నల్లగొండ జిల్లాలో వజ్రపు నిక్షేపాలు?
♦ అధ్యయనం చేస్తున్న ఉస్మానియా జియోఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్స్
♦ చండూరు, గుర్రంపోడు మండలాల్లోని 3 గ్రామాల్లో పర్యటన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వజ్రపు నిక్షేపాలున్నాయన్న కోణంలో నల్లగొండ జిల్లాలో జరుగుతున్న పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో లాంప్రైట్ ఖనిజాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ఇప్పటికే నిర్ధారించగా, చండూరు, గుర్రంపోడు మండలాల్లో కూడా భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన జియోఫిజిక్స్ ఎమిరీటస్ ప్రొఫెసర్ రాందాస్ నేతృత్వంలోని ఆరుగురు పరిశోధన విద్యార్థుల బృందం ఈ రెండు మండలాల్లోని మూడు గ్రామాల్లో పర్యటించింది.
గుండ్రపల్లి, అలరాజువారిగూడెం, వట్టికోడు గ్రామాల్లో పర్యటించి భూగర్భ పొరల్లో మూడు రకాల పరీక్షలు చేశారు. టోటల్ మాగ్నెటిక్ ఇంటెన్సిటీ (టీఎంఐ), రేడియో మెట్రిక్ ఇన్వెస్టిగేషన్ (ఆర్‌ఎంఐ)లతోపాటు అత్యంత తక్కువ సాంద్రతలో ఎలక్ట్రో మాగ్నెటిక్ మెథడ్ (ఈఎంఎం) పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా అసలు ఈ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలున్న మాట వాస్తవమా.. కాదా? అనేది నిర్ధారణ జరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అయితే, ఈ పరీక్షలను తరచుగా జరుపుతుండడం, మరో 3 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండడం జిల్లా వాసుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు మాత్రం జిల్లాలో అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లు ఉన్నాయని, కానీ వీటిని వెలికితీసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న పగుళ్లు, ఆనవాళ్లను బట్టి తాము జీఎస్‌ఏకు నివేదికలు పంపుతామని, వీటిని పరిశీలించాక ఈ ఖనిజాలను వెలికితీస్తే లబ్ధి చేకూరుతుందని కేం ద్రం భావిస్తే.. అనుమతి ఇస్తుందని వారంటున్నారు.
గతంలో జీఎస్‌ఏ పరీక్షలు
వాస్తవానికి నల్లగొండ జిల్లాలో వజ్రపు గనులున్నాయన్న కోణంలో గత పదేళ్లుగా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు, మూడు సార్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా పరీక్షలు చేసింది. ముఖ్యంగా హాలియా మండల కేంద్రంతోపాటు రామడుగు ప్రాంతాల్లో, మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లిలో కూడా పరీక్షలు జరిపింది. ఈ పరిశోధనల్లో సైతం ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లు ఉన్నాయని తేలినా, పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓయూ రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్న పరిశోధనలు కూడా జిల్లాలో ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లకు ఊతమిస్తున్నాయి.