మియామి: టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా(66) మళ్లీ క్యాన్సర్ బారిన పడ్డారు. తాజాగా ఆమెకు గొంతు, రొమ్ము క్యాన్సర్ సోకినట్లు తాజాగా తేలింది. అది స్టేజ్ వన్‌లోనే ఉందని తెలుస్తోంది. అంటే ఆరంభ దశ అన్నమాట. మెడ దగ్గర చిన్నకణితి ఏర్పడడంతో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో.. గొంతు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఉందని వెల్లడైంది. కాగా, నవ్రతిలోవా క్యాన్సర్ బారిన పడడం రెండోసారి.
తన కెరీర్‌లో 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచారు ఆమె. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌తో కలిపి గ్రాండ్‌స్లామ్‌లో మొత్తం 59 సార్లు ఛాంపియన్‌గా నిలిచారు. ప్రపంచ ఉత్తమ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన మార్టినా నవ్రతిలోవాకు గతంలో రొమ్ము క్యాన్సర్ సోకగా.. ఆరు నెలల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ‘‘ఒకేసారి రెండు రకాల క్యాన్సర్‌లు సోకడం తీవ్రమైన అంశమే. కానీ, చికిత్సతో జయించే అవకాశం ఉంది. ఫలితం సానుకూలంగా వస్తుందనే నమ్ముతున్నా. కొద్దికాలం హాస్పిటల్ వాసన భరించక తప్పదు. నా శక్తికొద్దీ పోరాడతా’’ అని 66 ఏళ్ల నవ్రతిలోవా తెలిపారు.
2010లో క్యాన్సర్ బారిన పడినప్పుడు నిస్సహాయంగా మారనని, అందుకే ఇలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వల్ల తనలా బాధపడుతున్న మహిళలకు సహాయం చేయవచ్చని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. చెక్-అమెరికన్ అయిన నవ్రతిలోవా కుటుంబంతో ప్రస్తుతం ఫ్లోరిడా మియామీలో ఉంటున్నారు. త్వరలోనే ఆమె చికిత్స తీసుకుంటారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment