కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చాక... గొంతు క్యాన్సర్‌ చికిత్స మరింత ప్రభావవంతంగా! | COVID-19 Vaccination Improves Effectiveness of Cancer Treatment | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చాక... గొంతు క్యాన్సర్‌ చికిత్స మరింత ప్రభావవంతంగా!

Published Sun, Nov 27 2022 5:48 AM | Last Updated on Sun, Nov 27 2022 5:48 AM

COVID-19 Vaccination Improves Effectiveness of Cancer Treatment - Sakshi

కోవిడ్‌ సమయంలో వ్యాక్సిన్లు ఇస్తున్నప్పుడు... దాని ప్రభావం నేపథ్యంలో ఇతర చికిత్సలు అంత ప్రభావవంతంగా ఉండవేమోనంటూ అప్పట్లో చాలామంది డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చాక చేసిన నేసోఫ్యారింజియల్‌ క్యాన్సర్‌ అనే ఒక రకం గొంతు క్యాన్సర్‌ చికిత్స మరింత ప్రభావవంతమైన ఫలితాలను ఇచ్చినట్లు డాక్టర్లు, పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్‌ చికిత్స మరింత బాగా జరిగేందుకు ఈ వ్యాక్సిన్‌ డోసులు దోహదం చేసినట్లు గ్రహించారు.

వాస్తవానికి నేసోఫ్యారింజియల్‌ క్యాన్సర్‌కు యాంటీ పీడీ–1 థెరపీ అనే చికిత్స అందిస్తుంటారు. ఇది పీడీ–1 రిసెప్టార్స్‌ అనే జీవాణువులను అడ్డుకుంటుంది. ఇలా అడ్డుకోవడం ద్వారా మందు ఇమ్యూన్‌ కణాలకు స్వేచ్ఛనిస్తుంది. దాంతో ఆ ఇమ్యూన్‌ కణాలు స్వేచ్ఛగా క్యాన్సర్‌ గడ్డకు కారణమయ్యే అంశాలపై యుద్ధం చేస్తాయి. ఇలా యాంటీ పీడీ–1 చికిత్స పనిచేస్తుంది.
మనకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇచ్చినప్పుడు... అది మన దేహంలో ఇమ్యూన్‌ ప్రతిస్పందనలు వచ్చే మార్గాల్లోని (పాత్‌ వేస్‌లోని) సిగ్నల్స్‌ను మరింతగా ప్రేరేపిస్తుంది. అలాంటప్పుడు ఆ సిగ్నల్స్‌ చురుగ్గా పనిచేస్తున్న కారణంగా క్యాన్సర్‌ చికిత్సకు ఇచ్చే మందులు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయోనని డాక్టర్లు తొలుత ఆందోళన చెందారు.

‘‘యాంటీ పీడీ–1 థెరపీకి ఈ వ్యాక్సిన్‌ అడ్డంకిగా మారవచ్చేమోనని తొలుత మేం భయపడ్డాం. ఎందుకంటే ఈ నేసోఫ్యారింజియల్‌ క్యాన్సర్‌ ఏ భాగాన్నైతో ప్రభావితం చేస్తుందో... కరోనా (సార్స్‌–సీవోవీ–2) కూడా అక్కడే ప్రభావం చూపుతుంది’’ అంటూ జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ బాన్‌కు చెందిన బయోఇన్‌ఫర్మాటిక్స్‌ సైంటిస్ట్‌ జియాన్‌ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అయితే వ్యాక్సిన్‌ తీసుకోని వారితో పోలిస్తే... వ్యాక్సిన్‌ వేయించుకున్నవారిలో యాంటీ పీడీ–1 ఔషధాలు మరింత సమర్థంగా పనిచేయడం మమ్మల్ని అబ్బురపరచింది’’ అంటూ అదే యూనివర్సిటీకి చెందిన ఇమ్యూనాలజిస్ట్‌ క్రిస్టియన్‌ కర్ట్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ పరిశోధక బృందం... నేసోఫ్యారింజియల్‌ క్యాన్సర్‌తో అక్కడి 23 ఆసుపత్రుల్లోని 1,537 మంది బాధితులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీళ్లలో 373 మంది బాధితులకు క్యాన్సర్‌ చికిత్సకు ముందు ‘సైనో–వ్యాక్‌’’ అనే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఇలా వ్యాక్సిన్‌ ఇచ్చిన వారిలో క్యాన్సర్‌ మందు చాలా సమర్థంగా పనిచేసింది. అంతేకాదు... వారిలో సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా చాలా తక్కువగా కనిపించాయి.

‘‘ఇది ఎలా జరిగిందో ఇప్పటికైతే మాకు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. బహుశా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చాక... వారికి అందించిన మందుల వల్ల బాధితుల్లోని ఇమ్యూన్‌ వ్యవస్థ మరింత ప్రేరేపితమై ఉండవచ్చు. దాంతో ఈ ఫలితాలు వచ్చి ఉండవచ్చు’’ అని చైనాలోని శాంగ్జీ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన క్యాన్సర్‌ పరిశోధకుడు క్వీ మెయ్‌ అభిప్రాయపడుతున్నారు. యూఎస్, యూకేలలో నేసో ఫేరింజియల్‌ క్యాన్సర్‌ కేసులు చాలా తక్కువ. అయితే చైనా వంటి ఆసియా దేశాలతో ఇది ఎక్కువ. ఇక తైవాన్‌లో దీనివల్ల మరణాలూ మరింత ఎక్కువ.
ఇప్పటివరకు కేవలం ఒక రకం కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన బాధితులపైనే ఈ పరిశోధన జరిగింది. ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరిగి, అసలు ఈ మెకానిజమ్‌ ఎలా జరుగుతుందో తెలుసుకోవాల్సి ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘యానల్స్‌ ఆఫ్‌ ఆంకాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement