CV raman
-
స్వతంత్ర భారతి: సర్ సీవీ రామన్ మరణం
సముద్రం ఎందుకు ఇలా నీలంగా ఉంటుంది? రంగులేని నీరు సముద్రంలోనే నీలంగా ఎందుకుంది? ఓడ పైభాగంలో నిలబడి మెడిటరేనియన్ సముద్రాన్ని చూస్తుంటే హఠాత్తుగా సీవీ రామన్‌కు సందేహం వచ్చింది. గొప్ప భౌతికశాస్త్రవేత్త కాబట్టి అంత పెద్ద అద్భుతం వెనుక ఉన్న రహస్యమేదో మెదడుకు చేరువవుతున్నట్టనిపించింది కూడా. నీలాకాశాన్ని ప్రతిబింబించడం వల్లనా, ఆ నీలం? ఇదే నిజమైతే వెలుగు లేని క్షణాలలో ఈ అద్భుత జలరాశి నీలం రంగులో కాకుండా ఇంకెలా కనిపిస్తుంది? కెరటాలు వెళ్లి ఒడ్డును తాకి పతనమయ్యే వరకు కూడా నీలంగా ఉంటాయి కదా! అప్పుడే సమాధానానికి చాలా సమీపంగా కూడా వచ్చారాయన. సూర్యకిరణాలు జల కణాల మీద వికిరణం చెందడం వల్లనే ఆ జలనిధిని నీలి వర్ణం కమ్ముకుందా?! బ్రిటిష్ సామ్రాజ్యంలోని విశ్వవిద్యాలయాల సమావేశం 1921లో లండన్‌లో జరిగింది. ఆ సమావేశానికి కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున చంద్రశేఖర్ వెంకట రామన్ హాజరయ్యారు. తిరిగి వస్తుంటే ఆ మహా భౌతికశాస్త్రవేత్తకు కలిగిన ఆలోచనలివి. ఈ పరిశోధనే ఆయనను 1930 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతికి అర్హుడిని చేసింది. మన కంటికి కనిపిస్తున్న ఈ వెలుగు చేసే ఒక అద్భుతాన్ని, ఒక విన్యాసాన్ని సీవీ రామన్ లోకానికి బహిర్గతం చేశారు. ధ్వని తరంగాల రహస్యాన్ని కూడా ఆయన ఛేదించారు. వెలుగు వెనుక రహస్యాన్ని ఛేదించినందుకే ఆయనను నైట్‌హుడ్ కూడా వరించింది. అలా సర్ సీవీ రామన్ అయ్యారు. మెడిటరేనియన్ సముద్రం మీద నుంచి గమనించిన వెలుగుల రహస్యం గురించి పరిశోధించిన రామన్, ఆ అంశాలను గురించి 1928లో నేచర్ పత్రికలో ప్రచురించారు. ఆయన ఎమ్మే చదువుతున్న కాలంలోనే ప్రొఫెసర్లు ఇంగ్లండ్ వెళ్లి పరిశోధన చేయవలసిందని సూచించారు. కానీ ఆయన వెళ్లలేదు. మద్రాస్ సివిల్ సర్జన్ ఒక సందర్భంలో రామన్‌ను దేశం విడిచి వెళ్లవద్దని సలహా ఇచ్చారు. అక్కడి వాతావరణం నీకు పడదని కూడా చెప్పారు. ఇందుకు గట్టి ఉదాహరణ కూడా ఉంది. సీవీ రామన్ కంటే ఒక సంవత్సరం పెద్దవాడైన గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిన్న వయసులోనే మరణించడానికి కారణం– ఇంగ్లండ్ వాతావరణానికి తట్టుకోలేకే. అలా భారతదేశంలోనే ఉండి అంతటి పురస్కారానికి అవసరమైన పరిశోధనలు చేశారు రామన్. అంటే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయాలంటే ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. అవకాశం ఉంటే వెళ్లడానికి అభ్యంతరం ఉండనక్కరలేదు. కానీ వెళ్లలేకపోయినంత మాత్రాన అవకాశాలు రాకుండా ఉండవని రామన్ జీవితం చెబుతోంది. ఆయనకు నోబెల్ పురస్కారాన్ని తెచ్చి పెట్టిన ‘రామన్ ఎఫెక్ట్’ (నీలి వర్ణం పరిశోధన)ను నిరూపించడానికి ఆయన ఉపయోగించిన పరికరాల ఖరీదు మూడు వందల రూపాయలు మాత్రమే. అవన్నీ ఒక డ్రాయిర్ సొరుగులో ఇమిడిపోతాయి. గొప్ప జీవితం గడిపిన రామన్ 1970 లో తన 82వ ఏట బెంగళూరులో తుది శ్వాస విడిచారు. (చదవండి: శతమానం భారతి: నవ భారతం) -
రామన్ ఎఫెక్ట్
-
విజ్ఞానశాస్త్రంపై గాంధీ దార్శనికత
గాంధీజీ సైన్స్ అనే పదాల కలయిక చూడగానే చాలామంది మొహాలు ప్రశ్నార్థకమవుతాయి. ఆ విషయాలు పూర్తిగా ప్రచారంలో లేకపోవడమే అసలు కారణం. గాంధీ 150వ జయంతి సంవత్సరంలో, జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యంలో కొన్ని కొత్త సంగతులు తప్పక తెలుసుకోవాలి. తన ఆత్మకథకు ఎక్స్పెరిమెంట్స్ అనే పదం శీర్షికలో ఉంచుకున్న ప్రయోగవాది ఆయన. గాంధీజీ పూర్తి రచనలు పరిశీలిస్తే చాలా చోట్ల తన దృష్టి, దృక్పథం, కృషి – ఈ దిశలో తారసపడతాయి. 1904లో దక్షిణాఫ్రికాను బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ సంస్థ సభ్యులు సందర్శించారు. వారితో చర్చిస్తూ గాంధీ సైన్స్‌ను ప్రాచుర్యం చేసి, బ్రిటన్ తన వలస దేశాలను కలుపుకోవాలని కోరారు. బ్రిటిష్ ఎంపైర్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్‌గా ఆ సంస్థ పేరును మార్చుకోమని సూచించారు. అంతేకాదు, భారతదేశంలో ఒక సమావేశం ఏర్పరచమని, దాని వల్ల భారతదేశం మాత్రమే కాక మొత్తం అసోసియేషన్ లబ్ధిపొందుతుందని కూడా వివరించారు. సైన్స్ ఒక సామూహిక ప్రయత్నం. తద్వారా ఆ సమాజాలే కాదు, సైన్స్ కూడా లబ్ధి పొందుతుందని వేరొక సందర్భంలో అన్నారు. వీలయినచోట్ల శాస్త్ర దృష్టిని పెంపొందించే రచనలు తన ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికలో ఇచ్చారు గాంధీ. సైన్స్ పరిమితులను గుర్తిస్తూనే, ఆ అభినివేశం వ్యాప్తి చెందాలని వాంఛించారు. వెసువియస్ అగ్నిపర్వతం బద్దలయినపుడు, విపత్కర పరిస్థితుల్లో సైతం శాస్త్రవేత్త మెటుస్సీ సమాచారాన్ని సేకరించడం అభినందనీయమని రాశారు. 1919–1920 ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమ సమయంలో యంత్రాల గురించి గాంధీ ఏమంటారని చాలామంది ప్రశ్నించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారు గాంధీని ఈ విషయంలో విమర్శించారు కూడా. తను యాంత్రీకరణకు వ్యతి రేకం కాదనీ, కానీ ఆ యంత్రాలను వాడే మనుషుల బుద్ధిని దారిలో పెట్టాలని చాలా స్పష్టంగా వివరిస్తారు (కంప్లీట్ వర్క్స్ 19వ సంపుటం) జగదీశ్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్ర రే దేశభక్తిపరులైన శాస్త్రవేత్తల దృష్టినీ, ప్రతిభను గాంధీ పలుసార్లు కొనియాడారు. శాస్త్ర పురోభివృద్ధికోసం ప్రాణులను వాడటం గురించి గాంధీ చాలా లోతుగా, స్పష్టంగా విభేదిం చారు. శరీరకోత లేకుండా రక్తప్రసరణ సిద్ధాంతం ప్రతిపాదించడం సాధ్యమైనపుడు, చీటికిమాటికి ప్రయోగాలకు ప్రాణులను బలిచేయడం అర్థరహితమని వాదించారు గాంధీ. ఈ ప్రయోగాల వల్ల ఆధునిక వైద్య శాస్త్రం మతం అసలు స్ఫూర్తిని వదిలివేయడమే కాదు, దాని శరీరం నుంచి ఆత్మను కూడా తొలగించిందని అంటారు. సైన్స్ విషయంలో ఒక్క సిద్ధాంత విభాగం మాత్రమే చేయగలిగేది ఏమీ లేదు. పని మన మనసు, మెదడుతో కలిసి సాగితేనే అది అర్థవంతం అని కూడా చెబుతారు గాంధీ. అదే సమయంలో ఆధునిక శాస్త్రవేత్తల నమ్రత, శాస్త్ర అభినివేశం వంటివి మన సంప్రదాయ వైద్య మహనీయులలో లేవని కూడా ప్రకటిస్తారు. 1921లో ఢిల్లీలోని టిబ్బా కళాశాలని ప్రారంభిస్తూ ఆయుర్వేదం, యునాని పాటించే సైన్సులో శాస్త్రీయ అభినివేశం లేదని విమర్శించారు. ఎంతమాత్రం పరిశోధన చేయకుండానే సాగే ఈ భారతీయ వైద్య విధానాలు అగౌరవస్థాయిలోకి దిగజారిపోయాయని ఖండిస్తారు. మద్రాసు ఆయుర్వేద ఫార్మసి, కలకత్తా అష్టాంగ ఆయుర్వేద విద్యాలయ సమావేశాలలో – రెండూ 1925లోనే – లైంగిక సామర్థ్యాన్ని పెంచే రీతిలో ఆయుర్వేద ఔషధాలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడాన్ని గట్టిగా ఖండించారు. కలకత్తా ప్రసంగం ఆయుర్వేద వైద్యులకు కోపం తెప్పించింది. కవిరాజ్ గణనాథ్ సేన్ అనే ఆయుర్వేద ప్రముఖుడు విభేదిస్తూ గాంధీని వివరించమని కోరారు. జవాబుగా చాలామంది ఆయుర్వేద వైద్యులు సర్వరోగాలను నయం చేస్తామని చెప్పుకునే దొంగవైద్యులనీ, వారిలో వినయంగానీ, ఆయుర్వేదం పట్ల గౌరవం గానీ, ఎటువంటి క్రమశిక్షణ గానీ లేవని గాంధీ ఢంకా బజాయించినట్టు ప్రకటించారు. ఆయుర్వేద వైద్యం చౌక కానీ, సరళం గానీ, ఫలవంతం గానీ కాదని విమర్శిస్తూ, ఆయుర్వేద విధానాలు సంక్లిష్టమని ఖండిస్తారు. మలేరియాకు క్వినైన్, నొప్పులకు ఐయోడిన్ వంటి ఔషధాలు ఆయుర్వేదంలో చూపమని కోరుతారు గాంధీ. సేవాగ్రామ్‌లో కలరా సోకినప్పుడు, దీనికి సంబంధించి ఆయుర్వేదం, హోమియోపతిలో పరిశోధనలు సాగాలని కోరారు. ‘హరిజన్’ పత్రికలో ఒకసారి గాంధీ ఇలా రాశారు: Everything could be turned into a science or romance if there was a scientific or a romantic spirit behind it. వ్యాసకర్త : డా. నాగసూరి వేణుగోపాల్, డైరెక్టర్, ప్రసారభారతి, రీజినల్ అకాడమి, ఆకాశవాణి, హైదరాబాద్ మొబైల్ : 94407 32392 -
శాస్త్రీయ దృక్పథంతోనే స్వావలంబన
సందర్భం ఆధునిక సమాజాలను శాస్త్ర, సాం కేతిక రంగాలు లేకుండా ఊహించ లేం. మరో మాటలో చెప్పాలంటే ఆధునిక మానవ అభివృద్ధికి దినది నాభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ పరిజ్ఞానమే మూలం. అందుకే ఎంతో ముందు చూపుతో డాక్టర్ అంబేడ్కర్ ప్రజలలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, దృక్పథాన్ని పెంపొం దించాల్సిన బాధ్యత ప్రభుత్వా లదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఎ (హెచ్) ద్వారా స్పష్టం చేశారు. నేడు జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం. ఈ రోజు దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు విశ్వ విద్యాలయాలలోని విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, శాస్త్ర, విద్యా రంగ, వైద్య, సాంకేతిక, పరిశోధనా సంస్థలతోపాటు అన్ని విద్యా సంస్థలూ నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాయి. రామన్ ఎఫెక్ట్ (కాంతి వక్రీభవనం) ఆవిష్కరణ ద్వారా భారతీయ శాస్త్ర పరిశో ధనా రంగ చరిత్రను కొత్త పుంతలు తొక్కించిన డాక్టర్ సీవీ రామన్ గౌరవార్థం ప్రతి ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రజల దైనందిన వ్యవహారాల్లో శాస్త్రీయ ఆవిష్కరణల అన్వ యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తింప జేయడం మానవ సంక్షేమం కోసం శాస్త్ర రంగంలో జరుగుతున్న అన్ని ప్రయత్నాలను, సాధిం చిన విజయాలను ప్రచారం చేయడం, దేశ ప్రజల్లో శాస్త్రీయ భావా లను పెంపొందింపజేయడం, శాస్త్ర, సాంకేతిక రంగాలను జనరం జీకరించి మూఢనమ్మకాలను పోగొట్టడం ‘నేషనల్ సైన్స్ డే’ లక్ష్యాలు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలో ప్రస్తుతం అనేక పెడ ధోరణులు, అశాస్త్రీయ పోకడలు చోటుచేసుకున్నాయి. వాస్తు, ముహూర్తం, యాగాల పేరు మీద ప్రజల బలహీనతలను వాడు కుంటున్నారు. శోచనీయమైన విషయం ఏమిటంటే రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటామని ప్రమాణం చేసిన వారే దానికి తూట్లు పొడుస్తున్నారు. విద్య, వైద్యం అన్ని రంగాల్లో అశాస్త్రీయ భావాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేసిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పరిహసిస్తున్నారు. ఛాందస వాదానికి బలం చేకూరుస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా అనేక పెడధోరణులు, అశాస్త్రీయ పోకడలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా పాలకవర్గాలు అనుసరిస్తున్నాయి. రచయితలు, కళాకారులు, విద్యార్థులు, ప్రజాస్వామిక శక్తుల మీద దాడులు తీవ్రమయ్యాయి. ప్రశ్నించే తత్వాన్నే కాదు, మాట్లాడే స్వాతం త్య్రాన్ని కూడా హరించే స్థితి ఈ రోజు ఏర్పడింది. ప్రజాస్వామ్య విలువలు అడుగంటుతున్నాయి. సమాజంలో అసహనం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రజలు అభద్రతకు గురవుతున్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, దేశ స్వావలంబన కోసం సైన్స్ అనే నినాదాలతో సామాన్య ప్రజలకు చేరినప్పుడే సైన్సుకు సార్థకత ఉంటుంది. ఈ లక్ష్యంతోనే జాతీయ సైన్స్ దినోత్సవమైన 28 ఫిబ్రవరి 1988 రోజున విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జన విజ్ఞాన వేదిక (జేవీవీ)ను ఏర్పాటైంది. వివిధ రకాల కళా జాతలు నిర్వహించి ప్రజలలో సైన్సు గురించి, శాస్త్రీయ పరిజ్ఞానం గురించి విస్తృత ప్రచారం చేశారు. ఒక రకంగా చెప్పా లంటే కళా జాత పక్రియను పరిచయం చేసింది జేవీవీయే. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, తొంబైలలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో జేవీవీ కార్య కర్తలు, ఉపాధ్యాయులు వేలాదిగా పాల్గొనడం, ఆ అక్షరాస్యత ఉద్యమం నుంచి వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమం తదనంతరం సంపూర్ణ మద్యనిషేధాన్ని రాష్ట్రంలో విధించడాన్ని చరిత్రలో గుర్తుంచుకునే కొన్ని అంశాలు. విద్యా ఆరోగ్య రంగాల్లో తమదైన శైలిలో పనిచేసిన సంస్థ జేవీవీ. విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మూఢనమ్మకాలు వంటి అంశాలపై పలు కార్యక్రమాలద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత 2014 జూన్ 1న జేవీవీ తన పేరు మార్చుకుని ఉభయ రాష్ట్రాలలో ‘ప్రజా సైన్సు వేదిక’గా పనిచేయడం మొదలు పెట్టింది. ఉభయ రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఏ రాజకీయ పార్టీలకు అను బంధం లేకుండా మెరుగైన శాస్త్రీయ సమాజం కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ ప్రజా సైన్స్ ఉద్యమ వేదిక. వర్తమాన సమాజంలో సంక్షోభానికి కారణమవుతున్న అంశా లను సమీక్షించుకుని భవిష్యత్తు ప్రణాళికలను, కార్యక్రమాలను నిర్ణయించడం కోసం ప్రజాసైన్సు వేదిక ఉభయ రాష్ట్రాల ప్రథమ మహాసభలు ఈ నెల 28 (ఆదివారం)న హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా ‘వర్తమాన సమాజం: అవాంఛిత, అశాస్త్రీయ పోకడలు’ అనే అంశం మీద ఉదయం పది గంటలకు సదస్సు ఉంటుంది. ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సీసీఎంబీ వ్యవస్థాపక అధ్యక్షులు డా. పీఎం భార్గవ, జస్టిస్ చంద్రకుమార్, గోరేటి వెంకన్న, ఆచార్య జయధీర్ తిరుమలరావు, డా. చందనా చక్రవర్తి, డా. కె.బాబూ రావు, డా. ఎం. చెన్న బసవయ్య తదితరులు పాల్గొంటారు. ఈ మహాసభల్లో ఉభయ రాష్ట్రాల నుంచి సంస్థ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రధానంగా అశాస్త్రీయ పోకడలపై చర్చ సాగే ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. (నేడు నేషనల్ సైన్స్ డే ... హైదరాబాద్‌లో ప్రజా సైన్సు వేదిక ప్రథమ మహా సభ) (వ్యాసకర్త : ప్రొ.వి.కృష్ణ అధ్యక్షులు, ప్రజా సైన్సు వేదిక మొబైల్: 9849603071) -
పరిశోధనారంగాన్ని ప్రోత్సహిస్తాం: ప్రధాని
న్యూఢిల్లీ: పరిశోధనారంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శని వారం శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, దృఢ సంకల్పం, అలుపెరుగని ప్రయత్నాన్ని గుర్తుచేసుకునే ఉత్సవంగా నేషనల్ సైన్స్‌డేను అభివ ర్ణించారు. విఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ మేథస్సుకు, సైన్స్‌కు ఆయన అందించిన సుదీర్ఘ సేవలకు మనం వందనాలర్పించాలన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలే భారత్ భవిష్యత్తును నిర్దేశిస్తాయని, ప్రస్తుతం దేశం ఈ స్థితికి చేరుకోవడంలో ఈ రంగాల పాత్ర చాలా ఉందన్నారు. -
రంగుల రహస్యం వెల్లడించిన రామన్
ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించి, నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్ (నవంబర్ 7, 1888 -1970 నవంబర్ 21). తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ వెంకటరామన్ జన్మించారు. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది. అనంతరం మద్రాసులో పదార్థ విజ్ఞాన శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన 1907లో ఫైనాన్స్ డిపార్టు మెంట్ ఉద్యోగిగా కలకత్తా వెళ్లాడు. అక్కడ డాక్టర్ మహేంద్ర లాల్ సర్కార్ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ సైన్స్ రామన్‌ను ఆకర్షించింది. ఉద్యోగం చేస్తూనే ఆ పరిశోధనాశాలలో పరిశోధనలు ప్రారంభించారు. అనంతరం 1817లో ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర పీఠాధిపతిగా నియ మితులయ్యారు. ప్రకృతిని అమితంగా ప్రేమించే రామన్, అందులోని శబ్దాలు, రంగులు, విలువైన రాళ్లు, వజ్రాలు మొదలైన వాటి మీద పరిశోధన చేశారు. సముద్రం నీలిరంగులో ఎందుకు ఉంటుంది? ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి. సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయి. వివిధ వర్ణాలు వివిధ దశలలో వెల్లివిరుస్తాయి. నీలిరంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తాయి. అందువల్ల సముద్రం నీలి రంగులో ఉంటుందని రామన్ వివరించారు. వీటిలో ఒక పరిశోధనా ఫలితానికే 1930లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. రామన్‌ను భారత ప్రభుత్వం ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించింది. 1954లో ‘భార తరత్న’ బిరుదు ఇచ్చింది. 1957లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ బహుమతి’తో సత్కరించింది. విదేశాలలో ఎన్నో అవకా శాలున్నా కాదని, మన దేశంలోనే అరకొర సదుపాయాలతోనే పరిశోధనలు చేసి విజయాలు సాధించారు. (నవంబర్ 7 రామన్ జయంతి) ఎం.శోభన్ నాయక్, ఎస్ఎఫ్ఐ రాష్ర్ట అధ్యక్షులు -
సైన్సపై ఆసక్తి పెంచుకోవాలి
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : విద్యార్థులు సైన్సపై అవగాహన పెంచుకోవాలని కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. హంటర్‌రోడ్‌లోని త్రివి హైస్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. మూడువందల మంది విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శన లో ఉంచారు. కార్యక్రమంలో అతిథులు తొలుత సీవీరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులు వందేమాతర గీతం ఆలపించారు. విద్యార్థులు మృదుల, సౌమ్య నృత్యంతో అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం అబ్దుల్ కలాం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బలరాం నాయక్ ముఖ్య అతిథిగా, కలెక్టర్ కిషన్ విశిష్ట అతిథిగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. డిప్యూటీ డీఈఓ వాసంతి స్వాగత ఉపన్యాసం చేశారు. కేంద్రమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ.. గురువులపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో భారత మేధావులే శాస్త్రవేత్తలుగా సేవలందిస్తారని అంబేద్కర్ ఆనాడే బ్రిటిష్ పాలకులతో అన్నారని గుర్తుచేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు సైన్స్‌పై ఆసక్తి కలిగేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆ ఘనత మనదే : కలెక్టర్ శశిరథుడు అనే మహర్షి నాలుగో శతాబ్దంలోనే కంటి ఆపరేషన్ చేశాడని, ఆ ఘనత మనదేనని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. అంకెల్లో సున్న కనుగొన్న ఆర్యభట్ట మన భారతీయుడేనన్నారు. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో జరిగే మార్పులను గమనించడమే సైన్స్ అన్నారు. హేతువాదంతో ఆలోచిస్తే ప్రతీదీ సైన్సేన న్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. దేశప్రగతి సైన్స్‌పైనే ఆధారపడి ఉందన్నారు. రూ.మూడు కోట్లతో రీజినల్ సైన్స్ సెంటర్ : డీఈఓ రీజనల్ సైన్స్ సెంటర్ ఏర్పాటుకు రూ.మూడుకోట్లు విడుదలయ్యాయని డీఈఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే మొబైల్ సైన్స్ సెంటర్‌తో విద్యార్థులకు వివిధ విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఇన్స్పైర్ కార్యక్రమాలు చేపట్టడం ఇది మూడోసారన్నారు. ఎగ్జిబిట్లను ప్రదర్శించే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రూ.ఐదువేలు అందిస్తోందని, అందులో రూ.2500 ఎగ్జిబిట్ తయారీకి కాగా, మిగతాది విద్యార్థి ప్రయాణ, ఇతర ఖర్చులకు వెచ్చిస్తున్నామని వివరించారు. గతంలో ఢిల్లీలో నిర్వహించిన ఇన్స్పైర్ కార్యక్రమానికి జిల్లా విద్యార్థులను పంపించామని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, వడుప్సా జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రావు, జిల్లా సైన్స్ అధికారి సీహెచ్ కేశవరావు, త్రివి స్కూల్ కరస్పాండెంట్ లింగారెడ్డి, డీసీబీ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.