సముద్రం ఎందుకు ఇలా నీలంగా ఉంటుంది? రంగులేని నీరు సముద్రంలోనే నీలంగా ఎందుకుంది? ఓడ పైభాగంలో నిలబడి మెడిటరేనియన్ సముద్రాన్ని చూస్తుంటే హఠాత్తుగా సీవీ రామన్‌కు సందేహం వచ్చింది. గొప్ప భౌతికశాస్త్రవేత్త కాబట్టి అంత పెద్ద అద్భుతం వెనుక ఉన్న రహస్యమేదో మెదడుకు చేరువవుతున్నట్టనిపించింది కూడా. నీలాకాశాన్ని ప్రతిబింబించడం వల్లనా, ఆ నీలం? ఇదే నిజమైతే వెలుగు లేని క్షణాలలో ఈ అద్భుత జలరాశి నీలం రంగులో కాకుండా ఇంకెలా కనిపిస్తుంది? కెరటాలు వెళ్లి ఒడ్డును తాకి పతనమయ్యే వరకు కూడా నీలంగా ఉంటాయి కదా! అప్పుడే సమాధానానికి చాలా సమీపంగా కూడా వచ్చారాయన.
సూర్యకిరణాలు జల కణాల మీద వికిరణం చెందడం వల్లనే ఆ జలనిధిని నీలి వర్ణం కమ్ముకుందా?! బ్రిటిష్ సామ్రాజ్యంలోని విశ్వవిద్యాలయాల సమావేశం 1921లో లండన్‌లో జరిగింది. ఆ సమావేశానికి కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున చంద్రశేఖర్ వెంకట రామన్ హాజరయ్యారు. తిరిగి వస్తుంటే ఆ మహా భౌతికశాస్త్రవేత్తకు కలిగిన ఆలోచనలివి. ఈ పరిశోధనే ఆయనను 1930 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతికి అర్హుడిని చేసింది.
మన కంటికి కనిపిస్తున్న ఈ వెలుగు చేసే ఒక అద్భుతాన్ని, ఒక విన్యాసాన్ని సీవీ రామన్ లోకానికి బహిర్గతం చేశారు. ధ్వని తరంగాల రహస్యాన్ని కూడా ఆయన ఛేదించారు. వెలుగు వెనుక రహస్యాన్ని ఛేదించినందుకే ఆయనను నైట్‌హుడ్ కూడా వరించింది. అలా సర్ సీవీ రామన్ అయ్యారు. మెడిటరేనియన్ సముద్రం మీద నుంచి గమనించిన వెలుగుల రహస్యం గురించి పరిశోధించిన రామన్, ఆ అంశాలను గురించి 1928లో నేచర్ పత్రికలో ప్రచురించారు. ఆయన ఎమ్మే చదువుతున్న కాలంలోనే ప్రొఫెసర్లు ఇంగ్లండ్ వెళ్లి పరిశోధన చేయవలసిందని సూచించారు. కానీ ఆయన వెళ్లలేదు. మద్రాస్ సివిల్ సర్జన్ ఒక సందర్భంలో రామన్‌ను దేశం విడిచి వెళ్లవద్దని సలహా ఇచ్చారు. అక్కడి వాతావరణం నీకు పడదని కూడా చెప్పారు.
ఇందుకు గట్టి ఉదాహరణ కూడా ఉంది. సీవీ రామన్ కంటే ఒక సంవత్సరం పెద్దవాడైన గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిన్న వయసులోనే మరణించడానికి కారణం– ఇంగ్లండ్ వాతావరణానికి తట్టుకోలేకే. అలా భారతదేశంలోనే ఉండి అంతటి పురస్కారానికి అవసరమైన పరిశోధనలు చేశారు రామన్. అంటే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయాలంటే ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. అవకాశం ఉంటే వెళ్లడానికి అభ్యంతరం ఉండనక్కరలేదు. కానీ వెళ్లలేకపోయినంత మాత్రాన అవకాశాలు రాకుండా ఉండవని రామన్ జీవితం చెబుతోంది. ఆయనకు నోబెల్ పురస్కారాన్ని తెచ్చి పెట్టిన ‘రామన్ ఎఫెక్ట్’ (నీలి వర్ణం పరిశోధన)ను నిరూపించడానికి ఆయన ఉపయోగించిన పరికరాల ఖరీదు మూడు వందల రూపాయలు మాత్రమే. అవన్నీ ఒక డ్రాయిర్ సొరుగులో ఇమిడిపోతాయి. గొప్ప జీవితం గడిపిన రామన్ 1970 లో తన 82వ ఏట బెంగళూరులో తుది శ్వాస విడిచారు.
(చదవండి: శతమానం భారతి: నవ భారతం)
Comments
Please login to add a commentAdd a comment