డైనోసార్లు ఇలా అంతరించాయి
మియామి: ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ ఇది కొన్ని కోట్ల మంది మెదడ్లో నానుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పటికిప్పుడు కాకున్న వచ్చే ఏడాదికైన సమాధానం దొరుకుతుంది. కాని కొన్ని వందల ఏళ్లుగా రాక్షసబల్లులు ఎలా అంతరించపోయాయి అనే దానికి మాత్రం ఎవరి దగ్గర సరైన జవాబు లేదు. ఈ విషయంపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. ఒక గ్రహశకలం భూమిని ఢీ కొట్టడం వల్ల డైనోసార్లు అంతరించాయని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కానీ అంతకంటే ముందే కొన్ని మిలియన్ సంవత్సరాలకు పూర్వమే అవి అంతరించి పోయే దశకు చేరుకుని జీవించడానికి పోటీపడ్డాయని కొందరు పరిశోధకులు ఇటీవల అధ్యయనంలో తేల్చారు. ఖండచలనాలు, అగ్ని ప్రమాదాలను అధిగమించి జీవించడానికి రాక్షసబల్లులు చాలా కష్టపడ్డాయని కనుగొన్నారు. 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టడం వల్ల దుమ్ము, ధూళి కణాలు ఆవరించి సూర్య కిరణాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకున్నాయని, చెట్లు, జీవరాశులు నశించిపోయాయని గుర్తించారు. దీంతో డైనోసార్లకు ఆహారం లేకుండా పోవడంతో అంతరించి పోయాయని కనుగొన్నారు.