గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతం | Classical singer Garimella Balakrishna Prasad | Sakshi
Sakshi News home page

గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతం

Published Wed, Mar 12 2025 3:16 AM | Last Updated on Wed, Mar 12 2025 3:16 AM

Classical singer Garimella Balakrishna Prasad

ఆచార్య తాడేపల్లి పతంజలి
కొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.

అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.

ఒక గొప్ప రహస్యం
ఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.

సంగీత ప్రస్థానం
శ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్‌. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్‌లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్‌ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.

కొత్త పద్ధతి
సాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్‌ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్‌ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.

నేదునూరి నోట – అన్నమయ్య మాట
అప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్‌ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్‌. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్‌ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్‌ అందించిన సేవలు సాటిలేనివి. 

పురస్కారాలు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్‌డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.

శివపదం కూడా...
గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‌  మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్‌ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.

అన్నమయ్య స్వరసేవ
‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్‌ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’

చిరస్మరణీయం
తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.

అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.

ప్రసూన బాలాంత్రపు
మంద్రస్థాయిలోని మధుర స్వరం  భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్‌ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్‌. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది. 

1948 నవంబర్‌ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట  రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్‌ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.

ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్‌ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు.  

నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్‌ స్కాలర్షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది  కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.

అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్‌ గారికి స్ఫూర్తి. ఇక  అన్నమయ్య పాట  పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్‌ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్‌  గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి. 

అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్‌ సంగీత ప్రస్థానం  150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్‌ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట  పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు. 

400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్‌ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్‌ అటువంటి మహనీయుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement