ముంబైలో రద్దీగా ఉన్న ఒక మార్కెట్ ప్రాంతం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు, నిపుణులు పదేపదే సూచిస్తున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. హిల్ స్టేషన్లతో పాటు మార్కెట్లలో జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారని, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రజా రవాణాలో కోవిడ్–19 ప్రోటోకాల్‌కు ఏమాత్రం కట్టుబడి ఉండడం లేదని, భారీ సంఖ్యలో జనాలు బహిరంగ ప్రదేశాలకు వస్తున్నారని, అక్కడ సామాజిక దూరం సైతం పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలో ప్రస్తుతం కోవిడ్–19 రెండో వేవ్ ఇంకా ముగియలేదని, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాల్సిందేనని అజయ్ భల్లా సూచించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజా రవాణా, హిల్ స్టేషన్లలో కోవిడ్–19 నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్లే కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని, ఇది ఆందోళనకరమైన విషయమని భల్లా తెలిపారు. అన్ని ప్రదేశాల్లో కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలను పాటించని పక్షంలో కఠిన ఆంక్షలు విధించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించేవారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా ఆంక్షలను సడలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment