Throat cancer
-
జస్ట్ లాలాజలంతోనే గొంతు, నోటి క్యాన్సర్లను గుర్తించే పరికరం!
క్యాన్సర్లలో కొన్నింటిని చాలావరకు ముందుగానే తెలుసుకుని, కొద్దిపాటి శస్త్ర చికిత్సలతో బయటపడొచ్చు. కానీ గొంతు, నోటి క్యాన్సర్ల విషయంలో అలా కాదు. చాలా వరకు చివరి స్టేజ్‌లోనే గుర్తించగలం. ముందుగా గుర్తించడం అసాధ్యం. అలాంటి ప్రాణాంతక క్యాన్సర్లని ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకునేలా ఏఐ ఆధారిత సరికొత్త సాధనాన్ని ఆవిష్కరించారు పరిశోధకులు. ఏ వ్యాధి అయినా నయం చేయడం కంటే రాకుండా నివారించడం అనేది ఉత్తమం. కాబట్టి ఆ రకమైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందా? అన్నది ఈ అత్యాధునిక సాధనంతో ముందుగా గుర్తిస్తే..వెంటనే ఆ వ్యాదులకు బ్రేక్ వేసి ఎన్నో ప్రాణాలు నిలబెట్టగలుగుతాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏంటా సరికొత్త సాధనం? ఎలా క్యాన్సర్‌ని డిటెక్ట్ చేస్తుంది? కచ్చితమైన ఫలితాలే ఇస్తుందా..? తదితరాల గురించే ఈ కథనం. నోరు, గొంతు క్యాన్సర్లను ముందుగా గుర్తించే అత్యాధుని పరకరాలు లేకపోవడంతో ఆ క్యాన్సర్లను లాస్ట్ స్టేజ్‌లోనే గుర్తించడం జరగుతోంది. ఈ సమస్యకు చెక్‌పెట్టే సోలెడాడ్ సోసా, జూలియా, అగ్యిర్రే ఘిసో తదితర పరిశోధక బృందం కంప్యూటర్ ఆధారిత పరికరాన్ని ఆవిష్కరించారు. ఇది 90% కచ్చిత ఫలితాలను ఇవ్వగలదని వెల్లడించారు. ఈ బృందం గొంతు, నోటి క్యాన్సర్లను ఫస్ట్ స్టేజ్‌లోనే ఎలా నివారించాలనే దిశగా గతంలో పలు పరిశోధనలు చేసింది. ఆ అధ్యయనంలో నిద్రాణంగా ఉన్న క్యాన్సర్ కణాల సామర్థ్యాన్ని ఎన్ఆర్2ఎఫ్1(NR2F1) ప్రోటీన్‌తో నియంత్రించొచ్చని కనుగొన్నారు. ప్రోటీన్ ఎలా నియంత్రిస్తుందంటే.. ఈ గ్రాహక ప్రోటీన్ సెల్ న్యూక్లియస్‌లోకి ప్రవేశించి, క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధించే ప్రోగ్రామ్‌ను సక్రియం చేసేందుకు అనేక జన్యువులను ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. ప్రాథమిక కణుతుల్లో ఎన్ఆర్2ఎఫ్1 స్థాయిలు తక్కువుగా ఉంటాయి. దీంతో నిద్రాణంగానే క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందడం మొదలు పెడతాయి. దీంతో ఎన్ఆర్2ఎఫ్1 ప్రోటీన్ స్థాయిలు తగ్గడం జరుగుతుంది. అందువల్ల ఈ ఎన్ఆర్2ఎఫ్1 ప్రోటీన్ సాయంతో నిద్రాణంగా ఉన్న ఈ క్యాన్సర్ కణాలను ప్రేరేపించేలా సంక్రియం చేస్తే సులభంగా క్యాన్సర్ కణాలను నియంత్రించొచ్చని వెల్లడించారు పరిశోధకులు. అంటే ముందుగానే ఆ ప్రోటీన్ స్థాయిలను గుర్తించే అత్యాధునిక పరికం ఉంటేనే ఇదంతా సాధ్యం అని భావించారు పరిశోధకులు. ఆ ఆలోచనే ఈ కంప్యూటర్ ఆధారిత స్కీనింగ్ సాధన ఆవిష్కరణకు నాంది పలికింది. ఇది ముందుగానే రోగి శరీరంలోని ఎన్ఆర్2ఎఫ్1 స్థాయిని గుర్తించి సక్రియం చేసేలా సీ26 డ్రగ్‌తో చికిత్స అందిస్తారు వైద్యులు. దీంతో రోగిలో క్యాన్సర్ కణాల విస్తరణ తగ్గి ఎన్ఆర్2ఎఫ్1 స్థాయిలు పెరుగుతాయి. వ్యొమ్ లైఫ్ సైన్స్ సారథ్యంలో ఆవిష్కరించిన ఈ అత్యాధునిక క్యాన్సర్ డిటెక్టర్ జస్ట్ రోగుల లాలాజలాంతోనే నోరు, గొంతులోని క్యాన్సర్ కణాలను ముందుగానే డిటెక్ట్ చేసేస్తుంది. నోటి లేదా గొంతు క్యాన్సర్ ఉన్న వ్యక్తులు, లేని వ్యక్తుల లాలాజాలం చాలా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. తాము ఈ ఏఐ ఆధారిత క్యాన్సర్ డిటెక్టర్‌తో దాదాపు 945 మంది నుంచి లాలాజల నమునాలను స్వీకరించామని, వాటిలో 80 నోటి క్యాన్సర్లు కాగా, 12 మాత్రం గొంతు క్యాన్సర్ నమునాలని వెల్లడించారు. ఆయా లాలాజల్లోని శిలింధ్రం, బ్యాక్టిరియా, జన్యువులను గుర్తించేలా సాధానానికి ట్రైయినింగ్ ఇస్తామని చెప్పుకొచ్చారు. అధ్యయనంలో ఈ సాధనం 90% చక్కటి ఫలితాలనిచ్చిందన్నారు. తాము దీర్ఘకాలికి వ్యాధుల మూలలను గుర్తించి ముందుగానే నివారించేలా చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ అత్యాధునిక క్యాన్సర్ డిటెక్టర్‌ని కనిపెట్టామని అన్నారు. ఇదేవిధంగా ఇతర ప్రాణాంతక వ్యాధులను కూడా ముందుగానే గుర్తించేలా సాధనాలను అభివృద్ధిపరచడమే గాక ఆ సమస్యను నుంచి బయటపడేలా కొంగొత్త వైద్య విధానాలను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు పరిశోధకులు. (చదవండి: మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు) -
Martina Navratilova: మాజీ ఛాంపియన్‌కు ఒకేసారి రెండు క్యాన్సర్లు
మియామి: టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా(66) మళ్లీ క్యాన్సర్ బారిన పడ్డారు. తాజాగా ఆమెకు గొంతు, రొమ్ము క్యాన్సర్ సోకినట్లు తాజాగా తేలింది. అది స్టేజ్ వన్‌లోనే ఉందని తెలుస్తోంది. అంటే ఆరంభ దశ అన్నమాట. మెడ దగ్గర చిన్నకణితి ఏర్పడడంతో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో.. గొంతు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఉందని వెల్లడైంది. కాగా, నవ్రతిలోవా క్యాన్సర్ బారిన పడడం రెండోసారి. తన కెరీర్లో 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచారు ఆమె. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌తో కలిపి గ్రాండ్‌స్లామ్‌లో మొత్తం 59 సార్లు ఛాంపియన్‌గా నిలిచారు. ప్రపంచ ఉత్తమ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన మార్టినా నవ్రతిలోవాకు గతంలో రొమ్ము క్యాన్సర్ సోకగా.. ఆరు నెలల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ‘‘ఒకేసారి రెండు రకాల క్యాన్సర్లు సోకడం తీవ్రమైన అంశమే. కానీ, చికిత్సతో జయించే అవకాశం ఉంది. ఫలితం సానుకూలంగా వస్తుందనే నమ్ముతున్నా. కొద్దికాలం హాస్పిటల్ వాసన భరించక తప్పదు. నా శక్తికొద్దీ పోరాడతా’’ అని 66 ఏళ్ల నవ్రతిలోవా తెలిపారు. 2010లో క్యాన్సర్ బారిన పడినప్పుడు నిస్సహాయంగా మారనని, అందుకే ఇలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వల్ల తనలా బాధపడుతున్న మహిళలకు సహాయం చేయవచ్చని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. చెక్-అమెరికన్ అయిన నవ్రతిలోవా కుటుంబంతో ప్రస్తుతం ఫ్లోరిడా మియామీలో ఉంటున్నారు. త్వరలోనే ఆమె చికిత్స తీసుకుంటారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాక... గొంతు క్యాన్సర్ చికిత్స మరింత ప్రభావవంతంగా!
కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు ఇస్తున్నప్పుడు... దాని ప్రభావం నేపథ్యంలో ఇతర చికిత్సలు అంత ప్రభావవంతంగా ఉండవేమోనంటూ అప్పట్లో చాలామంది డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చాక చేసిన నేసోఫ్యారింజియల్ క్యాన్సర్ అనే ఒక రకం గొంతు క్యాన్సర్ చికిత్స మరింత ప్రభావవంతమైన ఫలితాలను ఇచ్చినట్లు డాక్టర్లు, పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ చికిత్స మరింత బాగా జరిగేందుకు ఈ వ్యాక్సిన్ డోసులు దోహదం చేసినట్లు గ్రహించారు. వాస్తవానికి నేసోఫ్యారింజియల్ క్యాన్సర్‌కు యాంటీ పీడీ–1 థెరపీ అనే చికిత్స అందిస్తుంటారు. ఇది పీడీ–1 రిసెప్టార్స్ అనే జీవాణువులను అడ్డుకుంటుంది. ఇలా అడ్డుకోవడం ద్వారా మందు ఇమ్యూన్ కణాలకు స్వేచ్ఛనిస్తుంది. దాంతో ఆ ఇమ్యూన్ కణాలు స్వేచ్ఛగా క్యాన్సర్ గడ్డకు కారణమయ్యే అంశాలపై యుద్ధం చేస్తాయి. ఇలా యాంటీ పీడీ–1 చికిత్స పనిచేస్తుంది. మనకు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు... అది మన దేహంలో ఇమ్యూన్ ప్రతిస్పందనలు వచ్చే మార్గాల్లోని (పాత్ వేస్‌లోని) సిగ్నల్స్‌ను మరింతగా ప్రేరేపిస్తుంది. అలాంటప్పుడు ఆ సిగ్నల్స్ చురుగ్గా పనిచేస్తున్న కారణంగా క్యాన్సర్ చికిత్సకు ఇచ్చే మందులు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయోనని డాక్టర్లు తొలుత ఆందోళన చెందారు. ‘‘యాంటీ పీడీ–1 థెరపీకి ఈ వ్యాక్సిన్ అడ్డంకిగా మారవచ్చేమోనని తొలుత మేం భయపడ్డాం. ఎందుకంటే ఈ నేసోఫ్యారింజియల్ క్యాన్సర్ ఏ భాగాన్నైతో ప్రభావితం చేస్తుందో... కరోనా (సార్స్–సీవోవీ–2) కూడా అక్కడే ప్రభావం చూపుతుంది’’ అంటూ జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌కు చెందిన బయోఇన్ఫర్మాటిక్స్ సైంటిస్ట్ జియాన్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అయితే వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే... వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో యాంటీ పీడీ–1 ఔషధాలు మరింత సమర్థంగా పనిచేయడం మమ్మల్ని అబ్బురపరచింది’’ అంటూ అదే యూనివర్సిటీకి చెందిన ఇమ్యూనాలజిస్ట్ క్రిస్టియన్ కర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిశోధక బృందం... నేసోఫ్యారింజియల్ క్యాన్సర్‌తో అక్కడి 23 ఆసుపత్రుల్లోని 1,537 మంది బాధితులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీళ్లలో 373 మంది బాధితులకు క్యాన్సర్ చికిత్సకు ముందు ‘సైనో–వ్యాక్’’ అనే కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఇలా వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో క్యాన్సర్ మందు చాలా సమర్థంగా పనిచేసింది. అంతేకాదు... వారిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా కనిపించాయి. ‘‘ఇది ఎలా జరిగిందో ఇప్పటికైతే మాకు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. బహుశా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాక... వారికి అందించిన మందుల వల్ల బాధితుల్లోని ఇమ్యూన్ వ్యవస్థ మరింత ప్రేరేపితమై ఉండవచ్చు. దాంతో ఈ ఫలితాలు వచ్చి ఉండవచ్చు’’ అని చైనాలోని శాంగ్జీ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన క్యాన్సర్ పరిశోధకుడు క్వీ మెయ్ అభిప్రాయపడుతున్నారు. యూఎస్, యూకేలలో నేసో ఫేరింజియల్ క్యాన్సర్ కేసులు చాలా తక్కువ. అయితే చైనా వంటి ఆసియా దేశాలతో ఇది ఎక్కువ. ఇక తైవాన్‌లో దీనివల్ల మరణాలూ మరింత ఎక్కువ. ఇప్పటివరకు కేవలం ఒక రకం కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన బాధితులపైనే ఈ పరిశోధన జరిగింది. ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరిగి, అసలు ఈ మెకానిజమ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాల్సి ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘యానల్స్ ఆఫ్ ఆంకాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మూడేళ్ల ‘ఆకలి’ తీర్చారు
సాక్షి, సిటీబ్యూరో: గొంతు కేన్సర్‌తో బాధపడుతూ, ఆహారం కూడా తీసుకోలేకపోతున్న ఓ బాధితునికి నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో విభాగం వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. మూడేళ్లుగా పిడికెడు మెతుకులకు నోచుకోని ఆ బాధితునికి కడుపు నిండా ఆరగించే అవకాశం కల్పించారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి గత మూడేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. సదరు ఆస్పత్రి వైద్యులు రేడియేషన్ చికిత్స అందించారు. దీంతో కేన్సర్ కణాలతో పాటు అన్నవాహిక, కృత్రిమంగా ఏర్పాటు చేసిన పైపు కూడా దెబ్బతింది. దీంతో గొంతుకు ఓ వైపు శస్త్రచికిత్స చేసి కేన్సర్ సోకిన భాగాన్ని పూర్తిగా తొలగించారు. ఆ తర్వాత ఆహారనాళానికి ప్రత్యామ్నాయంగా ముక్కు నుంచి ఓ పైపును అమర్చి వదిలేశారు. అప్పటి నుంచి ఆయన ఆ పైపు ద్వారా నే ద్రవ పదార్థాలను తీసుకునేవారు. ఆకలైనప్పుడు నాలుగు మెతుకులు తినాలనుకున్నా తినలేక పోయే వాడు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రిలోని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బీరప్పను నెల రోజుల క్రితం ఆశ్రయించారు. పది మంది, పది గంటలు శ్రమించి... మూడేళ్లుగా ముక్కు ద్వారా ఆహారం తీసుకుంటున్నాడని తెలిసి వైద్యులు చలించిపోయారు. బాధితునికి పెట్‌స్కాన్ సహా ఇతర వైద్య పరీక్షలు చేయించిన వైద్యులు కేన్సర్ లేదని నిర్ధారించుకున్నారు. డాక్టర్ బీరప్ప నేతృత్వంలో పది మందితో కూడిన వైద్య బృందం సుమారు పది గంటల పాటు శ్రమించి ఈ నెల 9న ఆయనకు చికిత్స చేశారు. ముక్కు నుంచి వేసిన పైపులైన్‌ను తొలగించి, కొలాన్ బైపాస్ సర్జరీ చేశారు. అన్నవాహికను పెద్ద పేగుతో అనుసంధానించారు. పూర్తిగా కోలుకొని ఆహారం తీసుకుంటుండటంతో రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు. ఇలాంటి చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో పది లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఖరీదైన ఈ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసినట్లు డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. -
ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత
‘ఖుషి’, ‘7/జి బందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’...చిత్రాలతో పాటు పలు తెలుగు, తమిళ చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన కోలా భాస్కర్ (55) బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంత కాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారాయన. భాస్కర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ సతీమణి గీతాంజలి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘నన్ను వదలి నీవు పోలేవులే’తో హీరోగా పరిచయమయ్యారు భాస్కర్ కుమారుడు కోలా బాలకృష్ణ. ఈ చిత్రాన్ని కోలా భాస్కర్ నిర్మించారు. కాగా కోలా భాస్కర్ మృతి పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
నైట్ డ్యూటీలు చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం !
చాలా మంది చిన్నపిల్లలు అలా టెన్త్ లేదా ఇంటర్ పూర్తి కాగానే పై చదవులకని పక్క ఊళ్లకు వెళ్లడం మామూలే. ఒక్కసారిగా దొరికిన ఆ స్వేచ్ఛతో సిగరెట్లకు అలవాటు కావడం కూడా చాలా సాధారణమే. అలాగే బాగా ఒత్తిడితో ఉండే ఉద్యోగాలూ, కాన్ఫరెన్సులు, మీటింగుల తర్వాత రిలాక్స్ కావడం కోసం పొగతాగడం చాలా మందిలో అలా మెల్లగా అలవాటవుతుంది. ఇలాంటి వ్యవహారాలు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు కాస్తంత ఎక్కువ. ఇలా మొదట సరదాగా, టైమ్‌పాస్ కోసం మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లతోపాటు బయటి తిండి ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ బయటి ఆహారం రుచికరంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం నూనెలు, ఉప్పుకారాలూ ఎక్కువగా వాడటంతోపాటు దేహానికి, ఆరోగ్యానికి హాని చేసే కొన్ని కృత్రిమరంగులు, రసాయనాలు వాడతారు. వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడటమూ జరుగుతుంది. ఇవన్నీ క్యాన్సర్‌కు కారణాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దురలవాట్లు, బయటితిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, వాతావరణ కాలుష్యం, నైట్‌డ్యూటీలు, రాత్రంతా నిద్ర లేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం... ఈ అన్నిరకాల కారణాలతో మహిళలతో పోలిస్తే పురుషులు మరింత ఎక్కువగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లు తప్పితే... మరే క్యాన్సర్లు తీసుకున్నా అవి మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ. ఇటీవల పురుషులు కూడా రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం పెరిగిపోయింది. ప్రపంచంవ్యాప్తంగా క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య పెరుగుతున్న ధోరణులను చూస్తే 2007 నుంచి 2030 నాటికి ఈ సంఖ్య ఇప్పటికంటే 45% ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్ పరీక్షలు ఎన్ని వచ్చినా క్యాన్సర్ రాకుండా నివారించగలగడం ఎవరి చేతుల్లోనూ లేదనేది సత్యం. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యయనాల ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య... అన్ని మరణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. సిగరెట్, బీడీలు, పాన్, గుట్కా, ఆల్కహాల్, పొగాకు నమలడం మొదలైనవి నోటి క్యాన్సర్‌కు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఏడాదీ దాదాపు 80,000 మంది వరకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఉప్పు, కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం ఇంకా దురలవాట్లు కూడా చాలా ఎక్కువగా ఉండటం పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తాయి. అందుకే భారతదేశంలోని పురుషులు ఈ క్యాన్సర్‌బారిన ఎక్కువగా పడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవ్వడం చాలా ఎక్కువగానే గమనిస్తున్నాం. అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వంటివి క్యాన్సర్‌కు ముఖ్య కారణాలవడటంతోపాటు కొన్ని వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఆస్బెస్టాస్, అల్యూమినియం ఉత్పాదన కంపెనీల్లో, ఆల్కహాలిక్ బెవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీలు, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లియిడ్స్, చెక్కపొడి, గామా రేడియేష్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తల, మెడ భాగాల్లో (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అస్సలు ఎండ తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి పనిచేయడంతోపాటు నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్ వంటి వాటికి పురుషులే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. ఇక వారు పనుల కోసం బయటికి వెళ్లినప్పుడు తేలిగ్గా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కుగా తీసుకుంటూ ఉంటారు. దాంతో ఊబకాయం, క్యాన్సర్ ముప్పులు పొంచి ఉంటాయి. యాభైఏళ్లు పైబడ్డాక కనిపించే ప్రోస్టేట్క్యాన్సర్ను తెలుసుకునేందుకు పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్) అనే రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే వీర్యంలో, మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్ర సంబంధమైన సమస్యల వంటి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించేసరికి అది ముదిరిపోయి పక్కన ఉండే ఎముకలకూ పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్ఏ పరీక్షలో యాంటిజన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీలైన డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్ఏ, డీఆర్ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మళ్లీ ఎంతకాలం తర్వాత చేయించుకుంటే మంచిది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే పీఎస్ఏ పరీక్షలో మార్పులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎతర పరీక్షలను ఎలాంటి లక్షణాలు కనిపించనప్పుడు చేయించుకోవాలి వంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. ఈ కింద లక్షణాలు కనిపిస్తే పురుషులు నిర్లక్ష్యం చేయడం తగదు. అవి... తగ్గని దగ్గు, దగ్గుతో పాటు రక్తం ఆకలి, బరువు తగ్గడం నొప్పితో పాటు జ్వరం, మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం మలవిసర్జనలో రక్తస్రావం ,తీవ్రమైన అజీర్తి, గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం నోటిలో మానని పుండ్లు, ఎముకల్లో నొప్పులు పై లక్షణాలు కనిపించినప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ అనో, పైల్స్ అనో, రోగనిరోధక శక్తి తగ్గిందనో, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తుందనో నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక వయసు పైబడ్డ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి మంచి జీవనశైలిపై అవగాహన పెంపొందించుకొని, ఆరోగ్యంగా జీవించడం చాలా ముఖ్యం. -
ఈ నగరానికి ఏమైంది..?
ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ సిగరెట్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పకుండా వచ్చే ప్రకటన. ప్రకటన చూడడమే తప్ప పొగరాయుళ్లలో ఎటువంటి చలనం కలగడం లేదు. కాల్చే సిగరెట్లో నికోటిన్ విషతుల్యమైన మత్తు పదార్ధం ఉంటుంది. సిగరెట్, బీడీ తాగే వారిలో ఈ విషం శరీరాన్ని పీల్చిపిప్పి చేస్తుంది. నేటి యువత ధూమపానాన్ని క్రేజీగా భావిస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటోంది. పొగతాగడం వ్యసనంగా మారితే ప్రాణాన్నే హరిస్తుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. నేడు నో స్మోకింగ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుపతి (అలిపిరి): పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. సిగరెట్ ప్యాకెట్‌పైనే ప్రాణాంతకం అంటూ రాసుంటుంది. అయినా పొగతాగేవారు వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం విషవాయువుల నడుమ హరిస్తున్నా.. పొగతాగే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నేటి యువత ధూమపానాన్ని క్రేజ్‌గా భావి స్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించినా చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఊపిరితిత్తులకు ముప్పు పొగ పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. హానికర కార్బ న్ డైయాక్సైడ్ ఇతరత్రా వాయువులు విడిపోతాయి. ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ పీల్చుకుని మిగిలిన వాయువులను బయటకు పంపుతుంది. పొగ తాగడం వల్ల శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్ వంటి విష పదార్థాలు గాలి గదిలో చేరి హిమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. దీంతో హిమోగ్లోబిన్‌కు ఆక్సిజన్ మోసుకుపోయే సామర్ధ్యం తగ్గి కార్బన్ మోనాక్సైడ్‌తో కణాలు విషపూరితమవుతాయి. ఫలితంగా పలు వ్యాధులు సోకుతాయి. పీల్చేవారికీ ప్రమాదమే పొగ తాగేవారి కంటే పీల్చే వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగతాగేవారిని యాక్టివ్ స్మోకర్గా, పీల్చేవారిని పాసివ్ స్మోకర్గా పిలుస్తారు. పొగ తాగేవారితో పాటు పీల్చేవారు కూడా పలు రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పొగ పీల్చడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. ఎక్కువ పీల్చడం వల్ల అబార్షన్లు జరగడం, ఒక వేళ పిండం ఎదిగినా చివర్లో మృత శిశువులు జన్మించడం వంటి సమస్యలు మహిళలను వేధించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2.5 కోట్ల మంది పొగతాగే వారున్నట్లు అంచనా. ఒక సిగరెట్ తాగితే 43 రకాల విష వాయువులు వెలువడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వారు మానేస్తే, 20 ఏళ్ల తరువాత లంగ్స్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గొంతు క్యాన్సర్ పొగ తాగేవారిలో నోటి, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. గొంతులో ఉండే ప్రతి అవయవమూ పొగబారినపడి క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం వుంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెల్లే బ్రాంకియా.. ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని అవయవాలన్నింటికీ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. పొగతాగే వారిలో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ. నష్టం ఎంతంటే.. ♦ ఒక సిగరెట్ తాగితే 43 రకాల విషవాయువులు వెలువడుతాయి. ఎంఫసియా,క్రానిక్ అబ్స్ట్రిక్టవ్ పల్మ్నరీ డిసీజ్ లాంటి ప్రమాదకర మైన వ్యాధులు సోకుతాయి. ♦ బ్రెయిన్ స్ట్రోక్‌కు అవకాశం ఎక్కువ. ♦ దుర్వాసనతో నోరు,పెదాలు, నాలుక క్యాన్సర్లు వస్తాయి. ♦ ముఖంపై మచ్చలు ఏర్పడుతాయి. ♦ పళ్లు రంగు మారుతాయి. ♦ కనుగుడ్డు మీదా ప్రభావం ఉంటుంది. ♦ ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తుంది. ♦ గుండెపోటుకు అవకాశం ఎక్కువ. ♦ రక్త ప్రసరణ ప్రక్రియ మందగిస్తుంది. ♦ కడుపులో ప్రమాదకర యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి. ♦ మూత్రాశయం..మూత్రపిండాలు దెబ్బతింటాయి. ♦ శరీరంలో అన్ని భాగాలు దెబ్బతింటాయి. ♦ పొగపీల్చే మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అమలుకు నోచుకోని చట్టాలు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై చట్టాలు ఉన్నా అవి పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. బహిరంగంగా పొగ తాగుతూ అధికారులకు పట్టుబడితే తొలిసారి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా.. రెండో సారి పట్టుబడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా.. ఒక్కో సందర్భంలో రెండు శిక్షలు అమలు చేయవచ్చు. ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ 2014లో చట్టంలో నిబంధనలు మార్చాలని భావించి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం ధూమపాన సేవనానికి ఉన్న వయోపరిమితిని 18 నుంచి 25 ఏళ్లుగా చేసింది. నిబంధన అమలుకు నోచుకోలేదు. 2003లో పొగాకు నిషేధ చట్టం ప్రకారం విశ్వ విద్యాలయాల్లో వంద గజాల దూరంలో ఎలాంటి పొగాకు విక్రయ కేంద్రాలు ఉండకూడదు. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం ఒక సిగరెట్ తాగితే ఏమౌతుందులో అనే అలోచను విడనాడాలి. పొగ, గుట్కాలు వంటివి తీసుకోవడం వల్ల శరీరం అనేక వ్యాధుల బారినపడుతుంది. దీంతో శరీరాన్ని విష వాయువు పీల్చిపిప్పి చేసే ప్రమాదం ఉంది. యువత స్టైల్ కోసం స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. కొన్ని రోజుల పాటు అలవాటుపడి వారు చాల ఏళ్లు పాటు ఇబ్బందులు పడితేగాని మానలేకపోతున్నారు. స్మోకింగ్‌కు దూరంగా వుండడం ఉత్తమం. – డాక్టర్ ఎస్.సుబ్బారావు, అసోసియేట్ ప్రొఫెసర్, పల్మొనరీ మెడిసిన్, రుయా ఆస్పత్రి సున్నిత పొరలకు ప్రమాదం ధూమపానంతో కళ్లు, ముక్కు, గొంతులో సున్నిత పొరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. గుండె పోటు వచ్చే శాతం అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పొగతాగడానికి యువత దూరంగా వుండాలి. – డాక్టర్ సూర్యప్రకాష్, సీనియర్ పాల్మనాలజిస్ట్, తిరుపతి -
బాగానే ఉన్నాను
గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న దర్శక–నిర్మాత రాకేశ్ రోషన్ మంగళవారం దానికి సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ సక్రమంగానే జరిగినట్టు రాకేశ్ రోషన్ టీమ్ పేర్కొంది. ‘‘ఆపరేషన్ బాగా జరిగింది. ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగానే ఉంది. దేవుడున్నాడు. శుక్రవారం లేదా శనివారం ఇంటికి కూడా వెళ్లిపోతాను’’ అని రాకేశ్ పేర్కొన్నారు. -
మాట రాని మౌన వేదన
ఆళ్లగడ్డ: ఇతడి పేరు షేక్ షఫీ. పాతమసీదు వీధిలో నివాసం ఉంటున్నాడు. అందరిలాగే అతడి జీవితంగా ఆనందంగా గడిచేది. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే రెండేళ్ల కిత్రం గొంతుకు క్యాన్సర్ సోకడంతో అతడి జీవితంలో పెనుమార్పులు వచ్చాయి. మాట్లాడటానికి మాటలు రావు. తినడానికి గొంతు సహకరించడం లేదు. దీంతో తన బాధను పేపర్‌పై రాసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పగవాడికి ఈ కష్టం వద్దు అంటూ అతడు తన బాధను వెళ్లబోసుకుంటున్నాడు. రెండేళ్లుగా నరకయాతన రెండేళ్ల క్రితం షఫీ గొంతుకు క్యాన్సర్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికే దాదాపు రూ.2.5 లక్షల దాకా ఖర్చు చేశాడు. వ్యాధి తీవ్రతకు మాటలు పడిపోయాయి. అలాగే తినేందుకు గొంతు సహకరించకపోవడంతో డాక్టర్లు ప్రత్యేక పైపు ద్వారా ఆహారం తీసుకునేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కర్నూలులోని ఓమెగా వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇంటికి వచ్చాడు. మందులకు నెలకు రూ.25వేలు, కీమోథెరఫీకి నెలకు రూ.5 వేల వరకు ఖర్చు అవుతోంది. రెక్కాడితే డొక్కాడని ఈ కుటుంబానికి వైద్య ఖర్చులు భారమయ్యాయి. ప్రస్తుతం షఫీ తల్లి కూలీనాలీ చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. సాయం చేయండయ్యా.. నేను కూలీపని చేసుకుని జీవనం సాగిస్తుండేవాడిని. రెండేళ్లక్రితం నాకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఎన్ని వైద్యశాలలు తిరిగినా ఫలితం లేదు. ప్రస్తుతం మందులు వాడుతున్నా. దాతలు సాయం చేస్తే తప్ప నాప్రాణాలు నిలబడవు. ఇంటి వద్ద వసతి సరిగ్గా లేకపోవడంతో శిరివెళ్ల మండలం యర్రగుంట్లలోని అత్తమామల ఇంట్లో ఉంటున్నా. – షఫీ అంధురాలితో ప్రేమపెళ్లి.. షఫీ జీవితంలో అందరిలాగే సరదాగా గడిచేది. కూలి పనులు చేసుకునే అతడికి ఫోన్లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అమెకున్న వినికిడి లోపం, అంధత్వం ప్రేమ ముందు నిలవలేకపోయాయి. అతడి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. అలా ఎనిమిదేళ్ల క్రితం వారికి పెళ్లయింది. వారికి తీపి గుర్తులుగా సమీర్, అష్రఫ్, ఆయూస్ అనే ముగ్గురు పిల్లలు కలిగారు. ఇలా వారి సంసారం హాయిగా సాగిపోయేది. ఈ తరుణంలో క్యాన్సర్ మహమ్మారి వారి జీవితాలను కష్టాల్లోకి నెట్టింది. పేరు : షేక్ కపిజా (షఫీ తల్లి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆళ్లగడ్డ : IFSC Code : SBIN0014171 A/ C : 86736956084 PH : 7259957001 -
100కే స్వరపేటిక పరికరం
సాక్షి, బెంగళూరు: ‘గొంతు క్యాన్సర్’ బాధితులకు కృత్రిమ స్వర పేటికను సులభంగా అమర్చే నూతన పరికరాన్ని (ఇన్సర్టర్) బెంగళూరుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ యూఎస్ విశాల్‌రావ్ రూపొందించారు. దీన్ని రూ. 100కే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రావి చెట్టు చెక్కను పరికరం తయారీలో వాడారు. ఈ ఇన్సర్టర్కు ‘శుశృత’ అని పేరుపెట్టారు. దీని ద్వారా కృత్రిమ స్వరపేటికను ఇద్దరు రోగులకు విజయవంతంగా అమర్చినట్లు విశాల్ వెల్లడించారు. తాను రూపొందించిన ఇన్సర్టర్తో ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా 5 నిమిషాల్లోనే గొంతులో అమర్చవచ్చని డాక్టర్ విశాల్ చెప్పారు. శుశృత పని చేస్తుందిలా.. శుశృత (ఇన్సర్టర్) రావి చెట్టు చెక్కతో తయారవుతుంది. ఇందులో ‘సిలిండర్, పిస్టన్, పాలిథీన్ ట్యూబ్’ అనే మూడు భాగాలు ఉంటాయి. ఇందులో సిలెండర్లో పాలిథీన్ ట్యూబ్‌ను ఉంచి అందులో కృత్రిమ స్వరపేటికను ఉంచుతారు. తర్వాత గొంతు వద్ద చిన్న రంధ్రం చేసి సిలిండర్‌ను ఉంచి పిస్టన్ను నొక్కి రోగి గొంతులో స్వరపేటికను అమర్చుతారు. -
చిన్నారికి పెద్ద కష్టం
భీమడోలు : ముద్దు ముద్దు మాటలు, అల్లరితో మురిపించాల్సిన చిన్నారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆ బిడ్డ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. గొంతు వద్ద ఏర్పడిన గడ్డ కేన్సర్‌గా మారడంతో కన్నబిడ్డను బతికించుకునేందుకు రెక్కాడితే గాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు దాతల సహాయాన్ని కోరుతున్నారు. గుండుగొలను గ్రామ శివారు దళిత గ్రామమైన భోగాపురానికి చెందిన పెండెం ఏసుపాదం, రాణిలకు 11 నెలల క్రితం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పాప జన్మించగా మధులత అని పేరు పెట్టుకున్నారు. ఏసుపాదం వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పుట్టిన సమయంలో పాప గొంతుక కింద చిన్న గడ్డ ఉండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా ఆ గడ్డ పెద్దదైతే శస్త్ర చికిత్స చేసి తొలగిస్తామని చెప్పారు. ఆ పాప పెరుగుతూ ఉన్న కొద్దీ గొంతు కింద వేసిన గడ్డ కూడా పెరుగుతూ వచ్చింది. పాప 9 నెలల వయసుకు వచ్చిన తర్వాత పాలు మింగుడుపడడం లేదు. దీంతో వారు గుండుగొలను పీహెచ్సీ వైద్యాధికారిణికి చూపిం చారు. పిల్లల వైద్యుడిని సంప్రదించాలని సూచించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మధులతను పరీక్షించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. పాపను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు చేసి దానిని కేన్సర్ గడ్డగా నిర్ధారించారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్డు ఉంటే పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తామని చెప్పారు. అప్పటికప్పుడు ఏసుపాదం భీమడోలు తహసీల్దార్ పీబీపీఎల్ పద్మావతిని కలిసి బిడ్డ పరిస్థితిని చెప్పడంతో ఆమె వెంటనే ధ్రువీకరణ పత్రం అందించారు. అనంతరం వైద్యులు పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి కేన్సర్ ప్రాథమిక స్థాయిలో ఉందని వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉందని చెప్పారు. అయితే వివిధ వైద్య పరీక్షలు బయటి ల్యాబ్‌లలోనే చేయించుకోవాలని, ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవలో చేసినా ఇతర ఖర్చులు రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుందని, సిద్ధం చేసుకోవాలని వైద్యులు చెప్పడంతో ఏసుపాదం దంపతులు తల్లడిల్లుతున్నారు. కూలి పనులు చేసుకుని పేదరికంలో జీవి స్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉండడం, ఆహారం తినలేకపోవడంతో రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పాపను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి వైద్యానికి దాతలు ఆర్థిక సహాయం చేసి సహకరించాలని వేడుకుంటున్నారు. దాతలు 9160484024 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నెం 014810100087264కు తమ సహాయాన్ని పంపించవచ్చు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
పార్వతీపురం : అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కొమరాడ మండలం వన్నం గ్రామానికి చెందిన పల్ల రవి (24) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి నోటి క్యాన్సర్ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. దాంతో ఈ రోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్‌పై మృతదేహన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పాక్ జానపద గాయనీ రేష్మా మృతి
పాకిస్థానీ ప్రముఖ జానపద గాయనీ రేష్మా ఈ రోజు తెల్లవారుజామున ఉదయం లాహోర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె గత కొద్ది కాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేష్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతు నెలరోజులు క్రితం కోమాలో వెళ్లారని జియో టీవీ ఆదివారం వెళ్లడించింది. భారతదేశంలోని బికనీర్‌లోని బంజారా కుటుంబంలో రేష్మా జన్మించారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యానంతరం రేష్మా కుటుంబం పాక్ వలస వెళ్లి, కరాచీ నగరంలో స్థిరపడింది. జానపద గాయనీగా రేష్మా పాకిస్థానీయుల మనసులను చోరగున్నారు. -
‘చల్లని రాజా’ ఇక లేరు
భువనేశ్వర్: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు తనయులు. గత కొద్దినెలలుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రఘునాథ్ భువనేశ్వర్‌లోని తన నివాసం వద్ద చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 1934, ఆగస్టు 10న ఒడిశాలోలోని కోరాపుట్ జిల్లా గుణుపూర్‌లో జన్మించిన రఘునాథ్ చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతంలో రాణించారు. గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడి అభిమానులను అలరించారు. ‘ఇలవేల్పు’ చిత్రంలో తన 19వ ఏటనే రఘునాథ్ పాటలు పాడటం విశేషం. ఆ సినిమాలో ఆయన పాడిన ‘చల్లని రాజా.. ఓ చందమామ..’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది. శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ సంస్కృత కవి జయదేవుడు రాసిన ‘గీత గోవిందం’ గీతాల ద్వారా అశేష భక్తజనవాహినిని తన గానామృతంలో ఓలలాడించారు. ఈ గీతాలు ఒడిస్సీ సంగీత చరిత్రకే తలమానిక ంగా నిలిచాయి. దేశవిదేశాల్లో రఘునాథ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘గీతా గోవింద్’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఈ సత్కారం పొందిన తొలి ఒడిశా గాయకుడు రఘునాథ్ కావడం గమనార్హం. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. రఘునాథ్ భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్యకళాకారిణి సంజుక్త పాణిగ్రాహి. ఆమె 1997, ఆగస్టు 24న మరణించారు. శనివారం ఆమె వర్ధంతి. ఆ మరుసటి రోజే రఘునాథ్ మరణించడం విషాదం. మృదు స్వభావి, జంతు ప్రేమికుడైన రఘునాథ్.. తాను నివసిస్తున్న అశోక్‌నగర్‌లో వీధి కుక్కలను ఆదరించేవారు. శునకాలు జబ్బు పడినా గాయమైనా వాటిని ఆయన ప్రేమగా దగ్గరికి తీసుకుని సంరక్షించేవారు. రఘునాథ్ మృతి పట్ల ఒడిశా గవర్నర్ ఎస్సీ జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు.