సాక్షి, అమరావతి: చిన్నారులకు కరోనా సమయంలో లేదా దీని నుంచి కోలుకున్నాక వచ్చే మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్స్ (మిస్–సీ) గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వంద కరోనా కేసుల్లో ఐదారు మాత్రమే మిస్–సీ కేసులు ఉండొచ్చని అంటున్నారు. సకాలంలో చికిత్స అందిస్తే వారిని కాపాడుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. చిన్నారుల్లో సహజసిద్ధంగా ఉండే కొన్ని లక్షణాలు మిస్–సీని సమర్థవంతంగా ఎదుర్కొంటాయని పేర్కొంటున్నారు.
ఇవే చిన్నారులకు శ్రీరామరక్ష..
పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు మినహా మనం బూస్టర్‌గా అందించేది తక్కువ. అయితే కొన్ని సహజసిద్ధ లక్షణాల వల్ల వారికి కరోనా తక్కువగా వస్తున్నట్టు వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. అవి..
► ఏసీఈ–2 అంటే.. టైప్2 రిసెప్టార్స్ (అవయవాల పెరుగుదలకు ఉపయోగపడే గ్రాహకాలు) పెద్దల్లో కంటే చిన్నారుల్లో తక్కువ. ఈ రిసెప్టార్స్ ఎక్కువగా ఉంటే కరోనా వాటికి అతుక్కుపోయే ప్రమాదం ఎక్కువ. చిన్నారుల్లో ఇవి తక్కువ కాబట్టి కరోనా సోకే అవకాశం కూడా తక్కువే.
► పిల్లల్లో రక్తనాళాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. పెద్దల్లో అయితే రక్తనాళాల్లో కొవ్వులు పేరుకుపోవడం, పొగతాగడం వంటి వాటి వల్ల అవి దెబ్బతింటాయి. ఇలా రక్తనాళాలు దెబ్బతిన్న చోట వైరస్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. చిన్నారులకు అనేక రకాల వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంటారు. దీనివల్ల వారిలో క్రాస్ ఇమ్యూనిటీ వస్తుంది. దీనివల్ల వారిలో కరోనా వచ్చే ప్రమాదం తక్కువ. అదే పెద్దవాళ్లలో ఈ క్రాస్ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి కరోనా రావడానికి ఆస్కారం ఎక్కువ.
► సాధారణంగా చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల శ్వాస ప్రక్రియ ఎప్పటికప్పుడు యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. కరోనా కూడా శ్వాస ప్రక్రియపైన ప్రభావం చూపుతుంది. అయితే.. చిన్నారుల్లో సహజసిద్ధంగా ఉన్న యాంటీబాడీస్ కరోనాను అంత సులభంగా సోకనివ్వవు.
► చిన్నారుల్లో ఏడాదిలోపు వారికి, 8 ఏళ్లపైన వారికి మిస్–సీ వచ్చే అవకాశం ఎక్కువ. పై లక్షణాలున్న చిన్నారులకు వెంటనే ఎకో కార్డియోగ్రామ్ తీసి తీవ్రతను గుర్తించవచ్చు. 90 కంటే ఆక్సిజన్ సాంద్రత తగ్గితే సివియర్‌గా గుర్తించాలి.
చిన్నారుల్లో మిస్–సీ లక్షణాలు..
► 3 రోజులకు మించి జ్వరం
► ఒంటిపై ఎక్కువగా దద్దుర్లు
► గుండె వేగంగా కొట్టుకోవడం
► విరేచనాలు, పొట్ట ఉబ్బరం
వందలో ఐదారు కేసులే..
చిన్నారుల్లో వచ్చే మిస్–సీ కేసుల గురించి ఆందోళన అక్కర్లేదు. వందలో ఐదారు కేసుల్లోనే మిస్–సీ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్లలో టైప్2 రిసెప్టార్స్ లేకపోవడం మంచి పరిణామం. ఇలా కొన్ని సహజసిద్ధంగా వచ్చిన లక్షణాల వల్ల పెద్దల్లో కంటే చిన్నారుల్లో మిస్–సీ కేసులు చాలా తక్కువ.
–డా.కిరీటి, పీడియాట్రిక్ ప్రొఫెసర్, ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment