Department of Science and Technology
-
నూతన ఆవిష్కరణలకు వేదికగా గ్లోబల్ టెక్ సమిట్
హైదరాబాద్: వచ్చే నెల ఫిబ్రవరిలో వైజాగ్‌లో జరగబోయే గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023 .. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలవగలదని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ (టెక్నాలజీ డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్) అనితా అగర్వాల్ చెప్పారు. ఐటీ, సైన్స్, టెక్నాలజీ, స్టార్టప్స్, వాణిజ్యం తదితర రంగాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత మేధావులందరిని ఒక చోటికి చేర్చి, అర్థవంతమైన చర్చలకు తోడ్పడగలదని ఆమె తెలిపారు. 25 మంది ఇన్నోవేటర్ల ప్రతినిధి బృందంతో శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. అంకుర సంస్థలు, శాస్త్రవేత్తలు తదితరులు తమ మేథోశక్తిని ప్రదర్శించేందుకు గ్లోబల్ టెక్ సమిట్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 16–17 తేదీల్లో వైజాగ్‌లో నిర్వహించబోయే సదస్సులో పలు కీలక ప్రాజెక్టులను ప్రదర్శించనున్నట్లు గ్లోబల్ టెక్ సమిట్ 2023 లీడ్ ఆర్గనైజర్, పల్సస్ గ్రూప్ వ్యవస్థాపకుడు శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఐఐటీ, సీఎస్ఐఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 20 మంది ఆవిష్కర్తల బృందం వీటిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సదస్సు సందర్భంగా దాదాపు రూ. 3,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులపై కుదిరే అవకాశాలు ఉన్నాయి. -
ఆలోచన అక్కర్లేదా?!
ఇది ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ అవార్డుల సీజన్. కొద్దిరోజులుగా వివిధ రంగాల్లో నోబెల్ విజేతల పేర్లు ప్రకటిస్తుంటే, అంతకు పక్షం రోజుల క్రితం మన దేశంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిన ఓ దుర్మార్గం ఆలస్యంగా బయట కొచ్చింది. శాస్త్రీయ పరిశోధనలో ప్రతిభను గుర్తించి ఏటా ఇచ్చే 300 అంతర్గత అవార్డులు, ఉపకార వేతనాలు, ఫెలోషిప్లను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రంగాల్లో అవార్డుల ఎంపికను క్రమబద్ధీకరించడానికంటూ కేంద్ర హోమ్ సెక్రటరీ సారథ్య సమావేశంలో గత నెల 16న చడీచప్పుడు లేకుండా పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం దిగ్భ్రాంతికరం. శాస్త్రీయ దృక్పథాన్నీ, పరిశోధననూ పెంచాల్సిన రోజుల్లో ఆ స్ఫూర్తికి అశనిపాతం. దేశంలో అవార్డుల ఎంపిక వ్యవస్థను పారదర్శకంగా, నిష్పాక్షికంగా తీర్చిదిద్దాలనే ప్రధాని ఆలోచన మంచిదే కావచ్చు. దాని అంతరార్థం, శాస్త్రవేత్తల సమూహానికి కలిగించే నష్టమే చర్చనీయాంశం. అవార్డులైనా... రివార్డులైనా ప్రతిభను ప్రోత్సహించడానికి! ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నవారిని గుర్తించి, గౌరవించడానికి!! సంక్లిష్టమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అవి మరింత కీలకం. 1940లు, 50లలో భారతీయ శాస్త్రవేత్తల్లో సుప్రసిద్ధుడూ, సీఎస్ఐఆర్ సంస్థాపకుడూ అయిన ప్రొఫెసర్ శాంతిస్వరూప్ భట్నాగర్ జన్మదినమైన సెప్టెంబర్ 26ను మన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా జరుపుకొంటారు. ప్రతి ఏటా సరిగ్గా ఆ రోజునే భారత ప్రభుత్వం సైతం మన దేశంలో కృషి చేస్తున్న అత్యుత్తమ ప్రతిభావంతులైన 45 ఏళ్ళ వయస్సు లోపు శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, భట్నాగర్ ప్రైజ్ ప్రకటిస్తుంది. కానీ, ఈసారి ప్రభుత్వ అవార్డు ప్రకటనలు లేకపోగా, ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని ప్రైవేట్ ధర్మనిధి పురస్కారాల్ని సైతం ఎత్తివేస్తున్నట్టు చావుకబురు చల్లగా చెప్పింది. ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల సమాచారాన్ని బయటపెట్టి, గమ్మున ఊరకుంది. ఇప్పుడిక శాస్త్ర, సాంకేతిక విభాగంలో అవార్డుల సంఖ్య 207 నుంచి 4 జాతీయ అవార్డులకే పరిమితం. అంతరిక్షం, భూవిజ్ఞానం, అణు ఇంధన శాఖల్ని సైతం అవార్డులన్నీ ఎత్తేయమని కేంద్రం పేర్కొంది. ఏలికలు అకస్మాత్తుగా ఇలా అవార్డులు ఎత్తేయడానికి హేతుబద్ధత ఏమిటో అంతుపట్టదు. పొదుపుచర్యల్లో భాగంగా ఇలా చేశారనుకోవడానికీ వీల్లేదు. ఎందుకంటే, ఈ అవార్డులన్నిటికీ కలిపి ఏటా అయ్యే ఖర్చు అతి స్వల్పం. పోనీ, అర్హత లేని వారికి అవార్డులిస్తారనే మిషతో ఈ ఎత్తివేత జరిగిందా అంటే అదీ లేదు. సాధారణంగా ఏ అవార్డుల ఎంపికలోనైనా పక్షపాతం, దురభిప్రాయాల్ని కొట్టిపారేయలేం. ఇప్పటిదాకా శాస్త్రవేత్తల అవార్డుల్లో తప్పుడు ఎంపికలు అతి తక్కువ. ప్రస్తుతమున్న ఎంపిక ప్రక్రియలో అధిక శాతం అత్యుత్తమ ప్రతిభావంతులకే పట్టం కట్టారు. మరి ఏలినవారి ఈ హఠాన్నిర్ణయానికి కారణం? శాస్త్ర సాంకేతిక రంగాల్లోని బహుకొద్ది శాస్త్రవేత్తలే నేటి పాలకుల ప్రశ్నార్హమైన శాస్త్రీయ అజెండాతో అంటకాగుతున్నారు. అవార్డులన్నిటినీ కేంద్రీకృతం చేయడం వల్ల ఎంపిక కమిటీలపై ప్రభుత్వం పట్టు బిగుస్తుంది. దరిమిలా అయినవాళ్ళకు అవార్డులు వడ్డించి, వారిని వివిధ పరిశోధక సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో కీలక స్థానాల్లో కూర్చోబెట్టే వీలొస్తుంది. ఇదే తాజా ప్రభుత్వ నిర్ణయంలో పరమార్థమని వాదన. అలాగే, పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సైన్స్ విధానాలను మీడియాలో విమర్శించారు. మింగుడుపడని పాలకులు వారి రెక్కలు కత్తిరించడానికే ఈ చర్య చేపట్టారని ఒక కథనం. యువ శాస్త్రవేత్తలకిచ్చే ఫెలోషిప్‌లు గతంలో ఎప్పుడో అరుదుగా ఆలస్యమయ్యేవి. కానీ, మూడేళ్ళుగా సమయానికి ఫెలోషిప్‌లు, గ్రాంట్లు రాక పరిశోధనకు అవసరమైన సరుకులు, సామగ్రి వారు కొనుక్కోలేకపోతున్నారు. కుటుంబాల్ని పోషించుకోలేని పీహెచ్డీ విద్యార్థులు సగంలోనే పరిశోధనకు మంగళం పాడుతున్నారు. ఇప్పుడు అవార్డులను ఎత్తివేయడమంటే ప్రోత్సాహాన్ని ఆపేయడమే కాదు.... శాస్త్రీయ పరిశోధన పట్ల ఆసక్తిని మరింత నీరుగార్చి, నిరుత్సాహపరచడం! అసలు మన దేశంలో సరికొత్త పరిశోధనలకు ప్రేరణనిస్తూ, శాస్త్రవేత్తల వెన్నుతట్టేందుకు ఉన్న అవార్డులే తక్కువ. ఖజానాకు ఖర్చు లేని ప్రైవేట్ ధర్మనిధి పురస్కారాల్నీ ఎత్తేయడం ఏ రకంగా సమంజసం? ఇప్పటికే దేశం. ప్రాథమిక శాస్త్రీయ పరిశోధనలకు వచ్చే యువతీ యువకులు తగ్గారు. ఇతర రంగాల్లోని భారీ వేతనాలిచ్చే ఉద్యోగాల వైపు మళ్ళుతున్నారు. తాజా చర్యతో సర్కార్ ఎలాంటి సంకేతాలిస్తోంది? పాత అవార్డుల స్థానంలో నోబెల్ తరహాలో ‘విజ్ఞాన్ రత్న’ పేరిట ఉన్నత శ్రేణి జాతీయ అవార్డులు కొన్ని తెస్తామని సర్కారు వారి మాట. ఈ కొత్తవి పరిశోధనలో అన్ని విభాగాలకూ, పరిశోధకులకూ వర్తిస్తాయో లేదో తెలీదు. అవార్డులు తీసేస్తే, వాటి కోసం ఇచ్చిన ధర్మనిధులు ఏమవుతాయి? వాటిని దేనికి వినియోగిస్తారు? జవాబు లేని ప్రశ్నలెన్నో! శాస్త్రీయ పరికరాల కొనుగోలుపై జీఎస్టీని కేంద్రం ఇటీవలే 5 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. ఇది పలు సంస్థల పరిశోధన బడ్జెట్‌కు మోయలేని భారమవుతోంది. అలాగే, విదేశీ పరిశోధకుల్ని ఆహ్వానించాలన్నా, విదేశీ విశ్వవిద్యాలయంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలన్నా లెక్కలేనన్ని అనుమతులు అడ్డం పెట్టి, వ్యవహారం సంక్లిష్టం చేసింది. పరిశోధనలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని దాదాపు అసాధ్యం చేసింది. నమ్మకాలు, విశ్వాసాలకే తప్ప హేతుబద్ధత, తార్కిక విశ్లేషణకు చోటు లేకుండా పోతున్న రోజుల్లో, పాలనలో శాస్త్రీయ దృష్టికి ప్రోత్సాహం ఇలానే ఉంటుందేమో! ఏమైనా ఉత్తమాటలు చెప్పి ఉన్నవాటన్నిటినీ ఎత్తేయడం... మబ్బులు చూపిస్తూ ముంతలో ఉన్న నీళ్ళు ఒలకబోయడమే!! -
స్వదేశీ డిజిటల్ మ్యాప్
బెంగళూరు: మీరు గూగుల్ మ్యాప్ వాడుతున్నారా ? గమ్యస్థానం చేరినప్పటికీ మ్యాప్‌లో కొద్ది మీటర్ల దూరం తేడా వచ్చిందా ! గూగుల్ మ్యాప్స్‌లో కచ్చితత్వం, కొన్ని మీటర్ల తేడాతో ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు భారత్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని సర్వే ఆఫ్ ఇండియా నడుం కట్టింది. డిజిటల్ మ్యాప్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా కచ్చితత్వాన్ని 10 సెంటీమీటర్ల తేడాతో గుర్తించేలా డిజిటల్ మ్యాప్‌ను తయారుచేయబోతోంది. దీనికోసం డ్రోన్లను, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటాను ఉపయోగించుకుంటోందని ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. కచ్చితమైన కొలతలతో... ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మ్యాపును ప్రజలకు, గ్రామ పంచాయతీలకు, ప్రభుత్వ అధికారులకు అందివ్వనున్నారు. దీనివల్ల పరిపాలనా పరమైన ప్రయోజనాలు కూడా ఉండేలా రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర, గంగా బేసిన్లో మ్యాప్ కోసం సర్వే ప్రారంభించారు. గంగా బేసిన్‌కు ఇరువైపులా 25 కిలోమీటర్ల దూరంపాటు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో మ్యాపింగ్ చేస్తున్నట్లు సర్వే అధికారి ప్రొఫెసర్ శర్మ వెల్లడించారు. డిజిటల్ రిఫరెన్స్ పాయింట్లు... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలసి ఈ ప్రాజెక్టు చేపట్టామన్న వార్తలు అవాస్తవమని ప్రొఫెసర్ శర్మ తెలిపారు. సాధారణంగా శాటిలైట్లు ఫొటోలు తీస్తాయని, ఇది అలాంటి సాంకేతిక కాదన్నారు. డ్రోన్లను ఉపయోగించి, మలుపులను పరిగణలోకి తీసుకొని తయారుచేసే హైరిజల్యూషన్ మ్యాప్ అన్నారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక డిజిటల్ రిఫరెన్స్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా అక్షాంశాలు, రేఖాంశాలను కచ్చితత్వంతో విభజించడంతోపాటు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో మ్యాప్ ఉంటుందన్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) కొద్ది మీటర్ల తేడాతో ప్రదేశాలను గుర్తిస్తే ఇందులో ఆ తేడా స్వల్పమన్నారు. -
సైన్స్ సెంటర్‌కు తాళం
* నిర్మాణం పూర్తయినా తెరుచుకోని కేంద్రం * ప్రతి నెల నిర్వహణ ఖర్చులకే రూ. లక్ష * రెండేళ్లుగా పట్టించుకోని యంత్రాంగం సాక్షి ప్రతినిధి, వరంగల్: శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతీయ సైన్ సెంటర్ తెరుచుకోవడంలేదు. రెండేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయిన... రాష్ట్రంలోని ఏకైక సెంటర్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రూ. 3.85 కోట్లతో శాస్త్ర సాంకేతిక శాఖ నిర్మించిన ఈ సైన్స్ సెంటర్ సందర్శకులు అడుగు పెట్టకుండానే... మూత పడే పరిస్థితి వస్తోంది. సందర్శకులు వస్తే వసూలయ్యే ఫీజుతో నడిచే ఈ సెంటర్ మూతపడి ఉండడంతో నిర్వహణ కోసం... వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ప్రతి నెల లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అద్భుతమైన కట్టడం నిర్మాణ లక్ష్యం నెరవేరకుండా పోతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక సైన్స్ సెంటర్ ప్రారంభించాలనే ఆలోచన వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఫెలోషిప్స్
డీఎస్టీ-సీఎస్ఐ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) కాగ్నిటివ్ సైన్స్‌లో పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాలపరిమితి: రెండేళ్లు ఫెలోషిప్: ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ.35 వేలు చెల్లిస్తారు. దీంతోపాటు కంటింజెన్సీ ఫండ్ కింద ఏడాదికి రూ.2 లక్షలు చెల్లిస్తారు. అర్హతలు: సైన్స్/ఇంజనీరింగ్/అలైడ్ సెన్సైస్‌లో పీహెచ్డీ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి, పోస్టు/ఈ-మెయిల్ ద్వారా పంపించాలి. చివరి తేది: సెప్టెంబర్ 30 వెబ్సైట్: www.dst.gov.in -
సైన్సపై ఆసక్తి పెంచుకోవాలి
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : విద్యార్థులు సైన్సపై అవగాహన పెంచుకోవాలని కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. హంటర్‌రోడ్‌లోని త్రివి హైస్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. మూడువందల మంది విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శన లో ఉంచారు. కార్యక్రమంలో అతిథులు తొలుత సీవీరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులు వందేమాతర గీతం ఆలపించారు. విద్యార్థులు మృదుల, సౌమ్య నృత్యంతో అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం అబ్దుల్ కలాం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బలరాం నాయక్ ముఖ్య అతిథిగా, కలెక్టర్ కిషన్ విశిష్ట అతిథిగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. డిప్యూటీ డీఈఓ వాసంతి స్వాగత ఉపన్యాసం చేశారు. కేంద్రమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ.. గురువులపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో భారత మేధావులే శాస్త్రవేత్తలుగా సేవలందిస్తారని అంబేద్కర్ ఆనాడే బ్రిటిష్ పాలకులతో అన్నారని గుర్తుచేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు సైన్స్‌పై ఆసక్తి కలిగేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆ ఘనత మనదే : కలెక్టర్ శశిరథుడు అనే మహర్షి నాలుగో శతాబ్దంలోనే కంటి ఆపరేషన్ చేశాడని, ఆ ఘనత మనదేనని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. అంకెల్లో సున్న కనుగొన్న ఆర్యభట్ట మన భారతీయుడేనన్నారు. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో జరిగే మార్పులను గమనించడమే సైన్స్ అన్నారు. హేతువాదంతో ఆలోచిస్తే ప్రతీదీ సైన్సేన న్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. దేశప్రగతి సైన్స్‌పైనే ఆధారపడి ఉందన్నారు. రూ.మూడు కోట్లతో రీజినల్ సైన్స్ సెంటర్ : డీఈఓ రీజనల్ సైన్స్ సెంటర్ ఏర్పాటుకు రూ.మూడుకోట్లు విడుదలయ్యాయని డీఈఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే మొబైల్ సైన్స్ సెంటర్‌తో విద్యార్థులకు వివిధ విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఇన్స్పైర్ కార్యక్రమాలు చేపట్టడం ఇది మూడోసారన్నారు. ఎగ్జిబిట్లను ప్రదర్శించే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రూ.ఐదువేలు అందిస్తోందని, అందులో రూ.2500 ఎగ్జిబిట్ తయారీకి కాగా, మిగతాది విద్యార్థి ప్రయాణ, ఇతర ఖర్చులకు వెచ్చిస్తున్నామని వివరించారు. గతంలో ఢిల్లీలో నిర్వహించిన ఇన్స్పైర్ కార్యక్రమానికి జిల్లా విద్యార్థులను పంపించామని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, వడుప్సా జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రావు, జిల్లా సైన్స్ అధికారి సీహెచ్ కేశవరావు, త్రివి స్కూల్ కరస్పాండెంట్ లింగారెడ్డి, డీసీబీ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.