కేవలం రొమ్ము క్యాన్సర్‌తోనే 2022లో 98,337 మంది మృతి
నోటి క్యాన్సర్‌కు 79,979 మంది బలి
2045 నాటికి క్యాన్సర్ కేసులు, మరణాల్లో గణనీయమైన వృద్ధి
క్యాన్సర్ కేసుల్లో 2025లో భారత్‌లో 12.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా
సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ రక్కసి కోరలు చాస్తోంది. 2022 సంవత్సరంలో ఒక్క రొమ్ము క్యాన్సర్ కారణంగానే దేశంలో 98,337 మంది మహిళలు మృతి చెందినట్లు గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) నివేదిక వెల్లడించింది. అదే ఏడాది నోటి క్యాన్సర్ బారినపడి 79,979 మరణించినట్లు ఆ నివేదిక తెలిపింది.
ఇది కచ్చితంగా ప్రమాద సూచికేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2045 నాటికి క్యాన్సర్ కేసులు, మరణాల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా హెచ్చరించింది.
ముఖ్యంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో క్యాన్సర్ విజృంభణపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రొమ్ము క్యాన్సర్ కేసుల్లో 33.6 శాతం, మరణాల్లో 36.9 శాతం బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నట్టు వెల్లడించింది. అన్ని రకాల క్యాన్సర్ మరణాల్లో 42 శాతం ఈ దేశాల్లోనే సంభవించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
12.8 శాతం పెరుగుదల
2020తో పోలిస్తే 2025లో దేశంలో 12.8 శాతం మేర క్యాన్సర్ కేసుల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో పొగాకు వినియోగం వల్ల పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా ఉన్నాయి. వీటి కారణంగానే అత్యధిక మరణాలు నమోదవుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భారత్ మినహా మిగిలిన బ్రిక్స్ దేశాల్లో మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణమని వెల్లడైంది.
మహిళలు 40 ఏళ్ల నుంచి జాగ్రత్తలు పాటించాలి
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 10 శాతం రొమ్ము క్యాన్సర్‌లు వంశపారంపర్యంగా వస్తాయి. 90 శాతం కేసులు సాధారణంగా వస్తుంటాయి. కుటుంబంలో ఒక తరం స్త్రీకి 50 ఏళ్లలో క్యాన్సర్ బయటపడితే తర్వాతి తరంలోని ఆమె కూతుళ్లు, వారి సంతానం 10 ఏళ్లు ముందే అంటే 40 ఏళ్లకే జాగ్రత్త పడాలి. బ్రాకాజీన్ టెస్ట్ చేయించుకుంటే వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమణను గుర్తించవచ్చు.
మిగిలిన మహిళలైతే 40 ఏళ్ల నుంచే నెలసరి సమయంలో కాకుండా మిగిలిన రోజుల్లో ఇంట్లోనే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. గడ్డలు ఉన్నట్‌లైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 45 ఏళ్ల వయస్సు నుంచి రొమ్ము క్యాన్సర్‌కు మామోగ్రామ్, గర్భాశయ క్యాన్సర్‌కు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. గతంతో పోలిస్తే వైద్య రంగం అభివృద్ధి చెందింది. అధునాతన చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో క్యాన్సర్ బయటపడినా చికిత్స చేయొచ్చు. – డాక్టర్ జె.విజయకృష్ణ, క్లినికల్ అంకాలజిస్ట్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment