Classical singer
-
మహామహుల చేత శభాష్ అనిపించుకుంటున్నమాళవిక..
బర్కత్‌పురకు చెందిన మాళవిక చిన్నప్పటి నుంచే పాటలంటే ప్రాణంగా పెరిగింది. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే శాస్త్రీయ సంగీతాన్ని ఊపిరిగా మార్చుకుంది. ప్రసిద్ధ గాయని ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మీని స్ఫూర్తిగా తీసుకుని తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు ఇచ్చి.. తన ప్రతిభను ప్రపంచానికి చాటింది. ఇప్పటికే పలు భాషల్లో ఎన్నో పాటలు పాడి శాస్త్రీయ సంగీతంపై తనదైన ముద్ర వేసింది. మహనీయుల చేతుల మీదుగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. మహామహుల చేత శభాష్ అనిపించుకుంటున్న కళామతల్లి ముద్దుబిడ్డ మాళవికపై ప్రత్యేక కథనం.. – కాచిగూడ బాల్యం నుంచే ఆసక్తి.. ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు టీవీల్లో వచ్చే పాటలు విని అనుకరించేది. సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు సుచిత, వివేకానంద్ చిన్నారి మాళవికకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. రేవతి రత్నస్వామి వద్ద ఆ తర్వాత లలిత, హరిప్రియ (హైదరాబాద్ సిస్టర్స్) వద్ద మాళవిక శిక్షణ తీసుకుంది. 2009లో మాళవిక ‘శ్రీహరి సంకీర్తనలు’ పేరిట సీడీని రూపొందించింది. ఇందులో 17 పాటలు పాడింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీలోనూ పాడుతూ ఆయా భాషల వారీగా ఆదరాభీమానాలు పొందింది. 2010లో ‘దశరథరామా గోవిందా’³రిట మరో సీడీని విడుదల చేసింది. ఆ తర్వాత పది పాటలతో శ్రీరామదాసు కీర్తనలతో ఓ అల్బమ్ చేశారు. కీరవాణి సంగీతంలో ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’లో మూడు పాటలు పాడింది. భారతి ఓ భారతి నవ భారతీ.. అడుగడుగున అవమానాలే నీకు హారతీ.. పేరుతో వీడియో అల్బమ్ చేసింది. ప్రస్తుతం ఐబీఎస్ హైదరాబాద్‌లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం రేవా టర్మరిక్ డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 200లకు పైగా కచేరీలు.. మొదటి కచేరీ హిమాయత్‌నగర్ టీటీడీ దేవస్థానంలో చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 200లకు పైగా సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో శాస్త్రీయ సంగీత కచేరీ చేసే అవకాశం దక్కించుకుంది. 2014లో మైసూర్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరిగే దసరా వేడుకల్లో భక్తి గీతాలను ఆలపించి అందరిచేత మెప్పుపొందింది. 2019లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాటలు పాడింది. ఆల్ ఇండియా రేడియో, తిరుమల బ్రహ్మోత్సవాలు, భద్రాచలంలో శ్రీరాములవారి సన్నిధిలో, బాసర, వేములవాడ ఇలా ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాల్లో భక్తీగీతాలు పాడే అవకాశం దక్కడం దేవుడు ఇచి్చన గొప్పవరంగా భావిస్తున్నట్లు మాళవిక తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో ప్రార్థనాగీతం ఆలపిస్తూ.. అవార్డులు, ప్రశంసలు.. యూనిక్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్‌లలో స్థానం దక్కించుకుంది. యువగాన కోకిల, బాలరత్న, కాపు యువరత్న బిరుదులు, పలు సెలబ్రిటీ అవార్డులు అందుకుంది. బెంగళూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ విద్వాంసులైన బాలమురళీకృష్ణ, బిస్మిల్లాఖాన్, పండిత్ భీమ్సేన్ జోషీ, సుధా రఘునాథ్‌ల సమక్షంలో తన సుస్వారాలను వినిపించి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, చిన్నజీయర్ స్వామి తదితర ప్రముఖుల చేతుల మీదుగా సత్కారాలు అందుకుంది. సుబ్బలక్ష్మీలా పేరు సాధించాలి శాస్త్రీయ సంగీతం మనకున్న అతిపెద్ద సంపద. నేటి తరం మరిచి పోతున్న శాస్త్రీయ సంగీతాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. శాస్త్రీయ సంగీతంలో ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మీలా మంచి స్థాయికి వెళ్లాలని నా కోరిక. వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటా. సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుని ప్రముఖ గాయనీమణుల జాబితాలో నేను కూడా ఉండాలన్నది నా కోరిక. – మాళవిక, క్లాసికల్ సింగర్ -
అల్లరి పిల్లని..
చలాకీతనానికి మారు పేరు అశ్విని శర్మ. టీవీ యాంకర్‌గా పరిచయమై.. సినిమాల్లోనూ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ అమ్మాయి క్లాసికల్ సింగర్ కూడా. ఎంత రెబల్‌గా కనిపిస్తుందో అంతే సెన్సిటివ్ గాళ్ అయిన అశ్విని... క్రిటిక్సే తనవెల్ విషర్స్ అంటోంది. నేను అండమాన్‌లో పుట్టాను. డాడీ ఆర్మీ ఆఫీసర్. అమ్మ హౌస్‌వైఫ్. అక్కకు పెళ్లైపోయింది. ఒక పాప కూడా. నేను ఫిఫ్త్ క్లాసులో ఉన్నప్పుడే మా ఫ్యామిలీ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యింది. నాకు ఊహ తెలిసిందిక్కడే. అప్పటి నుంచి మేం ఉంటున్నది సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోనే. ప్లస్‌టూ వరకు కేంద్రీయ విద్యాలయలో చదివాను. నిఫ్ట్, హామ్స్టెక్లో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను. చిన్నప్పటి నుంచి నేను బాగా అల్లరి. అనర్గళంగా మాట్లాడేదాన్ని. అదే నన్ను యాంకరింగ్ వైపు వచ్చేలా చేసింది. లిట్రల్లీ నేను టామ్‌బాయ్‌ని. ఆడుకునేటప్పుడు అబ్బాయిలను చితక్కొట్టేదాన్ని. స్కూల్‌కు డుమ్మా కొట్టి, ఫ్రెండ్స్‌తో కూడా మాన్పించి ఇంటి డాబాపైకి చేరి... టిఫిన్‌బాక్సులు తింటూ ఎంజాయ్ చేసేవాళ్లం. ఆ తరువాత అమ్మతో దెబ్బలు తప్పేవి కాదనుకోండి! బై గాడ్స్ గ్రేస్... నేను స్టడీస్‌లోనూ ముందుండేదాన్ని. హైపర్ యాక్టివ్ కావడంతో.. అన్ని ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేసేదాన్ని. రెండుసార్లు గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. రీసెంట్గా 108 నిమిషాల్లో నవగ్రహ కీర్తనలు పూర్తి చేశాను. టైం దొరికినప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. మా తాతవాళ్లు... శ్రీపాద ఫ్యామిలీ. అలా బ్లడ్‌లోనే మ్యూజిక్ ఉంది. అందుకే సింగింగ్ నాకు అబ్బింది. ప్రస్తుతం వీణలో డిగ్రీ చేస్తున్నా. ఇంట్లో ఉన్నప్పుడు వీణ వాయిస్తూ టైంపాస్ చేస్తాను. ఫ్రెండ్స్‌తో ఉంటే మాత్రం షాపింగ్‌కి ఫ్రీకవుట్ అవుతాను. ఎప్పుడూ డల్‌గా ఉండను. నాకు ఆరోగ్యం బాగాలేదని నేను చెబితే తప్ప... ఎవరూ గుర్తు పట్టలేరు. అంత యాక్టివ్ అన్నమాట. థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ... ఎక్కడ ఫంక్షన్‌కు వెళ్లినా బడబడా ఏదో ఒకటి వాగుతూ ఉంటాను. అలా ఓసారి ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు చలాకీగా ఉన్న నన్ను చూసి జెమిని కిరణ్‌గారు, రాఘవేందర్రావుగారు ‘ఈ అమ్మాయి చాలా యాక్టివ్‌గా ఉందే’ అని బుల్లితెరవైపు తీసుకొచ్చారు. మొదటిసారిగా జెమినిలో ‘నీ కోసం’ ప్రోగ్రాంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. అది మొదలు.. అన్ని ఛానల్స్‌లో రకరకాల ప్రోగ్రామ్స్ చేశాను. ‘అభిమాని’, ‘ైధె ర్యం’, ‘ఛత్రపతి’, ‘పల్లకిలో పెళ్లికూతురు’,‘కొడుకు’.. ఇలా చాలా సినిమాల్లో చేస్తూ వచ్చాను. పదమూడేళ్లనుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. ఈ ప్రయాణంలో మా అమ్మ సపోర్ట్ చాలా ఉంది. సినిమాల్లోకి రాకుండా ఉంటే... ఏ ఎయిర్ హోస్టెసో, ఫ్యాషన్ డిజైనరో అయి ఉండేదాన్ని. నేను ఖురాన్ చదువుతాను. చర్చికి, గుడికీ వెళ్తాను. అన్ని మతాలనూ గౌరవిస్తాను. అది మా నాన్న నుంచి నేర్చుకున్నది. నాకు ఎక్కువగా జనాలతో ఉండటం ఇష్టం. వర్క్‌హాలిక్‌ని. విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకుంటాను. నా క్రిటిక్సే నా వెల్ విషర్స్ అనుకుంటాను. ఐయామ్ వెరీ థాంక్ఫుల్ టు దెమ్. ‘షా గౌస్’ చాయ్... చిన్నప్పుడు నేను, మా అక్క, మా కజిన్స్ తెల్లవారుజామునే లేచి సికింద్రాబాద్ ‘బ్లూ సీ’ హోటల్లో చాయ్ తాగేవాళ్లం. ఇప్పుడు ప్యారడైజ్‌కి వెళ్లి మరీ వెజ్ తినేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది నేనే అనుకోవచ్చు. ఇంకా టోలిచౌకిలో ‘షా గౌస్’ కేఫ్‌లో ఇరానీ చాయ్ అంటే ఇష్టం. ఇప్పటికీ వీలుచేసుకుని మరీ.. అప్పుడప్పుడు వెళ్లి తాగుతుంటాను. ఇమ్లిబన్ దగ్గర ఉన్న గోశాలలో మూడు గోవులను అడాప్ట్ చేసుకున్నా. వాటి ఫీడింగ్, మెయింటెనెన్స్ చూసుకుంటాను. పూజలు చేయడానికీ టైమ్ స్పెండ్ చేస్తాను. శిరీష చల్లపల్లి -
‘చల్లని రాజా’ ఇక లేరు
భువనేశ్వర్: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు తనయులు. గత కొద్దినెలలుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రఘునాథ్ భువనేశ్వర్‌లోని తన నివాసం వద్ద చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 1934, ఆగస్టు 10న ఒడిశాలోలోని కోరాపుట్ జిల్లా గుణుపూర్‌లో జన్మించిన రఘునాథ్ చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతంలో రాణించారు. గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడి అభిమానులను అలరించారు. ‘ఇలవేల్పు’ చిత్రంలో తన 19వ ఏటనే రఘునాథ్ పాటలు పాడటం విశేషం. ఆ సినిమాలో ఆయన పాడిన ‘చల్లని రాజా.. ఓ చందమామ..’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది. శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ సంస్కృత కవి జయదేవుడు రాసిన ‘గీత గోవిందం’ గీతాల ద్వారా అశేష భక్తజనవాహినిని తన గానామృతంలో ఓలలాడించారు. ఈ గీతాలు ఒడిస్సీ సంగీత చరిత్రకే తలమానిక ంగా నిలిచాయి. దేశవిదేశాల్లో రఘునాథ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘గీతా గోవింద్’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఈ సత్కారం పొందిన తొలి ఒడిశా గాయకుడు రఘునాథ్ కావడం గమనార్హం. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. రఘునాథ్ భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్యకళాకారిణి సంజుక్త పాణిగ్రాహి. ఆమె 1997, ఆగస్టు 24న మరణించారు. శనివారం ఆమె వర్ధంతి. ఆ మరుసటి రోజే రఘునాథ్ మరణించడం విషాదం. మృదు స్వభావి, జంతు ప్రేమికుడైన రఘునాథ్.. తాను నివసిస్తున్న అశోక్‌నగర్‌లో వీధి కుక్కలను ఆదరించేవారు. శునకాలు జబ్బు పడినా గాయమైనా వాటిని ఆయన ప్రేమగా దగ్గరికి తీసుకుని సంరక్షించేవారు. రఘునాథ్ మృతి పట్ల ఒడిశా గవర్నర్ ఎస్సీ జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు.