ఒక అడుగు ముందుకు పడితే... రెండు అడుగులు వెనక్కు!! ఇదీ దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం పరిస్థితి. 2021లోపు అర్హులైన ప్రజలందరికీ టీకాలేస్తామని... కేంద్రం ప్రకటనైతే చేసింది కానీ... అందుకు తగ్గట్టుగా టీకా ఉత్పత్తి, సరఫరా, పంపిణీలలో సమస్యలు ఎదురు కాకుండా చూడటంలో మాత్రం విఫలమైంది. మరి దేశం ఏడాది చివరిలోగా తన లక్ష్యాన్ని అందుకోగలదా? ఎన్ని టీకాలు వేశాం? ఎన్ని వేయాలి? ఏ ఏ కంపెనీలు ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే....
వూహాన్‌లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించి మానవాళికి పెనువిపత్తుగా పరిణమించిన కోవిడ్‌ను నిలువరించేందుకు ఉద్దేశించిన టీకా కార్యక్రమం దేశంలో నత్తనడకన సాగుతోందంటే తప్పేమీ కాదు. ఈ ఏడాది జనవరి పదహారవ తేదీన సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లు తయారు చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో కార్యక్రమం మొదలైనా.. ఆ తరువాత ముడిసరుకుల కొరత, పంపిణీ లోపాలు, ప్రభుత్వ విధానాల్లో తరచూ మార్పుల వంటి అనేక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో టీకాలు ఇవ్వలేకపోయామన్నది నిష్టూర సత్యం.
తాజాగా ఆగస్టు 11వ తేదీ నాటికి దేశం మొత్తమ్మీద 51.90 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయింది. అయితే ఇందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 12 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఒక డోసు తీసుకున్న వారు 40 కోట్లు ఉన్నారు. ఇంకోలా చెప్పాలంటే దేశ జనాభాలో వైరస్ నుంచి పూర్తిగా రక్షణ పొందిన వారు కొంచెం అటు ఇటుగా పది శాతం మంది మాత్రమే! సరఫరా సమస్యలకు అవగాహన రాహిత్యం, అపోహలు తోడు కావడంతో చాలామంది టీకాలు వేయించుకునేందుకు ఇప్పటికీ తటపటాయిస్తున్నారు.
అవసరాలేమిటి? ఉత్పత్తి ఎంత?
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో టీకాకు అర్హులైన వారు దాదాపు 95 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం లెక్క కట్టింది. ఇప్పటివరకూ వీరిలో 11 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడ్డాయి. అంటే.. ఇప్పటివరకూ ఒక డోసు వేసుకున్న 40 కోట్ల మందితోపాటు ఒక టీకా కూడా తీసుకోని 44 కోట్ల మందికి కలిపి దాదాపు 130 కోట్ల టీకాలు అవసరమవుతాయి. డిసెంబర్ నాటికల్లా మిగిలిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే కొంచెం అటు ఇటుగా నెలకు 29 కోట్ల టీకాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం దేశంలో టీకా ఉత్పత్తి 12 నుంచి 13 కోట్లకు మించి లేదు.
భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ఉత్పత్తిలో నాణ్యత పరమైన సమస్యలు ఎదురయ్యాయని, ఫలితంగా ముందుగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదని టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చెందిన ఎన్‌కే ఆరోరా ఇటీవలే తెలపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో 40 కోట్ల కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం మే నెలలోనే ప్రకటించింది. అయితే జనవరి –జూలై మధ్యకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించిన ఎనిమిది కోట్ల టీకాల్లోనూ భారత్ బయోటెక్ ఇందులో సగం కూడా అందించలేదని సమాచారం. కోవీషీల్డ్ తయారు చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రస్తుతం నెలకు 11 నుంచి 12 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కొత్త టీకాలు కొన్నింటికి అనుమతులిచ్చినా వాటి ఉత్పత్తి లేదా సరఫరా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టీకా కార్యక్రమం పూర్తవడం కష్టసాధ్యం!
అందుబాటులో ఐదు టీకాలు..
దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో టీకా కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం తరువాత రష్యా తయారు చేసిన స్పుత్నిక్–వీ వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే స్థానికంగా తయారీలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది జాప్యానికి దారితీసింది. తాజా సమాచారం ప్రకారం స్పుత్నిక్–వీ స్థానిక ఉత్పత్తి వచ్చే నెలకు గానీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతులు జారీ చేసినా... న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న కంపెనీ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకూ ఒక్క టీకా కూడా పడలేదు. తాజాగా అమెరికన్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకూ (సింగిల్ డోస్) ప్రభుత్వం అనుమతిచ్చింది.
కానీ.. ఈ టీకాల వాడకం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా.. జైడస్ క్యాడిల్లా జైకోవ్–డీ టీకాతోపాటు భారత్‌లో తయారైన మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్ ‘హెచ్‌జీసీఓ19’, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్‌లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇవే కాకుండా... అమెరికన్ కంపెనీ తయారు చేస్తున్న నోవావ్యాక్స్ టీకాను భారత్‌లో కోవావ్యాక్స్ పేరుతో తయారు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో పంపిణీ అయ్యే టీకాల జాబితాలో కోవావ్యాక్స్‌ను కూడా చేర్చడాన్ని బట్టి చూస్తే దీనికి త్వరలోనే అత్యవసర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమోరికా, ఇతర జీ7 సభ్యదేశాలు ఇస్తామన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ అందలేదు.
–నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment