చదువుల తల్లికి సీఎం చేయూత | Government financial assistance for Madhulatha education | Sakshi
Sakshi News home page

చదువుల తల్లికి సీఎం చేయూత

Published Thu, Jul 25 2024 4:07 AM | Last Updated on Thu, Jul 25 2024 4:07 AM

Government financial assistance for Madhulatha education

మధులత విద్యాభ్యాసానికి ప్రభుత్వ ఆర్థిక సాయం

సచివాలయంలో చెక్‌ అందించిన అధికారులు

వీర్నపల్లి (సిరిసిల్ల): ఐఐటీ పాట్నా లో  సీటు సాధించిన పేద గిరిజన విద్యార్థి ని బదావత్‌ మధులత విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎంవో బుధవారం అధికారికంగా వెల్లడించింది. కోర్సు పూర్తయ్యేవరకు ఆర్థిక సహాయం కొనసాగుతుందని హైదరాబాద్‌కు వెళ్లిన విద్యారి్థనితోపాటు వారి కుటుంబీకులకు సీఎంవో హామీ ఇచి్చంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్‌ తండాకు చెందిన బదావత్‌ మధులత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభచూపి 824వ ర్యాంక్‌ సాధించిన విషయం తెలిసిందే. 

పాట్నా ఐఐటీలో చదవాలంటే దాదా పు రూ.3 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సోమవారం ‘సాక్షి’లో ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికన  కథనం ప్రచురితమైంది. ఇది సీఎంవో దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ విద్యారి్థనిని హైదరాబాద్‌కు పిలిచారు. బుధవారం మధులత ఆమె తండ్రి రాములుతో కలిసి వెళ్లింది. చదువు పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని సీఎం ఆదేశించడంతో గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల మంజూరు ఉత్తర్వులు జారీచేశారు. 

సచివాలయంలో రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి శరత్‌ మధులతకు రూ.1,51,831 చెక్కును అందజేశారు. మధులత కోరిక మేరకు హైఎండ్‌ కంప్యూటర్‌ కొనుగోలు కోసం రూ.70 వేలు ఇవ్వడంతో పాటు అదనంగా మరో రూ.30 వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని గిరిజన సంక్షేమ శాఖ మధులతకు భరోసా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కాగా, చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ, మధులతను రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో అభినందించారు. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సాక్షితోపాటు తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధులత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement