ఆలోచన అక్కర్లేదా?!  | Indian Govt Removed Awards In Scientific research | Sakshi
Sakshi News home page

ఆలోచన అక్కర్లేదా?! 

Published Thu, Oct 6 2022 11:34 PM | Last Updated on Fri, Oct 7 2022 12:36 AM

Indian Govt Removed Awards In Scientific research - Sakshi

ఇది ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ అవార్డుల సీజన్‌. కొద్దిరోజులుగా వివిధ రంగాల్లో నోబెల్‌ విజేతల పేర్లు ప్రకటిస్తుంటే, అంతకు పక్షం రోజుల క్రితం మన దేశంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిన ఓ దుర్మార్గం ఆలస్యంగా బయట కొచ్చింది. శాస్త్రీయ పరిశోధనలో ప్రతిభను గుర్తించి ఏటా ఇచ్చే 300 అంతర్గత అవార్డులు, ఉపకార వేతనాలు, ఫెలోషిప్‌లను ఎత్తివేయాలని  కేంద్రం నిర్ణయించింది.

వివిధ రంగాల్లో అవార్డుల ఎంపికను క్రమబద్ధీకరించడానికంటూ కేంద్ర హోమ్‌ సెక్రటరీ సారథ్య సమావేశంలో గత నెల 16న చడీచప్పుడు లేకుండా పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం దిగ్భ్రాంతికరం. శాస్త్రీయ దృక్పథాన్నీ, పరిశోధననూ పెంచాల్సిన రోజుల్లో ఆ స్ఫూర్తికి అశనిపాతం. దేశంలో అవార్డుల ఎంపిక వ్యవస్థను పారదర్శకంగా, నిష్పాక్షికంగా తీర్చిదిద్దాలనే ప్రధాని ఆలోచన మంచిదే కావచ్చు. దాని అంతరార్థం, శాస్త్రవేత్తల సమూహానికి కలిగించే నష్టమే చర్చనీయాంశం.  

అవార్డులైనా... రివార్డులైనా ప్రతిభను ప్రోత్సహించడానికి! ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నవారిని గుర్తించి, గౌరవించడానికి!! సంక్లిష్టమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అవి మరింత కీలకం. 1940లు, 50లలో భారతీయ శాస్త్రవేత్తల్లో సుప్రసిద్ధుడూ, సీఎస్‌ఐఆర్‌ సంస్థాపకుడూ అయిన ప్రొఫెసర్‌ శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ జన్మదినమైన సెప్టెంబర్‌ 26ను మన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా జరుపుకొంటారు.

ప్రతి ఏటా సరిగ్గా ఆ రోజునే భారత ప్రభుత్వం సైతం మన దేశంలో కృషి చేస్తున్న అత్యుత్తమ ప్రతిభావంతులైన 45 ఏళ్ళ వయస్సు లోపు శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, భట్నాగర్‌ ప్రైజ్‌ ప్రకటిస్తుంది. కానీ, ఈసారి ప్రభుత్వ అవార్డు ప్రకటనలు లేకపోగా, ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని ప్రైవేట్‌ ధర్మనిధి పురస్కారాల్ని సైతం ఎత్తివేస్తున్నట్టు చావుకబురు చల్లగా చెప్పింది. ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల సమాచారాన్ని బయటపెట్టి, గమ్మున ఊరకుంది. 

ఇప్పుడిక శాస్త్ర, సాంకేతిక విభాగంలో అవార్డుల సంఖ్య 207 నుంచి 4 జాతీయ అవార్డులకే పరిమితం. అంతరిక్షం, భూవిజ్ఞానం, అణు ఇంధన శాఖల్ని సైతం అవార్డులన్నీ ఎత్తేయమని కేంద్రం పేర్కొంది. ఏలికలు అకస్మాత్తుగా ఇలా అవార్డులు ఎత్తేయడానికి హేతుబద్ధత ఏమిటో అంతుపట్టదు. పొదుపుచర్యల్లో భాగంగా ఇలా చేశారనుకోవడానికీ వీల్లేదు.

ఎందుకంటే, ఈ అవార్డులన్నిటికీ కలిపి ఏటా అయ్యే ఖర్చు అతి స్వల్పం. పోనీ, అర్హత లేని వారికి అవార్డులిస్తారనే మిషతో ఈ ఎత్తివేత జరిగిందా అంటే అదీ లేదు. సాధారణంగా ఏ అవార్డుల ఎంపికలోనైనా పక్షపాతం, దురభిప్రాయాల్ని కొట్టిపారేయలేం. ఇప్పటిదాకా శాస్త్రవేత్తల అవార్డుల్లో తప్పుడు ఎంపికలు అతి తక్కువ. ప్రస్తుతమున్న ఎంపిక ప్రక్రియలో అధిక శాతం అత్యుత్తమ ప్రతిభావంతులకే పట్టం కట్టారు.  

మరి ఏలినవారి ఈ హఠాన్నిర్ణయానికి కారణం? శాస్త్ర సాంకేతిక రంగాల్లోని బహుకొద్ది శాస్త్రవేత్తలే నేటి పాలకుల ప్రశ్నార్హమైన శాస్త్రీయ అజెండాతో అంటకాగుతున్నారు. అవార్డులన్నిటినీ కేంద్రీకృతం చేయడం వల్ల ఎంపిక కమిటీలపై ప్రభుత్వం పట్టు బిగుస్తుంది. దరిమిలా అయినవాళ్ళకు అవార్డులు వడ్డించి, వారిని వివిధ పరిశోధక సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో కీలక స్థానాల్లో కూర్చోబెట్టే వీలొస్తుంది.

ఇదే తాజా ప్రభుత్వ నిర్ణయంలో పరమార్థమని వాదన. అలాగే, పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ విధానాలను మీడియాలో విమర్శించారు. మింగుడుపడని పాలకులు వారి రెక్కలు కత్తిరించడానికే ఈ చర్య చేపట్టారని ఒక కథనం.

యువ శాస్త్రవేత్తలకిచ్చే ఫెలోషిప్‌లు గతంలో ఎప్పుడో అరుదుగా ఆలస్యమయ్యేవి. కానీ, మూడేళ్ళుగా సమయానికి ఫెలోషిప్‌లు, గ్రాంట్లు రాక పరిశోధనకు అవసరమైన సరుకులు, సామగ్రి వారు కొనుక్కోలేకపోతున్నారు. కుటుంబాల్ని పోషించుకోలేని పీహెచ్‌డీ విద్యార్థులు సగంలోనే పరిశోధనకు మంగళం పాడుతున్నారు.

ఇప్పుడు అవార్డులను ఎత్తివేయడమంటే ప్రోత్సాహాన్ని ఆపేయడమే కాదు.... శాస్త్రీయ పరిశోధన పట్ల ఆసక్తిని మరింత నీరుగార్చి, నిరుత్సాహపరచడం! అసలు మన దేశంలో సరికొత్త పరిశోధనలకు ప్రేరణనిస్తూ, శాస్త్రవేత్తల వెన్నుతట్టేందుకు ఉన్న అవార్డులే తక్కువ. ఖజానాకు ఖర్చు లేని ప్రైవేట్‌ ధర్మనిధి పురస్కారాల్నీ ఎత్తేయడం ఏ రకంగా సమంజసం? ఇప్పటికే దేశం.

ప్రాథమిక శాస్త్రీయ పరిశోధనలకు వచ్చే యువతీ యువకులు తగ్గారు. ఇతర రంగాల్లోని భారీ వేతనాలిచ్చే ఉద్యోగాల వైపు మళ్ళుతున్నారు. తాజా చర్యతో సర్కార్‌ ఎలాంటి సంకేతాలిస్తోంది? 

పాత అవార్డుల స్థానంలో నోబెల్‌ తరహాలో ‘విజ్ఞాన్‌ రత్న’ పేరిట ఉన్నత శ్రేణి జాతీయ అవార్డులు కొన్ని తెస్తామని సర్కారు వారి మాట. ఈ కొత్తవి పరిశోధనలో అన్ని విభాగాలకూ, పరిశోధకులకూ వర్తిస్తాయో లేదో తెలీదు. అవార్డులు తీసేస్తే, వాటి కోసం ఇచ్చిన ధర్మనిధులు ఏమవుతాయి? వాటిని దేనికి వినియోగిస్తారు? జవాబు లేని ప్రశ్నలెన్నో! శాస్త్రీయ పరికరాల కొనుగోలుపై జీఎస్టీని కేంద్రం ఇటీవలే 5 శాతం నుంచి 18 శాతానికి పెంచింది.

ఇది పలు సంస్థల పరిశోధన బడ్జెట్‌కు మోయలేని భారమవుతోంది. అలాగే, విదేశీ పరిశోధకుల్ని ఆహ్వానించాలన్నా, విదేశీ విశ్వవిద్యాలయంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలన్నా లెక్కలేనన్ని అనుమతులు అడ్డం పెట్టి, వ్యవహారం సంక్లిష్టం చేసింది. పరిశోధనలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని దాదాపు అసాధ్యం చేసింది.

నమ్మకాలు, విశ్వాసాలకే తప్ప హేతుబద్ధత, తార్కిక విశ్లేషణకు చోటు లేకుండా పోతున్న రోజుల్లో, పాలనలో శాస్త్రీయ దృష్టికి ప్రోత్సాహం ఇలానే ఉంటుందేమో! ఏమైనా ఉత్తమాటలు చెప్పి ఉన్నవాటన్నిటినీ ఎత్తేయడం... మబ్బులు చూపిస్తూ ముంతలో ఉన్న నీళ్ళు ఒలకబోయడమే!!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement