ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ: కోవిడ్ నిబంధనలను ఖాతరు చేయకుండా జనం పర్యాటక హిల్ స్టేషన్లు, మార్కెట్లలో పెద్ద సంఖ్యలో సంచరిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి తీరుతో ఇప్పటి వరకు కోవిడ్ మహమ్మారిపై దేశం సాధించిన ఫలితం వృథాగా పోతుందని పేర్కొంది. కోవిడ్ ముప్పు ఇంకా తొలగి పోలేదని పేర్కొన్న ప్రభుత్వం.. ప్రముఖ హిల్ స్టేషన్లకు పెద్ద సంఖ్యలో జనం పోటెత్తడం ఆందోళ నకరమని వ్యాఖ్యానించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను పాటించకపోవడం కేసులను మరింతగా పెంచడానికి కారణమవుతుందని హెచ్చరించింది.
‘చాలా రాష్ట్రాల్లో సెకండ్‌వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ సెకండ్ వేవ్‌తో పాజిటివిటీ రేటు ఇప్పటికీ 10%పైనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షలను అమలు చేయడం/ కొనసాగించడం చేయాల్సి రావచ్చు. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 73 జిల్లాల్లో జూన్ 29–జూలై 5వ తేదీ మధ్యలో పాజిటివిటీ రేటు 10% పైగానే నమో దైంది. జూలై 4వ తేదీ నాటికి 91 జిల్లాల్లో రోజువారీ కేసులు 100కు పైగానే ఉంటున్నాయి.
దేశంలో నమోదవుతున్న 80% కేసులు 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 90 జిల్లాల నుంచే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కోవిడ్ అప్రమత్తత కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది’ అని ఓ అధికారి అన్నారు. కాగా, అండమాన్ నికోబార్ దీవుల్లో 24 గంటల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇక్కడ మొత్తం 7,482 కేసులు నమోదు కాగా, 128 మరణాలు సంభవించాయి.
3 నెలల్లో కనిష్ట స్థాయికి రోజువారీ మరణాలు
దేశంలో కోవిడ్ బాధిత మరణాలు 90 రోజుల్లోనే అతి తక్కువగా ఒక్క రోజులో 553 నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 4,03,281కి చేరుకుందని మంగళవారం పేర్కొంది. అదేవిధంగా, 111 రోజుల తర్వాత రోజువారీ కోవిడ్ 24 గంటల్లో 34,703 నమోదయ్యాయి. దీంతో, మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,06,19,932కు చేరింది. దీంతోపాటు, 101 రోజుల తర్వాత అతి తక్కువగా 4,64,357 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment