Union Home Secretary
-
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ తదుపరి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఉన్న గోవింద్ మోహన్‌ను అజయ్‌కుమార్ భల్లా స్థానంలో హోంశాఖ కార్యదర్శిగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈనెల 22న అజయ్‌కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజు గోవింద్ మోహన్ బాధ్యతలు చేపడతారు. నళిన్ ప్రభాత్ పదవీకాలం కుదింపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా నళిన్ ప్రభాత్ పదవీకాలం 2028 ఆగస్టు 31 ఉండగా కేంద్రం అర్ధంతరంగా కుదించింది. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ను డిప్యుటేషన్‌పై ఏజీఎంయూటీ కేడర్‌కు మార్చింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా లేదా మూడేళ్లపాటు నళిన్ ఏజీఎంయూటీ కేడర్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగుతారని వివరించింది. అరుణాచల్ ప్రదేశ్– గోవా– మిజోరం– కేంద్ర పాలిత ప్రాంతాలను కలిసి ఏజీఎంయూటీ కేడర్‌గా పిలుస్తారు. ఇది కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటుంది. ప్రభాత్‌కు కేంద్రం కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. -
ఆలోచన అక్కర్లేదా?!
ఇది ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ అవార్డుల సీజన్. కొద్దిరోజులుగా వివిధ రంగాల్లో నోబెల్ విజేతల పేర్లు ప్రకటిస్తుంటే, అంతకు పక్షం రోజుల క్రితం మన దేశంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిన ఓ దుర్మార్గం ఆలస్యంగా బయట కొచ్చింది. శాస్త్రీయ పరిశోధనలో ప్రతిభను గుర్తించి ఏటా ఇచ్చే 300 అంతర్గత అవార్డులు, ఉపకార వేతనాలు, ఫెలోషిప్లను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రంగాల్లో అవార్డుల ఎంపికను క్రమబద్ధీకరించడానికంటూ కేంద్ర హోమ్ సెక్రటరీ సారథ్య సమావేశంలో గత నెల 16న చడీచప్పుడు లేకుండా పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం దిగ్భ్రాంతికరం. శాస్త్రీయ దృక్పథాన్నీ, పరిశోధననూ పెంచాల్సిన రోజుల్లో ఆ స్ఫూర్తికి అశనిపాతం. దేశంలో అవార్డుల ఎంపిక వ్యవస్థను పారదర్శకంగా, నిష్పాక్షికంగా తీర్చిదిద్దాలనే ప్రధాని ఆలోచన మంచిదే కావచ్చు. దాని అంతరార్థం, శాస్త్రవేత్తల సమూహానికి కలిగించే నష్టమే చర్చనీయాంశం. అవార్డులైనా... రివార్డులైనా ప్రతిభను ప్రోత్సహించడానికి! ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నవారిని గుర్తించి, గౌరవించడానికి!! సంక్లిష్టమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అవి మరింత కీలకం. 1940లు, 50లలో భారతీయ శాస్త్రవేత్తల్లో సుప్రసిద్ధుడూ, సీఎస్ఐఆర్ సంస్థాపకుడూ అయిన ప్రొఫెసర్ శాంతిస్వరూప్ భట్నాగర్ జన్మదినమైన సెప్టెంబర్ 26ను మన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా జరుపుకొంటారు. ప్రతి ఏటా సరిగ్గా ఆ రోజునే భారత ప్రభుత్వం సైతం మన దేశంలో కృషి చేస్తున్న అత్యుత్తమ ప్రతిభావంతులైన 45 ఏళ్ళ వయస్సు లోపు శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, భట్నాగర్ ప్రైజ్ ప్రకటిస్తుంది. కానీ, ఈసారి ప్రభుత్వ అవార్డు ప్రకటనలు లేకపోగా, ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని ప్రైవేట్ ధర్మనిధి పురస్కారాల్ని సైతం ఎత్తివేస్తున్నట్టు చావుకబురు చల్లగా చెప్పింది. ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల సమాచారాన్ని బయటపెట్టి, గమ్మున ఊరకుంది. ఇప్పుడిక శాస్త్ర, సాంకేతిక విభాగంలో అవార్డుల సంఖ్య 207 నుంచి 4 జాతీయ అవార్డులకే పరిమితం. అంతరిక్షం, భూవిజ్ఞానం, అణు ఇంధన శాఖల్ని సైతం అవార్డులన్నీ ఎత్తేయమని కేంద్రం పేర్కొంది. ఏలికలు అకస్మాత్తుగా ఇలా అవార్డులు ఎత్తేయడానికి హేతుబద్ధత ఏమిటో అంతుపట్టదు. పొదుపుచర్యల్లో భాగంగా ఇలా చేశారనుకోవడానికీ వీల్లేదు. ఎందుకంటే, ఈ అవార్డులన్నిటికీ కలిపి ఏటా అయ్యే ఖర్చు అతి స్వల్పం. పోనీ, అర్హత లేని వారికి అవార్డులిస్తారనే మిషతో ఈ ఎత్తివేత జరిగిందా అంటే అదీ లేదు. సాధారణంగా ఏ అవార్డుల ఎంపికలోనైనా పక్షపాతం, దురభిప్రాయాల్ని కొట్టిపారేయలేం. ఇప్పటిదాకా శాస్త్రవేత్తల అవార్డుల్లో తప్పుడు ఎంపికలు అతి తక్కువ. ప్రస్తుతమున్న ఎంపిక ప్రక్రియలో అధిక శాతం అత్యుత్తమ ప్రతిభావంతులకే పట్టం కట్టారు. మరి ఏలినవారి ఈ హఠాన్నిర్ణయానికి కారణం? శాస్త్ర సాంకేతిక రంగాల్లోని బహుకొద్ది శాస్త్రవేత్తలే నేటి పాలకుల ప్రశ్నార్హమైన శాస్త్రీయ అజెండాతో అంటకాగుతున్నారు. అవార్డులన్నిటినీ కేంద్రీకృతం చేయడం వల్ల ఎంపిక కమిటీలపై ప్రభుత్వం పట్టు బిగుస్తుంది. దరిమిలా అయినవాళ్ళకు అవార్డులు వడ్డించి, వారిని వివిధ పరిశోధక సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో కీలక స్థానాల్లో కూర్చోబెట్టే వీలొస్తుంది. ఇదే తాజా ప్రభుత్వ నిర్ణయంలో పరమార్థమని వాదన. అలాగే, పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సైన్స్ విధానాలను మీడియాలో విమర్శించారు. మింగుడుపడని పాలకులు వారి రెక్కలు కత్తిరించడానికే ఈ చర్య చేపట్టారని ఒక కథనం. యువ శాస్త్రవేత్తలకిచ్చే ఫెలోషిప్‌లు గతంలో ఎప్పుడో అరుదుగా ఆలస్యమయ్యేవి. కానీ, మూడేళ్ళుగా సమయానికి ఫెలోషిప్‌లు, గ్రాంట్లు రాక పరిశోధనకు అవసరమైన సరుకులు, సామగ్రి వారు కొనుక్కోలేకపోతున్నారు. కుటుంబాల్ని పోషించుకోలేని పీహెచ్డీ విద్యార్థులు సగంలోనే పరిశోధనకు మంగళం పాడుతున్నారు. ఇప్పుడు అవార్డులను ఎత్తివేయడమంటే ప్రోత్సాహాన్ని ఆపేయడమే కాదు.... శాస్త్రీయ పరిశోధన పట్ల ఆసక్తిని మరింత నీరుగార్చి, నిరుత్సాహపరచడం! అసలు మన దేశంలో సరికొత్త పరిశోధనలకు ప్రేరణనిస్తూ, శాస్త్రవేత్తల వెన్నుతట్టేందుకు ఉన్న అవార్డులే తక్కువ. ఖజానాకు ఖర్చు లేని ప్రైవేట్ ధర్మనిధి పురస్కారాల్నీ ఎత్తేయడం ఏ రకంగా సమంజసం? ఇప్పటికే దేశం. ప్రాథమిక శాస్త్రీయ పరిశోధనలకు వచ్చే యువతీ యువకులు తగ్గారు. ఇతర రంగాల్లోని భారీ వేతనాలిచ్చే ఉద్యోగాల వైపు మళ్ళుతున్నారు. తాజా చర్యతో సర్కార్ ఎలాంటి సంకేతాలిస్తోంది? పాత అవార్డుల స్థానంలో నోబెల్ తరహాలో ‘విజ్ఞాన్ రత్న’ పేరిట ఉన్నత శ్రేణి జాతీయ అవార్డులు కొన్ని తెస్తామని సర్కారు వారి మాట. ఈ కొత్తవి పరిశోధనలో అన్ని విభాగాలకూ, పరిశోధకులకూ వర్తిస్తాయో లేదో తెలీదు. అవార్డులు తీసేస్తే, వాటి కోసం ఇచ్చిన ధర్మనిధులు ఏమవుతాయి? వాటిని దేనికి వినియోగిస్తారు? జవాబు లేని ప్రశ్నలెన్నో! శాస్త్రీయ పరికరాల కొనుగోలుపై జీఎస్టీని కేంద్రం ఇటీవలే 5 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. ఇది పలు సంస్థల పరిశోధన బడ్జెట్‌కు మోయలేని భారమవుతోంది. అలాగే, విదేశీ పరిశోధకుల్ని ఆహ్వానించాలన్నా, విదేశీ విశ్వవిద్యాలయంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలన్నా లెక్కలేనన్ని అనుమతులు అడ్డం పెట్టి, వ్యవహారం సంక్లిష్టం చేసింది. పరిశోధనలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని దాదాపు అసాధ్యం చేసింది. నమ్మకాలు, విశ్వాసాలకే తప్ప హేతుబద్ధత, తార్కిక విశ్లేషణకు చోటు లేకుండా పోతున్న రోజుల్లో, పాలనలో శాస్త్రీయ దృష్టికి ప్రోత్సాహం ఇలానే ఉంటుందేమో! ఏమైనా ఉత్తమాటలు చెప్పి ఉన్నవాటన్నిటినీ ఎత్తేయడం... మబ్బులు చూపిస్తూ ముంతలో ఉన్న నీళ్ళు ఒలకబోయడమే!! -
కేంద్ర హోం కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో కేంద్ర హోం శాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ట్విట్టర్లో ‘ఇస్లామిక్ కరోనా వైరస్ జిహాద్, కరోనా జిహాద్, తబ్లిగ్‌జామాత్, ఇస్లామోఫోబిక్’లాంటి పేర్లతో చేస్తున్న అసభ్య పోస్టులను వెంటనే ఆపా లని 2020లో హైకోర్టు పిటిషన్ దాఖలైంది. ఒక వర్గాన్ని కించపరుస్తూ పెట్టే మెసేజ్‌ల ను ఆపాలని, ట్విట్టర్ సీఈవోతోపాటు సదరు పోస్టులు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకునేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పోస్టులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని 2021లో హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఇప్పటివరకు ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని 2022లో పిటిషనర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. -
ప్రజలు గుమికూడటాన్ని నివారించండి
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మార్గదర్శకాల అమలును మరో నెలపాటు, సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశం మొత్తమ్మీద కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అందుకే, రానున్న పండగల సీజన్ సమయంలో ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. అవసరమైతే స్థానికంగా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేశారు. జనసమ్మర్ధం ఉన్నచోట్ల కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేయాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది కోవిడ్ టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీకాలం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని పొడగించారు. ఈ ఏడాది ఆగస్టు 22 న అజయ్ భల్లా పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడగిస్తూ.. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన భల్లా, 22 ఆగస్టు, 2019 న హోం సెక్రటరీగా నియమితులయ్యారు. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తర్వాత కేంద్ర హోం సెక్రటరీగా విధులు స్వీకరించిన భల్లా.. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో.. పార్లమెంట్లో సీఏఏ, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వంటి కీలక, వివాదాస్పద చట్టాలను ఆమోదించారు. అలాగే, భల్లా రామ మందిరం ట్రస్ట్, కోవిడ్ -19 నిర్వహణను పర్యవేక్షించారు. -
కేంద్ర బృందాన్ని తప్పుదోవ పట్టించింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన కేంద్ర ఉన్నత స్థాయి బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిందని రాష్ట్ర బీజేపీ పేర్కొంది. ఈ మేరకు శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ లేఖ రాశారు. కరోనా ప్రభావాన్ని తక్కువగా చూపించాలనే లక్ష్యంతో రాష్ట్ర యం త్రాంగం ప్రయత్నాలు చేస్తోందని, దానిని హోంశాఖ దృష్టికి తీసుకురావడం తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కరోనా ప్రభావాన్ని తక్కువ చూపించే ప్రయత్నం చేస్తే దీర్ఘకాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అందుకే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, చికిత్స తీరులను, వైద్య సదుపాయాలను సమీక్షించేందుకు మరొక బృందాన్ని పంపించాలని కోరారు. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పత్రికల్లో వచ్చిందని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరీక్షలు చేయడం లేదన్నారు. 80 ఏళ్ల్ల ఓ వృద్ధుడు కరోనా అనుమానంతో ఏప్రిల్ 12న గాంధీ ఆస్పత్రికి వచ్చారని, పరీక్ష తర్వాత అతన్ని నెగెటివ్‌గా ప్రకటించారని, నాలుగు రోజుల తరువాత అదే వ్యక్తిని మరొక ఆస్పత్రిలో (నిమ్స్) పరీక్షించినప్పుడు పాజిటివ్‌గా ప్రకటించారన్నారు. అనంతరం ఆయనను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారని, అక్కడే ఆయన ఏప్రిల్ 26న మరణించారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఆయన మరణాన్ని చూపించలేదని, ఈ ఉదంతమే ప్రభుత్వ ఉద్దేశా న్ని అనుమానించడానికి అవకాశం ఇస్తోందన్నారు. ఈ సమస్యలన్నింటినీ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లామని, ఆధారాలను అందజేశామని, అయినా అవేవీ బృందం నివేదికలో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
నిర్ణీత సమయంలోగా విభజన పూర్తి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజ నకు సంబంధించిన పలు అంశాలపై దాదాపు ఏడాది తరువాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. పోలీసు అధికారుల ప్రమోషన్లు, షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి దీనికి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చర్చలకు నేతృత్వం వహించారు. పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల సీనియార్టీ అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఎస్సైలు, ఇన్స్పెక్టర్ల ప్రమోషన్లు జోన్ల ప్రకారం చేపడతారని, డీఎస్పీ స్థాయికి వెళ్తేనే కామన్ ప్రమోషన్ల కిందకు వస్తుందని, ఫ్రీజోన్‌లో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని, కేటాయింపుల ప్రకారం ప్రమోషన్లు ఇస్తామ న్న తెలంగాణ ప్రభుత్వ వాదనను కేంద్ర హోం శాఖ అంగీకరించలేదు. ఫ్రీజోన్ అనేది కొత్తగా వచ్చింది కాదని హోంశాఖ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీనియార్టీని నిర్ధారించాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో హోంశాఖ ఏకీభవించింది. ఆ మేరకు సీనియార్టీ నిర్ధారించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జాబితాపై ఏపీ స్పందన కోరిన కేంద్రం 9వ షెడ్యూల్లోని ఆస్తుల విభజనపై కూడా సమా వేశంలో చర్చ జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విభజన జరగాలని ఏపీ మొదటి నుంచి పట్టుబడుతోంది. ఈ విషయంలో ఇద్దరు సీఎస్ల వాదనలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి విన్నారు. ఇదే సమయంలో 68 సంస్థలకు సంబంధించి విభ జనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక జాబితాను సమర్పించింది. ఈ జాబితాపై ఆంధ్రప్రదేశ్ స్పందన తెలియచేయాలని హోంశాఖ కార్యదర్శి కోరారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి కావాలి.. సింగరేణి కాలరీస్‌కి సంబంధించి విభజన చట్టంలోనే లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం హోంశాఖ దృష్టికి తెచ్చింది. షెడ్యూల్ 9 ప్రకారం సింగరేణి సంస్థను విభజించాలని, ఆస్తుల నిష్పత్తి ప్రాతిపదికన తెలంగాణకు బదలాయించాలని ఉందని తెలిపింది. చట్టప్రకారం ఏం చేయాలో పరిశీలించి తగిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఆస్తుల విభజన నిర్ణీత వ్యవధిలోగా జరగాలని హోంశాఖ అధికారులు ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపుపై సుముఖం తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాది తర్వాత పౌర సరఫరాల శాఖను ఏర్పాటు చేసుకుంది. ఈ కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే గ్యారెంటీలు, అప్పులు చెల్లించింది. ఈ నేపథ్యంలో దీని విలువ ఎంతో నిర్ధారించి ఆమేరకు ఏపీకి ఇవ్వాలని హోం శాఖ సూచించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇది రూ.1,700 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ బకాయిల విషయం లో కూడా భేదాభిప్రాయాలు లేవని ఇరు రాష్ట్రాలు హోంశాఖకు స్పష్టం చేశాయి. రూ.కోట్లలో ఉన్న బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. 10వ షెడ్యూల్‌కు సంబంధించి శిక్షణ సంస్థల విభజన విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్ర హోం శాఖ వివరణ ఉందని ఏపీ ప్రభుత్వం నివేదించింది. దీనిపై న్యాయ సలహా తీసుకుని మళ్లీ అభిప్రాయం తెలియజేస్తామంది. -
కేంద్ర హోంశాఖకు సునీతారెడ్డి ఫిర్యాదు
-
కేంద్ర హోంశాఖకు సునీతారెడ్డి ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై దర్యాప్తు జరుగుతున్న విధానం సరిగా లేదని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్టు ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తన తండ్రి హత్యకు కారకులెవరో నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరినట్టు సునీతారెడ్డి మీడియాకు తెలిపారు. హైకోర్టులో ఇప్పటికే కేసు వేశారు కాబట్టి, హైకోర్టు నిర్ణయం వచ్చేంతవరకు వేచి చూడాలని తమకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి సూచించారని ఆమె వెల్లడించారు. తన తండ్రి హత్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నందున దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడాలంటూ అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు. ఈ కేసులో తమ కుటుంబ సభ్యులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. (ఈసీని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె) -
కేంద్ర హోంశాఖ కార్యదర్శితో గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం నిర్ణీత సమయం కంటే అరగంటే ముందే గవర్నర్ నార్త్ బ్లాక్ చేరుకుని హోం శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఓటుకు కోట్లు కేసు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలు చర్చకు రానున్నాయి. -
ఉమ్మడి సంస్థలన్నీ మావే!
-
'ఉమ్మడి రాజధానిలో పోలీసులదే కీలకపాత్ర'
ఉమ్మడి రాజధాని నిర్వహణలో పోలీసులదే కీలకపాత్ర అని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అపాయింటెడ్ డేట్‌కు ముందే పోలీస్ శాఖలో స్పష్టత రావాలని ఆయన తెలిపారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు కేంద్రం ఆధీనంలోనే పని చేస్తాయని వెల్లడించారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా కేంద్రమే చూసుకుంటుందని అనిల్ గోస్వామి పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతత్వంలోని బృందం మంగళవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. విభజన నేపథ్యంలో జరుగుతున్న నివేదికలను ఆ బృందం పరిశీలిస్తుంది. అందులోభాగంగా ఇప్పటికే అనిల్ గోస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ తదితరులను కలసి సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ బృందం
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ బృందం మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతత్వంలోని ఈ బృందం నగరానికి విచ్చేసింది. విభజన నేపథ్యంలో జరుగుతున్న నివేదికలను పరిశీలిస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చిస్తారు. ఇప్పటివరకు విభజన అంశాలపై ముందుకు సాగేందుకు 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల పంపిణీ నుంచి కొత్త రాజధానికి స్థల పరిశీలన వరకూ కమిటీలు పని చేస్తున్నాయి. ఈ కమిటీల పురోగతిని గోస్వామి సమీక్షిస్తారు. అలాగే పోలీసులకు సంబంధించిన అంశాలు, ఉద్యోగులు, ఐపీఎస్‌ల పంపకాలపై బుధవారం జాతీయ పోలీసు అకాడమీలో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న తాజా వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గవర్నర్ నరసింహన్, 3.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈ బృందం భేటీ కానుంది.