న్యూస్‌మేకర్
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది.
‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.
తండ్రి ్రపోత్సాహంతో ...
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.
లోపలి సౌందర్యం
‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్‌లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!
టీవీ యాంకర్‌గా...
కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్‌లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment