చాలా మంది చిన్నపిల్లలు అలా టెన్త్ లేదా ఇంటర్ పూర్తి కాగానే పై చదవులకని పక్క ఊళ్లకు వెళ్లడం మామూలే. ఒక్కసారిగా దొరికిన ఆ స్వేచ్ఛతో సిగరెట్లకు అలవాటు కావడం కూడా చాలా సాధారణమే. అలాగే బాగా ఒత్తిడితో ఉండే ఉద్యోగాలూ, కాన్ఫరెన్సులు, మీటింగుల తర్వాత రిలాక్స్ కావడం కోసం పొగతాగడం చాలా మందిలో అలా మెల్లగా అలవాటవుతుంది. ఇలాంటి వ్యవహారాలు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు కాస్తంత ఎక్కువ.
ఇలా మొదట సరదాగా, టైమ్‌పాస్ కోసం మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లతోపాటు బయటి తిండి ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ బయటి ఆహారం రుచికరంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం నూనెలు, ఉప్పుకారాలూ ఎక్కువగా వాడటంతోపాటు దేహానికి, ఆరోగ్యానికి హాని చేసే కొన్ని కృత్రిమరంగులు, రసాయనాలు వాడతారు. వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడటమూ జరుగుతుంది. ఇవన్నీ క్యాన్సర్‌కు కారణాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.
దురలవాట్లు, బయటితిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, వాతావరణ కాలుష్యం, నైట్‌డ్యూటీలు, రాత్రంతా నిద్ర లేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం... ఈ అన్నిరకాల కారణాలతో మహిళలతో పోలిస్తే పురుషులు మరింత ఎక్కువగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లు తప్పితే... మరే క్యాన్సర్లు తీసుకున్నా అవి మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ. ఇటీవల పురుషులు కూడా రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం పెరిగిపోయింది.
ప్రపంచంవ్యాప్తంగా క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య పెరుగుతున్న ధోరణులను చూస్తే 2007 నుంచి 2030 నాటికి ఈ సంఖ్య ఇప్పటికంటే 45% ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్ పరీక్షలు ఎన్ని వచ్చినా క్యాన్సర్ రాకుండా నివారించగలగడం ఎవరి చేతుల్లోనూ లేదనేది సత్యం. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధ్యయనాల ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య... అన్ని మరణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.
సిగరెట్, బీడీలు, పాన్, గుట్కా, ఆల్కహాల్, పొగాకు నమలడం మొదలైనవి నోటి క్యాన్సర్‌కు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఏడాదీ దాదాపు 80,000 మంది వరకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఉప్పు, కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం ఇంకా దురలవాట్లు కూడా చాలా ఎక్కువగా ఉండటం పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తాయి. అందుకే భారతదేశంలోని పురుషులు ఈ క్యాన్సర్‌బారిన ఎక్కువగా పడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి.
మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవ్వడం చాలా ఎక్కువగానే గమనిస్తున్నాం. అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వంటివి క్యాన్సర్‌కు ముఖ్య కారణాలవడటంతోపాటు కొన్ని వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటాయి.
ఉదాహరణకు ఆస్‌బెస్టాస్, అల్యూమినియం ఉత్పాదన కంపెనీల్లో, ఆల్కహాలిక్ బెవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీలు, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లియిడ్స్, చెక్కపొడి, గామా రేడియేష్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తల, మెడ భాగాల్లో (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అస్సలు ఎండ తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి పనిచేయడంతోపాటు నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్ వంటి వాటికి పురుషులే ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంటారు. ఇక వారు పనుల కోసం బయటికి వెళ్లినప్పుడు తేలిగ్గా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కుగా తీసుకుంటూ ఉంటారు. దాంతో ఊబకాయం, క్యాన్సర్ ముప్పులు పొంచి ఉంటాయి.
యాభైఏళ్లు పైబడ్డాక కనిపించే ప్రోస్టేట్‌క్యాన్సర్‌ను తెలుసుకునేందుకు పీఎస్‌ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్) అనే రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే వీర్యంలో, మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్ర సంబంధమైన సమస్యల వంటి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించేసరికి అది ముదిరిపోయి పక్కన ఉండే ఎముకలకూ పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్‌ఏ పరీక్షలో యాంటిజన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీలైన డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్‌ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు.
యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్‌ఏ, డీఆర్‌ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మళ్లీ ఎంతకాలం తర్వాత చేయించుకుంటే మంచిది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే పీఎస్‌ఏ పరీక్షలో మార్పులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎతర పరీక్షలను ఎలాంటి లక్షణాలు కనిపించనప్పుడు చేయించుకోవాలి వంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి.
ఈ కింద లక్షణాలు కనిపిస్తే పురుషులు నిర్లక్ష్యం చేయడం తగదు. అవి...
- తగ్గని దగ్గు, దగ్గుతో పాటు రక్తం ఆకలి, బరువు తగ్గడం
- నొప్పితో పాటు జ్వరం, మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం
- మలవిసర్జనలో రక్తస్రావం ,తీవ్రమైన అజీర్తి, గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం
- నోటిలో మానని పుండ్లు, ఎముకల్లో నొప్పులు
పై లక్షణాలు కనిపించినప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ అనో, పైల్స్ అనో, రోగనిరోధక శక్తి తగ్గిందనో, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తుందనో నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక వయసు పైబడ్డ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి మంచి జీవనశైలిపై అవగాహన పెంపొందించుకొని, ఆరోగ్యంగా జీవించడం చాలా ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment