Vaccines
-
టీబీ నుంచి డెంగ్యూ వరకూ.. 8 టీకాల పరీక్షకు అనుమతి
న్యూఢిల్లీ: టీకాలతో కరోనాకు అడ్డుకట్టవేడంలో విజయం సాధించిన అనంతరం ఇతర అంటు వ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం ఎనిమిది కొత్త వ్యాక్సిన్లను పరీక్షించడానికి ఆమోదించింది.ఇందులో టీబీ నుండి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వరకూ టీకాలు ఉన్నాయి. ఈ ఎనిమిదింటిలో నాలుగు వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయి. ఈ టీకాల సాయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రయోజనాలను పొందవచ్చు. వచ్చేరెండేళ్లలో ఈ టీకాల పరీక్షలన్నీ పూర్తవుతాయని అంచనా. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం ఆరు ఫార్మా కంపెనీలకు ఎనిమిది వేర్వేరు వ్యాక్సిన్లపై ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన నిపుణుల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్ఈసీ) సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్- ఈ కంపెనీకి డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బీ (ఆర్డిఎన్ఎ), ఇన్‌యాక్టివేటెడ్ పోలియోమైలిటిస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి వ్యాక్సిన్లపై ఫేజ్- II ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. న్యూమోకాకల్ పాలీశాకరైడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కూడా ఈ కంపెనీ అనుమతి పొందింది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ న్యుమోకాకల్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. అదేవిధంగా డెంగ్యూ వ్యాక్సిన్‌పై మూడవ దశ ట్రయల్ నిర్వహించేందుకు పనేసియా బయోటెక్ కంపెనీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.టీబీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చాలా కాలంగా బీసీజీ వ్యాక్సిన్‌పై కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా టీబీ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతి లభించింది. ట్రయల్లోని ప్రాథమిక ఫలితాల ఆధారంగా సీడీఎస్సీఓ దశ- III ట్రయల్‌ను ప్రారంభించడానికి కూడా అనుమతిని ఇచ్చింది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్వీ)తో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని సీడీఎస్సీఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఊపిరితిత్తులు,శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దీనికి కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ జాబితాలో స్థానం దక్కింది. దీని కోసం మూడవ దశ ట్రయల్‌కు జీఎస్కే కంపెనీకి అనుమతి లభించింది. -
కోవిడ్ టీకాను ఎలా చూడాలి?
‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.ఆంగ్లో–స్వీడిష్ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్ యాక్షన్ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. కోవిడ్–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్‌కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో థ్రాంబోసిస్. ఇది శరీరంలో ప్లేట్లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్ గగన్ దీప్ కాంగ్‌తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 2021 అక్టోబర్‌లో ‘కోవిషీల్డ్’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్ సంస్థ తన టీకా లేబుల్‌ను నవీకరించింది. టీటీఎస్ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?గగన్‌దీప్ కాంగ్ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్‌ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్ చేసి ఉండవచ్చు.’’దుష్ప్రభావాల క్లెయిమ్‌లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- శైలజా చంద్ర -
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
పాట్నా: కొవిడ్ వ్యాక్సిన్‌పై అనుమనాలు వ్యక్తం అవుతుండటం వల్లే ప్రధాని ఫొటోవ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తొలగించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదా్ యాదవ్ కుమార్త్ మీసా భారతి అన్నారు. మీసా భారతి బిహార్‌లోని పాటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మీసా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రధాని భయపడుతున్నారు. ప్రధానికి ప్రతి దానిపై క్రెడిట్ తీసుకోవడం అలవాటు. అయితే కరోనా వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రధాని పక్కకు తప్పుకుంటున్నారు.వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తన ఫొటోలను తొలగించారు. వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి’ అని మీసా డిమాండ్ చేశారు. కాగా, ఎన్నికల కోడ్ ఉన్నందు వల్లే కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో తొలగించారని బీజేపీ నేతలు మీసాకు కౌంటర్ ఇస్తున్నారు. -
వ్యాక్సిన్ల సామర్థ్యం తెలిసేదెలా?!
‘‘ఎప్పటికప్పుడు కొత్త వ్యాక్సిన్ల సృష్టి జరుగుతూన్న సందర్భంగా సదరు వ్యాక్సిన్లు సరిగ్గా పని చేసేవా, లేదా అని తేల్చుకోవాలంటే – ముందు ఆ వ్యాక్సిన్లను రాజకీయ పాలకులపై ప్రయోగించి చూడాలి. ఎందుకంటే, తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఆ పాలకులు బతికి బట్టకడితే ఆ వ్యాక్సిన్ మంచిదని నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఆ పాలకులు ఆ వ్యాక్సిన్ వల్ల స్వర్గస్థులయితే, దేశం సుఖంగా ఉన్నట్టు భావించాలి.’’ – ప్రసిద్ధ పోలిష్ తాత్వికులు మోనికా విర్నివా స్కా ఈ బండ ‘జోకు’ వినడానికి కటువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ గత పదేళ్లకు పైగా ప్రజా బాహుళ్యం ఆరోగ్య భాగ్యం కన్నా, వ్యాపార లాభాల కోసం పెక్కు ప్రయివేట్ కంపెనీలు వ్యాక్సిన్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వస్తున్నాయి. అవి సృష్టించే వ్యాక్సిన్లు ప్రముఖ శాస్త్రవేత్తల కొలమానాలకు అందకపోయినా, తిరస్కరిస్తున్నా మార్కెట్లోకి పాలక వర్గాల అండతో విడుదలవుతూండటం చూస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యథేచ్ఛగా సాగిన ఈ కుంభకోణాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎండకట్టి అనుక్షణం, ఈ రోజు దాకా ప్రశ్నిస్తూ వస్తున్న ప్రసిద్ధ భారత కరోనా శాస్త్రవేత్త, పరిశోధకురాలు గగన్‌దీప్ కాంగ్! వైరస్ల స్థాయి ఎంత తీవ్రమైనదంటే – భవిష్యత్తులో సోకగల ప్రమాదాలను కూడా ముందుగానే ఊహించి రోగ నిర్ణయానికి అవసరమైన ప్రయివేట్ స్థాయి అవకాశాలను కూడా గణించి, ప్రయివేట్ కంపెనీలను షరతులతో అదుపులో ఉంచుతూ రంగంలోకిదించాలని ఆమె పదేపదే ముందస్తుగానే సూచిస్తూ వచ్చారు. ఈ రోజు కాకపోతే రేపు అయినా పాలకులు అను మతించిన ప్రయివేట్ కంపెనీలను అదుపాజ్ఞల మధ్య వాడుకోవలసి ఉంటుందన్నారు. ప్రపంచ క్లినీషియన్ శాస్త్రవేత్తలలో భారతదేశ ఉద్దండురాలుగా ఆమెను గుర్తిస్తూ లండన్ రాయల్ సొసైటీ ‘ఫెలోషిప్’ ఇచ్చి గౌరవించింది. రాయవెల్లూరు మెడికల్ కాలేజీలో వైద్య శాస్త్ర పరిశోధనా కేంద్రంలో పిల్లల్లో ప్రబలుతున్న వైరల్ వ్యాధులపై ఎనలేని పరిశోధన చేశారు. అంతేకాదు, పిల్లలకు సంబంధించి పటిష్ఠమైన ఆరోగ్య జాగ్రత్తలను ప్రాథమిక దశ నుంచే తీసుకోవడం వల్ల ఉత్తరోత్తరా వాళ్లను ఆస్పత్రుల చుట్టూ తిప్పే అవసరం ఉండదనీ, ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్లనే కనీసం వంద దేశాల్లో లక్షలాది చిన్నారులు దారుణ పరిస్థితుల్లో చనిపోవలసి వచ్చిందనీ గగన్‌దీప్ కాంగ్ ఆందోళన వెలిబుచ్చారు. మానవాభ్యున్నతి గణింపులో గత పదిహేనేళ్లలో భారత అభి వృద్ధి సూచీ 3 స్థానాలు దిగజారి పోయింది. ఈ గణింపులో చిన్నారుల మరణ శాతం కూడా పరిగణనలోకి తీసుకుంటారనేది మరువరాదు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచవలసిన పాలకులు ఎప్పటికప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాస్వామ్య, లౌకిక వాద సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారు. మత రాజకీయాలను పెంచి పోషిస్తూ ‘హిందూ జాతీయవాదాన్ని’ రేకెత్తించి నియంతృత్వ పాలనను స్థాపించడానికి కావల సిన వాతావరణాన్ని సృష్టించుకొంటున్నారు. దీన్ని ఊహించే భారత రాజ్యాంగ నిర్మాత ‘భారత రాజ్యాంగంలో ఆచరణకు పొందుపరచిన ప్రజాస్వామ్య సూత్రాలను ఇతరులు ప్రజాస్వామ్య విరుద్ధంగా మార్చేసే ప్రమాదం లేకపోలేదు, నియంతృత్వాన్ని ప్రవేశపెట్టే ప్రమాదమూ లేక పోలేదు’ అని హెచ్చరించారు. దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశంలో హిందూ మత రాజకీయాల వల్ల అన్యమతస్థులకు స్థానముండదనీ, ప్రజాస్వామ్య లక్ష్యాలతో పొందుపరిచిన భారత సెక్యులర్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ గాంధీజీ హంతకుడు గాడ్సే కాలం నాటి పరిస్థితులను ‘సెక్యులరిజం’ పేరు చాటున తాము కూడా పాలనలో కొనసాగించ దలచినట్లు ‘బీజేపీ – ఆరెస్సెస్’ నాయకుల ప్రస్తుత ధోరణులు కనిపిస్తున్నాయనీ ‘వర్జీనియా యూని వర్సిటీ’ భారతీయ ప్రొఫెసర్ నీతీ నాయర్ ‘గాయపడ్డ మనస్సులు’ (2021) గ్రంథంలో పేర్కొన్నారు. ప్రత్యేక ‘హిందూ రాష్ట్రం’ సెగ ఒక మతాన్ని కాదు – ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు, బౌద్ధులు అందర్నీ చుట్టుముడుతుందనీ, అందుకని, మన భారత ప్రజలు ప్రత్యేక ‘హిందూ రాష్ట్ర ప్రతిపత్తి’కీ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అక్షర సత్యంగా పొందుపరిచిన ‘సమగ్ర భారతదేశ’ భావనకూ మధ్య వాస్త వాన్ని విధిగా ప్రేమించాలని ప్రొఫెసర్ నీతీ నాయర్ ఆ గ్రంథంలో పేర్కొ న్నారు. ఇటీవల ‘మహిళా రిజర్వేషన్ల’ సమస్యపై బీజేపీ పాలకులు నడిపిన తంతుపై సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు మంజుల్ వేసిన పాకెట్ కార్టూన్ (23.9.2023) వీరి రాజకీయాలను పట్టిస్తుంది. ‘మీ మహిళా రిజర్వేషన్ల కోటా 2039లో వస్తుంది. అయితే దాన్ని పెద్దగా ఆలస్యమైనట్టు మీరు భావించకండి. 2024లోనే మీ కోటాను మీకు కాగితం మీద కల్పిస్తాం. కానీ ఈలోగా, అంటే 2024లోనే మీ ఓటును మాకు ముందస్తు క్రెడిట్‌గా వేయండి’ అని ప్రధాని ముక్తాయించడం అసలు ‘చరుపు’! కానీ, ఆ 2039 నాటికి ఎవరుంటారో, ఎవరు ఊడతారో మాత్రం తెలియకపోవడం అసలు ‘మర్మం’! అందుకే అన్నాడేమో వేమన: ‘‘కులము గలుగువారు, గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగు వారు,పసిడి గల్గు వాని బానిస కొడుకులు!’’ ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in సీనియర్ సంపాదకులు -
నేటి నుంచి మిషన్ ఇంద్రధనుస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు వేయడమే లక్ష్యంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రతినెలా ఆరు రోజుల చొప్పున మూడునెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మిషన్ ఇంద్రధనస్సు, నులిపురుగుల మాత్రల పంపిణీపై మాట్లాడారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరలా సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకూ, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన సర్వేలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని చిన్నారులు 3,009 మందిని గుర్తించామన్నారు. వారితో పాటు ఇంకా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలో 422 సెçషన్స్(స్థలాలు)ను ఎంపిక చేసి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరికి మీజిల్స్–రూబెల్లా నిర్మూలనకు లక్ష్యాల ఏర్పాటులో భాగంగా మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 5.50 లక్షల ఆల్బెండాజోల్ మాత్రలు.. ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండాజోల్) మింగించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 19 ఏళ్లులోపు ఉన్న పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4,67,550 మందికి వేయాలనేది లక్ష్యం కాగా, 5.50 లక్షల మాత్రలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ మాత్రలను విజయవాడలోని జోనల్ కమిషనర్లు, మండలాల్లోని ఎంఈఓలు, మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. -
పశువుల మందులకు వేగంగా ఎన్వోసీ.. ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా ప్రాసెస్ చేసేందుకు, నో–అబ్జెక్షన్ సర్టిఫికేషన్ (ఎన్వోసీ) జారీ చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నాంది పేరిట పోర్టల్ ప్రారంభించింది. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా సోమవారం దీన్ని ఆవిష్కరించారు. సాధారణంగా ఔషధాలు, టీకాల దిగుమతి, తయారీ, మార్కెటింగ్ మొదలైన వాటి నియంత్రణ అనేది ఆరోగ్య శాఖలో భాగమైన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) పరిధిలోకి వస్తుంది. అయితే, వెటర్నరీ ఔషధాలు, టీకాలకు సంబంధించి మత్స్య, పశు సంవర్ధక, డైరీ శాఖతో సంప్రదింపుల తర్వాత అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మాన్యువల్‌గా ఉండటంతో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాంది (ఎన్వోసీ అప్రూవల్ ఫర్ న్యూ డ్రగ్ అండ్ ఇనాక్యులేషన్ సిస్టం) పోర్టల్‌ను ఆవిష్కరించినట్లు రూపాలా చెప్పారు. తాజా పరిణామంతో ఇకపై సీడీఎస్‌సీవో సుగమ్ పోర్టల్‌లో దాఖలు చేసిన దరఖాస్తును పశు సంవర్ధక, డెయిరీ విభాగానికి పంపిస్తారు. దరఖాస్తుదారు ఆన్లైన్లో అవసరమైన పత్రాలను దాఖలు చేయాలి. పశు సంవర్ధక శాఖలోని సాధికారిక కమిటీ అప్లికేషన్‌ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుంది. అన్నీ సంతృప్తికరంగా ఉంటే ఎన్వోసీని ఆన్లైన్లో జారీ చేస్తారు. -
కోవిడ్ ఫ్రీ బూస్టర్ డోస్‌లు నిల్.. కొనుక్కోవాల్సిందే!
చైనాలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అందులో భాగంగా కోవిడ్ బూస్టర్ డోస్‌లను త్వరిగతిన తీసుకోమని ప్రజలను హెచ్చరిస్తోంది. ఐతే 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా అందిచ్చే కోవిడ్ బూస్టర్ డోస్‌లు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లేవని, కనీసం దేశ రాజధాని ఢిల్లీలో సైతం తగినంత మొత్తంలో అందుబాటులో లేవని సమాచారం అలాగే సుమారు రూ. 400లు వసూలు చేసి బూస్టర్ డోస్‌లు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద ఉన్నాయి గానీ అవికూడా రానున్న కొద్ది రోజుల్లో అయిపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐతే అధికారిక లెక్కల ప్రకారం కోవిన్ వెబ్ పోర్టల్‌లో కూడా ఎన్నో బూస్టర్ డోస్‌లు అందుబాటులో లేవని స్పష్టంగా చెబుతోంది. ఐతే కొన్ని ప్రైవేట్ సెంటర్లో మాత్రం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు ప్రభుత్వం మాత్రం చైనా మాదిరిగా కేసులు పెరగకుండా ప్రజలను సత్వరమే బూస్టర్ డోస్‌లు తీసుకోమని చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, దేశంలో సాధారణ టూ డోస్ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు 90 శాతం మంది తీసుకోగా, బూస్టర్ డోస్‌ను ఢిల్లీలో కేవలం 20 శాతం మంది తీసుకోగా, భారత్ అంతటా 30 శాతం మంది తీసుకున్నారు. ప్రజలంతా కూడా వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధైర్యంతో ధీమాగా ఉన్నారని కేంద్రం నొక్కి చెబుతోంది. అయినప్పటికీ అవగాహన డ్రైవ్‌లను నిర్వహించమని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం భారత్‌లో కేసుల తక్కువుగానే ఉన్నాయని, సగటున 200 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. (చదవండి: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!) -
కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాక... గొంతు క్యాన్సర్ చికిత్స మరింత ప్రభావవంతంగా!
కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు ఇస్తున్నప్పుడు... దాని ప్రభావం నేపథ్యంలో ఇతర చికిత్సలు అంత ప్రభావవంతంగా ఉండవేమోనంటూ అప్పట్లో చాలామంది డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చాక చేసిన నేసోఫ్యారింజియల్ క్యాన్సర్ అనే ఒక రకం గొంతు క్యాన్సర్ చికిత్స మరింత ప్రభావవంతమైన ఫలితాలను ఇచ్చినట్లు డాక్టర్లు, పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ చికిత్స మరింత బాగా జరిగేందుకు ఈ వ్యాక్సిన్ డోసులు దోహదం చేసినట్లు గ్రహించారు. వాస్తవానికి నేసోఫ్యారింజియల్ క్యాన్సర్‌కు యాంటీ పీడీ–1 థెరపీ అనే చికిత్స అందిస్తుంటారు. ఇది పీడీ–1 రిసెప్టార్స్ అనే జీవాణువులను అడ్డుకుంటుంది. ఇలా అడ్డుకోవడం ద్వారా మందు ఇమ్యూన్ కణాలకు స్వేచ్ఛనిస్తుంది. దాంతో ఆ ఇమ్యూన్ కణాలు స్వేచ్ఛగా క్యాన్సర్ గడ్డకు కారణమయ్యే అంశాలపై యుద్ధం చేస్తాయి. ఇలా యాంటీ పీడీ–1 చికిత్స పనిచేస్తుంది. మనకు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు... అది మన దేహంలో ఇమ్యూన్ ప్రతిస్పందనలు వచ్చే మార్గాల్లోని (పాత్ వేస్‌లోని) సిగ్నల్స్‌ను మరింతగా ప్రేరేపిస్తుంది. అలాంటప్పుడు ఆ సిగ్నల్స్ చురుగ్గా పనిచేస్తున్న కారణంగా క్యాన్సర్ చికిత్సకు ఇచ్చే మందులు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయోనని డాక్టర్లు తొలుత ఆందోళన చెందారు. ‘‘యాంటీ పీడీ–1 థెరపీకి ఈ వ్యాక్సిన్ అడ్డంకిగా మారవచ్చేమోనని తొలుత మేం భయపడ్డాం. ఎందుకంటే ఈ నేసోఫ్యారింజియల్ క్యాన్సర్ ఏ భాగాన్నైతో ప్రభావితం చేస్తుందో... కరోనా (సార్స్–సీవోవీ–2) కూడా అక్కడే ప్రభావం చూపుతుంది’’ అంటూ జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌కు చెందిన బయోఇన్ఫర్మాటిక్స్ సైంటిస్ట్ జియాన్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అయితే వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే... వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో యాంటీ పీడీ–1 ఔషధాలు మరింత సమర్థంగా పనిచేయడం మమ్మల్ని అబ్బురపరచింది’’ అంటూ అదే యూనివర్సిటీకి చెందిన ఇమ్యూనాలజిస్ట్ క్రిస్టియన్ కర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిశోధక బృందం... నేసోఫ్యారింజియల్ క్యాన్సర్‌తో అక్కడి 23 ఆసుపత్రుల్లోని 1,537 మంది బాధితులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీళ్లలో 373 మంది బాధితులకు క్యాన్సర్ చికిత్సకు ముందు ‘సైనో–వ్యాక్’’ అనే కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఇలా వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో క్యాన్సర్ మందు చాలా సమర్థంగా పనిచేసింది. అంతేకాదు... వారిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా కనిపించాయి. ‘‘ఇది ఎలా జరిగిందో ఇప్పటికైతే మాకు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. బహుశా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాక... వారికి అందించిన మందుల వల్ల బాధితుల్లోని ఇమ్యూన్ వ్యవస్థ మరింత ప్రేరేపితమై ఉండవచ్చు. దాంతో ఈ ఫలితాలు వచ్చి ఉండవచ్చు’’ అని చైనాలోని శాంగ్జీ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన క్యాన్సర్ పరిశోధకుడు క్వీ మెయ్ అభిప్రాయపడుతున్నారు. యూఎస్, యూకేలలో నేసో ఫేరింజియల్ క్యాన్సర్ కేసులు చాలా తక్కువ. అయితే చైనా వంటి ఆసియా దేశాలతో ఇది ఎక్కువ. ఇక తైవాన్‌లో దీనివల్ల మరణాలూ మరింత ఎక్కువ. ఇప్పటివరకు కేవలం ఒక రకం కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన బాధితులపైనే ఈ పరిశోధన జరిగింది. ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరిగి, అసలు ఈ మెకానిజమ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాల్సి ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘యానల్స్ ఆఫ్ ఆంకాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
అమ్మో కుక్క...పీకేస్తుంది పిక్క
ఈ బాలుడు రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. గత నెల 28న స్కూల్‌కు వెళుతుండగా వీధి కుక్క కరిచింది. అదే సమయంలో పక్కనే మరో విద్యార్థుని సైతం గాయపరిచింది. మధ్యాహ్నం మరొకరిని, సాయంత్రం ట్యూషన్‌కు వెళుతున్న మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. ఒక్క రోజే ఐదుగురు విద్యార్థులు కుక్కకాటుకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ పరిస్థితి ఒక్క రాయదుర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా నిత్యం చోటు చేసుకుంటున్నాయి. వెలుగు చూస్తున్నవి కొని...వెలుగులోకి రానివి మరెన్నో.... రాయదుర్గం: పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో సంచరిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కాలినడకన వెళుతున్న వారే కాదు.. పశువులు, మేకలు, గొర్రెలు, ద్విచక్ర వాహన చోదకులు సైతం కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడుతున్నారు. మూడు నెలల్లో 2,978 కేసులు కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన మూడు నెలల్లో 2,978 మంది కుక్కకాటుకు గురయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం క్రితం రాయదుర్గంలోని దాసప్ప రోడ్డు, చికెన్ మార్కెట్ ప్రాంతాల్లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిక్కలు పీకేశాయి. ఇక ద్విచక్ర వాహనాల వెంట పడుతూ బెంబేలెత్తిస్తుండడంతో పలువురు ప్రమాదాలకు గురైన ఘటనలూ కోకొల్లలుగా ఉన్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడుతో పాటు అనంతపురం నగర పాలక సంస్థలోనూ కుక్కకాటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి నియంత్రణ, సంరక్షణ కోసం రూ. లక్షలు ఖర్చు చేస్తున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. వ్యర్థాలతో అనర్థాలు పట్టణ, గ్రామీణ, నగర ప్రాంతాల్లోని పలు చికెన్ సెంటర్ నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. వీటి కోసం పదుల సంఖ్యలో కుక్కలు గుమికూడి పోట్లాడుకుంటూ రోడ్డున వెళుతున్న వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కోడిమాంసాన్ని అధికంగా తినడంవల్ల తరచూ దుష్ప్రభావాలకు గురికావాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లలో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఎస్చెరిచియా కోలి వంటి బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయని, సరిగా ఉడికించకపోతే ఈ బ్యాక్టీరియా మనిషిలో అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుందని వివరిస్తున్నారు. పచ్చి మాంసం, వ్యర్థాలను తినడం వల్ల కుక్కల్లో పలు రకాల వ్యాధులు వ్యాపిస్తాయని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తూ కనిపించిన వారిపై దాడికి తెగబడుతాయని అంటున్నారు. చర్యలు తీసుకుంటాం గతంలో రీజియన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఏబీసీ కేంద్రానికి వీధికుక్కలు తరలించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేవాళ్లం. కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. వీటి నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. – దివాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం అందుబాటులో టీకా జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రిలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో కుక్క కాటుకు టీకా అందుబాటులో ఉంది. కుక్క కాటు బాధితులు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో టీకా వేయించుకోవచ్చు. శీతాకాలంలో కుక్కకాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కరిచే కుక్కలు ఉంటే ముందస్తుగా వాటికి రేబిస్ టీకా వేయించాలి. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్ఓ, అనంతపురం (చదవండి: బరితెగించిన టీడీపీ నేతలు.. 20కోట్ల ల్యాండ్ కోసం కలెక్టర్ పేరుతో..) -
BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్!
క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టదని ఈ ప్రాణాంతక వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధన చేస్తున్న దంపతులు, ‘బయో ఎన్‌టెక్’ వ్యాక్సిన్ల తయారీ సంస్థ అధినేలు ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్, ప్రొఫెసర్ ఓజ్లెమ్ టురేసి చెబుతున్నారు. మహా అయితే ఎనిమిదేళ్లలోపే క్యాన్సర్ వ్యాక్సిన్ వాడుకలోకి రాబోతోందని వివరించారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ఇంటర్వ్యూలో వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘మేం డాక్టర్లుగా బాధితుల వెతలు, నిరాశా నిస్పృహలు చూసి చలించిపోయేవాళ్లం. ఆ అనుభవమే క్యాన్సర్ పరిశోధనల వైపు మళ్లించింది’’ అన్నారు. ‘‘కరోనాకు మంచి వ్యాక్సిన్ తయారు చేస్తున్న క్రమంలో ఆ పరిశోధన అనుకోకుండా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేలా మలుపు తిరిగింది. ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్. మన ఒంట్లోని వ్యాధినిరోధక శక్తే క్యాన్సర్ కణాలను గుర్తించి తుదముట్టించేలా ఇది పని చేస్తుంది’’ అని డాక్టర్ సాహిన్ చెప్పారు. తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని ఘంటాపథంగా చెప్పారు. అది క్యాన్సర్ కణాలను నేరుగా తుదముట్టించేలా రూపొందిందని టురేసి వివరించారు. ‘‘ట్రయల్స్‌లో బాధితులపై వ్యాక్సిన్‌ను వాడుతున్నప్పుడు ఎదురైన అడ్డంకులు దీన్ని మరింత ప్రభావవంతంగా మార్చేలా చేశాయి’’ అని దంపతులు చెప్పారు. ఈ పరిశోధనల వివరాలు తొలుత బిజినెస్ ఇన్సైడర్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
కరోనా టీకాలపై వివాదం.. కోర్టుకెక్కిన మోడెర్నా..
వాషింగ్టన్: కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాలాడినప్పుడు వ్యాక్సిన్లు సంజీవనిలా మారిన విషయం తెలిసిందే. ఈ టీకాల వల్ల కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి. అయితే తమ టీకా సాంకేతికతను కాపీ కొట్టారాని మోడెర్నా సంస్థ ఆరోపించింది. ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫైజర్, బయోఎన్‌టెక్ ఏంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతను ఉపయోగించి తొలి కరోనా టీకాను తయారు చేశాయి. అయితే ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ హక్కులు తమవని, 2010-2016 మధ్యే దీన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు మోడెర్నా చెబుతోంది. ఈ విషయంపై కోర్టుకెక్కింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే.. ఫైజర్, బయోఎన్‌టెక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఎన్ఏ అనేది ప్రతి కణం ప్రోటీన్ తయారీకి డీఎన్ఏ సూచనలను కలిగి ఉండే జన్యు స్క్రిప్ట్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల తయారీలో ఈ సాంకేతికతనే ఉపయోగించారు. ఈ అధునాతన టెక్నాలజీతో తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చు. చదవండి: లండన్‌లో గోమాతకు పూజలు.. రిషి సునాక్‌పై నెటిజెన్ల ప్రశంసలు.. -
Telangana: బీఈ పెట్టుబడి రూ.1,800కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ టీకా ఉత్పత్తులు, పరిశోధన రంగాన్ని భారీగా విస్తరించాలని కోవిడ్ వ్యాధి నియంత్రణకు కోర్బివ్యాక్స్ టీకా తయారు చేసిన బయోలాజికల్–ఈ (బీఈ) సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలోని టీకా ఉత్పత్తులను భారీయెత్తున పెంచేందుకు ఏకంగా రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్ ఘనత సాధించనుంది. రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడితో కొత్తగా 2,518 మందికి ఉపాధి లభిస్తుందని బీఈ సంస్థ ప్రకటించింది. గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశం తరువాత బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వివరాలు వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం ప్రతి ఏడాదీ 900 కోట్ల టీకాలు ఉత్పత్తి అవుతుంటే.. బీఈ తాజా విస్తరణతో 1,400 కోట్ల టీకాల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపారు. కోవిడ్ నివారణ టీకా జెన్సెన్, ఎమ్మార్ పీసీవీ , టైఫాయిడ్, ఐపీవీ, పెర్టుసిస్ వ్యాక్సిన్లు.. టెటనస్ టాక్సైడ్ యాంపూల్స్, జెనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. సుదీర్ఘ చరిత్ర గల బీఈ సంస్థ దాదాపు నాలుగు వ్యూహాత్మక బిజినెస్ యూనిట్లను కలిగి ఉందన్నారు. కోవిడ్ నేపథ్యంలో సకాలంలో స్పందించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మౌలిక వసతులు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే.. ప్రపంచ టీకా అవసరాల్లో మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే తీరుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఈ విస్తరణను సగర్వంగా.. సంతోషంగా ప్రకటిస్తున్నానని, దీనిద్వారా టీకా రంగంలో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం మీద ఏడాదికి 900 కోట్ల టీకాలు తయారవుతున్నాయని తెలిపారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే అత్యుత్తమ టీకాల ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన క్లస్టర్ అని వివరించారు. ఇక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, స్పెషల్ ఎకనామిక్ జోన్, డ్రై, వెట్ లాబోరేటరీలు , ఇంక్యుబేషన్ సౌకర్యాలు ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇందులోని దాదాపు 200 పరిశ్రమల్లో 15 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు నోవార్టిస్, గ్లాక్సో స్మిత్‌క్లైన్, ఫెర్రింగ్ ఫార్మా, కెమో, డూపాంట్, లోంజా తదితర కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి ఎం.నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లో వ్యాక్సిన్లతో... 42 లక్షల ప్రాణాలు నిలిచాయి
లండన్: కరోనా మహమ్మారిని వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని, వాటివల్ల 2021లో భారత్ 42 లక్షల మరణాలను నివారించిందని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. యూకేలోని లండన్‌లో ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్–19 వాస్తవ మరణాలను, డిసెంబర్ 8, 2020, డిసెంబర్ 8, 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్‌ను సరిపోల్చి చూస్తూ ఈ లెక్కలు వేశారు. భారత్‌లో 42 లక్షలకు పైగా మరణాలను నివారించినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ‘‘భారత్‌కు సంబంధించినంత వరకు ఈ ఏడాది కాలంలో 42,10,000 మరణాలను నివారించగలిగిందని మాకు అంచనాలున్నాయి’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ ఒలివర్ వాట్సన్ చెప్పారు. 2 కోట్ల ప్రాణాలు పోయేవి కరోనా మరణాల విషయంలో అధికారిక లెక్కలకి, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ తేడా ఉన్నట్టు విమర్శలున్నాయి. కరోనాతో 189 దేశాల్లో 3.14 కోట్ల మంది మరణిస్తారని అనుకుంటే వ్యాక్సిన్లు రావడం వల్ల వారిలో 1.98 కోట్ల మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతీ దేశంలో 40శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండి ఉంటే 5.99 లక్షల మరణాలు తప్పేవని అధ్యయనం పేర్కొంది. 17 వేలకు పైగా కేసులు న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 30శాతం కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 17,336 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. కరోనాతో ఒక్క రోజులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. -
జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం !
హెల్త్‌కేర్ రంగంలో దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ల తయారీపై వెనక్కి తగ్గింది. మార్కెట్లో వివిధ కంపెనీలు భారీ ఎత్తున వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం దీనికి తోడు డిమాండ్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటంతో ముందుగా నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలపై పునరాలోచనలో పడింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అప్పటికే ఫైజర్, మోడెర్నా, సీరమ్, భారత్‌బయోటెక్, ఇండియా, రష్యా, ఇంగ్లండ్‌లకు చెందిన పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు మార్కెట్లోకి తెచ్చాయి. అయితే కరోనా వేవ్‌లు ఒకదాని తర్వాత ఒకటిగా ముంచెత్తడంతో 2021 చివరి వరకు వ్యాక్సిన్లకు డిమాండ్ తగ్గలేదు. గతేడాది 2.38 బిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్ల అమ్మకాలు సాగించింది. ఇదే క్రమంలో ఈ ఏడాది 3.5 బిలియన్ డాలర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ అమ్మకాలు 457 మిలియన్లకే పరిమితం అయ్యాయి. ఇందులో కూడా 75 శాతం అమ్మకాలు బయటి దేశాల్లోనే జరిగాయి. యూఎస్‌లో కేవలం 25 శాతం అమ్మకాలే నమోదు అయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కోవిడ్ ప్రభావ శీలత తగ్గిపోయిందా అనే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధంతో సప్లై చెయిన్‌లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నా గతంలో ఉన్న స్థాయిలో కోవిడ్ భయాలు ఉండటం లేదు. పైగా అనేక కంపెనీలు వ్యాక్సిన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నిర్దేశించుకున్న వ్యాక్సిన్ల అమ్మకాల లక్ష్యాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ సస్పెండ్ చేసింది. చదవండి: చైనాకు మరోసారి గట్టిషాకిచ్చిన కోవిడ్-19..! -
కాంబినేషన్ వ్యాక్సిన్లు అంటే...
గతంలో ఒక్కో రకం వైరస్‌కు నిర్దిష్టంగా ఒక్కో వ్యాక్సిన్ ఇచ్చేవారు. అటు తర్వాత ఒక్క వ్యాక్సిన్ డోస్‌లోనే అనేక రకాల వ్యాక్సిన్లను ఒకేసారి ఇవ్వడం సాధ్యమైంది. ఇలా ఒకే డోస్‌లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనేలా రూపొందించిన వ్యాక్సిన్లనే కాంబినేషన్ వ్యాక్సిన్లు అంటారు. ఉదాహరణకు ‘ఎమ్ఎమ్ఆర్ ప్లస్ వారిసెల్లా’ అనే వ్యాక్సిన్ ద్వారా మీజిల్స్, మంప్స్, రుబెల్లా, వారిసెల్లా అనే సమస్యలకూ, ‘డీటీఏపీ ప్లస్ ఐపీవీ’ అనే వ్యాక్సిన్ వల్ల డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, పోలియో అనే సమస్యలకు ఒకే ఒక ఇంజెక్షన్ ద్వారానే నివారణ లభిస్తుంది. ఇలాంటి రకరకాల కాంబినేషన్ వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల మాటిమాటికీ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అగత్యం తప్పుతుంది. ఒకే ఇంజెక్షన్ ద్వారా మూడు/ నాలుగు/ఐదు సమస్యలను నివారించవచ్చు. చిన్నారులు డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి అంత సుముఖంగా ఉండరు. అందుకే కాంబినేషన్ వ్యాక్సిన్లతో మాటిమాటికీ హాస్పిటల్‌కు వెళ్లాల్సిరావడంతో పాటు కొన్ని వ్యాక్సిన్లను మిస్ అయ్యే అనర్థాల్లాంటివి చాలావరకు తప్పుతాయి. టీకా వేయించాల్సిన చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు తమ పీడియాట్రీషియన్‌ను కలిసి, ఏయే కాంబినేషన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయో, తమ బిడ్డకు ఏవేవి అవసరమవుతాయో తెలుసుకుంటే, తక్కువ ఇంజెక్షన్లలోనే ఎక్కువ వ్యాక్సిన్లు ఇవ్వడానికి వీలవుతుంది. చదవండి: (కిడ్నీలో రాళ్ల తొలగింపు ఇప్పుడు తేలికే!) -
వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై నేటికి ఏడాది!!
కరోన మహమ్మారితో విలవిలలాడిపోయిన భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి నేటికి ఏడాది పూర్తైయింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ "ప్రపంచంలో అత్యంత విజయవంతమైనది"గా పేర్కొన్నారు. గతేడాది ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన అభినందించారు. ఈ మేరకు మాండవ్వ మాట్లాడుతూ.." ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి నేటికి ఒక ఏడాది పూర్తైయింది. 'సబ్కే ప్రయాస్'తో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభించిన ఈ ప్రక్రియ నేడు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియగా అభివర్ణించారు. అంతేకాదు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కి సహాయ సహకారాలు అందించిన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, దేశ ప్రజలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను" అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పైగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏవిధంగా ప్రారంభమైందో ఎలా విజయవింతమైందో వంటి విషయాలకు సంబంధించిన గ్రాఫికల్ చార్ట్‌లను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ జనవరి 16, 2021న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియ దాదాపు 156.76 కోట్లకు పైగా డోసులను అందించింది. గత 24 గంటల్లో సుమారు 66 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందిచారు. అంతేగాక భారత్‌లో గడిచిన 24 గంటల్లో 2,71,202 కొత్త కోవిడ్ -19 కేసులు, 314 మరణాలు సంభవించగా, 1,38,331 రికవరీలు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. Have a look at the journey of #1YearOfVaccineDrive, that gives glimpses of the nation's collective fight against #COVID19 under the visionary and inspiring leadership of PM @NarendraModi Ji. pic.twitter.com/Hit9Ku8rzS — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 16, 2022 (చదవండి: ‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్) -
నాలుగో వేవ్ నడుస్తోంది.. జాగ్రత్త!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా నాలుగో వేవ్ ఉధృతి కనిపిస్తోందని, ఈ సమయంలో భారత్‌లో కోవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలను కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల పేరిట కోవిడ్ నిబంధనల అతిక్రమణ చేయవద్దని కోరింది. తక్షణమే టీకాలు తీసుకోవడం, కోవిడ్ సమయంలో పాటించాల్సిన పద్ధతులు(కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) పాటించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం చేయాలని సూచించింది. ఇప్పటికీ ఇండియాలో డెల్టానే డామినెంట్ వేరియంట్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ తెలిపారు. ఏరకమైన వేరియంట్ సోకినా ఒకటే చికిత్స అందించాలన్నారు. ఇంతవరకు దేశంలో 358 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని, వీటిలో 183 కేసులను విశ్లేషించగా అందులో 121 కేసులు విదేశీ ప్రయాణికులవని తెలిపింది. 183 కేసుల్లో 91 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారని, ముగ్గురైతే బూస్టర్ డోసు తీసుకున్నారని వివరించింది. వీరిలో 70 శాతం మందిలో ఒమిక్రాన్ సోకినా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ పాజిటివిటీ రేటు 6.1 శాతం వద్ద కదలాడుతోంది. దేశీయంగా కేరళ, మిజోరాంలో జాతీయ సగటు కన్నా అధిక పాజిటివిటీ నమోదవుతోందని కేంద్రం వెల్లడించింది. దేశం మొత్తం మీద 20 జిల్లాల్లో(కేరళలో 9, మిజోరాంలో 8)పాజిటివిటీ రేటు 5– 10 శాతం మధ్య ఉందని తెలిపింది. ఒమిక్రాన్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రైవేట్ వైద్య రంగం తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. కరోనాపై పోరుకు 18 లక్షల ఐసోలేషన్ బెడ్స్, 5 లక్షల ఆక్సీజన్ సపోర్టెడ్ బెడ్స్, 1.39 లక్షల ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచారు. ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్2లో భాగంగా 50 శాతం నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించామని, వీటితో ఏర్పాట్లు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. యూపీలో రాత్రి కర్ఫ్యూ ఈనెల 25 నుంచి ఉత్తరప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. పెళ్లిళ్లలాంటి కార్యక్రమాలకు 200కు మించి హాజరు కారాదని తెలిపారు. రోడ్లపై తిరిగేవారికి మాస్కు తప్పనిసరి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు వచ్చేవారికి కరోనా టెస్టులు చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు, ముంబైలో రాత్రిపూట ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై నిషేధం విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నియమం అమల్లోకి వస్తుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఇన్డోర్ ఫంక్షన్లలో 100 మంది లేదా హాలు సామర్ధ్యంలో 50 శాతం కన్నా ఎక్కువమంది, అవుట్ డోర్ కార్యక్రమాల్లో 250 మంది లేదా సమావేశ ప్రాంత మొత్తం సామర్ధ్యంలో 25 శాతం కన్నా ఎక్కువ హాజరు కాకూడదని ప్రభుత్వం ఆదేశించింది. జార్ఖండ్‌లోని రాంచీలో జనం రద్దీ -
Omicron Variant: మళ్లీ ఆంక్షల చట్రంలోకి.. మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి
లండన్, జోహెన్నెస్‌బర్గ్, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్(బి.1.1.529) కేసులు పలు దేశాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా బ్రిటన్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఇజ్రాయెల్‌లో కేసులు నిర్ధారణయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బ్రిటన్‌లో ముగ్గురికి, ఆస్ట్రేలియాలో ఇద్దరికి, జర్మనీలో ఇద్దరికి, ఇటలీ, ఇజ్రాయెల్, బెల్జియంలలో ఒక్కొక్కరికీ ఈ వేరియెంట్ సోకిందని పరీక్షల్లో తేలింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 61 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైతే వారిలో 13 మందికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఖతర్ ఎయిర్వేస్ విమానంలో సిడ్నీకి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకిందని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. డెల్టా కంటే శరవేగంగా ఈ వేరియెంట్ కేసులు వ్యాపిస్తూ ఉండడంతో భయాందోళనలకు లోనైన 18 దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకల్ని నిలిపివేశాయి. ఇజ్రాయెల్ తమ దేశాల సరిహద్దుల్ని మూసేసింది. ఆఫ్రికాలోని 50 దేశాల నుంచి రాకపోకల్ని నిషేధించింది. యూకేలో మళ్లీ మాస్కులు ఇంగ్లాండ్‌లో మంగళవారం నుంచి దుణాకాలు, వ్యాపారసముదాయాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మంగళవారం నుంచి మళ్లీ మాస్కులు ధరించడం తప్పనిసరి చేయనున్నారు. యూకేకు వచ్చే విదేశీ ప్రయాణీకులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేస్తామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావేద్ ఆదివారం వెల్లడించారు. మొరాకో సోమవారం నుంచి రెండువారాల పాటు తమ దేశంలోకి వచ్చే విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రపంచానికి త్వరితంగా వెల్లడిస్తే శిక్షిస్తారా? ఒమిక్రాన్ వేరియెంట్ ఎంత ప్రమాదకరమో ఇంకా నిర్ధారణ కాకుండానే అంతర్జాతీయ సమాజం రవాణా ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా ఆవేదన వ్యక్తం చేస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల్ని రానివ్వకపోవడం అత్యంత క్రూరమైన చర్యని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాము ఎంతో ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించి కొత్త వేరియెంట్‌ని కనుగొనడం తమకు శిక్షగా మారిందని అంటోంది. ‘‘సైన్స్ అద్భుతం చేస్తే ప్రశంసించాలి కానీ శిక్షించకూడదు’’ అని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ‘రిస్క్’ ఉన్న దేశాల నుంచి వస్తే... ఆర్టీ–పీసీఆర్ ఫలితాలొచ్చాకే ఇంటికి న్యూఢిల్లీ: ‘రిస్క్’ దేశాల నుంచి (ఒమిక్రాన్ జాడలు బయటపడుతున్న దేశాలు) లేదా వాటిమీదుగా వస్తున్న ప్రయాణికులు అందరూ భారత్‌లో దిగగానే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని, పరీక్షల ఫలితాలు వచ్చేదాకా వారు విమానాశ్రయంలోనే వేచి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ట్రాన్సిట్‌లో ఉన్న వారు కూడా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే... తదుపరి ప్రయాణం నిమిత్తం విమానాల్లోకి బోర్డింగ్ కావొచ్చని తెలిపింది. సురక్షిత జాబితాలోని దేశాల నుంచి వచ్చే వారు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిస్తారని, అయితే 14 రోజుల పాటు వీరు స్వీయ ఆరోగ్యపరిరక్షణ చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముప్పులేని దేశాల నుంచి వచ్చేవారిలోనూ ఐదుశాతం మందిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్యోశాఖ వెల్లడించింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా ఈ నెల 24వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒమిక్రాన్ వేరియెంటో, కాదో తేల్చుకోవడానికి అతని శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ రక్షణను ఏమార్చొచ్చు: గులేరియా ‘‘ఒమిక్రాన్ వేరియెంట్ వైరస్ కొమ్ములో 30 పైచిలుకు జన్యుపరమైన మార్పులున్నట్లు సమాచారం. ఫలితంగా ఇది రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోగలదు. కాబట్టి ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయనేది (ఈ వేరియెంట్ నుంచి ఎంతమేరకు రక్షణ కల్పిస్తాయనేది) నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది’’ అని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. వైరస్ పైనుండే కొమ్ముల ద్వారానే కరోనా ఆతిథ్య కణంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందుతుందనే విషయం తెలిసిందే. ‘ఎక్కువమటుకు వ్యాక్సిన్లు స్పైక్ ప్రొటీన్ (వైరస్‌పై నుంచే కొమ్ములకు)లకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీలను తయారుచేయడం ద్వారా రక్షణ కల్పిస్తాయి. అలాంటి స్పైక్ ప్రొటీన్‌లో పెద్దసంఖ్యలో జన్యుపరమైన మార్పులుంటే యాంటీబాడీలు వాటిని అంత సమర్థంగా అడ్డుకోలేకపోవచ్చు’ అని గులేరియా పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనేది పరిశోధించి నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ ముప్పు అన్ని దేశాలకు పొంచి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచడం, కరోనా పరీక్షలు ఎక్కువ చేయడం, కరోనా హాట్‌స్పాట్‌ల్లో నిరంతర పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయడం, ప్రజలందరూ కోవిడ్–19 నిబంధనల్ని తుచ తప్పకుండా పాటించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్, బోస్ట్వానా నుంచి వచ్చే ప్రయాణికుల్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయాలని, అందరికీ కరోనా పరీక్షలతో పాటు ఏ వేరియెంట్ సోకిందో తెలిసే వరకు క్వారంటైన్లో ఉంచాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించానికి ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ ల్యాబొరేటరీకి శాంపిల్స్ పంపాలన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా వైరస్ ఎంతవరకు వ్యాప్తి చెందిందో తెలుసుకోవడం కష్టమవుతుందన్నారు. 5శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉండేలా రాష్ట్రాలన్నీ చర్యలు చేపట్టాలన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్ అన్న విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు కృషి చెయ్యాలన్నారు. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారత్‌కు 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం 150 కోట్ల అమెరికా డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా ఆ ప్రకటన తెలిపింది. చైనాలోని బీజింగ్ కేంద్రంగా పని చేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) అదనంగా మరో 50 కోట్ల డాలర్లను రుణంగా ఇవ్వడానికి అవకాశాలున్నాయి. -
టీకా వద్దనేవారు తగ్గిపోతున్నారు!
న్యూఢిల్లీ: భారత జనాభాలో కోవిడ్ టీకాలపై అపనమ్మకం వేగంగా తగ్గుతోందని ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ తెలిపింది. దేశ జనాభాలో టీకాలపై సందేహాలున్న వారి సంఖ్య కేవలం 7 శాతానికి చేరిందని, టీకాలివ్వడం ఆరంభమయ్యాక ఇదే కనిష్ఠ స్థాయని సర్వే తెలిపింది. 301 జిల్లాల్లో 12,810 మందిని వ్యాక్సినేషన్‌పై ప్రశ్నించారు. వీరిలో 67 శాతం మగవారు కాగా 33 శాతం మంది మహిళలు. వీరిలో ఇప్పటివరకు టీకా తీసుకోనివారిని ప్రశ్నించగా 46 శాతం మంది కనీసం తొలిడోసైనా త్వరలో తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేవలం 27 శాతం మంది మాత్రం ఇంకా టీకాపై నమ్మకం కుదరడం లేదని, మరింత డేటా వచ్చాక టీకా తీసుకుంటామని చెప్పినట్లు సంస్థ అధిపతి సచిన్ తపారియా తెలిపారు. భారత్‌లో వయోజనుల జనాభా దాదాపు 94 కోట్లు కాగా వీరిలో 68 కోట్ల మంది కనీసం ఒక్కడోసైనా టీకా తీసుకున్నవారున్నారు. సర్వే ఫలితాలను దేశజనాభాతో పోల్చిచూస్తే 7 శాతం మంది అంటే సుమారు 26 కోట్లమంది ఇంకా ఒక్కడోసు కూడా తీసుకోలేదు. వీరిలో కొంతమంది త్వరలో టీకా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ఆరంభమైనప్పుడు దేశ జనాభా(వయోజన)లో దాదాపు 60 శాతం మంది టీకాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా సెకండ్‌వేవ్ అనంతరం టీకాలు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. దీనికితోడు ప్రభుత్వం ఉచితంగా టీకాల పంపిణీ ఆరంభించడం కూడా ప్రజల్లో వ్యాక్సినేషన్‌కు ప్రాచుర్యం లభించేందుకు కారణమైంది. ఎందుకు వద్దంటే... టీకాలను వద్దనే సందేహరాయుళ్లు తమ వ్యతిరేకతకు పలు కారణాలు చెబుతున్నారు. కొత్తవేరియంట్ల నుంచి టీకా కల్పించే రక్షణపై సందేహాలను వెలుబుచ్చుతున్నారు. వీరి అనుమానాల్లో కొన్ని... ► సరైన పరీక్షలు పూర్తికాకముందే హడావుడిగా టీకాలకు అనుమతులిచ్చారు, కాబట్టి వాటితో లభించే రక్షణపై సందేహాలున్నాయి. ► టీకాలతో సైడ్‌ఎఫెక్టులుంటాయి, కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు టీకాతో అనవసర సమస్యలు వస్తాయి. ► కొత్తగా వచ్చే వేరియంట్లను ప్రస్తుత టీకాలు ఎలాగూ రక్షించలేవు. అందువల్ల మరింత శక్తివంతమైన వ్యాక్సిన్లు వచ్చాక ఆలోచిద్దాం. ► మాకు బ్లడ్ క్లాటింగ్ సమస్యలున్నాయి అందుకే టీకాకు దూరంగా ఉంటున్నాము. ► మానవ పయ్రత్నం ఏమీ లేకుండా ఎలా వచ్చిందో అలాగే కోవిడ్ మాయం అవుతుంది, దానికోసం టీకాలు అవసరం లేదు. టీకాలపై మారుమూల ప్రాంతాల్లో వ్యాపించిన మూఢనమ్మకాలు, అభూత కల్పనలు కొందరిని టీకాకు దూరంగా ఉంచుతున్నాయి. వ్యాక్సినేషన్ తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారింది. జనాభాలో వీలైనంత ఎక్కువమందికి టీకాలు అందితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
కరోనాకు ముగింపు లేదా!?
‘కరోనా కార్చిచ్చులాంటిది.. అడవి మొత్తం తగలబడే వరకు కార్చిచ్చు ఆరదు, అలాగే మానవాళి మొత్తానికి ఒక్కసారైనా సోకే వరకు కరోనా ఆగదు’ అంటున్నారు ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు. మానవాళి మరికొన్ని సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందిపడక తప్పదని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకి ఇమ్యూనిటీ పెరగడం కన్నా టీకాలతో ఇమ్యూనిటీ పెంచడం మంచిదంటున్నారు. వ్యాక్సినేషన్‌తోనే దీన్ని అరికట్టడం సాధ్యమని మరోమారు గుర్తు చేస్తున్నారు. సంవత్సరన్నరకు పైగా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనాకు నిజంగా ముగింపు ఉందా? ఉంటే ఎప్పుడు? ఎలా? అనేవి ప్రతిఒక్కరిలో తలెత్తే ప్రశ్నలు. కానీ ఇంతవరకు సైంటిస్టులు దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. తాజాగా వచ్చే 3–6 నెలల్లో పరిస్థితులు ఎలా ఉండొచ్చన్న అంశంపై సైంటిస్టులు పరిశోధన జరిపారు. అయితే వచి్చన సమాధానాలు ఏమంత ఆశాజనకంగా లేవని చెప్పారు. రాబోయే కాలంలో మరలా కరోనా ప్రబలవచ్చని, దీనివల్ల స్కూళ్లు మూతపడడం, టీకాలు తీసుకున్నవారిలో కొత్త ఇన్ఫెక్షన్ భయాలు పెరగడం, ఆస్పత్రులు కిటకిటలాడటం జరగవచ్చని హెచ్చరించారు. కరోనాకు నిజమైన ముగింపు వచ్చే లోపు ప్రపంచంలో ప్రతిఒక్కరూ దీని బారిన ఒక్కసారైనా పడటం లేదా టీకా తీసుకోవడం జరుగుతుందన్నారు. కొందరు దురదృష్టవంతులకు రెండుమార్లు కరోనా సోకే ప్రమాదం కూడా ఉండొచ్చన్నారు. అందరికీ కరోనా సోకేవరకు వేవ్స్ రాకడ ఆగకపోవచ్చని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, తిరిగి తగ్గడం గమనించవచ్చని అమెరికా సైంటిస్టు మైకేల్ ఓస్టర్ హామ్ అభిప్రాయపడ్డారు. మ్యుటేషన్లతో ప్రమాదం వైరస్‌ల్లో వచ్చే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణమవుతాయన్నది తెలిసిందే! కరోనాలో మ్యుటేషన్ మెకానిజం ఇతర వైరస్‌లతో పోలిస్తే మెరుగ్గాఉంది. గత వేరియంట్లలో లోపాలను దిద్దుకొని కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇందువల్ల రాబోయే కాలంలో ఫ్లూలాగానే ఎప్పటికప్పుడు కరోనాకు టీకా (బూస్టర్ డోస్‌లు) టాప్అప్లు తీసుకోవాల్సిరావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. కొన్ని మ్యుటేషన్ల అనంతరం ఫస్ట్‌జనరేషన్ వ్యాక్సిన్లను తట్టుకునే వేరియంట్ రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేకాకుండా కొత్త రకం ఫ్లూ వైరస్ మానవాళిపై దాడి చేసే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ శాస్త్రవేత్త కంటా సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా 5,6 నెలల్లో మాత్రం కరోనా మాయం కాకపోవచ్చని సైంటిస్టుల ఉమ్మడి మాట. ప్రపంచ జనాభాలో 95 శాతం వరకు ఇమ్యూనిటీ(కరోనా సోకి తగ్గడం వల్ల లేదా టీకా వల్ల) వస్తేనే కోవిడ్ మాయం అవుతుందని చెబుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీకి అత్యుత్తమ మార్గం వ్యాక్సినేషనేనని చెప్పారు. కరోనా ముగింపు ప్రపంచమంతా ఒకేదఫా జరగకపోవచ్చని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో(టీకా కార్యక్రమం పూర్తికావడం బట్టి) కరోనా మాయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏం జరగవచ్చు ఒకపక్క కోట్లాదిమందికి టీకా అందలేదు, మరోపక్క ఆర్థిక వ్యవస్థలు చురుగ్గా మారుతున్నాయి. ఈ రెండింటి సమ్మేళనంతో మరలా కేసులు పెరగవచ్చని మైకేల్ అంచనా వేశారు. టీకా కార్యక్రమాల వేగం పెరిగినా, వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నవారు(ఉదాహరణకు పసిపిల్లలు, టీకా అందని వారు, బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ బారిన పడేవారు) ఎప్పుడూ ఉంటారన్నారు. రాబోయే కొన్ని నెలలు ప్రమాదమని, ముఖ్యంగా టీకా నిరోధక వేరియంట్ వస్తే మరింత ప్రమాదమని సైంటిస్టుల అంచనా. 130 ఏళ్ల క్రితం మనిíÙని ఐదుమార్లు వణికించిన ఇన్ఫ్లుయెంజా మహమ్మారి ఉదంతాన్ని గమనిస్తే కరోనా భవిష్యత్‌పై ఒక అంచనా రావచ్చని భావిస్తున్నారు. వీటిలో ఒక దఫా సుమారు ఐదేళ్లు మానవాళిని పీడించింది. ఆ ఐదేళ్లలో 2–4 వేవ్స్ వచ్చాయి. దీనికన్నా కరోనా ప్రమాదకారని, కనుక థర్డ్‌వేవ్ తప్పదని లోనే సిమన్సన్ అనే సైంటిస్టు అభిప్రాయపడ్డారు. అధిక వ్యాక్సినేషన్లు, ఆధునిక సౌకర్యాలున్న అగ్రరాజ్యాల్లో సైతం మరలా కేసులు పెరుగుతున్న సంగతి గుర్తు చేశారు. టీకాల వల్ల మరణాలు తగ్గవచ్చని, కానీ కేసులు పెరగడం ఆగకపోవచ్చని చెప్పారు. ముఖ్యంగా టీకాలు పెద్దగా కనిపించని మెక్సికో, ఇరాన్ లాంటి దేశాల్లో డెల్టాతో డేంజర్ పెరగవచ్చని చెప్పారు. టైమ్ గడిచేకొద్దీ వైరస్లు బలహీనపడతాయన్న అపోహ వద్దన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
వృద్ధులకు కరోనా ముప్పు
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మహమ్మారి నుంచి ముప్పు తప్పినట్లేనని ఇన్నాళ్లూ భావించాం. కానీ, తాజాగా అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీఎస్) నిర్వహించిన అధ్యయనంలో టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ వయసు మీద పడిన వారిలో కరోనా ముప్పు అధికంగా ఉంటున్నట్లు తేలింది. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు కరోనా సోకితే వ్యాక్సిన్ తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని ఈ అధ్యయనం వెల్లడించింది. గత ఎనిమిది నెలల్లో రెండు డోసులు తీసుకున్నాక కూడా ఆస్పత్రి పాలైన వారు, లేదంటే ప్రాణాలు కోల్పోయిన వారు 12,908 వరకు ఉన్నారని తెలిపింది. ఆస్పత్రిలో చేరిన వారిలో 70 శాతానికి పైగా మంది 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే. ఇక కరోనాతో మృతి చెందిన వారిలో 87 శాతం మందికి పైగా 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నావారే. సీడీసీ తాజాగా కరోనా కేసుల తీరు తెన్నుల్ని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. -
దేశంలో 45,083 కొత్త కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆదివారం 45,083 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,558కు పెరిగింది. యాక్టివ్ కేసులు పెరగడం ఇది వరుసగా అయిదో రోజు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.13 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 460 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,37,830కు చేరుకుంది. శనివారం 17,55,327 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 2.28గా నమోదైంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 63.09 కోట్ల డోసుల టీకాలు వేశారు. ఇటీవల వరుసగా నాలుగు రోజుల పాటు కేరళలో 30 వేలకు పైగా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 29,836 కరోనా కేసులు బయటపడ్డాయి. -
రొటీన్‌గా చెయ్యాలని అనుకోవడం లేదు..
న్యూఢిల్లీ: కోవిడ్–19 విజృంభిస్తున్న ఈ సమయంలో దేశ ప్రజలందరూ కచ్చితంగా స్వచ్ఛ భారత్ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు 62 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని అయినప్పటికీ అందరూ ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో మన్‌కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రధాని ఆదివారం 80వ ఎపిసోడ్లో మాట్లాడారు. స్వచ్ఛభారత్ అనగానే అందరికీ ఇండోర్ నగరమే మదిలోకి వస్తుందని, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంతో ఈ నగర ప్రజలు సంతృప్తి చెందలేదన్నారు. నీటి సంరక్షణలో కూడా అద్భుతాలు సాధించి దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా ఆవిర్భవించిందని అన్నారు. యువతరం మారుతోంది దేశంలో యువత ఏదో ఒకటి రొటీన్‌గా చెయ్యాలని అనుకోవడం లేదని, ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారని ప్రధాని అన్నారు. వారి ఆలోచన దృక్పథంలో ఎంతో మార్పు వచ్చిందని, ఏదైనా సృజనాత్మకంగా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి చాలా శక్తివంతమైనదిగా మారిందని, చిన్న నగరాల్లోని యువకులూ స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారని మోదీ అన్నారు. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ టీమ్ సాధించిన విజయాన్ని ఆయన కొనియాడారు. ‘‘ఇవాళ మేజర్ ధ్యానచంద్ జయంతి. ఆయన స్మృత్యర్థం జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్‌లో గెలుచుకున్న ప్రతీ పతకం ఎంతో విలువైనది. హాకీలో పతకం కొట్టగానే దేశమంతా ఉప్పొంగిపోయింది. మేజర్ ధ్యాన్‌చంద్‌జీ కూడా సంతోష పడే ఉంటారు’’అని వ్యాఖ్యానించారు. క్రీడారంగంలో యువత ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని, స్టార్టప్‌ల ఏర్పాటులో తలమునుకలై ఉన్నారని కొనియాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, యావత్ ప్రపంచం వాటికే దాసోహం అంటోందని ప్రధాని అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ‘‘సంస్కృతం చాలా సులభంగా.. ఎంతో తియ్యగా ఉంటుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. జాతీయ ఐక్యతను కాపాడుతుంది’’అని పేర్కొన్నారు. థాయ్‌లాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంస్కృతానికి ప్రాచుర్యం కల్పించడానికి ఎందరో కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.