అల్లరి పిల్లని..
చలాకీతనానికి మారు పేరు అశ్విని శర్మ. టీవీ యాంకర్‌గా పరిచయమై.. సినిమాల్లోనూ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ అమ్మాయి క్లాసికల్ సింగర్ కూడా. ఎంత రెబల్‌గా కనిపిస్తుందో అంతే సెన్సిటివ్ గాళ్ అయిన అశ్విని... క్రిటిక్సే తనవెల్ విషర్స్ అంటోంది.
నేను అండమాన్‌లో పుట్టాను. డాడీ ఆర్మీ ఆఫీసర్. అమ్మ హౌస్‌వైఫ్. అక్కకు పెళ్లైపోయింది. ఒక పాప కూడా. నేను ఫిఫ్త్ క్లాసులో ఉన్నప్పుడే మా ఫ్యామిలీ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యింది. నాకు ఊహ తెలిసిందిక్కడే. అప్పటి నుంచి మేం ఉంటున్నది సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోనే. ప్లస్‌టూ వరకు కేంద్రీయ విద్యాలయలో చదివాను. నిఫ్ట్, హామ్స్‌టెక్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను. చిన్నప్పటి నుంచి నేను బాగా అల్లరి. అనర్గళంగా మాట్లాడేదాన్ని. అదే నన్ను యాంకరింగ్ వైపు వచ్చేలా చేసింది. లిట్రల్లీ నేను టామ్‌బాయ్‌ని. ఆడుకునేటప్పుడు అబ్బాయిలను చితక్కొట్టేదాన్ని. స్కూల్‌కు డుమ్మా కొట్టి, ఫ్రెండ్స్‌తో కూడా మాన్పించి ఇంటి డాబాపైకి చేరి... టిఫిన్‌బాక్సులు తింటూ ఎంజాయ్ చేసేవాళ్లం. ఆ తరువాత అమ్మతో దెబ్బలు తప్పేవి
కాదనుకోండి!
బై గాడ్స్ గ్రేస్...
నేను స్టడీస్‌లోనూ ముందుండేదాన్ని. హైపర్ యాక్టివ్ కావడంతో.. అన్ని ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేసేదాన్ని. రెండుసార్లు గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. రీసెంట్‌గా 108 నిమిషాల్లో నవగ్రహ కీర్తనలు పూర్తి చేశాను. టైం దొరికినప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. మా తాతవాళ్లు... శ్రీపాద ఫ్యామిలీ. అలా బ్లడ్‌లోనే మ్యూజిక్ ఉంది. అందుకే సింగింగ్ నాకు అబ్బింది. ప్రస్తుతం వీణలో డిగ్రీ చేస్తున్నా. ఇంట్లో ఉన్నప్పుడు వీణ వాయిస్తూ టైంపాస్ చేస్తాను. ఫ్రెండ్స్‌తో ఉంటే మాత్రం షాపింగ్‌కి ఫ్రీకవుట్ అవుతాను. ఎప్పుడూ డల్‌గా ఉండను. నాకు ఆరోగ్యం బాగాలేదని నేను చెబితే తప్ప... ఎవరూ గుర్తు పట్టలేరు. అంత యాక్టివ్ అన్నమాట.
థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ...
ఎక్కడ ఫంక్షన్‌కు వెళ్లినా బడబడా ఏదో ఒకటి వాగుతూ ఉంటాను. అలా ఓసారి ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు చలాకీగా ఉన్న నన్ను చూసి జెమిని కిరణ్‌గారు, రాఘవేందర్‌రావుగారు ‘ఈ అమ్మాయి చాలా యాక్టివ్‌గా ఉందే’ అని బుల్లితెరవైపు తీసుకొచ్చారు. మొదటిసారిగా జెమినిలో ‘నీ కోసం’ ప్రోగ్రాంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. అది మొదలు.. అన్ని ఛానల్స్‌లో రకరకాల ప్రోగ్రామ్స్ చేశాను. ‘అభిమాని’, ‘ైధె ర్యం’, ‘ఛత్రపతి’, ‘పల్లకిలో పెళ్లికూతురు’,‘కొడుకు’.. ఇలా చాలా సినిమాల్లో చేస్తూ వచ్చాను. పదమూడేళ్లనుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. ఈ ప్రయాణంలో మా అమ్మ సపోర్ట్ చాలా ఉంది. సినిమాల్లోకి రాకుండా ఉంటే... ఏ ఎయిర్ హోస్టెసో, ఫ్యాషన్ డిజైనరో అయి ఉండేదాన్ని. నేను ఖురాన్ చదువుతాను. చర్చికి, గుడికీ వెళ్తాను. అన్ని మతాలనూ గౌరవిస్తాను. అది మా నాన్న నుంచి నేర్చుకున్నది. నాకు ఎక్కువగా జనాలతో ఉండటం ఇష్టం. వర్క్‌హాలిక్‌ని. విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకుంటాను. నా క్రిటిక్సే నా వెల్ విషర్స్ అనుకుంటాను. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు దెమ్.
‘షా గౌస్’ చాయ్...
చిన్నప్పుడు నేను, మా అక్క, మా కజిన్స్ తెల్లవారుజామునే లేచి సికింద్రాబాద్ ‘బ్లూ సీ’ హోటల్‌లో చాయ్ తాగేవాళ్లం. ఇప్పుడు ప్యారడైజ్‌కి వెళ్లి మరీ వెజ్ తినేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది నేనే అనుకోవచ్చు. ఇంకా టోలిచౌకిలో ‘షా గౌస్’ కేఫ్‌లో ఇరానీ చాయ్ అంటే ఇష్టం. ఇప్పటికీ వీలుచేసుకుని మరీ.. అప్పుడప్పుడు వెళ్లి తాగుతుంటాను. ఇమ్లిబన్ దగ్గర ఉన్న గోశాలలో మూడు గోవులను అడాప్ట్ చేసుకున్నా. వాటి ఫీడింగ్, మెయింటెనెన్స్ చూసుకుంటాను. పూజలు చేయడానికీ టైమ్ స్పెండ్ చేస్తాను.
శిరీష చల్లపల్లి