హోమోసేపియన్ జాతి మానవులు
అంచనాలు తారుమారు కావడం అంటే ఇదే. ఈ భూమి మీద ఆధునిక మానవుడు (హోమో సేపియన్) అవతరించి దాదాపు మూడు లక్షల ఏళ్లు అయిందని.. ఆఫ్రికాలో పుట్టి.. ఆ తరువాత ప్రపంచమంతా విస్తరించాడని అనుకుంటున్నామా? తాజా పరిశోధనలు ఈ అంచనాలన్నీ తప్పు అంటున్నాయి. భారత్ విషయాన్నే తీసుకుంటే సుమారు నాలుగు లక్షల ఏళ్ల క్రితమే హోమోసేపియన్ జాతి మానవులు ఇక్కడ సంచరించారనేందుకు తగ్గ ఆధారాలను పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీశారు. అలాగే ఇజ్రాయెల్‌లో లభించిన అవశేషాలు కూడా సుమారు రెండు లక్షల ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
భారత్‌లో లభించిన పురాతన రాతి పనిముట్లకు, ఆఫ్రికాలో లభించిన వాటికి ఉన్న దగ్గరి పోలికల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెన్నైలోని శర్మ సెంటర్ ఫర్ హెరిటేజ్ ఎడ్యుకేషన్‌కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్త పప్పు శాంతి తెలిపారు. చెన్నైకు నైరుతి దిక్కులో లభించిన ఈ పని ముట్లు నిజంగానే ఆఫ్రికా నుంచి వలస వచ్చిన హోమో సేపియన్లు తయారు చేశారా? లేక స్థానికంగానే అభివృద్ధి చెందిన మానవుల్లాంటి జంతువులు అభివృద్ధి చేశాయా? అన్నది ప్రస్తుతానికి స్పష్టం కావడం లేదని.. పనిముట్లతోపాటు శిలాజాలేవీ లభించకపోవడం దీనికి ఒక కారణమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment