సృజనకు పదును పెడితేనే ఆవిష్కరణలు | Minister Rajanarsimha at the state level science exhibition | Sakshi
Sakshi News home page

సృజనకు పదును పెడితేనే ఆవిష్కరణలు

Published Wed, Jan 8 2025 4:23 AM | Last Updated on Wed, Jan 8 2025 4:23 AM

Minister Rajanarsimha at the state level science exhibition

విద్యార్థుల ఆలోచనలను ప్రోత్సహించండి 

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలోమంత్రి రాజనర్సింహ 

అద్భుత ఆవిష్కరణలు ప్రదర్శించిన విద్యార్థులు 

జడ్చర్ల/ జడ్చర్ల టౌన్‌: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహిస్తేనే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఇండస్ట్రియల్‌ గ్రీన్‌ పార్కులోని ఎస్‌వీకేఎంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. 

విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలకు పదుపుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలోనూ సైన్స్‌ ప్రయోగశాలలు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. 

ఈ ప్రదర్శనలో 33 జిల్లాల నుంచి ఇన్‌స్పైర్‌ 2023– 24 విభాగంలో 301.. 2024– 25 రాష్ట్రీయ  బాల్‌ వైజ్ఞానిక ప్రదర్శన కింద 563 ఎంట్రీలు వచ్చాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఏవీఎన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు‡ పాల్గొన్నారు. 

సంజీవని హెలికాప్టర్‌
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల హైసూ్కల్‌ విద్యార్థి ప్రణీత్‌ కుమార్‌ తన గైడ్‌ శోభారాణితో కలిసి ‘సంజీవని హెలికాప్టర్‌’ప్రయోగాన్ని ప్రదర్శించాడు. హెలికాప్టర్‌ ప్రమాదం జరిగినప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్, ఫైర్‌ప్రూప్‌తో కూడిన బెలూన్‌ ఓపెన్‌ అయి సురక్షితంగా బయటపడేందుకు వీలుగా రూపొందించారు. 

బెలూన్‌లోనే ఆక్సిజన్‌ ఉండటం వల్ల అందులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీనికి జీపీఎస్‌ అనుసంధానం ఉండటం వల్ల హెలికాప్టర్‌ క్రాషెస్‌ను గుర్తించేందుకు సులువవుతుంది.  

మొక్కజొన్న వ్యర్థాల నుంచి బయో ఆయిల్‌
మొక్కజొన్న వ్యర్థాలు, పేడ నుంచి బయో ఆయిల్‌ ఉత్పత్తి చేసే ఆవిష్కరణను నిజామాబాద్‌ విజయ హైస్కూల్‌ విద్యార్థులు విజిదేంద్రియ, శ్రీకర్‌ కలసి ప్రదర్శించారు.  

అ్రల్టాసోనిక్‌ హెల్మెట్‌
వినికిడి లోపం ఉన్నవారితో పాటు వాహనదారులకు బైక్‌ నడిపే సమయంలో ప్రమాదాల నివారణకోసం అ్రల్టాసోనిక్‌ హెల్మెట్‌ను ఖమ్మం జిల్లా చెన్నారం జెడ్పీ హైసూ్కల్‌కు చెందిన విద్యార్థి ప్రియ రూపొందించింది. వాహనం నడిపేటప్పుడు సెన్సార్‌ల ఆధారంగా హెల్మెట్‌ గ్లాస్‌కు కంటికి కనిపించే విధంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్‌ లైట్లను ఏర్పాటు చేశారు. దీని ఖర్చు కేవలం రూ.400 నుంచి రూ.1,000 వరకు అవుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement