హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : విద్యార్థులు సైన్‌సపై అవగాహన పెంచుకోవాలని కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. హంటర్‌రోడ్‌లోని త్రివి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. మూడువందల మంది విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శన లో ఉంచారు.
కార్యక్రమంలో అతిథులు తొలుత సీవీరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులు వందేమాతర గీతం ఆలపించారు. విద్యార్థులు మృదుల, సౌమ్య నృత్యంతో అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం అబ్దుల్ కలాం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బలరాం నాయక్ ముఖ్య అతిథిగా, కలెక్టర్ కిషన్ విశిష్ట అతిథిగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. డిప్యూటీ డీఈఓ వాసంతి స్వాగత ఉపన్యాసం చేశారు. కేంద్రమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ.. గురువులపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో భారత మేధావులే శాస్త్రవేత్తలుగా సేవలందిస్తారని అంబేద్కర్ ఆనాడే బ్రిటిష్ పాలకులతో అన్నారని గుర్తుచేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు సైన్స్‌పై ఆసక్తి కలిగేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఆ ఘనత మనదే : కలెక్టర్
శశిరథుడు అనే మహర్షి నాలుగో శతాబ్దంలోనే కంటి ఆపరేషన్ చేశాడని, ఆ ఘనత మనదేనని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. అంకెల్లో సున్న కనుగొన్న ఆర్యభట్ట మన భారతీయుడేనన్నారు. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో జరిగే మార్పులను గమనించడమే సైన్స్ అన్నారు. హేతువాదంతో ఆలోచిస్తే ప్రతీదీ సైన్సేన న్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. దేశప్రగతి సైన్స్‌పైనే ఆధారపడి ఉందన్నారు.
రూ.మూడు కోట్లతో రీజినల్ సైన్స్ సెంటర్ : డీఈఓ
రీజనల్ సైన్స్ సెంటర్ ఏర్పాటుకు రూ.మూడుకోట్లు విడుదలయ్యాయని డీఈఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే మొబైల్ సైన్స్ సెంటర్‌తో విద్యార్థులకు వివిధ విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఇన్‌స్పైర్ కార్యక్రమాలు చేపట్టడం ఇది మూడోసారన్నారు. ఎగ్జిబిట్లను ప్రదర్శించే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రూ.ఐదువేలు అందిస్తోందని, అందులో రూ.2500 ఎగ్జిబిట్ తయారీకి కాగా, మిగతాది విద్యార్థి ప్రయాణ, ఇతర ఖర్చులకు వెచ్చిస్తున్నామని వివరించారు. గతంలో ఢిల్లీలో నిర్వహించిన ఇన్‌స్పైర్ కార్యక్రమానికి జిల్లా విద్యార్థులను పంపించామని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, వడుప్సా జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రావు, జిల్లా సైన్స్ అధికారి సీహెచ్ కేశవరావు, త్రివి స్కూల్ కరస్పాండెంట్ లింగారెడ్డి, డీసీబీ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సైన్‌సపై ఆసక్తి పెంచుకోవాలి
Published Sun, Aug 11 2013 2:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement