శాస్త్రీయ సంగీతంలో రాణిస్తున్న యువగాయని మాళవిక
బర్కత్‌పురకు చెందిన మాళవిక చిన్నప్పటి నుంచే పాటలంటే ప్రాణంగా పెరిగింది. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే శాస్త్రీయ సంగీతాన్ని ఊపిరిగా మార్చుకుంది. ప్రసిద్ధ గాయని ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మీని స్ఫూర్తిగా తీసుకుని తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు ఇచ్చి.. తన ప్రతిభను ప్రపంచానికి చాటింది. ఇప్పటికే పలు భాషల్లో ఎన్నో పాటలు పాడి శాస్త్రీయ సంగీతంపై తనదైన ముద్ర వేసింది. మహనీయుల చేతుల మీదుగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. మహామహుల చేత శభాష్ అనిపించుకుంటున్న కళామతల్లి ముద్దుబిడ్డ మాళవికపై ప్రత్యేక కథనం..
– కాచిగూడ
బాల్యం నుంచే ఆసక్తి..
ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు టీవీల్లో వచ్చే పాటలు విని అనుకరించేది. సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు సుచిత, వివేకానంద్ చిన్నారి మాళవికకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. రేవతి రత్నస్వామి వద్ద ఆ తర్వాత లలిత, హరిప్రియ (హైదరాబాద్ సిస్టర్స్) వద్ద మాళవిక శిక్షణ తీసుకుంది. 2009లో మాళవిక ‘శ్రీహరి సంకీర్తనలు’ పేరిట సీడీని రూపొందించింది. ఇందులో 17 పాటలు పాడింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీలోనూ పాడుతూ ఆయా భాషల వారీగా ఆదరాభీమానాలు పొందింది. 2010లో ‘దశరథరామా గోవిందా’³రిట మరో సీడీని విడుదల చేసింది. ఆ తర్వాత పది పాటలతో శ్రీరామదాసు కీర్తనలతో ఓ అల్బమ్ చేశారు. కీరవాణి సంగీతంలో ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’లో మూడు పాటలు పాడింది. భారతి ఓ భారతి నవ భారతీ.. అడుగడుగున అవమానాలే నీకు హారతీ.. పేరుతో వీడియో అల్బమ్ చేసింది. ప్రస్తుతం ఐబీఎస్ హైదరాబాద్‌లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం రేవా టర్మరిక్ డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
200లకు పైగా కచేరీలు..
మొదటి కచేరీ హిమాయత్‌నగర్ టీటీడీ దేవస్థానంలో చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 200లకు పైగా సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో శాస్త్రీయ సంగీత కచేరీ చేసే అవకాశం దక్కించుకుంది. 2014లో మైసూర్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరిగే దసరా వేడుకల్లో భక్తి గీతాలను ఆలపించి అందరిచేత మెప్పుపొందింది. 2019లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాటలు పాడింది. ఆల్ ఇండియా రేడియో, తిరుమల బ్రహ్మోత్సవాలు, భద్రాచలంలో శ్రీరాములవారి సన్నిధిలో, బాసర, వేములవాడ ఇలా ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాల్లో భక్తీగీతాలు పాడే అవకాశం దక్కడం దేవుడు ఇచి్చన గొప్పవరంగా భావిస్తున్నట్లు మాళవిక తెలిపారు.
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో ప్రార్థనాగీతం ఆలపిస్తూ..
అవార్డులు, ప్రశంసలు..
యూనిక్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్‌లలో స్థానం దక్కించుకుంది. యువగాన కోకిల, బాలరత్న, కాపు యువరత్న బిరుదులు, పలు సెలబ్రిటీ అవార్డులు అందుకుంది. బెంగళూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ విద్వాంసులైన బాలమురళీకృష్ణ, బిస్మిల్లాఖాన్, పండిత్ భీమ్‌సేన్ జోషీ, సుధా రఘునాథ్‌ల సమక్షంలో తన సుస్వారాలను వినిపించి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, చిన్నజీయర్ స్వామి తదితర ప్రముఖుల చేతుల మీదుగా సత్కారాలు అందుకుంది.
సుబ్బలక్ష్మీలా పేరు సాధించాలి
శాస్త్రీయ సంగీతం మనకున్న అతిపెద్ద సంపద. నేటి తరం మరిచి పోతున్న శాస్త్రీయ సంగీతాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. శాస్త్రీయ సంగీతంలో ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మీలా మంచి స్థాయికి వెళ్లాలని నా కోరిక. వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటా. సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుని ప్రముఖ గాయనీమణుల జాబితాలో నేను కూడా ఉండాలన్నది నా కోరిక.
– మాళవిక, క్లాసికల్ సింగర్
Comments
Please login to add a commentAdd a comment