చిన్నారికి పెద్ద కష్టం | madhulatha suffer with cancer | Sakshi
Sakshi News home page

చిన్నారికి పెద్ద కష్టం

Published Sun, Jul 3 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

madhulatha suffer with cancer

భీమడోలు : ముద్దు ముద్దు మాటలు, అల్లరితో మురిపించాల్సిన చిన్నారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆ బిడ్డ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. గొంతు వద్ద ఏర్పడిన గడ్డ కేన్సర్‌గా మారడంతో కన్నబిడ్డను బతికించుకునేందుకు రెక్కాడితే గాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు దాతల సహాయాన్ని కోరుతున్నారు. గుండుగొలను గ్రామ శివారు దళిత గ్రామమైన భోగాపురానికి చెందిన పెండెం ఏసుపాదం, రాణిలకు 11 నెలల క్రితం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పాప జన్మించగా మధులత అని పేరు పెట్టుకున్నారు.
 
 
 ఏసుపాదం వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పుట్టిన సమయంలో పాప గొంతుక కింద చిన్న గడ్డ ఉండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా ఆ గడ్డ పెద్దదైతే శస్త్ర చికిత్స చేసి తొలగిస్తామని చెప్పారు. ఆ పాప పెరుగుతూ ఉన్న కొద్దీ గొంతు కింద వేసిన గడ్డ కూడా పెరుగుతూ వచ్చింది. పాప 9 నెలల వయసుకు వచ్చిన తర్వాత పాలు మింగుడుపడడం లేదు. దీంతో వారు గుండుగొలను పీహెచ్‌సీ వైద్యాధికారిణికి చూపిం చారు. పిల్లల వైద్యుడిని సంప్రదించాలని సూచించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మధులతను పరీక్షించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు.
 
 పాపను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు చేసి దానిని కేన్సర్ గడ్డగా నిర్ధారించారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్డు ఉంటే పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తామని చెప్పారు. అప్పటికప్పుడు ఏసుపాదం భీమడోలు తహసీల్దార్ పీబీపీఎల్ పద్మావతిని కలిసి బిడ్డ పరిస్థితిని చెప్పడంతో ఆమె వెంటనే ధ్రువీకరణ పత్రం అందించారు. అనంతరం వైద్యులు పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి కేన్సర్ ప్రాథమిక స్థాయిలో ఉందని వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉందని చెప్పారు. అయితే వివిధ వైద్య పరీక్షలు బయటి ల్యాబ్‌లలోనే చేయించుకోవాలని, ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవలో చేసినా ఇతర ఖర్చులు రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుందని, సిద్ధం చేసుకోవాలని వైద్యులు చెప్పడంతో ఏసుపాదం దంపతులు తల్లడిల్లుతున్నారు. కూలి పనులు చేసుకుని పేదరికంలో జీవి స్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉండడం, ఆహారం తినలేకపోవడంతో రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పాపను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి వైద్యానికి దాతలు ఆర్థిక సహాయం చేసి సహకరించాలని వేడుకుంటున్నారు. దాతలు 9160484024 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరుతున్నారు. ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నెం 014810100087264కు తమ సహాయాన్ని పంపించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement