
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని పొడగించారు. ఈ ఏడాది ఆగస్టు 22 న అజయ్ భల్లా పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడగిస్తూ.. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన భల్లా, 22 ఆగస్టు, 2019 న హోం సెక్రటరీగా నియమితులయ్యారు. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తర్వాత కేంద్ర హోం సెక్రటరీగా విధులు స్వీకరించిన భల్లా.. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో.. పార్లమెంట్‌లో సీఏఏ, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వంటి కీలక, వివాదాస్పద చట్టాలను ఆమోదించారు. అలాగే, భల్లా రామ మందిరం ట్రస్ట్, కోవిడ్ -19 నిర్వహణను పర్యవేక్షించారు.