ వంటి మరికొన్ని వ్యాధులను పసిగట్టే పనిలో పరిశోధకులు ఉన్నారు. బ్రెయిన్ చిప్ కంపెనీ తయారు చేసిన ‘అకిడా’ప్రాసెసర్ వంద రకాల రసాయనాలను, వాసనలను పసిగట్టగలుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్, బ్రూవరేజ్ వంటి ఫ్యాక్టరీలలో పదార్ధాల నాణ్యతను పరీక్షించడానికి ఇప్పుడు ఎలక్ట్రానిక్ నాసికలను వినియోగిస్తున్నారు. మనిషికి ప్రమాదకరమైన విషపూరిత వాయువులను పరీక్షించడానికి కూడా ఈ కృత్రిమ నాసికలు వాడకంలోకి వచ్చాయి. వినికిడి ► దాదాపు రెండు దశాబ్దాలుగా మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ ద్వారా చెవిటి వారిలో వినికిడి శక్తిని ఇనుమడించగలిగాం. చెవిలో అంతర్భాగమైన కాక్లీని అనుకరించే పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి మాటలను, శబ్దాలను వేరుచేయగల ఏఐ ఆధారిత పరికరాన్ని ‘ఓమ్నీ బ్రిడ్జ్’అభివృద్ధి చేసింది. ఈ పరికరం సాయంతో అవసరమైన భాషలోకి తర్జుమా చేసుకొని సంభాషణల్ని కొనసాగించగలిగే శక్తి చెవిటి వారికి ప్రసాదించింది. ► మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), రొడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ (ఆర్ఐఎస్డీ) కలసి శబ్దాలను గ్రహించి ప్రసారం చేయగల ఒక రకమైన వస్త్రాన్ని అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధనా ఫలితాన్ని ఇటీవల నేచర్ పత్రికలో ప్రచురించాయి. చెవిలో కర్ణభేరిని పోలిన ఈ వస్త్రం... శబ్ద తరంగాలను ఎలక్ట్రిక్ తరంగాలుగా మార్చి మన చెవికి అమర్చిన మైక్రోఫొన్ లాంటి పరికరానికి చేరుస్తుంది. ఈ పరికరం ఆ శబ్దాలను చెవిటి వారికి యథాతథంగా వినిపించగలుగుతుంది. ఈ వస్త్రాన్ని పైదుస్తుల్లో గుండె ప్రాంతంలో అమర్చడం ద్వారా గుండె, శ్వాసకోస పనితీరును కూడా ఎప్పటికప్పుడు గమనించవచ్చు. స్పర్శ చర్మానికి ఉన్న ప్రత్యేక గుణం స్పర్శ జ్ఞానం. స్పర్శ ద్వారా వస్తువులను గ్రహించగలిగే గుణం చర్మానికి ఉంది. వికలాంగులకు అమర్చే కృత్రిమ చేతులు, కాళ్లకు స్పర్శ జ్ఞానం కూడా అందించాలనే బృహత్ సంకల్పం పరిశోధకులకు ఏర్పడింది. ఈ దిశగా జరుగుతున్న పరిశోధనలు అనేక ఆవిష్కరణలకు దారి తీస్తున్నాయి. బ్రిటన్‌లోని బ్రిస్టల్ రొబోటిక్స్ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు త్రీడీ ప్రింట్‌తో రూపొందించిన కృత్రిమ చర్మాన్ని రోబోల వేళ్లకు తొడగడం ద్వారా స్పర్శ జ్ఞానాన్ని కలిగించడంలో విజయం సాధించగలిగారు. కృత్రిమ చర్మం ద్వారా వస్త్రాల నాణ్యత, మృదుత్వం, తేమ వంటి లక్షణాలను పసిగట్టవచ్చు. స్పర్శను ఆస్వాదించగలిగే కృత్రిమ చర్మం తయారీపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముట్టుకున్నçప్పుడు వచ్చే ప్రకంపనాల ఆధారంగా కృతిమ మేథతో వస్తువులను గ్రహించగలిగే ఈ–స్కిన్.. మనిషి స్పర్శజ్ఞానాన్ని అనుకరించగల ప్రత్యామ్నాయ మార్గంగా అవతరించబోతోంది. మనిషి ముట్టుకోలేని అత్యంత వేడి పదార్థాలు, అత్యంత శీతల పదార్థాలు, ప్రమాదకరమైన వస్తువులను ఈ కృత్రిమ చర్మం ద్వారా విశ్లేషించే అవకాశం ఏర్పడుతుందని పరిశోధకుల అభిప్రాయం. ‘అకిడా’ప్రాసెసర్ అమర్చిన పరికరాలతో రోడ్డు, బ్రిడ్జీలను ముట్టుకొని వాటి నాణ్యతను అంచనా వేసే అవకాశం ఏర్పడుతుంది. మనిషి వెళ్లలేని సముద్రగర్భాలు, భూగర్భాల్లో ఈ కృత్రిమ చర్మంగల పరికరాలను పంపడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకొనే ఆస్కారం ఉందని ఈ రంగంలో పనిచేస్తున్న పరిశోధకులు చెబుతున్నారు. రుచి గుండె జబ్బులకు, రక్తపోటుకు కారణమైన అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించడం కోసం జపాన్‌లో మైజీ యూనివర్సిటీ ఒక ఎలక్ట్రానిక్ చాప్‌స్టిక్‌ను తయారు చేసింది. ఈ చాప్‌స్టిక్‌తో ఆహారం తీసుకొనేటప్పుడు అది సోడియం అయాన్లను నోటికి అందించి కృత్రిమంగా ఉప్పు రుచిని కలిగిస్తుంది. దాంతో ఆహారంలో ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించగలిగామని యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఈ సూత్రాన్ని అనుసరించి మనిషి కోరిన రుచులను కృత్రిమంగా అందించగల అనేక వస్తువులు అందుబాటులోకి రాబోతున్నాయని ప్రముఖ పరిశోధకుడు నిమిషె రణసింఘె చెబుతున్నారు. వైన్ తయారీ కేంద్రాల్లో రుచిచూసి నాణ్యతను అంచనా వేసే టేస్టర్ల స్థానంలో ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో పని చేసే ‘ఎలక్ట్రానిక్ నాలుక’లు అంటుబాటులోకి వచ్చాయి. ఈ ఎలక్ట్రానిక్ నాలుకలో ఉండే సెన్సర్లు పదార్థంలో ఉండే రుచికి సంబంధించిన సమాచారాన్ని గ్రహించి, విశ్లేషించి ఫలితాలను వెల్లడించగలవు. పదార్థాల నాణ్యత, తాజాదనాన్ని విశ్లేషించే ఎలక్ట్రానిక్ నాలుకలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో వాడుతున్నారు. అలాగే మనిషి నాలుకతో రుచి చూడలేని రసాయనాల కోసం ఫార్మా కంపెనీల్లో కూడా ఎలక్ట్రానిక్ నాలుకలు అందుబాటులోకి వచ్చాయి. పంచేంద్రియాలకే కాదు... మనిషికి ఉండే సృజనాత్మక శక్తికి కూడా కృత్రిమ మేథతో ప్రత్యామ్నాయాలు సృష్టించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కృత్రిమ మేధ సాయంతో కవితలు, కథలు, పెయింటింగ్స్ వంటివి సృష్టించడంలో సఫలీకృతులయ్యారు పరిశోధకులు. -
ఆధారాలు లేకుండా చేయడానికే ఇంటికి నిప్పు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆధారాలు దొరకకుండా హత్య చేసేందుకే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్(గుడిపల్లి) ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురిని బలిగొన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు సజీవ దహనం కేసు వివరాలను మంగళవారం డీసీపీ అఖిల్ మహాజన్.. ఏసీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్‌తో కలసి వెల్లడించారు. ఈ ఘటనలో ఐదు గురిపై హత్య, కుట్ర, ఒకరిపై అదనంగా అట్రాసిటీ కేసు పెట్టామన్నారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద పరిహారం అందేలా చూస్తా మని తెలిపారు. మూడురోజులు 16 బృందాలు ద ర్యాప్తు చేసి క్షుణ్ణంగా పరిశీలించాయన్నారు. ఏ1గా మేడి లక్ష్మణ్, ఏ2 శనిగరపు సృజన, ఏ3 శ్రీరాముల రమేశ్, ఏ4గా వేల్పుల సమ్మయ్య, ఏ5గా ఆర్నకొండ అంజయ్య ఉన్నారని తెలిపారు. ఏళ్లుగా దంపతుల మధ్య గొడవలు.. మందమర్రి మండలం వెంకటాపూర్ పరిధి గుడిపల్లికి చెందిన మాసు శివయ్య(48) రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ(42) దంపతులు. శ్రీరాంపూర్‌కు చెందిన సింగరేణి మైనింగ్ సర్దార్ శనిగరపు శాంతయ్య(57) భార్య సృజనతో గొడవల కారణంగా శివయ్య–రాజ్యలక్ష్మితో ఉంటున్నాడు. ఇరువురు పంచాయతీలు, కేసులు పెట్టుకున్నారు. మెయింటెనెన్సు, జీతభత్యం వేరెవరికీ ఇవ్వకుండా కేసులు ఉన్నాయి. అయినా జీతం డబ్బులు, ఆస్తులు రాజ్యలక్ష్మికే ఇస్తున్నాడని భావించిన శాంతయ్య భార్య సృజన.. భర్తను హత్య చేయాలనుకుంది. తండ్రితో కలసి తనకు సన్నిహితుడైన లక్షెట్టిపేటవాసి మేడి లక్ష్మణ్(42)సాయం కోరింది. దీనికోసం 3 గుంటల భూమి రాసిస్తానని చెప్పింది. అలాగే, రెండు దఫాల్లో రూ.4 లక్షలు ఇచ్చింది. రంగంలోకి దిగిన లక్ష్మణ్.. శాంతయ్యను చంపేందుకు రూ.4లక్షలు ఇస్తానంటూ లక్షెట్టిపేటవాసి శ్రీరాముల రమేశ్ (36) సాయం కోరాడు. రోడ్డు ప్రమాదం చేసేందుకు రూ.1.40 లక్షలతో పాత బొలెరోను కొన్నా రు. నెల క్రితం మంచిర్యాల నుంచి శాంతయ్య, రాజ్యలక్ష్మి వెళ్తున్న ఆటోను బొలెరోతో ఢీకొట్టి చంపుదామనుకుని విఫలమయ్యారు. ఇలా రెండుసార్లు విఫలం కావడంతో ఈనెల 16న ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్, రమేశ్ మంచిర్యాలకు బస్సులో వెళ్లారు. శివయ్య, రాజ్యలక్ష్మి, శాంతయ్య ముగ్గురే ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు రమేశ్, సమ్మయ్య ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టారు. నిద్రిస్తున్న వారిలో రాజ్యలక్ష్మి అక్క కూతురు మౌనిక(24), కూతుళ్లు ప్రశాంతి(3), హిమబిందు (13నెలలు) ఉన్నట్లు వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో ఒకరి కోసం ప్లాన్ వేస్తే ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. నిందితులను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో వివరాలు బయటపడ్డాయి. నిందితుల్ని బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
మీ పరిధిలో మీరు ఉండండి.. మాకు తెలుసు ఏం చేయాలో?
న్యూఢిల్లీ: ఢిల్లీలో గత కొన్ని నెలలుగా ఆప్ ప్రభుత్వంపై వరుస సీబీఐ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. విద్యుత్ సబ్సిడిలో అక్రమాలు జరిగాయంటూ మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడిలో పలు అక్రమాలు జరిగాయని, అందువల్ల ఏడు రోజుల్లో ఆ విషయమై పూర్తి రిపోర్ట్ సమర్పించాలంటూ తన సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియా సక్సేనా తీరుపై మండిపడ్డారు. రాజకీయ దాడులకు తెగబడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సిసోడియా లెఫ్టనెంట్ గవర్నర్‌కి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో... "ఇంతవరకు జరిపిన సీబీఐ దాడులన్ని అక్రమమైనవి, రాజ్యంగ విరుద్ధమని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మీరు మమ్మల్ని సక్రమంగా పాలన కొనసాగించనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. అయినా మీకు భూమి సంబంధించిన వ్యవహారాలు, పోలీసు వ్యవహరాలు, ప్రజా హక్కుల్ని కాపాడే ఆదేశాలు, సేవా ఆదేశాలు తప్పించి మిగతా ఏ విషయాల్లోనూ ఆదేశాలు జారీ చేసే హక్కు లేదని నొక్కిచెప్పారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఏది యాక్ట్ చేయాలో ఏది యాక్ట్ చేయకూడదో అనే విషయంలో తమకే సర్వహక్కులు ఉంటాయన్నారు. ఒక నాలుగు అంశాల్లో ఆర్డర్లు తప్పితే మిగతా విషయాల్లో ప్రజలు ఎన్నుకున్న తమకే అధికారాలు ఉంటాయనేది గ్రహించాలన్నారు. ఏది ఏమైనా మీ పరిధిలో మీరు ఉండకుంటా మిగతా విషయాల్లో తలదూర్చడం మంచిది కాదన్నారు. రాజకీయ నేపథ్యంలో సాగిస్తున్న దాడులు కాబట్టే దర్యాప్తులో ఏం బయటపడటం లేదన్నారు. ఐనా దయచేసి రాజ్యంగబద్ధంగా నడుచకునేందుకు యత్నించండి" అని లేఖలో కోరారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ... నరేంద్రమోదీ సొంత గడ్డ గుజరాత్ ఉచిత ఎలక్ట్రిసిటీ సబ్సిడీని ఇష్టపడుతుంది కాబోలు అందుకే ఈ సీబీఐ దాడులు కాబోలు అని ఎద్దేవా చేశారు. గత రెండు దశాబ్దాలుగా బీజేపీనే గుజరాత్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. అదీగాక ఇప్పుడు ఆప్ కూడా గుజరాత్లో అధికారం దక్కించుకోవడంసౌ దృష్టి కేంద్రీకరిస్తోందని, అందువల్ల ఈ దాడులు చేస్తోందంటూ ఆరోపణలు చేశారు. (చదవండి: ఎట్టకేలకు మాజీ హోం మంత్రికి బెయిల్, కానీ.. బయటకు రావడం కష్టమే!) -
చిత్రా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ/ముంబై: ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ, గ్రూప్ మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌కి చెందిన ముంబై, చెన్నై నివాసాల్లో ఆదాయ పన్ను శాఖ గురువారం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముంబై విచారణ విభాగం ఇందులో పాల్గొన్నట్లు పేర్కొన్నాయి. ఎక్సే్చంజీకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం ద్వారా వీరిద్దరూ అక్రమంగా లబ్ధి పొంది ఉంటా రన్న అనుమానాలు నెలకొన్నాయి. వీరిపై ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేత ఆరోపణలను నిర్ధా రించేందుకు అవసరమైన ఆధారాలు సేకరించేందుకు నిర్వహించిన ఈ సోదాల్లో ఐటీ అధికారులు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ నేపథ్యం..: 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ మధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే నిబంధనలను పక్కన పెట్టి, ఎవరో అజ్ఞాత, అదృశ్య హిమాలయ యోగి సూచనల మేరకు ఆనంద్ సుబ్రమణియన్‌ను జీవోవోగా, ఆ తర్వాత ఎండీకి సలహాదారుగా నియమించారంటూ చిత్రపై ఆరోపణలు ఉన్నాయి. పైపెచ్చు ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక సమాచారమంతటినీ సదరు యోగికి చేరవేయడంతో పాటు ఉద్యోగుల పనితీరు మదింపులోనూ ఆయన సలహాలు తీసుకుని, వాటిని అమ లు చేశారని సెబీ తన విచారణలో నిర్ధారించింది. ఇంత జరిగినా ఆ యోగి వివరాలను వెల్లడించని చిత్రా రామకృష్ణ.. ఆ అజ్ఞాత వ్యక్తి నిరాకారులని, తనకు ఆధ్యాత్మిక శక్తిలాంటి వారని మాత్రమే విచారణలో చెప్పారు. దీంతో, ఈ మొత్తం వ్యవహారంలో తీవ్ర స్థాయిలో పాలనా లోపాలు జరిగాయంటూ ఆమెతో పాటు మరికొందరు అధికారులను సెబీ ఆక్షేపించింది. చిత్రాకు రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈ, సుబ్రమణియన్, ఎన్ఎస్ఈ మాజీ ఎండీ రవి నారాయణ్‌పై తలో రూ.2 కోట్ల జరిమానా వి ధించింది. దీంతోపాటు పలు ఆంక్షలు విధించింది. -
శభాష్.. పోలీస్
సాక్షి, అమరావతి: నేర పరిశోధనలో ఏపీ పోలీసుల సామర్థ్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల దర్యాప్తులో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో చార్జిషీట్లు దాఖలు చేయడంలో మన రాష్ట్ర పోలీసులు అద్వితీయమైన పనితీరు కనబరిచారు. ఏకంగా 93.80 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేసి ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి దోషులను గుర్తించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ ల్యాబ్‌లతోపాటు వివిధ సంస్థల నుంచి రావల్సిన నివేదికలను సకాలంలో తెప్పించేందుకు అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. దర్యాప్తు అధికారిని ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేస్తూ నిర్ణీత గడువులోగా కేసు దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు చార్జిషీట్ దాఖలు చేసేలా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తు ప్రగతిని వివిధ దశల్లో బాధితులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తోంది. పటిష్టంగా ఐసీజేఎస్ విధానం క్రిమినల్ జస్టిస్ విధానంలోని అన్ని ప్రధాన విభాగాలకు కేసుల వివరాలను ఆన్లైన్ ద్వారా సమన్వయపరిచేందుకు ‘ఇంటర్ ఆపరేటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్)ను పోలీసు శాఖ సమర్థంగా నిర్వహిస్తోంది. దాంతో దర్యాప్తును సకాలంలో పూర్తి చేసి ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడం ద్వారా దోషులకు సత్వర శిక్షలు పడేలా చేస్తోంది. ఐసీజేఎస్ విధానం ద్వారా పౌరులకు సేవలందించడంలో గతంలో రెండోస్థానంలో ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పుడు మొదటి స్థానానికి చేరింది. సీఎం, కేంద్ర హోం మంత్రి అభినందనలు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో సకాలంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు భరోసా ఇవ్వడంలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం రాష్ట్ర పోలీస్ శాఖను అభినందించారు. కాగా, సమగ్ర దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అందిస్తున్న పోలీసు టెక్నికల్ సర్వీసెస్ విభాగాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. డీఐజీ ( పోలీస్ టెక్నికల్ సర్వీసెస్) పాలరాజు, ఇతర సాంకేతిక అధికారుల బృందాన్ని ఆయన ప్రశంసించారు. -
హర్ష మందర్ ఇళ్లల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మానవ హక్కుల ఉద్యమకారుడు హర్ష మందర్(66)కు చెందిన ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగానే ఈ సోదాలు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో ఇళ్లు, ఎన్జీఓ కార్యాలయంలో సోదాలు జరిపారు. హర్ష మందర్‌కు సంబంధం ఉన్న రెండు ఎన్జీఓల ఆర్థిక, బ్యాంకింగ్ కార్యకలాపాల పత్రాలను ఈడీ అధికారులు పరిశీలించారు. హర ్షమందర్ గురువారం ఉదయమే తన భార్యతో కలిసి జర్మనీకి పయనమయ్యారు. సామాజిక న్యాయం, మానవ హక్కులపై ఆయన వార్తా పత్రికల్లో సంపాదకీయాలు రాస్తుంటారు. పుస్తకాలు రచిస్తారు. హర్ష మందర్ డైరెక్టర్‌గా ఉన్న సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్(సీఎస్ఈ) అనే సంస్థపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సోనూ సూద్‌పై ఐటీ శాఖ దృష్టి!
ముంబై/న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్(48)కు సంబంధించి ముంబై, లక్నోలో ఆరు చోట్ల ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ బుధవారం సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సోనూకు చెందిన కంపెనీకి, లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయని, అందుకే సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సోనూ భేటీ అయిన కొన్ని రోజులకే ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఢిల్లీలో పాఠశాల విద్యార్థుల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన మార్గదర్శక (మెంటార్షిప్) కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సోనూ అంగీకరించారు. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తనకు కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరే ఆలోచన లేదని సోనూ సూద్ స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనను లక్ష్యంగా చేసుకుందని, అందుకే ఐటీ సోదాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు లెక్కలేనన్ని అవరోధాలు ఎదురవుతాయని, ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల ఆశీస్సులు సోనూ సూద్‌కు ఉన్నాయని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో ఆయన దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆదుకున్నారని గుర్తుచేశారు. వారంతా ఆయన కోసం ప్రార్థిస్తున్నారని చెప్పారు. సోనూ సూద్‌కు సంబంధించి ఐటీ సోదాలు జరపడాన్ని శివసేన తప్పుపట్టింది. -
వూహాన్లో ఏం జరిగింది?
వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆ వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ చేపట్టడానికి సన్నద్ధమైంది. చైనా లోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ ప్రమాదవశాత్తూ బయటకి వచ్చి ఉండడానికే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆ కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి సమగ్ర దర్యాప్తు చేపడతామని అధ్యక్షుడు ప్రకటించారు. వూహాన్ మార్కెట్లో ఆ గబ్బిలాలు లేవా ? కరోనా వైరస్ ఒకానొక రకమైన గబ్బిలం నుంచి సోకిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే అలాంటి గబ్బిలాలు ఆ ప్రాంతంలో లేవని వూహాన్ వెట్ మార్కెట్లో గబ్బిలం మాంసం విక్రయాలు జరగలేదంటూ ఫాక్స్ న్యూస్ చానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. చైనా సర్కార్ చెబుతున్న గబ్బిలాలు వూహాన్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్నాయంటూ తాను రూపొందించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి పేషెంట్ జీరో వైరాలజీ ల్యాబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ వ్యక్తి ద్వారానే కరోనా సోకిందని చెబుతోంది. ల్యాబ్‌లో భద్రత కరువు? వూహాన్లో వైరాలజీ ల్యాబొరేటరీకి భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏదైనా జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ పోస్టు తన కథనంలో రాసుకొచ్చింది. చైనాలో అమెరికా దౌత్యవేత్తలు అందించిన సమాచారం ప్రకారం 2018లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పలుమార్లు వూహాన్లో వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించారు. అక్కడ సరైన భద్రత ఏర్పాట్లు లేవని, గబ్బిలాల్లో వైరస్‌కు సంబంధించి అక్కడ జరుగుతున్న పరిశోధనల సమయంలో సార్స్ వంటి వైరస్లు బయటకు లీకయ్యే అవకాశాలు ఉన్నాయని రెండేళ్ల క్రితమే అమెరికా ప్రభుత్వాన్ని శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టుగా తన కథనంలో పేర్కొంది. ఆ ల్యాబ్‌లో ఏం చేస్తారు? వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వూహాన్ శివార్లలో ఉండే ఈ ల్యాబ్‌కి సమీపంలో వెట్ మార్కెట్ ఉంది. ఈ ల్యాబ్‌లో పనిచేయాలంటే సమర్థవంతులైన టెక్నీషియన్లు ఉండాలి. అయితే ఈ ల్యాబ్‌లో నిపుణుల కొరత ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా గతంలో సూచించింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వంటి సంస్థలు ఆ ల్యాబ్‌లో పటిష్టమైన భద్రత ఉందని, అందులోంచి వైరస్ లీకయ్యే అవకాశం లేదని కచ్చితంగా చెబుతున్నాయి. పీ4 ల్యాబొరేటరీ -
‘పరిశోధనకు’ ప్రాధాన్యమేదీ?
సాక్షి, హైదరాబాద్: పరిశోధన.. ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో నాణ్యత ప్రమాణాలతోపాటు పరిశోధనలకు ప్రాధాన్యం పెరిగింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలన్నీ పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పరిశోధనల వైపే మొగ్గుచూపుతుండటంతో అన్ని రాష్ట్రాలు అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలోని విద్యాసంస్థలు పరిశోధనల్లో ఇంకా వెనుకబడే ఉన్నాయి. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) ప్రవేశాల్లో ప్రధాన రాష్ట్రాలన్నీ ముందుండగా, తెలంగాణ మాత్రం 12వ స్థానానికే పరిమితమైంది. అత్యధికంగా తమిళనాడులో 29,778 మంది విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తుండగా, తెలంగాణలో 4,884 మంది మాత్రమే పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్నా.. గడిచిన ఆరేళ్లలో పరిస్థితిని పోల్చితే దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రవేశాలు ఏటేటా పెరుగుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆశించిన మేర పీహెచ్డీ ప్రవేశాలు పెరగడం లేదు. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాల విషయంలో గొడవలు సర్వసాధారణం అయ్యాయి. చివరకు తెలుగు యూనివర్సిటీలోనూ అదే పరిస్థితి నెలకొంది. రెండేళ్ల కిందటి విద్యా సంవత్సరాన్ని పేర్కొంటూ ఇటీవల పీహెచ్డీ ప్రవేశాలకు తెలుగు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లేకపోయినా పీహెచ్డీ ప్రవేశాలు చేపట్టడం, ప్రొఫెసర్లు ఉన్న చోట వివాదాలతో పీహెచ్‌డీలకు ప్రవేశాలు జారీ చేయకపోవడం వంటి సమస్యలతో రాష్ట్రంలో పీహెచ్డీ ప్రవేశాలు గందరగోళంగా మారాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పీహెచ్డీ గ్రాడ్యుయేట్లు దాదాపు 30 వేల మంది వరకు అవసరమున్నా, కేవలం 2 వేలలోపే ఉండటంతో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులపై ఆధారపడాల్సి వస్తోంది. కాలేజీలకు అవసరాలు ఉండటంతో ఇతర రాష్ట్ర యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీలను కొనుక్కుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో జేఎన్టీయూహెచ్ కూడా నకిలీ పీహెచ్‌డీలను గుర్తించి, ఆ ఫ్యాకల్టీని బ్లాక్ లిస్టులో పెట్టింది. పీజీలు చేస్తున్నా పీహెచ్‌డీలకు దూరం.. దేశవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో లక్షల మంది చేరుతున్నా అంతా పీహెచ్‌డీలు చేయడం లేదు. గడిచిన ఆరేళ్లలో పీహెచ్‌డీలు చేస్తున్న వారి సంఖ్య పెరిగినా ఆశించిన స్థాయిలో లేదన్నది విద్యావేత్తల అభి ప్రాయం. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో 72.65 లక్షల మంది చదువుతుండగా, అందులో పీహెచ్‌డీలు చేస్తున్న విద్యార్థుల సంఖ్య కేవలం 0.5 శాతమే. యూనివర్సిటీలు, కాలేజీలుసహా దేశవ్యాప్తంగా 1,61,412 మంది విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తున్నారు. యూనివర్సిటీలు మినహా పీహెచ్డీ కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలు దేశంలో 3.6 శాతమే ఉన్నట్లు కేంద్ర ఉన్నత విద్యాశాఖ అంచనా వేసింది. పీహెచ్‌డీలు చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో అత్యధికంగా 43,959 మంది (31.6 శాతం) రాష్ట్ర యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలు చేస్తుండగా, జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో 28,383 మంది (20.4 శాతం) చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో 15.8 శాతం మంది, డీమ్డ్ యూనివర్సిటీల్లో 13.4 శాతం మంది పీహెచ్‌డీలు చేస్తున్నారు. మిగతా వారు ఇతర ప్రైవేటు యూనివర్సిటీలు, కాలేజీల్లో చేస్తున్నారు. మొత్తం పీహెచ్డీ ప్రవేశాల్లో 3,110 మంది ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలు చేస్తున్నారు. మరోవైపు పీహెచ్డీ చేస్తున్న వారిలో మహిళలకంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది. సైన్స్కోర్సుల్లోనేఎక్కువ మంది.. దేశంలో అత్యధికంగా సైన్స్ కోర్సుల్లోనే పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఆ తరువాత స్థానం ఇంజనీరింగ్దే. సైన్స్ స్ట్రీమ్‌లో మొత్తంగా 41,844 మంది పీహెచ్‌డీలు చేస్తుండగా, ఇంజనీరింగ్‌లో 38,714 మంది చేస్తున్నారు. ఇందులోనూ మెకానికల్ ఇంజనీరింగ్‌లో 5,235 మంది, సివిల్ ఇంజ నీరింగ్‌లో 35,967 మంది పీహెచ్‌డీలు చేస్తున్నారు. సైన్స్‌లో పీహెచ్‌డీలు చేస్తున్న వారిలో 5,612 మంది (21.1%) అగ్రికల్చర్, అనుబంధ రంగాల్లో చేస్తున్నారు. ఇందులో 58.9% మంది పురుషులే ఉన్నారు. తమ పీజీ పూర్తయ్యాక ఇంజనీరింగ్‌లో 20.07 శాతం మంది పీహెచ్డీలలో చేరుతున్నారు. మెడికల్ సైన్స్‌లో 7,086 మంది, సోషల్ సైన్స్‌లో 18,366 మంది పీహెచ్‌డీలు చేస్తుండగా, కామర్స్‌లో 4,493 మంది పీహెచ్డీలలో చేరారు. భారతీయ భాషల్లో 7,850 మంది, విదేశీ భాష ల్లో 3,889 మంది పీహెచ్‌డీలు చేస్తుండగా ఒక్క ఇంగ్లిష్‌లోనే 3,110 మంది పీహెచ్డీలలో చేరారు. -
పుట్టినరోజు వేడుకలో విషాదం
కోదాడ: పుట్టిన రోజు వేడుక విషాదం నింపింది. స్నేహితుడి బర్త్‌డే నిర్వహించేందుకు చెరువువద్దకు వెళ్లిన నలుగురు పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. హుజూర్‌నగర్‌కు చెందిన చక్రాల ప్రవీణ్ (17), దుగ్యాల భవానీ ప్రసాద్ (17), నేరేడుచర్లకు చెందిన ఎస్.కె. సమీర్ (16), ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం పైనపల్లికి చెందిన ఎన్.మహేందర్ సింహా (17)లు కోదాడ సమీపంలోని అనురాగ్ పాలిటెక్నిక్ కళాశాలలో తొలి ఏడాది చదువుతున్నారు. బుధవారం చక్రాల ప్రవీణ్ పుట్టినరోజు కావడంతో కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు వేడుక చేసుకోవడానికి తినుబండారాలు తీసుకుని కోదాడ పెద్దచెరువు కట్టపైన ఉన్న మైసమ్మగుడి వద్దకు చేరుకున్నారు. కేక్ కటింగ్ అనంతరం చేతులు కడుక్కోవడానికి సమీర్ అనే విద్యార్థి చెరువులోకి దిగాడు. కాలు జారడంతో అతను నీటిలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో కాపాడేందుకు చక్రాల ప్రవీణ్ చెరువులోకి దిగాడు. కానీ సమీర్ గట్టిగా పట్టుకోవడంతో ఈత వచ్చిన ప్రవీణ్ కూడా నీటిలో మునిగిపోయాడు. ఇది గమనిస్తున్న భవానీ ప్రసాద్, మహేందర్ సింహా, పి.ప్రవీణ్, అరవింద్‌లు వారిని కాపాడేందుకు చెరువులోకి దూకారు. అయితే చెరువు లోతుగా ఉండటంతో భవానీ ప్రసాద్, మహేందర్ సింహాలు నీటిలో మునిగి మృతి చెందగా పి.ప్రవీణ్, అరవింద్‌లు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో భయపడిన మిగతా విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీస్తుండటంతో స్థానికులు గమనించి వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోదాడ పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డి, కోదాడ ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని జాలర్ల సాయంతో నలుగురు విద్యార్థుల మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లల మృతదేహాలు చూసి బోరున విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కారంగా ఉండే టమోటాలు
కారం తింటే నోరంతా మండిపోతుంది గానీ.. అందులో ఉండే కాప్సినాయిడ్ రసాయనాల వల్ల మాత్రం బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఊబకాయం, నొప్పి తగ్గించే విషయంలో ఈ కాప్సినాయిడ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇంకేముంది. వీటిని బోలెడన్ని పండిస్తే సరి అంటున్నారా? అక్కడే వస్తోంది చిక్కు. వీటిని పెద్దఎత్తున పండించడం సాధ్యం కాదు. మిరప, మిరియాలు, కాప్సికం వంటి వాటిల్లోనూ ఇవి తక్కువగా ఉంటాయి. పంటపంటకూ తేడాలూ ఉంటాయి. మరెలా? అంటే.. సులువుగా పండించుకోగల టమోటాల్లో కాప్సినాయిడ్లు ఉత్పత్తి చేసే జన్యువులను మళ్లీ ఆన్ చేస్తే సరి అంటున్నారు శాస్త్రవేత్తలు. టమోటా, కాప్సికమ్‌లు రెండూ ఒకేజాతికి చెందినప్పటికీ రెండు కోట్ల ఏళ్ల కిత్రం విడిపోయాయని, కాకపోతే రెండింటిలోనూ ఒకే రకమైన జన్యువులు కొన్ని ఉండటం గమనార్హమని తాజా ప్రతిపాదన తీసుకొచ్చిన శాస్త్రవేత్త అగస్టిన్ సైన్. ఈ జన్యువుల్లో కాప్సినాయిడ్ ఉత్పత్తి చేసేవి కూడా ఉన్నాయని.. ఇవెలా పనిచేస్తాయో తెలుసుకుని టమోటాల ద్వారా బహుళ ప్రయోజనకరమైన కాప్సినాయిడ్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడం ఎంతైనా ప్రయోజనకరమని ఆయన వివరించారు. టమోటా కేంద్రంగా కొన్ని ఆహారానికి రంగులిచ్చే బిక్సిన్, కంటిచూపును మెరుగుపరిచే బీటా కెరొటిన్ వంటి ఆక్సిడెంట్లను కూడా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. -
హెచ్ఐవీ నివారణకు సరికొత్త మందు..
ప్రమాదకరమైన హెచ్ఐవీ వ్యాధిని నిరోధించేందుకు, చికిత్స చేసేందుకూ యూనివిర్శటీ ఆఫ్ నార్త్ కారొలీనా శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని సిద్ధం చేశారు. ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి ఓ గాడ్జెట్లాంటిది ప్రవేశపెట్టి దాని ద్వారా మందు నిత్యం అందుబాటులో ఉండేలా చేయడం ఇందులోని విశేషం. రోజుకో మాత్ర వేసుకోవడం ద్వారా హెచ్ఐవీ రాకుండా ఉండేందుకు ఇప్పటికే అవకాశముంది. అలాగే యాంటీ రెట్రోవైరల్ మందులను క్రమం తప్పకుండా వాడటం వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందనీ మనకు తెలుసు. అయితే ప్రతిరోజూ మందులేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని మార్టినా కొవరోవా అనే శాస్త్రవేత్త ఈ కొత్త పద్ధతి కోసం పరిశోధనలు చేసి విజయం సాధించారు. ఈ పద్ధతిలో హెచ్ఐవీ మందు, ఓ సాల్వెంట్, ప్లాస్టిక్‌లను కలిపి ఓ గడ్డలా తయారు చేసి. గొట్టంలాంటి గాడ్జెట్‌లోకి ఎక్కిస్తారు. ఈ గొట్టాన్ని చర్మం అడుగుభాగంలోకి జొప్పించినప్పుడు ప్లాస్టిక్ క్రమేపీ కరిగిపోతూ వస్తుంది. ఈ క్రమంలో సాల్వెంట్‌తో కూడిన మందు నెమ్మదిగా అందడం మొదలవుతుంది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఒక్కో గాడ్జెట్ దాదాపు ఐదు నెలలపాటు మందు అందించినట్లు తెలిసిందని, ఎలాంటి ఇతర దుష్ఫలితాలూ లేవని మార్టినా వివరించారు. -
విష వలయం
ధరలు పెరిగిపోతున్నాయి. అసలు వస్తువులు, కూరగాయల ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయో తెలియని అయోమయ పరిస్థితి! ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న సర్ మాంటో ఏది ఏమైనా ధరల పెంపుదలకు కారణాలు కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఆడమ్ స్మిత్, డేవిడ్ రిచార్డో, జాన్ కినెస్ వంటివారు ఆర్థిక పరిస్థితుల మీద రచించిన గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. రాబడి, పన్నులు, నిరుద్యోగం వంటి వాటి మీద పరిశోధనలు చేసినా ధరల పెరుగుదల రహస్యాన్ని ఛేదించలేకపోతున్నాడు! ఇక ఈ విషయమ్మీద విసుగుపుట్టి వదిలివేయాలనుకున్న తరుణంలో పొరుగున ఒక పెద్దావిడ మాటల మధ్యలో సర్ మాంటోతో ‘‘ఈ విషయమ్మీద ఇంత మథనపడటమెందుకు? అసలు ఈ ధరలు పెంచి అమ్ముతున్న వారినే కలిసి అడిగితే సరిపోతుంది కదా!’’ అని ఒక సలహా ఇచ్చింది.సర్ మాంటోకు ఆ సలహా నచ్చింది. తన ప్రశ్నలకు, అనుమానాలకు త్వరలోనే ఊహించిన దానికన్నా మంచి సమాధానం దొరకబోతున్నదని ఆనందపడిపోయాడు.వెంటనే రియో డిజనైరోలో తన వీధి చివరనున్న మార్కెట్‌కు వెళ్లి ఉల్లిపాయలు అమ్మే అతన్ని, ‘‘ఎందుకు ఉల్లిపాయల ధరను పెంచేసి అమ్ముతున్నావు, ఎదుటివాడి ఆర్థిక పరిస్థితి అర్థం చేస్కోవా?’’ అని అడిగాడు. ‘‘అయ్యా! నేను కూడా బతకాలి కదా. ఎక్కువ ధర పెట్టి కొని, మరలా నా లాభం వేసుకుని అమ్మాలి కదా ఆలోచించండి’’ అన్నాడు. ‘‘నీకు ఎక్కువ ధరకు ఎవరు అమ్ముతున్నారు?’’‘‘సెంట్రల్ మార్కెట్లో ఉన్న డీలరు దగ్గర కొంటున్నాను’’ అని చెప్పాడు.వెంటనే సర్ మాంటో సెంట్రల్ మార్కెట్‌కి వెళ్లి, ‘‘ఉల్లిపాయలు ధర పెంచి మార్కెట్ వాళ్లకి ఎందుకు అమ్ముతున్నావు?’’ కర్కశంగా మొహం పెట్టి అడిగాడు.‘‘అయ్యా! నన్ను నమ్మండి. నేను తక్కువ ధరకే అమ్మాలనుకుంటున్నాను. లారీ వాడే ధర పెంచి లారీ లోడు ఉల్లిపాయలు నాకు అమ్మాడు. నేనేం చేసేది?’’ బేలగా చెప్పాడు.రెండోరోజు వేకువజామున మార్కెట్ దగ్గర కాపు కాచి ఉల్లిపాయల లోడుతో వచ్చిన లారీ వాణ్ని పట్టుకొని, ‘‘తెల్లవారి ఎవరూ చూడటం లేదని ఉల్లిపాయల ధరలు పెంచి అమ్ముతున్నావా?’’ అడిగాడు. ‘‘అయ్యా! నేనేం చేసేది? ఉల్లిపాయలు పండించే రైతే ధర పెంచి అమ్ముతున్నాడు. దానిమీద కొద్ది లాభంతో సెంట్రల్ మార్కెట్లో డీలర్‌కు అమ్ముకుంటున్నాను’’ చెప్పాడు.వెంటనే బస్సెక్కి సర్ మాంటో ఉల్లిపాయలు పండిచే రైతు వద్దకు వెళ్లి ‘‘నీవే ఉల్లిపాయల ధరలు పెంచి అమ్ముతున్నట్టు లారీ డ్రైవర్ చెప్పాడు. నీ విషయం ప్రభుత్వానికి చెప్పి నీ ఆటలు కట్టిస్తాను.’’ కోపంగా చెప్పాడు సర్ మాంటో. ‘‘దీనికంతా కారణం వానలు లేని వాతావరణం. వాన పడినపుడు తగినవిధంగా ఎరువులు వెయ్యాలి కదా! ఎరువులు 85 శాతం పెరిగిపోయాయి. మరి అంత ఖరీదు పెట్టి కొన్న ఎరువులతో పండించిన ఉల్లిపాయలు ధరలు పెంచి అమ్మక ఏం చేస్తాం?’’ బేలగా చెప్పాడు రైతు. సర్ మాంటో ఇక ఆలస్యం చేయకుండా ఎరువులు అమ్మే దుకాణానికి వెళ్లాడు. ఎరువులు అమ్మే దుకాణదారుడిని ఉల్లిపాయల ధరలకి కారణం నీవే అన్నట్టు కోపంగా వాడి కళ్లలో కళ్లు పెట్టి అడిగాడు.‘‘సార్! ధరలు పెంచి అమ్మడం నాకు సరదానా? నేను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న పొటాషియం కలిగిన ఎరువును కొద్దిలాభంతో అమ్మి నా కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాను’’ చెప్పాడు ఎరువుల దుకాణదారుడు. సర్ మాంటో ఏది ఏమైనా ధరల పెరుగుదల విషయం అంతు చూడదలుచుకున్నాడు.రెండో రోజే విమానంలో ఫ్రాన్సుకు వెళ్లి ఎరువుల ఫ్యాక్టరీ సెక్రటరీని కలిసి బ్రెజిల్లో ధర పెరిగిపోతున్న ఉల్లిపాయల్ని గురించి అడిగాడు.‘‘దీనికి కారణం ఎరువుల తయారీకి కావలసిన రసాయనాలు తెచ్చే ఓడలు రవాణా ఖర్చు విపరీతంగా పెంచడమే..’’ చెప్పాడు ఫ్యాక్టరీ సెక్రటరీ. ఆ ఓడల నౌకాశ్రయం జర్మనీలోని హోంబర్గ్లో ఉంది. సర్ మాంటో సరాసరి అక్కడికి వెళ్లి ‘‘ఎందుకు మీరు రవాణా ఖర్చులను పెంచుతున్నారు. మీ వల్ల ఉల్లిపాయలకు బ్రెజిల్లో అధిక ధరలను మేం చెల్లిస్తున్నాం’’ గట్టిగా అడిగాడు.‘‘మేం ఓడలను తయారు చేయడానికి ఇనుముకు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుసా? గ్రీసు దేశంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీలు ఉక్కును అతి ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి. అందుకే మేం రవాణా ధరలు పెంచాం.’’ చెప్పాడు.‘‘దీనికంతా కారణం ఉక్కు పరిశ్రమా?’’ అనుకుంటూ మరలా విమానంలో గ్రీసులోని ఏథెన్స్కు వెళ్లాడు. అక్కడి పరిశ్రమలోని పెద్దను కలిసి, ‘‘మీరు ఉక్కు ధరను ఎందుకు పెంచారు? మీ వల్ల ఓడలు తయారుచేయడం ఖరీదు. దాని వల్ల వారు రసాయనాలను ఎక్కువ ధరకు రవాణా చేస్తున్నారు. అందువల్ల ఎరువులు ఖరీదైపోతున్నాయి. రైతులు ఉల్లిపాయల ధరలు పెంచుతున్నారు. అందుకే మా బ్రెజిల్లో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి.ఇది మీకు న్యాయంగా ఉందా?’’ అడిగాడు సర్ మాంటో.‘‘అయ్యా! మీకు ఉక్కు ఏవిధంగా తయారవుతుందో తెలుసా? బొగ్గుతో ఇనుప ఖనిజాన్ని కరిగించి ఇనుముని తయారు చేస్తాం. సౌత్ ఆఫ్రికాలోని బొగ్గు గనులకు వెళ్లండి. బొగ్గుకు ఎంత ధర మేం చెల్లిస్తున్నామో మీకు తెలుస్తుంది’’ నమ్రతగా చెప్పాడు పరిశ్రమ పెద్ద. సర్ మాంటో సౌతాఫ్రికాకు విమానంలో వెళ్లాడు. బొగ్గు గనుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ని కలిసి ఉల్లి ధరల గురించి చెప్పాడు. ‘‘బొగ్గు గనులు తవ్వే పరికరాలకు, బొగ్గు రవాణా చేసే రైలుకు మేం కొంత చెల్లించాలి కదా, చెల్లించిన దానిమీద కొంత లాభం వేసుకుని అమ్ముతున్నాము. ఈ పరికరాలు, రైలు పెట్టెలు మాకు జపాన్‌లోని టోక్యో నుండి వస్తాయి. అందుకే బొగ్గును ఎక్కువ ధరకు వారికి అమ్ముతున్నాం’’ తాపీగా చెప్పాడు ఎగ్జిక్యూటివ్. సర్ మాంటో ఇక ఆలోచించలేదు. అందుబాటులో ఉండే విమానంలో వెంటనే టోక్యోకు వెళ్లాడు.ఫ్యాక్టరీ చీఫ్ ఇంజనీర్ని కలిశాడు.‘‘తమరు బొగ్గు తవ్వే యంత్రాలు, రైలు వ్యాగన్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు? దీని వల్ల మా బ్రెజిల్లో ధరలు పెరిగిపోతున్నాయి’’ చెప్పాడు సర్ మాంటో. చీఫ్ ఇంజనీర్ తొణకకుండా ‘‘దీన్నే ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు. మా యంత్ర పరికరాల్ని మీ బ్రెజీలియన్ ఉల్లిపాయలకు బదులుగా వారికి ఇస్తాం. పెరిగిపోయిన ఉల్లిపాయల ధరలతో మా పరికరాలు కూడా ధరలు పెరిగిపోయాయి. తమరు బ్రెజిల్ నుండి వచ్చారుగనక అడుగుతున్నాను – మీ బ్రెజిల్లో ఉల్లిపాయలు ఎందుకు అంత ఖరీదు?’’ చిరునవ్వుతో అడిగాడు చీఫ్ ఇంజనీర్.సర్ మాంటో ఏం చెప్పాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నాడు! పోర్చుగీస్ మూలం : కార్లోస్ ఎడ్యురాడో నోవెస్ అనువాదం: కంచనపల్లి వేంకట కృష్ణారావు -
నాలుగు లక్షల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం?
అంచనాలు తారుమారు కావడం అంటే ఇదే. ఈ భూమి మీద ఆధునిక మానవుడు (హోమో సేపియన్) అవతరించి దాదాపు మూడు లక్షల ఏళ్లు అయిందని.. ఆఫ్రికాలో పుట్టి.. ఆ తరువాత ప్రపంచమంతా విస్తరించాడని అనుకుంటున్నామా? తాజా పరిశోధనలు ఈ అంచనాలన్నీ తప్పు అంటున్నాయి. భారత్ విషయాన్నే తీసుకుంటే సుమారు నాలుగు లక్షల ఏళ్ల క్రితమే హోమోసేపియన్ జాతి మానవులు ఇక్కడ సంచరించారనేందుకు తగ్గ ఆధారాలను పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీశారు. అలాగే ఇజ్రాయెల్‌లో లభించిన అవశేషాలు కూడా సుమారు రెండు లక్షల ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. భారత్‌లో లభించిన పురాతన రాతి పనిముట్లకు, ఆఫ్రికాలో లభించిన వాటికి ఉన్న దగ్గరి పోలికల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెన్నైలోని శర్మ సెంటర్ ఫర్ హెరిటేజ్ ఎడ్యుకేషన్‌కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్త పప్పు శాంతి తెలిపారు. చెన్నైకు నైరుతి దిక్కులో లభించిన ఈ పని ముట్లు నిజంగానే ఆఫ్రికా నుంచి వలస వచ్చిన హోమో సేపియన్లు తయారు చేశారా? లేక స్థానికంగానే అభివృద్ధి చెందిన మానవుల్లాంటి జంతువులు అభివృద్ధి చేశాయా? అన్నది ప్రస్తుతానికి స్పష్టం కావడం లేదని.. పనిముట్లతోపాటు శిలాజాలేవీ లభించకపోవడం దీనికి ఒక కారణమని వివరించారు. -
హోమియోపై మరిన్ని పరిశోధనలు
అంటువ్యాధుల నివారణ కోసం భారత్, ఆస్ట్రేలియా సంస్థల ఒప్పందం సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం, అంటువ్యాధుల నివారణ కోసం హోమియో వైద్యంపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ (ఐఐహెచ్‌పీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (ఎన్ఐఐఎం) ఆస్ట్రేలియా సంస్థలు ఆదివారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. రామంతాపూర్ హోమియో కాలేజీలో జరిగిన సదస్సులో ఐఐహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఎ.రావు, ఆస్ట్రేలియా ఎన్ఐఐఎం తరఫున డాక్టర్ ఐజాక్ గోల్డెన్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. హోమియో మందులను అంటువ్యాధుల నివారణలో మరింత మెరుగ్గా ఉపయోగించడానికి, మందుల ప్రభావాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐహెచ్‌పీ అంటువ్యాధుల నివారణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.శ్రీనివాస్‌రావు తెలిపారు. రెండు దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మెదడువాపు వ్యాధిని సమూలంగా నిర్మూలించడంలో హోమియో వైద్యులు విజయం సాధించారన్నారు. -
రంగుల చర్మం వెనుక రహస్యమిదిగో!
- చర్మ రంగుల తేడాలకు జన్యు మూలాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు - సీసీఎంబీ ఆధ్వర్యంలో విస్తృత పరిశోధనలు సాక్షి, హైదరాబాద్: ఆఫ్రికన్లది నలుపు రంగు. యూరోపియన్లది తెలుపు. చైనీలు ఎల్లో. జపనీలు ఇంకో రంగు. మరి భారతీయులో? ఇలా ఒకటా రెండా.. అన్ని రంగుల వాళ్లూ మనకు కనిపిస్తారు. అలాగే మనదేశంలో ఉత్తరాన పంజాబీలు, కశ్మీరీలది మిలమిల మెరిసే తెలుపైతే.. దక్షిణాన కేరళ, తమిళనాడుల్లో కారు నలుపు మనుషులు కనిపిస్తారు. వీరే కాక, చామనఛాయ, గోధుమ వర్ణం, ఇలా రకరకాల రంగుల సమ్మేళనం భారతీయుల్లో కనిపిస్తుంది. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే..? సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ (సీసీఎంబీ) బయాలజీ శాస్త్రవేత్తలు ఈ చర్మ రంగుల తేడాలకు సంబంధించిన జన్యు మూలాలను ఆవిష్కరించారు కాబట్టి. సీసీఎంబీ ఈస్టోనియా, కొన్ని ఇతర అంతర్జాతీయ పరిశోధక సంస్థలతో కలిసి ఈ అంశంపై విస్తృత అధ్యయనం చేసింది. భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సుమారు 1000 మందిని ఎంపిక చేసుకొని వారిలో 375 మందికి జన్యుపరమైన పరీక్షలు నిర్వహించింది. ఈ పరిశోధనల ద్వారా తేలిందేమిటంటే.. తేలికపాటి చర్మం రంగుకు కారణమని ఇప్పటికే నిర్ధారించిన ఎస్ఎల్సీ24ఏ5 జన్యువులో వచ్చిన రెండు మార్పులని వీరు తెలుసుకోగలిగారు. దీంతోపాటు భారతదేశంలోకి గత 2వేల సంవత్సరాలుగా వేర్వేరు ప్రాంతాల ప్రజలు వలస రావడం ఒక కారణమని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. అంతేకాకుండా సామాజికమైన హోదా, ఒక వర్గంలోనే అధికంగా పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చర్మం రంగులో ఉన్న తేడాలకు కారణాలుగా వీరు గుర్తించారు. భారతదేశంలోని గిరిజన, తెగల జన్యువులతో ఇతరుల జన్యువులను పోల్చి చూసినపుడు చర్మం రంగుకు సంబంధించిన తేడాలు ప్రస్ఫుటంగా కనిపించారుు. ఈ పరిశోధన వివరాలుక ఆన్లైన్ పత్రిక ‘ది జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ’ నవంబర్ సంచికలో ప్రచురితమయ్యారుు. జన్యుపరమైన పరిశోధనలు సీసీఎంబీ విసృ్తతంగా చేపడుతోందని, వీటి ద్వారా భవిష్యత్తులో వ్యాధులకు మెరుగైన చికిత్సతోపాటు వ్యక్తుల జన్యుప్రభావం ఆధారంగా చికిత్స అందించే సౌకర్యం కలుగుతుందని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. -
పావురాల అక్రమ రవాణా గుట్టురట్టు
-
పరిశోధన ఫలాలు ప్రజలకు అందాలి
పటాన్చెరు: పరిశోధన ఫలాలు ప్రజలకు అందాలని ఓయూ కెమిస్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సోమేశ్వర్ పోలా అన్నారు. రుద్రారం హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో మంగళవారం ‘సీహెచ్-బాండ్ క్రియాశీలత ద్వారా కొత్త సేంద్రియ పదార్థాల సంశ్లేషణ, సేంద్రి ఎలక్ట్రానిక్స్ రంగంలో వాటి అనువర్తనాలు’ అనే అంశంపై ఆయన ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పరిశోధన ఫలాలు పేదల దరిచేరాలని, సమాజానికి ఉపయోగపడితేనే ఆ శోధన సాఫల్యవంతమవుతుందన్నారు. పరిశోధనలు పత్ర సమర్పణకో, పట్టాలు పొందేందుకో కాకుండా వాటి ఫలాలు ప్రజలకు ఉపయోగపడినప్పుడే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రజోపయోగ పరిశోధనలు సాగించాలని విజ్ఙప్తి చేశారు. సేంద్రియ పదార్థాల సంశ్లేషణ, వాటి అనువర్తనాల గరించి ఆయన వివరించారు. కార్యక్రమంలో బాబా ఆటామిక్ రిసెర్చ్ సెంటర్ పూర్వ శాస్త్రవేత్త డా.జి.ఏ.రామారావు, ప్రొఫెసర్లు రాంబాబు గుండ్ల, ఐబీ సుబ్బారెడ్డి, అసోసియేట్ ప్రొ డా.పాత్రుడు, డా.శివకుమార్, డా. నాగేంద్రకుమార్ తదితరులు పాలొ్గన్నారు. -
నల్లగొండ జిల్లాలో వజ్రపు నిక్షేపాలు?
♦ అధ్యయనం చేస్తున్న ఉస్మానియా జియోఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్స్ ♦ చండూరు, గుర్రంపోడు మండలాల్లోని 3 గ్రామాల్లో పర్యటన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వజ్రపు నిక్షేపాలున్నాయన్న కోణంలో నల్లగొండ జిల్లాలో జరుగుతున్న పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో లాంప్రైట్ ఖనిజాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఇప్పటికే నిర్ధారించగా, చండూరు, గుర్రంపోడు మండలాల్లో కూడా భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన జియోఫిజిక్స్ ఎమిరీటస్ ప్రొఫెసర్ రాందాస్ నేతృత్వంలోని ఆరుగురు పరిశోధన విద్యార్థుల బృందం ఈ రెండు మండలాల్లోని మూడు గ్రామాల్లో పర్యటించింది. గుండ్రపల్లి, అలరాజువారిగూడెం, వట్టికోడు గ్రామాల్లో పర్యటించి భూగర్భ పొరల్లో మూడు రకాల పరీక్షలు చేశారు. టోటల్ మాగ్నెటిక్ ఇంటెన్సిటీ (టీఎంఐ), రేడియో మెట్రిక్ ఇన్వెస్టిగేషన్ (ఆర్ఎంఐ)లతోపాటు అత్యంత తక్కువ సాంద్రతలో ఎలక్ట్రో మాగ్నెటిక్ మెథడ్ (ఈఎంఎం) పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా అసలు ఈ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలున్న మాట వాస్తవమా.. కాదా? అనేది నిర్ధారణ జరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అయితే, ఈ పరీక్షలను తరచుగా జరుపుతుండడం, మరో 3 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండడం జిల్లా వాసుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు మాత్రం జిల్లాలో అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లు ఉన్నాయని, కానీ వీటిని వెలికితీసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న పగుళ్లు, ఆనవాళ్లను బట్టి తాము జీఎస్ఏకు నివేదికలు పంపుతామని, వీటిని పరిశీలించాక ఈ ఖనిజాలను వెలికితీస్తే లబ్ధి చేకూరుతుందని కేం ద్రం భావిస్తే.. అనుమతి ఇస్తుందని వారంటున్నారు. గతంలో జీఎస్ఏ పరీక్షలు వాస్తవానికి నల్లగొండ జిల్లాలో వజ్రపు గనులున్నాయన్న కోణంలో గత పదేళ్లుగా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు, మూడు సార్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా పరీక్షలు చేసింది. ముఖ్యంగా హాలియా మండల కేంద్రంతోపాటు రామడుగు ప్రాంతాల్లో, మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లిలో కూడా పరీక్షలు జరిపింది. ఈ పరిశోధనల్లో సైతం ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లు ఉన్నాయని తేలినా, పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓయూ రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్న పరిశోధనలు కూడా జిల్లాలో ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లకు ఊతమిస్తున్నాయి. -
డైనోసార్లు ఇలా అంతరించాయి
మియామి: ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ ఇది కొన్ని కోట్ల మంది మెదడ్లో నానుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పటికిప్పుడు కాకున్న వచ్చే ఏడాదికైన సమాధానం దొరుకుతుంది. కాని కొన్ని వందల ఏళ్లుగా రాక్షసబల్లులు ఎలా అంతరించపోయాయి అనే దానికి మాత్రం ఎవరి దగ్గర సరైన జవాబు లేదు. ఈ విషయంపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. ఒక గ్రహశకలం భూమిని ఢీ కొట్టడం వల్ల డైనోసార్లు అంతరించాయని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ అంతకంటే ముందే కొన్ని మిలియన్ సంవత్సరాలకు పూర్వమే అవి అంతరించి పోయే దశకు చేరుకుని జీవించడానికి పోటీపడ్డాయని కొందరు పరిశోధకులు ఇటీవల అధ్యయనంలో తేల్చారు. ఖండచలనాలు, అగ్ని ప్రమాదాలను అధిగమించి జీవించడానికి రాక్షసబల్లులు చాలా కష్టపడ్డాయని కనుగొన్నారు. 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టడం వల్ల దుమ్ము, ధూళి కణాలు ఆవరించి సూర్య కిరణాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకున్నాయని, చెట్లు, జీవరాశులు నశించిపోయాయని గుర్తించారు. దీంతో డైనోసార్లకు ఆహారం లేకుండా పోవడంతో అంతరించి పోయాయని కనుగొన్నారు. -
తెలుగునాట బొమ్మలాట
నేడు వరల్డ్ పప్పెట్రీ డే ఓ మధు, సాక్షి భరతాది కథల జీరమఱుగల... నారంగ బొమ్మలనాడించు వారు... కడు అద్భుతంబుగ కంబసూత్రంబు... లారగ బొమ్మలాడించువారు ... అనే పద్యం 12వ శతాబ్దానికి చెందిన పాల్కూరి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో మనకు కనిపిస్తుంది. అలాగే ఆలయాలలో లభ్యమయిన ఆనాటి శాసనాలను బట్టి కూడా చూసినప్పుడు బొమ్మలాటలు అంతకు ముందునుంటే ఉన్నాయనే విషయం రూఢీ అవుతుంది. వేమన యోగిగా మారడానికి కూడా తోలుబొమ్మలాట కారణమైందని ఒక కథనం ప్రాచుర్యంలో వుంది. నాచనసోముడు బొమ్మలాట గురించి తన రచనలలో కూడా ప్రస్తావించాడు. తెలుగువారి ఆటను మరాఠీ వారు తేర్పుగా ఆడించి తమ వశం చేసుకున్నారని పరిశోధనలు తెలుపుతున్నాయి. అయినా నేటికీ తెలుగు జానపద కళారూపాలలో ఒకటిగా బొమ్మలాటలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలలో వివిధ రకాల బొమ్మలాటప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. వాటిలో కొన్ని: మందెచ్చులు: కథకి ఎక్కువ ప్రాముఖ్యత వుంటుంది. గొల్లకులానికి ఆశ్రీత కులస్తులు ఈ బొమ్మలాటను ప్రదర్శిస్తుంటారు. చెక్కబొమ్మలు: చక్కని చెక్కబొమ్మలు తయారు చేసి రామాయణ, మహాభారత గాథలు ప్రదర్శిస్తుంటారు. తోలుబొమ్మలు: బాగా ప్రాచుర్యంలో వున్న తోలుబొమ్మలాటలో ఒక్కొక్క బొమ్మను మలచటం నుంచి ప్రదర్శించే తీరు వరకూ చక్కటి కళా నైపుణ్యాన్ని చూడవచ్చు. పెద్దమ్మలు: నెత్తిన బొమ్మలు పెట్టుకుని ఆడిస్తారు. కీలుగుర్రాలు: గుర్రాలతో కూడిన బొమ్మలాట బుట్టబొమ్మలు: బొమ్మలను తొడుక్కుని ఆడుతారు. ప్రత్యేకంగా కథలు చెప్పటం వుండదు. పటం కథలు! పటాలపై చిత్రీకరించిన బొమ్మల ఆధారంగా కథ చెబుతారు. వీటిలో తోలు, కొయ్య, చెక్కబొమ్మలాటలలో మాత్రమే పూర్తి నిడివి బొమ్మలను చూపిస్తూ కథ చెప్పటం జరుగుతుంది. మార్చి 21 ప్రపంచ వ్యాప్తంగా మార్చి 21ని పప్పెట్రీడేగా సెలబ్రేట్ చేసుకోవటం 2000 సం॥నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో రకరకాల పప్పెట్ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది ఆదిలాబాద్‌లోని కళాశ్రమంలో జరిగే మిత్ ్రమిలాన్ వేడుకలలో... దేశవిదేశాల నుంచి అనేకమంది ప్రముఖులు పాల్గొంటారు. ఈ కళాసంరంభంలో మూడు రకాల బొమ్మలాట ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అలాగే కొడంగల్‌లోనూ రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సప్తపర్ణిలోనూ పిల్లల కోసం బొమ్మలాట నిర్వహిస్తున్నారు. (ఇన్పుట్స్: గంజి మాధవీలత, పప్పెటీర్, రీసెర్చ్ స్కాలర్) -
దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి!
సహకరిస్తాం.. పెట్టుబడులతో రండి ప్రవాస భారతీయులకు సుష్మాస్వరాజ్ పిలుపు గాంధీనగర్: ప్రధాని నరేంద్రమోదీ కలలు కంటున్న నవ భారతావని నిర్మాణానికి సహకరించాల్సిందిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘భారత్‌లో తయారీ(మేక్ ఇన్ ఇండియా)’, ‘స్వచ్ఛభారత్’ తదితర కార్యక్రమాలకు పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. గాంధీనగర్ బుధవారం మొదలైన 13వ ‘ప్రవాసీ భారతీయ దివస్(పీబీడీ)’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం సుష్మా పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం, వ్యాపార వాణిజ్యాలు నిర్వహించడం సులభతరం అయ్యేందుకు అవసరమైన చర్యలను తమ ప్రభుత్వం తీసుకుంటోందని వివరించారు. ‘రానున్న ఏళ్లలో మనకు విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉంటుంది. వివిధ రంగాల్లో, ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి యువ ప్రవాస భారతీయులు దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అన్నారు. పారదర్శకత విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు. శాస్త్రీయ, సాంకేతికపరమైన ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని, దేశాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు భారత్‌కు తిరిగివచ్చే విషయంపై ఆలోచించమని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు జరుపుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ అభ్యర్థించారు. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్) రంగాల్లో వెలుగులోకి వచ్చిన శాస్త్రవేత్తల్లో 80% మంది భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, విజయవాడు, పూణె, చెన్నైలనుంచే వచ్చారని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో రూపొందిన ఒక పరిశోధనా పత్రం వెల్లడించిందని తెలిపారు. అహింసే ఆయుధంగా, భారతీయులందరినీ ఒక్కటి చేసి, బలమైన బ్రిటిష్‌వారిని ఎదుర్కొన్న గాంధీజీ అత్యంత వ్యూహాత్మక రాజకీయ నేత అని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకేసింగ్ వ్యాఖ్యానించారు. కాగా గుజరాత్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్ పటేల్ విగ్రహం ‘ఐక్యతా శిల్పం’ కోసం అమెరికాకు చెందిన ప్రవాస భారత వైద్యుడు ఇంద్రజిత్ జే పటేల్ నిధుల సేకరణ చేపట్టారు. ప్రధాని మోదీ చిత్రం ఉన్న వెండి నాణేలను అమ్మి 2.5 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం పంపించిన ఆహ్వానాన్ని మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ తిరస్కరించారు. -
విధికి ఎదురీత
భగవంతుడా! బలమివ్వు.. గుక్క పెట్టి ఏడ్వడానికి గుండె గొంతుకలో చుక్క నీరు లేదు. ఏడేళ్ళుగా ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. ఏం తప్పు చేశాం అంటూ ఆ భగవంతుడినే నిలదీసేందుకు అవసరమైన శక్తీ లేకపోయింది. ఏళ్ళ తరబడి ఊరూవాడా తిరిగీ తిరిగీ నిస్సత్తువ ఆవహించింది. ఉన్నదల్లా ఒకే మార్గం. దేవుడిని వేడుకోవడం. అందుకే ‘దేవుడా.. కరుణ చూపని విధి నుంచి మా కన్నబిడ్డల్ని రక్షించు’ - అని క్షణక్షణం మూగవేదన అనుభవిస్తున్న ఓ కుటుంబం ప్రార్థిస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబం ఊహించని ఆపదతో అల్లాడి పోతోంది. ఆపన్న హస్తం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చేస్తోంది. ప్రపంచంలోనే వేళ్ల మీద లెక్కబెట్టదగిన కండరాల బలహీనత (డిజార్డర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ) ఆ ఇంట్లోని ఇద్దరి చిన్నారులను ఏడేళ్లుగా వేధిస్తోంది. ఉన్నవన్నీ ఊడ్చిపెట్టిన ఆ తల్లిదండ్రులు, ఇంకా గంపెడాశతో పిల్లలను రక్షించుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. అనుక్షణం కళ్ళల్లో వత్తులేసుకుని కష్టపడుతున్నారు. మనసున్న ప్రతి మనిషి గుండెను కదిలించే యథార్థ గాథ ఇది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన కోట వాసుదేవరావు, అన్నపూర్ణ దంపతుల కన్నీటి వ్యధ ఇది. ముందు ఏమీ అర్థం కాలేదు! గణేష్, శ్రీనివాస్ ఇద్దరూ పుట్టిన నాలుగేళ్ళదాకా ఆడుతూ పాడుతూనే తిరిగారు. అయితే ఏడేళ్ళ వయసు వచ్చేసరికి ఆ చిన్నారులు నడుస్తూ నడుస్తూనే కుప్పకూలిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగించింది. బలహీనంగా ఉన్నారేమో అని మొదట అనుకున్నారు. కానీ రానురాను లేవలేని స్థితి. చేతులు ఆడించలేని పరిస్థితి. బెంబేలెత్తిన దంపతులు తమ పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్ళారు. డాక్టరుకూ ముందు ఏమీ అర్థం కాలేదు. రకరకాల పరీక్షల తర్వాత అది కండరాల బలహీనత అని తేల్చేశారు. ఈ వ్యాధికి మందులే లేవన్నారు. దీనిపై అమెరికా, లండన్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. కన్నీరు మున్నీరయ్యారు ‘అమ్మా... మాకేమైంది? మేం స్కూలుకు వెళ్ళలేమా? అమెరికా వెళ్ళి పెద్ద ఉద్యోగం చేయలేమా?’ అంటూ గణేష్, శ్రీనివాస్ వేసిన ప్రశ్నలు గుండెలను పిండేశాయని అన్నపూర్ణ కన్నీరు మున్నీరు అయ్యారు. ‘‘ఆ క్షణంలో చావాలన్పించింది. భార్యాభర్తలం ఇద్దరం కొన్ని రోజులు తిండి, నీళ్ళు ముట్టకుండా ఏడ్చాం. కన్పించిన దేవుడికల్లా మొక్కాం. నాటు వైద్యం మొదలుకొని, ఆయుర్వేదం, హోమియో అన్నీ వాడాం. ఎవరు ఏం చెప్పినా కాలికి బలపం కట్టుకుని అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరు పిల్లలను భుజాల మీద ఎక్కించుకుని వైద్యుల వద్దకు తిరిగేవాళ్ళం. పూర్వీకులు ఇచ్చిన ఇల్లూ, పొలం అన్నీ అమ్మేసి పిల్లలకోసం ఖర్చు చేశాం. అవీ చాలకపోవడంతో అప్పులు చేశాం. అయినా నయం కాలేదు. అమెరికా వెళ్తే కొంత ప్రయోజనం ఉండొచ్చని కొంతమంది చెబుతున్నారు. కానీ చిల్లిగవ్వ లేదు. ప్రైవేటు స్కూల్లో నాకు వచ్చే మూడు వేలు, ఓ ప్రైవేటు కంపెనీలో ఆయనకు వచ్చే ఐదు వేలు... ఇదీ మా సంపాదన. పిల్లల నెలవారీ మందులకే అవి సరిపోతున్నాయి. ఖాళీ సమయంలో ట్యూషన్లు చెబితే వచ్చే సంపాదన, కుట్లూ అల్లికలపై నిద్రలేకుండా తెచ్చే మొత్తంతోనే కుటుంబం గడుస్తోంది’’ అని ఉబికి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకునే ప్రయత్నం చేస్తూ చెప్పారు అన్నపూర్ణ. ఇంట్లో ఉంటూనే అద్భుత పరిజ్ఞానం సామాజిక, వైజ్ఞానిక విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు ఈ చిన్నారులు చెప్పే సమాధానం అబ్బురపరుస్తాయి. ఇంట్లోనే ఉండి చదువుకోవడమే కాదు. స్కూల్ విద్యార్థులతో సమానంగా పరీక్షలు రాయడం, అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం విశేషం. కొన్నాళ్ళు స్కూలుకెళ్ళి పరీక్షలు రాసేవాళ్ళు. కదలలేని వాళ్ళ స్థితిని చూసి, ఉపాధ్యాయులే ఇంటికొచ్చి పరీక్షలు రాయిస్తున్నారు. 13 ఏళ్ళ గణేష్ ఇప్పుడు 8 వ తరగతి, 12 ఏళ్ళ శ్రీనివాస్ 7వ తరగతి చదువుతున్నారు. ఫొటోలు: రాధారపు రాజు, ఖమ్మం అమ్మా ఏడ్వకు... అమెరికా వెళ్ళి నీ కష్టం తీరుస్తా! అమ్మా! నాకేం కాదు. నేను అమెరికా వెళ్తా. పెద్ద చదువులు చదువుతాను. నీ కన్నీళ్లు తుడుస్తా. ఈ జబ్బుకు మందులు వస్తాయని మొన్న డాక్టర్ అంకుల్ చెప్పారుగా. ఎందుకమ్మా దిగులు? - శ్రీనివాస్ నా కడుపుకోత తీర్చేదెవరు: అన్నపూర్ణ వాళ్ళకు అన్నీ మంచంలోనే. రానురాను మరింతగా బలహీనపడతారనే వైద్యుల మాటలు తట్టుకోలేకపోతున్నారు. ముద్ద నోటికి అందించేప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు, కాలకృత్యాలు తీర్చేటప్పుడు ‘అమ్మా...’ అంటూ వాళ్ళు పడే బాధ నా గుండెను కకావికలం చేస్తోంది. అనుక్షణం క్షోభ : వాసుదేవరావు నా పిల్లలకు నయం చేసుకోవాలని ఉంది. అది పెద్ద కోరికే అయినా, వాళ్లను కన్నీళ్ళు లేకుండా చూసుకోవాలి. కానీ ఆర్థిక భారం నన్ను కుంగదీస్తోంది. కన్నతండ్రిగా నా వైఫల్యం అనుక్షణం క్షోభకు గురిచేస్తోంది. చిన్నారుల కోసం ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే బాగుండు. -
పరిశోధనలతో బహుళ ప్రయోజనాలు..
బిట్స్-పిలానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిజేంద్రనాథ్ జైన్ ఒక దేశం అభివృద్ధి పథంలో పయనించాలన్నా.. ఓ వ్యక్తి ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నా.. దోహదపడే సాధనం పరిశోధనలు (రీసెర్చ్). ప్రస్తుతం మనదేశంలో పరిశోధనల అవసరం ఎంతో ఉంది. అందుకే విద్యార్థులను చిన్నప్పటి నుంచే ఆ దిశగా ప్రోత్సహించాలి. ఈ విషయంలో ఫ్యాకల్టీది కీలక పాత్ర. సరైన మార్గ నిర్దేశకులు ఉంటేనే యువత కెరీర్ పరంగా సముచిత నిర్ణయాలు తీసుకొని లక్ష్యాలను చేరుకోగలదు అంటున్నారు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్(బిట్స్)-పిలానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిజేంద్రనాథ్ జైన్. ఐఐటీ- కాన్పూర్‌లో బీటెక్.. స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తిచేసిన ఆయనకు ఐఐటీ - ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో మూడు దశాబ్దాలకు పైగా బోధనానుభవం ఉంది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, స్టార్టప్స్లపై ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఆ మూడే.. ముఖ్య ప్రాతిపదికలు ఏ ఇన్స్టిట్యూట్ అయినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే ముఖ్యంగా మూడు అంశాలు ప్రాతిపదికగా నిలుస్తాయి. అవి.. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఇంటర్నేషనలైజేషన్ (అంతర్జాతీయీకరణ), ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ మూడు అంశాల్లో బిట్స్ ఎంతో ముందంజలో ఉంది. ఎన్నో స్పాన్సర్డ్ రీసెర్చ్, కన్సల్టెన్సీ బేస్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ చేపట్టడంతోపాటు వాటిలో విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్పంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. అందుకే బిట్స్‌కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తోంది. ఫ్యాకల్టీ పాత్ర కీలకం విద్యార్థులను పరిశోధనలపరంగా నడిపించడంలో ఫ్యాకల్టీది కీలక పాత్ర. ఫ్యాకల్టీ రీసెర్చ్ చేస్తుంటే.. పీహెచ్డీ విద్యార్థులను గైడ్ చేయడం కూడా సులభంగా ఉంటుంది. అందుకే బిట్స్ పిలానీలో ఫ్యాకల్టీ 20 నుంచి 40 శాతం సమయాన్ని కచ్చితంగా పరిశోధనల్లో పాల్గొనేలా చూస్తున్నాం. ఫలితంగా స్పాన్సర్డ్ రీసెర్చ్ గ్రాంట్స్ లభించడంతోపాటు ప్రఖ్యాత జర్నల్స్‌లో రీసెర్చ్ పేపర్స్ ప్రచురితమవుతున్నాయి. అంతేకాకుండా ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌ను.. టీచింగ్, రీసెర్చ్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్లో ముందుంచేలా మిషన్-2015 అనే ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాం. విద్యార్థుల్లో పీహెచ్‌డీపై ఆసక్తి పెరగాలంటే పీహెచ్డీ విషయంలో మనదేశంలోని విద్యార్థులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆర్థిక ప్రోత్సాహకాలు అంతంతమాత్రంగా ఉండటం. అందుకే చాలా మంది విద్యార్థులు పీహెచ్డీ, బోధన రంగాలపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. అయితే ఈ రెండు విభాగాల్లో ఇతర దేశాల్లో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు కారణం ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహకాలే! ప్రభుత్వం కూడా పీహెచ్డీ ఔత్సాహికులకు ఇచ్చే స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ మొత్తాన్ని పెంచితే మరింత ఎక్కువ మంది పరిశోధనల రంగంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మరో ప్రధాన సమస్య మన దేశంలోని విద్యార్థులకు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తయ్యే వరకూ పీహెచ్‌డీపై సరైన అవగాహన ఉండటం లేదు. ఈ విషయంలో పాఠశాల స్థాయి నుంచే తరగతి గదిలోనే పరిశోధన దృక్పథం అలవర్చే వాతావరణాన్ని కల్పించాలి. ఆసక్తిని పెంపొందించే విధానాలు అమలు చేయాలి. బోధనలో తేడాలు అమెరికా.. భారత్‌లను పోల్చితే బోధన, పాఠం చెప్పే తీరులో వ్యత్యాసం ఉంటోంది. అమెరికాలో టీచింగ్ అసిస్టెన్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఫ్యాకల్టీ తరగతి గదిలో ఒక అంశాన్ని బోధిస్తే.. దానికి సంబంధించిన లేబొరేటరీ వర్క్, అసైన్మెంట్ల పరిష్కారం దిశగా టీచింగ్ అసిస్టెన్స్ సదుపాయం ప్రత్యక్షంగా లభిస్తుంది. ఫలితంగా విద్యార్థులకు తాము థియరిటికల్‌గా నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్‌గా అవగాహన పొందే వీలు కలుగుతుంది. ఈ విధానం మన దేశంలో ఐఐటీలు, బిట్స్ వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లలోనే ఉంది. ఇది అన్ని స్థాయిల్లో, అన్ని ఇన్స్టిట్యూట్లలో అమలు కావాలి. కరిక్యులంలో మార్పులు చేయాలి కరిక్యులంలో మార్పు అనేది నిరంతర ప్రక్రియగా సాగాల్సిందే. అప్పుడే పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు సొంతం చేసుకోగలుగుతారు. బిట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో కరిక్యులంలో మార్పులు నిరంతరం జరుగుతుంటాయి. మరిన్ని అవకాశాలకు.. డ్యూయల్ డిగ్రీలు ఇటీవల కాలంలో విద్యార్థులకు కెరీర్ పరంగా ఆకర్షణీయంగా మారుతున్నవి డ్యూయల్ డిగ్రీ కోర్సులు. వీటివల్ల విద్యార్థులకు కెరీర్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ప్రస్తుతం బిట్స్‌లో అమలు చేస్తున్న ఈ డ్యూయల్ డిగ్రీ విధానంలో విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సు నిర్ణీత కాల వ్యవధి తర్వాత అదనంగా ఒక ఏడాది ఏదైనా ఒక అంశాన్ని రెండో స్పెషలైజేషన్‌గా చదివితే డ్యూయల్ డిగ్రీ అందజేస్తున్నాం. వాస్తవంగా ఇప్పటి పోటీ పరిస్థితుల్లో డ్యూయల్ డిగ్రీలు ఎంతో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. స్టార్టప్స్‌కు అనుకూల వాతావరణం కల్పించాలి స్టార్టప్స్ విషయంలో ఇటీవల కొంత పురోగతి కనిపిస్తున్నప్పటికీ.. అది ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. కారణం వీటికి అవసరమైన సదుపాయాలు తగినంతగా లేకపోవడమే. కానీ.. సిలికాన్ వ్యాలీలో పరిస్థితిని చూస్తే మొత్తం ఉత్పత్తుల్లో 25 శాతం భారతీయుల ఆలోచనలకు ప్రతిరూపాలే. దీని అర్థం.. అవకాశాలు కల్పిస్తే మన దేశంలోనే ఎన్నో ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. ఇటీవల కాలంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించే దిశగా ఐఐటీలు, బిట్స్, ట్రిపుల్ ఐటీలు వంటి ఇన్స్టిట్యూట్లు ఇంక్యుబేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఇవి ఇంకా పెరగాలి. అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలంటే కొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. లక్ష్యంపై స్పష్టత విద్యార్థులు ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా.. తమను తాము ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాలి. సదరు ఇన్స్టిట్యూట్, కోర్సులో ఎందుకు చేరారు? ఏయే లక్షణాలు తమలో ఉన్నాయి? కోర్సు పూర్తి చేసి ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక ఏం చేయాలనుకుంటున్నారు? అనే అంశాల్లో స్పష్టత ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తాము వేసే ప్రతి అడుగు జీవితంలో సుదీర్ఘ కాలం ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. ఇక.. కోర్సు పూర్తి చేశాక ఉన్నత విద్య వైపు వెళ్లడమా? ఉద్యోగం సొంతం చేసుకోవడమా? అనేది ఆయా విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉన్నత విద్య ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చని గుర్తించాలి!! -
వామ్మో... ఎంత అతి!
సినిమాల్లో హీరో పోలీసాఫీసరైతే భలే బాగుంటుంది. ఇన్వెస్టిగేషన్లు, ఇంటరాగేషన్లు, అరెస్టులు అంటూ యాక్షన్ సీన్లు భలే ఆసక్తి గొలుపుతాయి. ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తారు కూడా. అందుకే బుల్లితెర మీద కూడా పోలీసు కథలు మొదల య్యాయి. అలాంటి వాటిలో ఒకటి... ‘సూపర్కాప్స్ వర్సెస్ సూపర్ విలన్స్’. లైఫ్ ఓకే చానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్లో ఓ పోలీసు గ్రూప్ ఉంటుంది. వాళ్లకి కొన్ని వింత వింత సమస్యలు వస్తుంటాయి. విచిత్రమైన శత్రువులు ఎదురవుతుంటారు. వారి నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడేందుకు ఖాకీలు చేసే పోరాటమే ఈ సీరియల్. స్టోరీ ఓకే కానీ ఆ సమస్యలు ఉంటాయి చూడండీ... ఎంత విచిత్రంగా ఉంటాయో. అసలు నిజ జీవితంలో అలాంటి సమస్యలు రానే రావు. అలాంటి శత్రువులు ఎదురు పడనూ పడరు. తలలేని వాళ్లు, జంతువుల్లాగా పాకుతున్నవాళ్లు, బిల్డింగుల మీద ఎగిరేవాళ్లు, ముట్టుకుంటే షాక్ కొట్టేవాళ్లు, బాంబు పెట్టి పేల్చినా ఏమీ కాని ఇనుప దేహాలు కలవాళ్లు... ఇలాంటి విచిత్రమైనవాళ్లు దాడి చేస్తుంటారు. ప్రజల్ని, దేశాన్ని నాశనం చేయాలనుకుంటూ ఉంటారు. వాళ్లని మట్టుబెట్టే విధానం తెలియక కాసేపు, తెలిశాక ఎలా మట్టుబెట్టాలా అని కాసేపు పోలీసులు నానా హైరానా పడిపోతుంటారు. అవడానికి పెద్దల సీరియలే అయినా... చూడ్డానికి చిన్నపిల్లల షోలా అనిపిస్తుంది. కల్పనల్ని బాగా నమ్మేవాళ్లు, ఇష్టపడేవాళ్లు మాత్రమే దీన్ని చూడగలరు. వాస్తవికతను కోరుకునేవాళ్లెవరూ ఆ అతిని భరించలేరు! -
సమస్యల క్షేత్రం
* పరిశోధనలకు దూరంగా సామర్లకోట వ్యవసాయ క్షేత్రం * అధికారులూ లేరు.. సిబ్బంది కరువు * శిథిలస్థితిలో క్వార్టర్లు * రైతులకు చేరని సేవలు సామర్లకోట : సామర్లకోట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఒకప్పుడు రాష్ట్రంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తన పరిశోధనలతో ప్రత్యేక స్థానం నిలుపుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పరిశోధనలు లేవు సరికదా భవనాలు శిథిలమైపోయి.. క్వార్టర్లు పాడైపోయి.. సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే నిరుపయోగంగా మారింది. సాంకేతికతకు దూరం అయింది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి.. 1902లో గోదావరి, ఏలేరు కాలువ ముఖ్య కూడలి ప్రదేశంలో 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశారు. సిబ్బంది క్వార్టర్లు కోసమే సుమారు 10 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 30 ఎకరాల్లో వివిధ పంటలు పండించి రైతులల్లో అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలో 40 ఏళ్ల క్రితం సన్న బియ్యం పరిశోధనలో భాగంగా ఎస్ఎల్ఓ (సామర్లకోట) అక్కుళ్లు వరి వంగడాన్ని ఉత్పత్తి చేశారు. అప్పట్లో ఎస్ఎల్ఓ అక్కుళ్లుకు రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది. అయితే ఆ తరువాత నుంచి ఇక్కడ పరిశోధన లు కరువయ్యాయి. శాస్త్రవేత్తలు, అధికారులు దృష్టి పెట్టడం మానేశారు. దీంతో ఈ కేంద్రం రైతులకు విత్తనాలు ఉత్పత్తి చేయడానికే పరిమితం అయింది. అప్పట్లో ఇక్కడ ఏడీఏతో పాటు ముగ్గురు వ్యవసాయ అధికారులు, ఇద్దరు వ్యవసాయ విస్తరణాధికారులు, ఇతర సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ఇన్చార్జి ఏడీఏతో పాటు ఒక వ్యవసాయాధికారి మాత్రమే పని చేస్తున్నారు. కేంద్రంలో పంటలను పర్యవేక్షించేందుకు సిబ్బంది ఉండేలా నిర్మించిన క్వార్టర్లు శిథిలమయ్యాయి. వీటిల్లో ఎవరూ ఉండడం లేదు. క్వార్టర్లలో తుప్పలు పెరిగిపోయి పాములకు నిలయంగా మారాయి. సాంకేతికకూ దూరం గతంలో వ్యవసాయ ఉత్పత్తిలో వచ్చిన సాంకేతిక పద్ధతులను అవలంబించి వాటి ఫలితాలను రైతులకు వివరించేవారు. 2008లో వరినాట్ల యంత్రాలు, వరి కోత యంత్రాలు తీసుకువచ్చి రైతులకు ఆర్భాటంగా పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం సాంకేతిక పద్ధతుల గురించి అధికారులు పట్టించుకోవడం మానేశారు. వెదజల్లు పద్ధతి, డ్రమ్ము సీడర్లు ద్వారా వరి విత్తనాలు వేసి ఖర్చు తగ్గించుకోవడం, అధిక దిగుబడులు సాధించడం తదితర వాటి గురించి అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ కేంద్రంలో మాత్రం వ్యవసాయ కూలీలతో వరినాట్లు వేయిస్తున్నారు. అలాగే కేంద్రంలో వర్మి కంపోస్టు తయారీ కేంద్రాన్ని ప్రారంభించి వదిలేశారు. వర్మి కంపోస్టు తయారు చేసుకునే రైతులకు వానపాములు అందజేసే నిమిత్తం వానపాముల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి పట్టించుకోవడం మానేశారు. భూముల ఆక్రమణ వ్యవసాయ క్షేత్రానికి చెందిన 30 ఎకరాల భూమిలో కొంత మేర ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆక్రమణలు జరినట్టు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రంపై ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థకావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అభివృద్ధి పథంలో పెట్టాలని కోరుతున్నారు.