
లండన్: కరోనా మహమ్మారిని వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని, వాటివల్ల 2021లో భారత్ 42 లక్షల మరణాలను నివారించిందని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. యూకేలోని లండన్‌లో ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్–19 వాస్తవ మరణాలను, డిసెంబర్ 8, 2020, డిసెంబర్ 8, 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్‌ను సరిపోల్చి చూస్తూ ఈ లెక్కలు వేశారు. భారత్‌లో 42 లక్షలకు పైగా మరణాలను నివారించినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ‘‘భారత్‌కు సంబంధించినంత వరకు ఈ ఏడాది కాలంలో 42,10,000 మరణాలను నివారించగలిగిందని మాకు అంచనాలున్నాయి’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ ఒలివర్ వాట్సన్ చెప్పారు.
2 కోట్ల ప్రాణాలు పోయేవి
కరోనా మరణాల విషయంలో అధికారిక లెక్కలకి, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ తేడా ఉన్నట్టు విమర్శలున్నాయి. కరోనాతో 189 దేశాల్లో 3.14 కోట్ల మంది మరణిస్తారని అనుకుంటే వ్యాక్సిన్లు రావడం వల్ల వారిలో 1.98 కోట్ల మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతీ దేశంలో 40శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండి ఉంటే 5.99 లక్షల మరణాలు తప్పేవని అధ్యయనం పేర్కొంది.
17 వేలకు పైగా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 30శాతం కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 17,336 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. కరోనాతో ఒక్క రోజులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment