‘చల్లని రాజా’ ఇక లేరు
భువనేశ్వర్: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు తనయులు. గత కొద్దినెలలుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రఘునాథ్ భువనేశ్వర్‌లోని తన నివాసం వద్ద చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 1934, ఆగస్టు 10న ఒడిశాలోలోని కోరాపుట్ జిల్లా గుణుపూర్‌లో జన్మించిన రఘునాథ్ చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతంలో రాణించారు. గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడి అభిమానులను అలరించారు. ‘ఇలవేల్పు’ చిత్రంలో తన 19వ ఏటనే రఘునాథ్ పాటలు పాడటం విశేషం. ఆ సినిమాలో ఆయన పాడిన ‘చల్లని రాజా.. ఓ చందమామ..’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది.
శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ సంస్కృత కవి జయదేవుడు రాసిన ‘గీత గోవిందం’ గీతాల ద్వారా అశేష భక్తజనవాహినిని తన గానామృతంలో ఓలలాడించారు. ఈ గీతాలు ఒడిస్సీ సంగీత చరిత్రకే తలమానిక ంగా నిలిచాయి. దేశవిదేశాల్లో రఘునాథ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘గీతా గోవింద్’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఈ సత్కారం పొందిన తొలి ఒడిశా గాయకుడు రఘునాథ్ కావడం గమనార్హం. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. రఘునాథ్ భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్యకళాకారిణి సంజుక్త పాణిగ్రాహి. ఆమె 1997, ఆగస్టు 24న మరణించారు. శనివారం ఆమె వర్ధంతి. ఆ మరుసటి రోజే రఘునాథ్ మరణించడం విషాదం. మృదు స్వభావి, జంతు ప్రేమికుడైన రఘునాథ్.. తాను నివసిస్తున్న అశోక్‌నగర్‌లో వీధి కుక్కలను ఆదరించేవారు. శునకాలు జబ్బు పడినా గాయమైనా వాటిని ఆయన ప్రేమగా దగ్గరికి తీసుకుని సంరక్షించేవారు. రఘునాథ్ మృతి పట్ల ఒడిశా గవర్నర్ ఎస్‌సీ జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు.