
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి తగ్గడంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ ఆంక్షల ఎత్తివేత లేదా సడలింపుల బాట పట్టాయి. అయితే, కోవిడ్ తాజా పరిస్థితులను నిశితంగా గమనించాకే అప్రమత్తతతో ‘అన్‌లాక్’ ప్రక్రియను మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం శనివారం సూచించింది. ఆంక్షల సడలింపుల కారణంగా మార్కెట్లు, కొన్ని ప్రదేశాల్లో ప్రోటోకాల్‌ను గాలికొదిలేసి ప్రజలు గుమికూడుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో అన్‌లాక్ అప్రమత్తతపై శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
ట్రిపుల్ టి + వీ మంత్రం
అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడంతోపాటు, కరోనా టెస్టింగ్–ట్రాకింగ్, ట్రీట్‌మెంట్(కోవిడ్ చికిత్స), టీకాలు, నిరంతర అప్రమత్తత ఇలా ఐదు అత్యంత ఆవశ్యకమైన నియమావళిని రాష్ట్రాలు తప్పక కొనసాగించాలని లేఖలో అజయ్ భల్లా సూచించారు. ‘వ్యాక్సినేషన్‌ను మరింతగా పెంచాలి. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గడంతో రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను ఎత్తేయడమో, సడలించడమో చేస్తున్నాయి. అన్‌లాక్‌కు అనుగుణంగానే క్షేత్ర స్థాయి పరిస్థితులు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఆంక్షలపై నిర్ణయాలు తీసుకోండి. మరో వేవ్ రాకుండా ఉండాలంటే నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందే’ అని భల్లా సూచించారు.
సంక్రమణ రేటు, యాక్టివ్ కేసులపై నిఘా
‘ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు. దేశంలో థర్డ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదలగానీ పాజిటివిటీ రేటులో పెరుగుదల వంటి సంకేతాలను ప్రారంభదశలో గుర్తించాలి. ఏదైనా ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువైతే ఆ ప్రాంతానికే వ్యాప్తిని పరిమితం చేయాలి’ అని భల్లా లేఖలో పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్‌తో సురక్షితం
కరోనా వైరస్ కట్టడికి టీకా అతిపెద్ద ఆయుధమని కేంద్రం తెలిపింది. కరోనా గొలుసు సంక్రమణలను విచ్ఛిన్నం చేయడానికి ఇది సహాయపడుతుందని, ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలని సూచించింది. రాష్ట్రాలు ఆంక్షలను సడలించుకోవచ్చని, అయితే కరోనా నిబంధనలను నిర్లక్ష్యంచేయొద్దని కోరింది.
డాక్టర్లపై దాడులను ఉపేక్షించొద్దు
‘కోవిడ్ చికిత్స విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, ఆరోగ్యరంగంలోని వృత్తినిపుణులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి. కఠిన విపత్తు నిర్వహణ(సవరణ) చట్టం–2020 కింద కేసు నమోదుచేయండి. సిబ్బందిపై దాడి, బెదిరింపు తదితర ఘటనలు వారిలో నైతికస్థైర్యాన్ని దెబ్బతీసి అభద్రతా భావాన్ని పెంచే ప్రమాదముంది. దాడికి పాల్పడే వారిపై కేసులు పెట్టి త్వరితగతిన శిక్షలుపడే చూడండి’ అని భల్లా పేర్కొన్నారు. విపత్తు చట్టం కింద గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా గాయపడితే నిందితుడికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment