prostate cancer
-
బ్రో... ఫిఫ్టీ దాటారా? 'ప్రో'స్టేటస్’ చూసుకోండి!
పురుషుల్లో వచ్చే అత్యంత సాధారణమైన కేన్సర్లలో ప్రోస్టేట్ కేన్సర్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వచ్చే కేన్సర్లలో దీనిది రెండోస్థానం. వీలైనంత త్వరగా దీన్ని గుర్తించి, ప్రస్తుతం లభిస్తున్న అధునాతనమైన చికిత్స పద్ధతుల ద్వారా వైద్యం చేయించగలిగినట్లయితే చాలా మంచి ఫలితాలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు నెలను ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన మాసంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ప్రోస్టేట్ కేన్సర్‌పై అవగాహన కోసం ఈ కథనం. ప్రోస్టేట్ గ్రంథిని తెలుగులో పురుష గ్రంథి అని పిలుస్తారు. ఇది మూత్రకోశం (యూరినరీ బ్లాడర్)కు దిగువన ఉండి, అక్కడ మొదలైన మూత్రనాళం (యురెథ్రా) ఈ గ్రంథిలోంచే బయటకు వచ్చి, పురుషాంగం ద్వారా వెలుపలకు వస్తుంది. మూత్రనాళం చుట్టూ ప్రోస్టేట్ గ్రంథి ఉండటంతో మూత్రకోశం నుంచి మూత్రాన్ని బయటకు రాకుండా అది నిలువరిస్తుంది. కేవలం మూత్ర విసర్జన సమయంలో మాత్రమే ఇది తెరచుకుంటుంది. ఇది చేసే మరో ముఖ్యమైన పనేమిటంటే... ఇది స్రవించే స్రావం పురుషుల వీర్యకణాలకు పోషకపదార్థంగా పనిచేస్తుంది.ప్రోస్టేట్ కేన్సర్ అంటే...? ప్రోస్టేట్ గ్రంథి కణాలలోని జన్యువుల్లో మ్యూటేషన్ జరిగినప్పుడు అది కేన్సర్‌కు దారితీస్తుంది. సరైన సమయంలో వ్యాధిని నిర్ధారణ చేసి చికిత్స చేయించకపోతే, ఈ కేన్సరే ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే... హార్మోన్ల అసమతౌల్యత వల్ల 50 ఏళ్లు పైబడిన కొందరిలో ఈ గ్రంథి పరిమాణం పెరగవచ్చు. దీన్నే బినైన్ ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ అని పిలుస్తారు. ఇది కేన్సర్ కాదు.ప్రమాద సూచికలు ఏమిటి? ఈ కేన్సర్‌లో ప్రోస్టేట్ పరిమాణం పెరగడం వల్ల మూత్రవిసర్జన సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఉదాహరణకు... ∙మూత్రధార సన్నబడటం, ముక్కాల్సి రావడం రాత్రుళ్లు మాటిమాటికీ నిద్రలేచి మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం మూత్రవిసర్జన తర్వాత కొంత లోపలే మిగిలిపోవడం అప్పుడప్పుడూ మూత్రంలో రక్తం కనిపించడం. ఒకవేళ కేన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించినప్పుడు ఎముకల్లో నొప్పులు, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాల విషయంలో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది... తొలిదశలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. రెండో అంశమేమి టంటే... ఇవే లక్షణాలు హానికరం కాని బినైన్ ఎన్లార్ట్మెంట్లోనూ కనిపించవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్? వయసు పెరుగుతుండటం: పెరిగే వయసు ఒక నివారించలేని ముప్పు. నాలుగింట మూడొంతుల మందిలో 65 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య కనిపిస్తుంది. వంశపారంపర్యంగా: కుటుంబాల్లో ఎవరైనా ప్రోస్టేట్ కేన్సర్ బారిన పడితే... వారి సంతానానికి / సోదరులకు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ. మెటబాలిక్ సిండ్రోమ్: సిండ్రోమ్ అంటే వివిధ రకాల శారీరక రుగ్మతల సమాహారం. అంటే... హై బ్లడ్ ప్రెషర్, అధిక కొలెస్ట్రాల్, ఉబకాయం, నియంత్రణ లేని మధుమేహం... ఈ అంశాల సమాహారం వేరువేరు కేన్సర్లతో పాటు ప్రోస్టేట్ కేన్సర్‌కూ కారణమయ్యే అవకాశాలు ఎక్కువ. పొగతాగడం: ఇది పరోక్షంగా ప్రోస్టేట్ కేన్సర్ రిస్క్‌ను అధికం చేస్తుంది. నిర్ధారణ ఎలా? యాభై ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ముందుజాగ్రత్తగా ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. దీని నిర్ధారణ కోసం యూరాలజిస్టులు పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్) అనే రక్తపరీక్ష చేయిస్తారు. ఆ విలువ ఉండాల్సిన దానికంటే పెరిగినట్లయితే ప్రోస్టేట్ బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత ఎమ్మారై, పెట్‌స్కాన్ అనే పరీక్షలతో క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో అంశాన్ని తెలుసుకుంటారు. చికిత్స : కేన్సర్ కేవలం ప్రోస్టేట్ గ్రంథికే పరిమితమై ఉంటే, శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. దాంతో వ్యాధి పూర్తిగా మటుమాయమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ సాంకేతికత ద్వారా ఈ శస్త్రచికిత్స చేస్తున్నారు. దీన్ని ‘రోబోటిక్ రాడికల్ ప్రోస్టెక్టమీ’ అంటారు. రోబోటిక్ శస్త్రచికిత్సలో పెద్ద గాట్లు అవసరం లేకుండా, కేవలం చిన్న చిన్న రంధ్రాలతో అధునాతమైన పరికరాల ద్వారా ఆపరేషన్ చేస్తారు. దీనివల్ల రక్తస్రావం, నొప్పి తక్కువ, కోలుకోవడమూ వేగంగా జరుగుతుంది. ప్రోస్టేట్ చుట్టూ ఉండే చిన్న చిన్న నరాలకు ఎలాంటి దెబ్బా తగలకుండా ఆపరేషన్ చేయవచ్చు. ఈ నరాలు అంగస్తంభనకు అవసరమవుతాయి. ఈ పద్ధతిని ‘నర్వ్ స్పేరింగ్ ప్రోస్టెక్టమీ’ అంటారు. ఎవరైనా శస్త్రచికిత్స వద్దనుకున్నా లేదా వారికి ఫిట్నెస్ లేకపొయినా రేడియోథెరపీ మంచి ప్రత్యామ్నాయం. దురదృష్టవశాత్తూ ఈ జబ్బును లేట్ స్టేజెస్‌లో కనుగొన్నట్లయితే... అంటే కేన్సర్ ఇతర అవయవాలకు తాకినప్పుడు వారిలోని టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను తగ్గించడం ద్వారా ఈ కేన్సర్‌ను తగ్గించవచ్చు. దీన్ని ‘హార్మోన్ థెరపీ’ అంటారు దీనికి అదనంగా ఇప్పుడు ఎబిరటారోన్ లేదా ఎంజాలుటమైడ్ వంటి అధునాతనమైన మందులూ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియోన్యూక్లైడ్ థెరపీ ఉన్నాయి. నివారణ ఎలా? ప్రోస్టేట్ కేన్సర్‌కు నివారణ అంటూ ఏమీ లేదు. అయితే దీనికి కచ్చితమైన చికిత్స పొందవచ్చు. కొంతవరకు జీవనసరళిలో మార్పులూ, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం ద్వారా కొంత నివారణ సాధ్యమవుతూ ఉండవచ్చు. ఉదాహరణకు ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, అలాగే శరీర బరువును నియంత్రించడం, రోజూ వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో కొంతవరకు నియంత్రించవచ్చు.డా. రాజేశ్ కుమార్ రెడ్డి అడపాల, కన్సల్టెంట్ యూరో ఆంకాలజిస్ట్ (చదవండి: పిక్కకు ఓ లెక్కుంది..! హార్ట్ పంపింగ్‌లో కింగ్..!) -
తుమ్మితే పేగులు బయటికొచ్చాయి!
వాషింగ్టన్: ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మూత్రకోశం ఆపరేషన్ చేయించుకున్న 63 ఏళ్ల రోగి అనూహ్యమైన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొన్నారు. గట్టిగా తుమ్మి, దగ్గడంతో పేగులు బయటికొచ్చాయి. దీంతో ఆయనను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకుండా కాపాడారు. ఫ్లోరిడావాసికి జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి. యూరినరీ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ సమయంలో పై నుంచి వేసిన కుట్లను విప్పేశారు. ఆపరేషన్, కుట్లు విప్పడం అంతా సవ్యంగా జరగడంతో చిన్న పార్టీ చేసుకుందామనుకుని ఆ దంపతులు తర్వాతి రోజు ఉదయాన్నే దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్లి అల్పాహారం తినేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి బిగ్గరగా తుమ్మడంతోపాటు దగ్గారు. దీంతో ఆపరేషన్ కోసం గతంలో కోత పెట్టిన ప్రాంతం నుంచి పేగుల్లో కొంతభాగం బయటికొచ్చింది. హుతాశుడైన వ్యక్తి వెంటనే ధైర్యం తెచ్చుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. భార్య వద్దని వారించడంతో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి చూసి అవాక్కవడం వైద్యుల వంతయింది. ముగ్గురు నిష్ణాతులైన యూరాలజీ సర్జన్లు జాగ్రత్తగా వాటిని మళ్లీ యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఇలాంటి ఘటన జరగడం మాకు తెలిసి ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు వ్యాఖ్యానించారు. -
ఘనంగా మొవెంబర్ ఈవెంట్
లండన్ లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ బాయ్స్ కమ్యూనిటీ (B.B.C) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మొవెంబర్ (Movember) అనే ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. మగవారిలో వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ (prostate cancer) గురించి అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ కార్య నిర్వాహక సభ్యులు సంజీవ్ అంకిరెడ్డి, గోవర్ధన్ వడ్లపట్ల, సతీష్ చింతపండు, విషి మనికిరెడ్డి, రవి మంచిరాజు, సత్యనారాయణ నోముల, రవి మేకల, సత్యనారాయణ ఆవుల, శ్రీధర్ బేతి, తిరుమల కాగిత, ప్రకాష్ విత్తనాలు, రమేష్ బుక్క లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వార £2027పౌండ్లు ( సుమారు 2 లక్షల రూపాయలు ) మొవెంబర్ ఛారిటికి అందజేశారని తెలిపారు. -
దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ కేన్సర్ నివారణ!
సాక్షి, హైదరాబాద్: భారతీయులు వంటకాల్లో తరచూ ఉపయోగించే దాల్చిన చెక్క ప్రొస్టేట్ కేన్సర్ నివారణకు దోహదపడుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) జరిపిన అధ్యయనం తేల్చింది. దాల్చిన చెక్కతో మన ఆరోగ్యానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. ఎన్ఐఎన్ తాజా అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. దాల్చిన చెక్కలోని చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిన్ బీ–2లను ఎలుకలకు అందించినప్పుడు ప్రాథమిక దశలోని ప్రొస్టేట్ కేన్సర్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు తెలిసింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలకు 16 వారాలపాటు దాల్చిన చెక్క, దాంతోపాటు చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిస్ బీ–2లను అందించారు. ఆ తరువాత ఈ ఎలుకలకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చేలా చేశారు. దాల్చిన చెక్క, దాంట్లోని రసాయనాలను ఆహారంగా తీసుకున్న 60–70 శాతం ఎలుకల్లో కేన్సర్ లక్షణాలేవీ కనిపించలేదు. ఈ పదార్థాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను సమర్థంగా తట్టుకోగలగడం వల్లనే వాటికి కేన్సర్ సోకలేదని భావిస్తున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అయేశా ఇస్మాయిల్ తెలిపారు. ప్రొస్టేట్ గ్రంథిలో కేన్సర్ కణాల వ్యాప్తి కూడా తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. అంతేగాకుండా... ఎముకల్లోని ఖనిజాల మోతాదు ఎక్కువైందని, ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం తగ్గిందని వివరించారు. ప్రొస్టేట్ కేన్సర్ నివారణలో దాల్చిన చెక్క ఉపయోగపడగలదన్న విషయం ఎలుకల్లో రుజువైనప్పటికీ మనుషుల్లో వాడకానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘కేన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్’జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. -
మగవారిలో ప్రోస్టేట్ పెరిగితే ప్రమాదమా?
మన మానవాళి విస్తరిస్తోందంటే దానికి తోడ్పడే గ్రంథుల్లో కీలకమైనది ప్రోస్టేట్. కేవలం పురుషులలో మాత్రమే ఉంటూ పునరుత్పత్తికి తోడ్పడే ఈ గ్రంథే లేకపోతే సంతానమే లేదు. వృషణాలు వీర్యకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ వీర్యకణాలు ఈదడానికి కావాల్సిన ద్రవాన్ని ఉత్పత్తి చేసే ఈ ప్రోస్టేట్ గ్రంథి... చాలామందిలో వాళ్ల 50వ ఏళ్ల వయసు తర్వాత అమాంతం పెరిగిపోయి కొన్ని అనర్థాలను తెచ్చిపెడుతుంది. అవేమిటో, వాటిని అధిగమించాల్సిన మార్గమేమిటో వివరించే కథనమిది. ప్రోస్టేట్ సాధారణంగా 18–22 గ్రాముల బరువుంటుంది. కానీ 50 ఏళ్లు దాటిన కొందరిలో ఇది అకస్మాత్తుగా సైజు పెరిగిపోయే అవకాశం ఉంది. మానవ శరీర నిర్మాణం ఎంత సంక్లిష్టంగా ఉంటుందంటే... మూత్రంనాళం చుట్టూతా ఈ ప్రోస్టేట్ గ్రంథి ఆవరించి ఉండటంతో... ఇది హఠాత్తుగా సైజ్ పెరగడంతో ఆ నాళం నొక్కుకుపోయి... క్రితం రోజుదాకా సాఫీగా వచ్చిన మూత్రం అకస్మాత్తుగా ఆగిపోయి, లోపల ఎంతగానో మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా, ఎంతగా ముక్కుతున్నా రాక బెంబేలెత్తిస్తుంది. అలాంటి సమయాల్లో అత్యవసరంగా హాస్పిటల్‌కు వెళ్లాల్సిన స్థితిలో ‘ప్రోస్టేట్ పెరుగుదల’ (ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్) తెలుస్తుంది. కొందరిలో మాత్రమే ఇలా పెరిగిపోయే ఈ గ్రంథి సైజు... ఎందుకంత హఠాత్తుగా పెరిగిపోతుందనేది ఇప్పటికీ వైద్యవర్గాలకు తెలియని రహస్యమే. అది వయసు పెరగడం వల్ల వచ్చే అనేక పరిణామాల్లో అదీ ఒకటిగా భావిస్తున్నారు. రెండు రకాలుగా పెరుగుదల: ప్రోస్టేట్ పెరుగుదల రెండు రకాలుగా ఉంటుంది. సైజు పెరిగినప్పటికీ ఆ కణాల్లో ఏదీ ప్రమాదకరం కాకుండా కేవలం సైజు మాత్రమే పెరుగుతుంది. ఇలాంటి పెరుగుదలను ‘బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు. ఇక రెండోది క్యాన్సర్ కణాల వల్ల సంభవిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా ఆ గ్రంథి సైజు పెరుగుతుంది. ఇది ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా. లక్షణాలు: ప్రోస్టేట్ పెరుగుదలలో రెండు విధాలుగా లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది స్టోరేజీ... అంటే మూత్రం భర్తీ అవడం వల్ల కనిపించే లక్షణాలు. రెండోది వాయిడింగ్... అంటే మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి సంబంధించిన లక్షణాలు. స్టోరేజీ: రాత్రివేళల్లో మామూలు కంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం. పగటివేళల్లో కూడా చాలా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం. మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం. మూత్రవిసర్జనపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం. వాయిడింగ్: ► మూత్రవిసర్జన కోసం నిలబడ్డ తర్వాత ఎంతోసేపటికి గాని మూత్రపు ధార మొదలుకాకపోవడం. ► మూత్రపుధార మెల్ల మెల్లగా, ఆగుతూ ఆగుతూ వస్తుండటం. ► మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి చాలా సమయం తీసుకోవడం. ► మూత్రవిసర్జన అన్నది ఎప్పటిలా సాఫీగా కాకుండా చాలా శ్రమతో, బాధతో జరుగుతున్నట్లుగా అనిపించడం. ► మూత్రవిసర్జనలో నొప్పి. ► మూత్రవిసర్జన ముగిసే సమయానికి ముక్కి ముక్కి పోయాల్సిరావడం. ► ఆ తర్వాత కూడా మూత్రం ఎంతోకొంత లోపలే ఉండిపోవడం (లేదా అలా ఉండిపోయిన ఫీలింగ్ ఉండటం). ► ఒక్కోసారి మూత్రపు ధారలో రక్తపు చారిక కనిపించడం (మూత్రంలో లేదా బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది). నివారణ: ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ నివారణ పూర్తిగా మన అదుపులో ఉండదు. అయితే కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా ప్రోస్టేట్ సమస్యలను కొంతవరకు నివారించవచ్చు. అవి... ► మూత్రవిసర్జన ఫీలింగ్ రాగానే... ఆపుకోకుండా వెంటనే మూత్రవిసర్జన చేసేయాలి. ► కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉండే కూల్డ్రింకులూ, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ► నిద్రకు ఉపక్రమించబోయే ముందర 2 – 3 గంటల ముందుగా మాత్రమే నీళ్లు తాగడం / ద్రవాహారాలు తీసుకోవడం. ► డాక్టర్ సలహా లేకుండా అలర్జీల కోసం / ఊపిరితిత్తుల్లోకి గాలి సాఫీగా ప్రవహించేలా చేసే డీ–కంజెస్టెంట్స్ లేదా యాంటీహిస్టమైన్ మందులు తీసుకోకపోవడం. ► ఇవి బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా ముప్పును పెంచే అవకాశం ఉంది. ►చాలా చల్లని వాతావరణంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడం (చలి వాతావరణం ఈ సమస్యను మరింత పెంచుతుంది). ► చురుగ్గా ఉండాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ► పొత్తికడుపు కండరాలపై నియంత్రణను పెంచే ‘కెగెల్స్ ఎక్సర్సైజ్’లు ప్రాక్టీస్ చేయడం కొంతవరకు మేలు చేస్తుంది. ► శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవడం. చికిత్స: ప్రోస్టేట్ గ్రంథికి వచ్చిన సమస్య, పెరుగుదలకు కారణాలూ, దాని తీవ్రతా, లక్షణాలూ... బాధితులు ఎదుర్కొనే సమస్యలను బట్టి చికిత్స ఉంటుంది. ఉదాహరణకు... ►ప్రోస్టెటైటిస్ : ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్ను ప్రోస్టెటైటిస్ అంటారు. మిగతా ఇన్ఫెక్షన్ల లాగానే దీనికి యాంటిబయాటిక్స్‌తో చికిత్స చేస్తే పూర్తిగా తగ్గుతుంది. కాకపోతే కాస్త ఎక్కువ కాలం పాటు ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ► మూత్రాన్ని ఏమాత్రం ఆపుకోలేకపోవడం, మూత్రధారలో రక్తపు చారిక, పెరిగిన ప్రోస్టేట్ గ్రంథి అన్నివైపుల నుంచి నొక్కేయడం వల్ల మూత్రం లోపలే ఉండిపోవడం, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్లూ, కిడ్నీ దెబ్బతినడం వంటి సమస్యల్ని తొలుత మందులతో అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పటికీ మందులతో అదుపు సాధ్యం కాకపోతే అప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. ► ప్రోస్టేట్ పెరిగిన పరిమాణం, దాని ఆకృతి వంటి అంశాలను బట్టి వేర్వేరు రకాల ప్రక్రియలు (ప్రొసీజర్స్) అవసరమవుతాయి. వీటన్నింటిలో బినైన ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా సమస్య కోసం సాధారణంగా ‘ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్’(టీయూఆర్‌పీ) అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరిస్తుంటారు. ► కొందరిలో లేజర్ సహాయంతో ‘లేజర్ ప్రోస్టెక్టమీ’ చేస్తుంటారు. మామూలు శస్త్రచికిత్సతో పోలిస్తే దీనిలో కొన్ని ప్రయోజనాలు ఎక్కువ. రక్తాన్ని పలచబార్చే మందులు వాడుతున్నవారికీ, ప్రోస్టేట్ సైజు విపరీతంగా పెరిగినవారు, గుండె సమస్యలున్నవారికీ లేజర్ సహాయంతో చేసే చికిత్స వల్ల ప్రయోజనాలుంటాయి. ఉదాహరణకు ► రక్తస్రావం చాలా తక్కువ ►హాస్పిటల్లో ఉండాల్సిన వ్యవధి కూడా తక్కువ కావడం ► త్వరగా కోలుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటాయి. పై అంశాలను దృష్టిలో ఉంచుకుని... మూత్రవిసర్జన కోసం చాలాసేపు టాయ్లెట్లో గడపాల్సి వస్తున్నా, ధార సరిగా లేకపోయినా, విసర్జన తర్వాత కొంత మిగిలిపోయినట్లు అనిపిస్తున్నా... ఒకసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకుని, అవసరాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవడం మేలు. సమస్య నిర్ధారణ ఇలా ► ఈ సమస్య నిర్ధారణ కోసం వైద్యులు ‘డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్’ (డీఆర్ఈ) ద్వారా ప్రోస్టేట్ పెరిగినదీ, లేనిదీ తెలుసుకుంటారు. దాంతో పాటు... ► మైక్రోస్కోప్ సహాయంతో ఏవైనా ఇన్ఫెక్షన్స్ను అన్వేషిస్తూ చేసే మూత్రపరీక్ష ► యూరిన్ కల్చర్ ఎగ్జామినేషన్ ► మూత్ర ప్రవాహ వేగం (యూరనరీ ఫ్లో / యూరోఫ్లోమెట్రీ) ► పొత్తికడుపు భాగంలో నిర్వహించే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ పరీక్ష ద్వారా మూత్రపిండాలు (కిడ్నీ), యురేటర్ (మూత్రపిండం నుంచి మూత్రపు సంచి వరకు ఉండే ట్యూబ్) , మూత్రపు సంచి (బ్లాడర్)ల పరిమాణంతో పాటు మూత్రపు సంచిలో మూత్రం మిగిలిపోతోందా అన్న విషయాలు తెలుస్తాయి. ► బ్లడ్ యూరియా, క్రియాటినైన్ పరీక్షలు. డా. వి. చంద్రమోహన్, సీనియర్ యూరాలజిస్ట్, యూరో సర్జన్ -
పురుషులకే క్యాన్సర్ ముప్పు అధికం.. ఈ పరీక్షలు తప్పనిసరి.. లక్షణాలేంటంటే?
యువతలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలలో స్నేహితులు, సరదాలు, ఎక్కువ. ఈ క్రమంలో సరదగా, టైమ్‌పాస్‌గా మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, బయటతిండి తినడం కూడా వాళ్లలోనే ఎక్కువ. బయటి ఆహారం అందంగా కనిపించడానికి వాటిల్లో నూనెలు, ఉప్పుకారాలు ఎక్కువగా వాడటమే కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, కెమికల్స్, వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు. దురలవాట్లు, బయటి తిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవడం, వాతావరణ కాలుష్యానికి గురవ్వడం, నైట్‌డ్యూటీలు, ఏసీ రూముల్లో నిద్రలేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం ఇలా కారణాలు ఏమైతేనేం... మొత్తంగా చూస్తే పురుషులు స్త్రీలకంటే క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతారని మనం గమనించగలం. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ తప్పితే ఇంక ఏవి తీసుకున్నా స్త్రీలకంటే పురుషుల్లోనే ఎక్కువ. కారణాలు... ఉప్పు కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఇంకా దురలవాట్లు ఉండటం వంటి అంశాలు పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తుంటాయి. అందుకే భారతదేశంలోని పురుషులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడటం ఎక్కువ అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవడం చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. అలవాట్లు, జీవనశైలి, ఆహారం ఆరోగ్యకరంగా లేకపోవడంతో పాటు పురుషుల్లో వారి వృత్తిపరమైన కారణాలూ ఉంటాయి. ఆస్బెస్టాస్ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్ కంపెనీల్లో పనిచేసేవారు, ఆల్కహాలిక్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీ, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లైడ్, చెక్కపొడి, గామారేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారికి ఊపిరితిత్తులు – హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్... ఇతర వృత్తుల వారి కంటే ఎక్కువగా వచ్చే ముప్పు ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరగడం లేదా ఎండ అస్సలు తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి కూర్చుని పనిచేయడం, నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్‌కు మగవారే ఎక్కువగా గురవుతారు కాబట్టి వారికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా పురుషులు... అమ్మ లేదా భార్య ఏవి పెడితే అవి తింటూ ఉంటారు. వారు దగ్గరగా లేనప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు తేలికగా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా ఊబకాయం ముప్పు కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. నిర్ధారణ పరీక్షలు... పురుషుల్లో వయసు పైబడ్డాక సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోడానికి పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్) అనే రక్తపరీక్షను 50 ఏళ్లు పైబడ్డాక చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు... వీర్యంలో, అలాగే మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్రసంబంధ సమస్యల వంటి లక్షణాలతో కనిపించేసరికి... దశ ముదిరిపోయి ఎముకలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్ఏ పరీక్షలో యాంటిజెన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీక్షలు, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్ఏ, డీఆర్ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు ఎంతకాలం తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే మంచిదో తెలుసుకోవాలి. పీఎస్ఏ పరీక్షల్లో మార్పులు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలనే విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి. పురుషుల్లో ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయడం తగదు. 1. తగ్గని దగ్గు; ఆ దగ్గుతో పాటు రక్తం పడటం. 2. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం 3. అంతుపట్టని జ్వరం, స్పష్టమైన కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం 4. మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం 5. మలవిసర్జనలో రక్తస్రావం 6. తీవ్రమైన అజీర్తి 7. గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం 8. నోటిలో మానని పుండ్లు 9. ఎముకల్లో నొప్పులు. పై లక్షణాలను ఇన్ఫెక్షన్స్ అనీ, పైల్స్ అనీ, రోగనిరోధక శక్తి తగ్గిందనీ, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తూ ఉండటం మామూలేనంటూ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. కానీ వయసు కాస్త పైబడి, దురలవాట్లు ఉండి, లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి ఆ మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, క్యాన్సర్లపై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. -
ప్రొస్టేట్ క్యాన్సర్‌పై నానో కత్తి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ శాపంగా పరిణమిస్తోంది. దీన్ని గుర్తించిన తర్వాత రేడియో థెరపీ లేదా ఆపరేషన్ చేసి ప్రొస్టేట్ గ్రంధిని తొలగించడమనే మార్గాలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా దీన్ని పూర్తిగా నిర్మూలించే సరికొత్త చికిత్సా విధానంపై డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంటలోపు పూర్తయ్యే ఈ చికిత్స ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నయం చేస్తుందంటున్నారు. ఈ చికిత్సలో మందులకు లొంగని కణతులపైకి ఎలక్ట్రిక్ తరంగాలను పంపి వాటిని నాశనం చేస్తారు. ‘నానో నైఫ్’గా పిలిచే ఈ సరికొత్త చికిత్సా విధానం చాలా సులువైనదని, సైడ్ ఎఫెక్టులు చాలా స్వల్పమని యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ సర్జన్లు చెప్పారు. నిజానికి ఈ నానో నైఫ్ చికి త్సను ఇప్పటికే లివర్, క్లోమ క్యాన్సర్లలో వాడుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌పై దీన్ని తొలిసారి వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఏమిటీ నానో నైఫ్.. ఈ ట్రీట్మెంట్ పేరు నానో నైఫ్ కానీ, నిజంగా చికిత్సలో నైఫ్ (కత్తి) వాడరు. చర్మం ద్వారా ఒక సూదిని పంపి ఆల్ట్రాసౌండ్స్ను ఉపయోగించి కణతులను (ట్యూమర్లు) గుర్తిస్తారు. అనంతరం ఆ కణితి చుట్టూ నాలుగు సూదులు గుచ్చుతారు. వీటి ద్వారా నానో నైఫ్ మిషన్ ఎలక్ట్రిక్ తరంగాలను పంపుతుంది. ఈ తరంగాలు కణతుల్లోని కణాలపై ఉండే త్వచాన్ని ధ్వంసం చేస్తాయి. దీంతో ఆ కణుతులు నాశనం అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ 45–60 నిమిషాల్లో పూర్తవుతుంది. లకి‡్ష్యత కణుతులపైకి కరెంట్ తరంగాలను పంపి నిర్వీర్యం చేసే ఈ పద్దతిని ఇర్రివర్సబుల్ ఎలక్ట్రోపోరేషన్ అంటారు. దీనివల్ల కణతులకు చుట్టుపక్కల కణజాలంపై పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుంది. సాంకేతికత సాధించిన విజయాల్లో ఇది ఒకటని ఈ ఆపరేషన్ తొలిసారి నిర్వహించిన డాక్టర్ ఆలిస్టర్ గ్రే అభిప్రాయపడ్డారు. ముదిరితే కానీ తెలియదు.. మగవారిలో మూత్రాశయం దిగువన ఉండే ప్రొస్టేట్ గ్రంధిలో కణజాలం అదుపుతప్పి పెరగడాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంభవించే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో, పురుషుల్లో ఈ క్యాన్సర్ అంతే ప్రమాదకారిగా మారింది. ఏటా లక్షలమంది దీని బారినపడి మరణిస్తున్నారు. ఇతర క్యాన్సర్లలో కనిపించినట్లు ఈ క్యాన్సర్ సోకగానే లక్షణాలు కనిపించవు. దీంతో చాలామందిలో ఇది సోకిన విషయం చివరి దశలో కానీ బయటపడదు. మూత్ర విసర్జనలో ఇబ్బంది అనిపిస్తే డాక్టర్లు ప్రొస్టేట్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. బయాప్సీ ద్వారా ఈ క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. రేడియోథెరపీ నిర్వహించడం, ఆపరేషన్‌తో కణుతులను తొలగించడం వంటి చికిత్సామార్గాలున్నాయి. అయితే వీటితో సైడ్ ఎఫెక్టులు ఎక్కువ. ఇండియాలో ఏడాదికి సుమారు లక్షకుపైగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 85 శాతం కేసులు 3, 4వ దశల్లో మాత్రమే గుర్తించడం జరుగుతోంది. ఇది సోకడానికి నిర్దిష్ఠ కారణాలు తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేనివారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం ద్వారా ఇది రాకుండా నివారించవచ్చు. – నేషనల్ డెస్క్,సాక్షి -
జాతి వివక్ష పోరాట యోధుడు అస్తమయం
జొహన్నెస్‌బర్గ్/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు(90) అస్తమించారు. ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు ఆదివారం వేకువజామున కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్ టుటు, ప్రొస్టేట్ కేన్సర్ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్‌బిషప్ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’గా నోబెల్ ఇన్స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది. మండేలాతో విడదీయరాని మైత్రి మొదట జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా ఉన్న టుటు తర్వాత కేప్‌టౌన్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది. -
77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!
77 year Old Astrophysicist Battling Stage 4 Prostate Nails Ice Skating: మనషి ఎప్పుడూ నిత్య విద్యార్థిలా చివరి దశ వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆచరణ వరకు వస్తే అంతగా ఎవరూ పూర్తి స్థాయిలో చేయడానికి ఆసక్తి చూపరనే చెప్పాలి. ఏదో ఒక కారణంతో మన కలలను, లక్ష్యాలను వదిలేసి మనం ఇంతవరకే సాధించగలం అని సరిపెట్టేసుకుంటారు. కానీ ఇక్కడొక వృద్ధుడు మరణానికి దగ్గరలో ఉన్నా కూడా ఐస్ స్కేటింగ్ చేయాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. అసలు విషయంలోకెళ్లితే...రిచర్డ్ ఎప్స్టీన్ అనే 77 ఏళ్ల వృద్ధుడు రెండేళ్లకు పైగా క్రానిక్ లింఫాటిక్ లుకేమియా (సిఎల్‌ఎల్)తో పోరాడి బయట పడిన తర్వాత మళ్లీ 2020లో స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్ భారిన పడతాడు. అయితే అవేమి ఆ వృద్ధడు పెద్దగా పట్టించకోడు. పైగా ఐస్ స్కేటింట్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు దీని కోసం ఒక స్కేటింగ్ టీచర్ వద్ద ట్రైయినింగ్ కూడా తీసుకుంటాడు. ఈ మేరకు అతని కూతురు మహిళ రెబెకా బాస్టియన్ తన తండ్రి విజయవంతంగా ఐస్ స్కేటింగ్ నేర్చుకోవడమే కాక గురువుతో కలిసి స్కేటింగ్ చేస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు తన తండ్రి ఖగోళ శాస్త్రవేత్త అని మౌంట్ రైనర్‌ను అధిరోహించిన సాహసి అని కూడా వెల్లడిస్తుంది. పైగా నేర్చకునే వయసు అయిపోయింది, నా పరిస్థితి ఏం బాగోలేదు అని కూర్చోకూడదని కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ జీవితాన్ని ఆస్వాదించాలంటూ ట్విట్టర్లో పేర్కొంటుంది. అయితే ప్రసుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. My father is 77 years old and has stage 4 prostate cancer. He decided to learn how to ice skate a few years ago, and just did this performance with his teacher. For anyone that thinks it’s too late to try something new… ❤️ pic.twitter.com/0SZ3FmbNGE — Rebekah Bastian (@rebekah_bastian) December 9, 2021 -
నో షేవింగ్.. 3,500 కోట్లు సేవింగ్
సాక్షి, హైదరాబాద్: వీరంతా కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు. సహజంగా వైద్యులు ప్రతీరోజూ గడ్డాలు తీసి మీసాలు ట్రిమ్ చేసుకొని ఫ్రెష్‌గా కనిపిస్తారు. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్న డాక్టర్లు గడ్డాలు, మీసాలు పెంచుకొని ఉండటం గమనించారా? సమయం లేకపోవడం వల్ల ఇలా పెంచుకోలేదు. ప్రొస్టేట్ కేన్సర్‌పై అవగాహన కోసం ఇలా ఈ నెలంతా ఇలా పెంచారు. అలాగే మహిళా వైద్యులు, సిబ్బంది బ్యూటీపార్లర్లకు ఈ నెలంతా వెళ్లలేదు. ఇలా హైదరాబాద్‌లో పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది, కేన్సర్ రోగులు, వారి బంధువులు వందలాది మందికి వ్యాధిపై అవగాహన కోసం ప్రత్యేకంగా నవంబర్‌ను ‘మవంబర్’ నెలగా పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్‌ను ప్రొస్టేట్ కేన్సర్‌పై అవగాహన నెలగా పాటిస్తోంది. ఆస్ట్రేలియాలో మొదలైన ఉద్యమం... పురుషుల్లో కొందరికి 60–70 ఏళ్ల తర్వాత ప్రొస్టేట్ కేన్సర్ వస్తుంది. సహజంగా మగవారిలో కేన్సర్‌పై అవగాహన తక్కువ. ఆ పరిస్థితిని మార్చడం కోసం ఆస్ట్రేలియాలో 2దశాబ్దాల క్రితం ఒక ఉద్యమం మొదలైంది. నవంబర్‌లో గడ్డం, మీసాలు, జుట్లు పెంచి ప్రజల్లో వినూత్నంగా కనిపిస్తూ కేన్సర్‌పై అవగాహన పెంచేవారు. సెలూన్‌కు వెళ్లకుండా మిగిలిన డబ్బును కేన్సర్ రోగులకు సాయం చేయడం, స్క్రీనింగ్ టెస్టులు చేయించడం, అవగాహన కార్యక్రమాలకు వెచ్చించేవారు. మహిళా డాక్టర్లు, సిబ్బంది తదితరులు కూడా బ్యూటీపార్లర్లకు వెళ్లడం ఆపేశారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో 15 లక్షల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, కేన్సర్ రోగులు, వారి బంధువులు, స్నేహితులు ఇలాగే చేస్తున్నారు. ఇలా ఏడాదికి రూ.3,500 కోట్లు మిగుల్చుతున్నారు. ఐదేళ్ల నుంచి ఈ ఉద్యమం మన దేశంలోనూ మొదలైంది. ఢిల్లీ, హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలోనూ, సీసీ ఫౌండేషన్ సిబ్బంది దీన్ని పాటిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే వేయి మంది డాక్టర్లు ఈ నెలంతా గడ్డం, మీసాలు, జుట్టు పెంచుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 10 వేల నుంచి 15 వేల మంది వరకు ఈ విధానాన్ని పాటిస్తున్నారని అంచనా. నవంబర్ గడిచాక పొదుపు చేసిన సొమ్మును సంబంధిత చారిటబుల్ ట్రస్టుకు అందజేస్తారు. ఐదేళ్లుగా పాటిస్తున్నా.. ఐదేళ్లుగా నవంబర్‌లో ఈ విధానాన్ని పాటిస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో ఇలా చేయడం ద్వారా మిగిలిన లక్షల రూపాయలను ప్రొస్టేట్ కేన్సర్‌పై అవగాహనకు ఖర్చు చేస్తున్నాం. ఈ ఏడాది రెండు లేబొరేటరీలు రూ.100కే పీఎస్ఏ టెస్టులు చేయడానికి ముందుకొచ్చాయి. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో 90 మందిమి ఈ ఉద్యమం చేస్తున్నాం. ఇందులో పురుషులు, మహిళలు ఉన్నారు. – డాక్టర్ ఎ.వి.సురేష్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కాంటినెంటల్ ఆసుపత్రి -
ప్రోస్టేట్ కేన్సర్ ముందస్తు లక్షణాలివే! ఈ జాగ్రత్తలు పాటించారంటే పురుషుల్లో ఆ సమస్య..
Leading Cause Of Cancer Deaths In Men Is Prostate Cancer And Risk Factors For Prostate Cancer: మన దేశంలో గత కొన్నేళ్లుగా పురుషుల్లో వెలుగు చూస్తున్న కేన్సర్ కేసుల్లో అత్యధిక శాతం ప్రోస్టేట్ కేన్సర్స్ ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రకరకాల కారణాల వల్ల ప్రోస్టేట్ కేన్సర్ వ్యాధి గ్రస్థులు పెరుగుతున్న నేపధ్యంలో అపోలో ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్–యూరాలజిస్ట్ డా.ప్రియాంక్ సలేచా ఈ వ్యాధికి సంబంధించిన పలు విశేషాలు, నివారణ మార్గాలు సూచిస్తున్నారు. అవగాహన కీలకం.. ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడం, అపోహలు కూడా ప్రోస్టేట్ పరీక్షల కోసం వైద్యుని దగ్గరకు వెళ్లే విషయంలో వెనుకాడేలా చేస్తున్నాయి. ప్రోస్టేట్ కేన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత ఎక్కువగా చికిత్స విజయవంతం అయే అవకాశాలు ఉన్నాయి.అలా జరగాలంటే ప్రోస్టేట్ కేన్సర్ బారినపడేందుకు ముందుగా శరీరంలో సంభవించే హెచ్చరిక సూచికలను గమనించాల్సి ఉంటుంది. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో ఉండే ఒక అవయవం ప్రోస్టేట్. ఇది శరీరపు మూత్ర విసర్జన విధులకు అనుసంధానించి ఉంటుంది. అన్ని వయసుల వారికీ ప్రోస్టేట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే 50 ఏళ్లు పై బడిన పురుషులు ఈ లక్షణాల పట్ల అవగాహన పెంచుకుని, ముందస్తు సూచికలను పసిగట్టగలగాలి. అదే విధంగా తరచుగా ప్రోస్టేట్ పరీక్షలు చేయిస్తూ ఉండడం కూడా ప్రోస్టేట్ ఆరోగ్యం సవ్యంగా ఉంచేందుకు, తొలిదశలోనే ఏ వ్యాధినైనా అడ్డుకునేందుకు అవసరం. చదవండి: Wild Facts About Octopuses: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! ప్రోస్టేట్‌కు అనుబంధంగా వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఇన్ఫ్లమేషన్, ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ (బిపిహెచ్)... ప్రోస్టేట్ కేన్సర్ వరకూ దారితీస్తాయి. తొలి దశలోనే కేన్సర్‌ను గుర్తించిన కేసుల్లో అది ప్రోస్టేట్ అవయవం వరకూ మాత్రమే పరిమితమై, చికిత్స, కోలుకోవడం మరింత సులభంగా, ప్రభావవంతంగా సాధ్యపడుతోంది. లక్షణాలను గుర్తించేలోగానే ఒకవేళ కేన్సర్ ఇతర అవయవాలకు కూడా విస్తరించినట్లయితే చికిత్స సంక్లిష్టంగా మారడం అలాగే కోలుకునేందుకు పట్టే సమయం కూడా పెరగడం వంటివి జరుగుతాయి. లక్షణాలివే... ►రాత్రి సమయంలో తరచు మూత్ర విసర్జన అవుతుంటుంది. ప్రొస్టేట్ అవయవం ఎన్లార్జ్ అవడం వల్ల యురేత్రా మీద అదనపు ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది. తద్వారా మూత్ర విసర్జన సరఫరాకి అడ్డంకులు ఏర్పడి మూత్ర కోశం గోడల ఇరిటేషన్‌కు కారణమవుతుంది. ఈ పరిస్థితి తరచుగా రాత్రి సమయంలో చోటు చేసుకుంటుంది. ►కేన్సర్ సోకి వృద్ధి చెందే దశలో ఇది పలు రకాల గుర్తించదగిన లక్షణాలు వెల్లడయేలా చేస్తుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, నుంచుని మూత్ర విసర్జన చేసేందుకు ఇబ్బంది పడడం, ధార బలహీనంగా పోవడం... వంటివి ఉంటాయి. ►మూత్రంలో రక్తం కనపడడం అనేది రకరకాల వ్యాధులకు సూచిక అలాగే ప్రోస్టేట్ కేన్సర్‌కి కూడా. ఈ లక్షణం కనపడిందంటే.. కేన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌కి చేరినట్టు అర్ధం. ►పురుషుల పునరుత్పత్తి కి సంబంధించి కీలకమైన అవయవం కాబట్టి, ప్రోస్టేట్... స్కలన సమయంలో నొప్పితో పాటు రకాల ఇబ్బందికర భావనలు వచ్చేందుకు కేన్సర్ కారకమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది అంగస్తంభన వైఫల్యాలకు కూడా దారి తీస్తుంది. ►కేన్సర్ పెరుగుతున్న కొద్దీ... ప్రోస్టేట్ గ్లాండ్ మరింత ఎన్లార్జ్ అయి పురీష నాళంపై నిర్విరామంగా ఒత్తిడి కలిగిస్తుంది. పైన పేర్కొన లక్షణాలు మాత్రమే కాకుండా మరే విధమైన అసాధారణ మార్పులు కనపడినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం తప్పనిసరి. కేన్సర్ స్టేజ్ మీద ఆధారపడి రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్సలను నిపుణులు సూచిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, హైడ్రేషన్ వంటివి శరీరానికి అవసరం లేని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. - డా.ప్రియాంక్ సలేచా కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్–యూరాలజిస్ట్ అపోలో ఆసుపత్రి చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! -
మూత్రంలో ఇబ్బందా? ప్రోస్టేట్ పరీక్ష చేయించుకోండి
మగవారిలో ప్రోస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌ను ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. మనకు వీర్యంలో కనబడే ద్రవాన్ని ఇది తయారుచేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్లడానికి ఈ ద్రవం ఉపయోగపడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. మొదటిదశలో ఇది ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది లేదా కొందరి లో చికిత్స చేయాల్సిన అవసరమే రాకపోవచ్చు. కానీ కొన్ని రకాల ప్రోస్టేట్ క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే... అంటే గ్రంథికి పరిమితమైన దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభదశలో... దానికి సంబంధించిన ఎలాంటి లక్షణాలూ బయటపడకపోవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రం లో లేదా వీర్యంలో రక్తం పడటం, మూత్రం ధారగా రాకపోవడం, కాళ్లవాపు, ఎముకలలో నొప్పి, పొత్తికడుపులో ఇబ్బంది... వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేం. వయసు పైబడటం, కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండటం, స్థూలకాయం వంటి ప్రోస్టేట్‌కు కారణాలు కావచ్చు. పురుషులు తమ 50 ఏటికి చేరగానే క్రమం తప్పకుండా ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ (పీఎస్ఏ) పరీక్షల ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షలలో రిపోర్ట్ ‘అబ్నార్మల్’గా వస్తే, అల్ట్రాసౌండ్, బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలి, బయాప్సీలో పాజిటివ్‌గా వస్తే గ్రేడింగ్ చేయించుకోవాలి. అంటే వ్యాధి తీవ్రత ఏ దశలో ఉందో గుర్తించాలి. వ్యాప్తిని గుర్తించడం క్యాన్సర్ వ్యాధి ప్రోస్టేట్ గ్రంథిని దాటి ఇతర అవయవాలకూ వ్యాప్తి చెందిందా అని అనుమానం వస్తే సీటీ స్కాన్, ఎమ్మారై వంటి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ దశలు (స్టేజ్‌లు) స్టేజ్ – 1 : మొదటి స్టేజ్‌లో ఉందంటే క్యాన్సర్ చాలా ప్రాథమిక దశలో ఉందని అర్థం. స్టేజ్ – 2 : ఈ దశలో క్యాన్సర్ సులభంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రోస్టేట్ గ్రంథికే పరిమితమై ఉంటుంది. స్టేజ్ – 3 : ఈ దశలో క్యాన్సర్... ప్రోస్టేట్ గ్రంథిని దాటి వీర్యవాహికలు లేదా సమీపంలోని ఇతర కణాజాలానికి పాకి ఉండవచ్చు. స్టేజ్ – 4 : ఈ దశలో లింఫ్ గ్రంథులు, ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు పాకి ఉంటుంది. చికిత్స వెంటనే అవసరం పడకపోవచ్చు... క్యాన్సర్ మొదటిదశలో ఉన్నవారికి వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అప్రమత్తతో వేచిచూడాల్సిందిగా డాక్టర్లు రోగులకు సూచిస్తారు. అంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, పురీషనాళ పరీక్షలు, అవసరమైతే బయాప్సీ వంటివి చేయించుకుంటూ శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అప్రమత్తతతో వేచిచూడటం అనేది క్యాన్సర్ చాలా నెమ్మదిగా వృద్ధిచెందుతున్నవారికీ, క్యాన్సర్ లక్షణాలు బయటపడని వారికి డాక్టర్లు సూచిస్తారు. క్యాన్సర్ వృద్ధి చెందుతున్నట్లు గమనిస్తే శస్త్రచికిత్స, రేడియోథెరపీ వంటి చికిత్స పద్ధతులను ఉపయోగిస్తారు. రేడియేషన్ థెరపీ : ఇందులో అధికశక్తి కలిగిన రేడియోధార్మిక కిరణాలు ఉపయోగించి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో రెండు రకాలుగా రేడియేషన్ ఇస్తారు. శరీరం బయట నుంచి రేడియోధార్మికతను ఇవ్వడం, శరీరం లోపలే రేడియోధార్మిక కిరణాలు ప్రసరించేలా ఏర్పాటు చేయడం (బాకీథెరపీ). హార్మోన్ థెరపీ : ఇందులో శరీరంలోని టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నిలిపివేస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో క్యాన్సర్ కణాలు టెస్టోస్టెరాన్ మీద ఆధారపడి వృద్ధి చెందుతుంటాయి. దాని సరఫరాను నిలిపివేయడం వల్ల క్యాన్సర్ కణాల వృద్ధి మందగించడం గానీ, అవి చనిపోవడంగానీ జరుగుతుంది. హార్మోన్ థెరపీని వివిధ రకాలుగా ఇవ్వవచ్చు. మందులతో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నిలిపివేయడం.. వృషణాలు టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అవి టెస్టోస్టెరాన్ను ఉత్పిత్తి చేయకుండా కొన్ని రకాల మందుల ద్వారా నిరోధించవచ్చు. టెస్టోస్టెరాన్ను క్యాన్సర్ కణాలకు అందకుండా చేయడం... ‘యాంటీ–యాండ్రోజన్’ మందుల ద్వారా టెస్టోస్టెరాన్ క్యాన్సర్ కణాలకు అందకుండా చేయవచ్చు. వృషణాలను తొలగించడం : రెండు వృషణాలను తొలగించడం ద్వారా శరీరంలో టెస్టోస్టెరాన్ పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఇది కూడా హార్మోన్ థెరపీలాంటిదే. ఈ పద్ధతిలో టెస్టోస్టెరాన్ స్థాయిని వేగంగా తగ్గించవచ్చు. అయితే దీన్ని క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నవారికి మాత్రమే ఉపయోగిస్తారు. క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్నవారికి హార్మోన్ థెరపీ సరిపోతుంది. వృషణాలను తొలగించాల్సిన అవసరం ఉండదు. హార్మోన్ థెరపీ వల్ల క్యాన్సర్ కణుతులు కుంచించుకుపోతాయి. ఆ తర్వాత రేడియేషన్ చికిత్స చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. శస్త్రచికిత్స: శస్త్రచికిత్సలో ప్రోస్టేట్ గ్రంథిని, దాని చుట్టుపక్కల కణాజాలాన్ని, లింఫ్ గ్రంథుల్లో కొంతభాగాన్ని తొలగిస్తారు. అయితే దీనివల్ల అంగస్తంభన సమస్య. మూత్ర విసర్జనలో సమస్యలు తలెత్తవచ్చు. కీమోథెరపీ : ఇందులో మందుల ద్వారా క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రయత్నిస్తారు. కీమోథెరపీలో మందులను ఇంజెక్షన్ల రూపంలో గానీ, మాత్రల రూపంలో గానీ ఇస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్ బాగా ముదిరి, శరీరంలోని ఇతర భాగాలకు పాకినట్లయితే కీమోథెరపీ ఇస్తారు. నిత్యం వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు. -
అక్కడ 36 వేల మందికి ప్రాణాపాయం!
సాక్షి, న్యూఢిల్లీ : 61 ఏళ్ల క్రిస్ డర్కన్ మార్చి 23వ తేదీన ఆస్పత్రికెళ్లి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోగా ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. బిర్మింగమ్లో భార్య అలిసాన్తో కలిసి నివసిస్తోన్న డర్కన్‌కు వంశ పారంపర్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినట్లు తేలింది. ఆయన తాత, తండ్రులతోపాటు టామ్ అనే 46 ఏళ్ల తమ్ముడికి కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చిందట. ఆయన తమ్ముడు ఏడాది క్రితమే ఆపరేషన్ చేయించుకొని ప్రాణాపాయం నుంచి బయట పడ్డారట. అలాంటి అదష్టం తనకు లేనందుకు క్రిస్ డర్కన్ ప్రస్తుతం కుమిలిపోయారు. డర్కన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉందని తేలిన మరుసటి రోజు నుంచే లండన్‌లో లాక్డౌన్ అమలు చేశారు. ఆయనకు హైగ్రేడ్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్నందున బయాప్సీ నిర్వహించాలంటూ ఆస్పత్రి నుంచి ఓ లేఖ వచ్చిందట. ఆయన ఆగమేఘాల మీద ఆస్పత్రికి వెళ్లగా బయాప్సీ నిర్వహించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయట. లాక్డౌన్ కారణంగా ఆస్పత్రి అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని వైద్య సేవలను నిలిపి వేశారని చెప్పారట. ఆ తర్వాత ఆయన ఏ ఆస్పత్రికి వెళ్లి ఇలాంటి సమాధానాలే వినాల్సి వచ్చింది. ఆ తర్వాత డర్కన్ జూన్ 9వ తేదీన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయాప్సీ చేయించుకున్నారు. క్యాన్సర్ ప్రమాదకర స్థాయిలో ఉందని తేలడంతో ఆయనకు ఆగస్టు నెలలో ‘ర్యాడికల్ ప్రొస్టేటెక్టమీ’ చేసి ఆ గ్రంధిని తొలగించారు. దాదాపు ఐదు నెలలపాటు శస్త్ర చికిత్స జరిగే వరకు బతుకుతానో, లేదోననే భయాందోళనల మధ్య ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు ఆయన చెప్పారు. లండన్‌లో ఆయన లాగా భయాందోళనలకు గురవుతున్న వారు ఏడు వేల నుంచి 36 వేల వరకు ఉన్నట్లు క్యాన్సర్ రిసెర్చ్ హబ్ ‘డాటా–కెన్’ వెల్లడించింది. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రాబల్యం ఇంకా తగ్గక పోవడంతో క్యాన్సర్ సహా అత్యవసరంకానీ ఆపరేషన్లన్నీ ఇప్పటికీ నిలిచిపోయాయి. -
ప్రోస్టేట్‌తో పాటు కిడ్నీ క్యాన్సర్ అంటున్నారు...
మా అన్నయ్య వయసు 48 ఏళ్లు. కొద్దికాలంగా ప్రోస్టేట్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈమధ్య తరచూ యూరిన్ సమస్యలు ఎక్కువకావడం, జ్వరం కూడా ఎక్కువగా రావడంతో పెద్దాసుపత్రిలో చూపించాం. అన్ని రకాల పరీక్షలు చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పారు. ఎడమ కిడ్నీలోని కొంతభాగానికి కూడా క్యాన్సర్ సోకిందరి పరీక్షల్లో తేలింది. రొబోటిక్ వైద్య విధానంలో ‘ప్రోస్టెక్టమీ’, ‘నెఫ్రెక్టమీ’ శస్త్రచికిత్స చేయించాలని ఇక్కడి డాక్టర్లు చెపా్పరు. దయచేసి మాకు ఈ వ్యాధి గురించి, దాంతో పాటు ఈ శస్త్రచికిత్సల గురించి వివరంగా తెలియజేయండి. మా అన్నయ్యకు ఇంకా చాలా జీవితం ఉంది. ఈ వయసులోనే ప్రోస్టేట్ గ్రంథిని తొలగిస్తే తర్వాత వచ్చే దుష్ఫలితాలు, వ్యంధ్వత్వం వంటివి ఏమైనా వస్తాయా? అలాగే ఇంత పెద్ద సర్జరీ చేయడం వల్ల ప్రాణహాని ఏదైనా ఉంటుందా అని మా కుటుంబం మొత్తం చాలా ఆందోళన పడుతున్నాం. దయచేసి అన్నీ వివరంగా తెలపగలరు. ముందుగా మీరు అడిగిన వివరాల ప్రకారం వరసగా మీకు సమాధానం ఇస్తాను. మీరు సర్జరీ విషయంలో ఎక్కువగా ఆందోళన చెందవద్దు. మీ కుటుంబసభ్యులకు కూడా భయపడొద్దని చెప్పండి. ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లకు ఇప్పుడు అత్యాధునికమైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రోస్టేట్ గ్రంథిలో సమస్యలున్నప్పుడు... మరీ ముఖ్యంగా క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని తొలగించాల్సి వస్తుంది. ఈ శస్త్రచికిత్సను ‘రాడికల్ ప్రోస్టెక్టమీ’ అంటారు. లాపరోస్కోపీ ద్వారా ప్రోస్టేట్ను తొలగించేసమయంలో దాని చుట్టుపక్కల ఉన్న చిన్న నాడులు సరిగా కనిపించక పొరబాటున అవి తెగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యంధత్వం వచ్చే అవకాశాలుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ తొలగిపోయి, ప్రాణాపాయం తప్పిపోయినప్పటికీ వాళ్లు ఇంపొటెంట్ కావడం చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటపుపడు ఈ సమస్య రాకుండా సర్జరీ చేయడం రొబోటిక్స్ ద్వారా సాధ్యమవుతుంది. లోపల ఉన్న శరీర భాగాలు పదివంతులు ఎక్కువ పెద్దగా కనిపించడం వల్ల చిన్న చిన్న నాడులు సైతం స్పష్టంగా కనిపిస్తుంటాయి. కాబట్టి అవి తెగిపోకుండా జాగ్రత్తగా సర్జరీ చేయడం సాధ్యమవుతుంది. ఇక కిడ్నీ ట్యూమర్లు / క్యాన్సర్లు / పెద్ద పెద్ద ట్యూమర్లు ఉంటే కొన్ని సందర్భాల్లో కిడ్నీ మొత్తాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇలా తొలగించే ప్రక్రియను ‘రాడికల్ నెఫ్రెక్టమీ’ అంటారు. కానీ చిన్నసైజు ట్యూమర్లు ఉన్నప్పుడు కణితి వరకు మాత్రమే తీసేసి, మిగిలిన కిడ్నీని కాపాడవచ్చు. దీన్ని ‘పార్షియల్ నెఫ్రెక్టమీ’ అంటారు. ఓపెన్, లాపరోస్కోపీ, రొబోటిక్ సర్జరీ ఇలా అన్ని ప్రక్రియల ద్వారా కూడా పార్షియల్ నెఫ్రెక్టమీ చేయవచ్చు. కానీ రొబోటిక్స్ ద్వారా మరింత సమర్థంగా ఈ శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుంది. ట్యూమర్‌ను తొలగించే సమయంలో కిడ్నీని కట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు రక్తం ఎక్కువగా పోతుంది. ఇది అరగంట కన్నా ఎక్కువ సేపు జరిగితే కిడ్నీ డ్యామేజీ అవుతుంది. కానీ రొబోటిక్స్ ద్వారా కిడ్నీ కట్ చేయడం, కుట్లు వేయడం చాలా తొందరగా అయిపోతాయి. కాబట్టి అధిక రక్తస్రావం ఉండదు. కిడ్నీ దెబ్బతినేందుకు ఆస్కారం ఉండదు. ఇప్పుడు రొబోటిక్స్ శస్త్రచికిత్సల గురించి సవివరంగా చెబుతాను. ఇప్పుడు ఎన్నో రకాల కిడ్నీ సమస్యలకు సురక్షితమైన పరిష్కారం చూపిస్తున్నది రొబోటిక్ సర్జరీ. వైద్యరంగంలో ఎన్ని మార్పులు వచ్చినా పేషెంట్ సేఫ్టీయే చివరి లక్ష్యంగా ఉంటుంది. మొదట్లో సర్జరీ అంటే పెద్ద కోత పెట్టి చేసే ఓపెన్ సర్జరీయే. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించివైతే ఛాతీ తెరచి సర్జరీ చేయాలి. పొట్టలోని అవయవాలకు సంబంధించినదైతే పొట్టపై గాటు పెట్టాలి. కానీ లాపరోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద కోత అవసరం లేకుండానే మూడు, నాలుగు రంధ్రాలు మాత్రమే పెట్టి చేసే కీహోల్ సర్జరీ రోగులకు వరప్రదాయని అయ్యింది. కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లకు కూడా లాపరోస్కోపీ చేసేవారు. ఇలా లాపరోస్కోపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత శరీరాన్ని కోసే బాధ తప్పింది. కేవలం చిన్న చిన్న గాట్లతో రంధ్రాలు చేసి లోపలికి కెమెరా, లాపరోస్కోపిక్ పరికరాన్ని పంపి సర్జరీ చేయవచ్చు. లోపలి అవయవాలను స్క్రీన్ మీద స్పష్టంగా చూడవచ్చు. వాటిని తెర మీద చూస్తూ లోపల సర్జరీ చేయవచ్చు. లాపరోస్కోపిక్ పరికరం 2డి విజన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల లోపలి అవయవాలను 2 డైమన్షనల్గా చూపిస్తుంది. కోత ఉండదు కాబట్టి రక్తస్రావమై రక్తం నష్టపోయే అవకాశం ఉండదు. హాస్పిటల్ కూడా మూడు, నాలుగు రోజులుంటే చాలు. త్వరగా కోలుకుంటారు. అయితే కొన్ని ప్రొసిజర్లలో లాపరోస్కోపీ చేయడం కష్టం. కిడ్నీలో ట్యూమర్ ఉంటే కణితి వరకే తీసేసి మిగిలింది కుట్లు వేయాలి. ఇది లాపరోస్కోపీలో కష్టం. దీనికి చాలా నైపుణ్యం అవసరం. ఎంతో అనుభవం కావాలి. స్థూలకాయం ఉన్నవాళ్లలో కూడా లాపరోస్కోపీతో ఆపరేషన్ ఇంకా కష్టమవుతుంది. ఇక రోబోతో చేసే సర్జరీకి రోబో చేతుల సహాయంతోనే డాక్టర్లు సర్జరీ చేయిస్తారు. తెరమీద లోపలి అవయవాలను చూస్తూ రోబో పరికరాన్ని ఎటు ఎలా తిప్పాలనేది డాక్టర్ కంట్రోల్ చేస్తుంటారు. అందుకు అనుగుణంగా రోబో చేతులు చకచకా ఆపరేషన్ చేసేస్తుంటాయి. రొబోటిక్ సర్జరీకి కూడా పెద్ద కోత పెట్టాల్సిన అవసరం ఉండదు. దీనికి కూడా లాపరోస్కోపీ లాగానే కేవలం ఒక సెం.మీ. గాట్లు... మూడ్నాలుగు పెట్టాల్సి ఉంటుంది. లాపరోస్కోపీ ద్వారా చేయలేని సర్జరీలను రోబోతో చేయవచ్చు. పైగా రోబో యంత్రానికి 3డి విజన్ ఉంటుంది. అందుకే లోపలి అవయవాలను 3 డైమన్షనల్గా చూడవచ్చు. ఓపెన్ సర్జరీలో డాక్టర్ తన చేతులతో చేసినట్లు ఇక్కడ రోబో చేతులు ఆపరేషన్ చేస్తాయి. మన చేతులను ఎలా పడితే అలా తిప్పగలిగినట్లే, రోబో చేయి కూడా 360 డిగ్రీలలో తిప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే మానవ హస్తం కంటే మరింత మిన్నగా ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఉదాహరణకు ఒక్కోసారి మానవహస్తం కాస్తంతైనా వణికే అవకాశమైనా ఉందేమోగానీ రోబో చేయి అలా వణకదు. లాపరోస్కోపీ అయితే ఒకరు కెమరా పట్టుకొని ఉండాలి. కానీ ఇందులో రోబో యంత్రానికే కెమెరా ఉంటుంది. ఈ సర్జరీలు చాలా సురక్షితం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. లోతుగా ఉండే అవయవాలకు చేయాల్సిన సర్జరీలు కూడా చాలా సులువుగా జరిగిపోతాయి. స్థూలకాయులకు కూడా చాలా సులువుగా సర్జరీలు చేయవచ్చు. కాబట్టి మీరు ఏమాత్రం ఆందోళన పడకండి. డా. వి. సూర్యప్రకాశ్, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
నైట్ డ్యూటీలు చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం !
చాలా మంది చిన్నపిల్లలు అలా టెన్త్ లేదా ఇంటర్ పూర్తి కాగానే పై చదవులకని పక్క ఊళ్లకు వెళ్లడం మామూలే. ఒక్కసారిగా దొరికిన ఆ స్వేచ్ఛతో సిగరెట్లకు అలవాటు కావడం కూడా చాలా సాధారణమే. అలాగే బాగా ఒత్తిడితో ఉండే ఉద్యోగాలూ, కాన్ఫరెన్సులు, మీటింగుల తర్వాత రిలాక్స్ కావడం కోసం పొగతాగడం చాలా మందిలో అలా మెల్లగా అలవాటవుతుంది. ఇలాంటి వ్యవహారాలు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు కాస్తంత ఎక్కువ. ఇలా మొదట సరదాగా, టైమ్‌పాస్ కోసం మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లతోపాటు బయటి తిండి ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ బయటి ఆహారం రుచికరంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం నూనెలు, ఉప్పుకారాలూ ఎక్కువగా వాడటంతోపాటు దేహానికి, ఆరోగ్యానికి హాని చేసే కొన్ని కృత్రిమరంగులు, రసాయనాలు వాడతారు. వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడటమూ జరుగుతుంది. ఇవన్నీ క్యాన్సర్‌కు కారణాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దురలవాట్లు, బయటితిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, వాతావరణ కాలుష్యం, నైట్‌డ్యూటీలు, రాత్రంతా నిద్ర లేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం... ఈ అన్నిరకాల కారణాలతో మహిళలతో పోలిస్తే పురుషులు మరింత ఎక్కువగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లు తప్పితే... మరే క్యాన్సర్లు తీసుకున్నా అవి మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ. ఇటీవల పురుషులు కూడా రొమ్ముక్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం పెరిగిపోయింది. ప్రపంచంవ్యాప్తంగా క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య పెరుగుతున్న ధోరణులను చూస్తే 2007 నుంచి 2030 నాటికి ఈ సంఖ్య ఇప్పటికంటే 45% ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్ పరీక్షలు ఎన్ని వచ్చినా క్యాన్సర్ రాకుండా నివారించగలగడం ఎవరి చేతుల్లోనూ లేదనేది సత్యం. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యయనాల ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య... అన్ని మరణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. సిగరెట్, బీడీలు, పాన్, గుట్కా, ఆల్కహాల్, పొగాకు నమలడం మొదలైనవి నోటి క్యాన్సర్‌కు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఏడాదీ దాదాపు 80,000 మంది వరకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఉప్పు, కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం ఇంకా దురలవాట్లు కూడా చాలా ఎక్కువగా ఉండటం పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తాయి. అందుకే భారతదేశంలోని పురుషులు ఈ క్యాన్సర్‌బారిన ఎక్కువగా పడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవ్వడం చాలా ఎక్కువగానే గమనిస్తున్నాం. అలవాట్లు, జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వంటివి క్యాన్సర్‌కు ముఖ్య కారణాలవడటంతోపాటు కొన్ని వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఆస్బెస్టాస్, అల్యూమినియం ఉత్పాదన కంపెనీల్లో, ఆల్కహాలిక్ బెవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీలు, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లియిడ్స్, చెక్కపొడి, గామా రేడియేష్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తల, మెడ భాగాల్లో (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అస్సలు ఎండ తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి పనిచేయడంతోపాటు నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్ వంటి వాటికి పురుషులే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. ఇక వారు పనుల కోసం బయటికి వెళ్లినప్పుడు తేలిగ్గా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కుగా తీసుకుంటూ ఉంటారు. దాంతో ఊబకాయం, క్యాన్సర్ ముప్పులు పొంచి ఉంటాయి. యాభైఏళ్లు పైబడ్డాక కనిపించే ప్రోస్టేట్క్యాన్సర్ను తెలుసుకునేందుకు పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్) అనే రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే వీర్యంలో, మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్ర సంబంధమైన సమస్యల వంటి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించేసరికి అది ముదిరిపోయి పక్కన ఉండే ఎముకలకూ పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్ఏ పరీక్షలో యాంటిజన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీలైన డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్ఏ, డీఆర్ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు మళ్లీ ఎంతకాలం తర్వాత చేయించుకుంటే మంచిది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే పీఎస్ఏ పరీక్షలో మార్పులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎతర పరీక్షలను ఎలాంటి లక్షణాలు కనిపించనప్పుడు చేయించుకోవాలి వంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. ఈ కింద లక్షణాలు కనిపిస్తే పురుషులు నిర్లక్ష్యం చేయడం తగదు. అవి... తగ్గని దగ్గు, దగ్గుతో పాటు రక్తం ఆకలి, బరువు తగ్గడం నొప్పితో పాటు జ్వరం, మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం మలవిసర్జనలో రక్తస్రావం ,తీవ్రమైన అజీర్తి, గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం నోటిలో మానని పుండ్లు, ఎముకల్లో నొప్పులు పై లక్షణాలు కనిపించినప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ అనో, పైల్స్ అనో, రోగనిరోధక శక్తి తగ్గిందనో, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తుందనో నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక వయసు పైబడ్డ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి మంచి జీవనశైలిపై అవగాహన పెంపొందించుకొని, ఆరోగ్యంగా జీవించడం చాలా ముఖ్యం. -
పొడగరులకు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు
పొడగరులకు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఐదున్నర అడుగుల పొడవు ఉండే వారితో పోలిస్తే ఆరడుగులకు పైబడి పొడవుగా ఉండే పురుషుల్లో ఈ ముప్పు 21 శాతం ఎక్కువగా ఉంటుందని ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పొడవుకు తోడు అధిక బరువు కూడా ఉన్నట్లయితే ఈ ముప్పు మరో 13 శాతం వరకు పెరుగుతుందని వారు అంటున్నారు. పొడవుగా ఉండేవారిలో నడి వయసులో నడుము చుట్టుకొలత నాలుగు అంగుళాలకు మించి పెరిగినట్లయితే ఈ ముప్పు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని, నడి వయసులో పెరిగే అదనపు బరువు వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిలో సంభవించే మార్పులే దీనికి కారణమని వారు వివరిస్తున్నారు. బ్రిటన్‌లో ప్రొస్టేట్ క్యాన్సర్ కారణంగా ఏటా 11 వేల మంది మరణిస్తున్నారని, వారిలో అధిక బరువు ఉన్న పొడగరులే ఎక్కువగా ఉంటున్నారని ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ అరోరా పెరెజ్ కోర్నాగో తెలిపారు. -
గాయని జెస్సికా తండ్రికి క్యాన్సర్..
లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ ప్రముఖ గాయని జెస్సికా సింప్సన్ తండ్రి, ప్రముఖ ఫొటోగ్రాఫర్ జో సింప్సన్(58) క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయన గత రెండు నెలల కిందట ప్రొస్టేట్ క్యాన్సర్‌కు గురయ్యారని పీపుల్ మేగజిన్ తెలిపింది. ప్రస్తుతం ఆయన సర్జరీ చేయించుకున్నారని, తిరిగి కోలుకుంటారని, నిండైన ఆశాభావంతో కనిపించారని మేగజిన్ పేర్కొంది. చికిత్స తీసుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఆయనకు గొప్ప సహకారం అందిందని, ముఖ్యంగా తన కూతుర్లు ఆష్లీ, జెస్సికా తనను కాపాడుకున్న తీరు మాటల్లో చెప్పలేనని ఆయన అన్నారట. ఇలాంటి సమస్యలతో ఉన్న జో మరోసారి తన ఫొటో గ్రాఫర్ కెరీర్ ను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చని వైద్యులు అంటున్నారు. -
ఏడీటీ చికిత్సతో డిప్రెషన్ ప్రమాదం
వాషింగ్టన్: ప్రొస్టేట్ క్యాన్సర్‌కు ఏడీటీ (ఆండ్రోజన్ డిప్రివేషన్ థెరపీ) అనే హర్మోన్ చికిత్సను వాడడం వల్ల వ్యాకులత (డిప్రెషన్) పెరుగుతుందని పరిశోధనలో తేలింది. దీంతోపాటు లైంగిక సామర్థ్యం కోల్పోవడం, బరువు పెరగడం, నీరసించిపోవడం వంటి చెడు ప్రభావాలు కూడా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఈ పరిశోధనను అమెరికాలోని ‘బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్’ ఆసుపత్రి వారు చేశారు. ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడి 1992 నుంచి 2006 వరకు ఏడీటీ చికిత్స తీసుకున్న, 65 ఏళ్లు పైబడిన 78,552 మంది పురుషుల వివరాలను సమీక్షించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏడీటీ తీసుకున్న వారు తీసుకోని వారి కన్నా 23 శాతం ఎక్కువ వ్యాకులత బారిన పడే అవకాశం ఉందని, ఎంత ఎక్కువ కాలం చికిత్స తీసుకుంటే అంత ఎక్కువ ప్రమాదమని పరిశోధనలో బయటపడింది. -
విటమిన్ ‘డి’ లోపం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రతరం!
మెడి క్షనరీ విటమిన్ ‘డి’ లోపం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ మరింత తీవ్రతరం అవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ఈ విషయం ప్రచురితమైంది. ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చి ‘రాడికల్ ప్రొస్టెటెక్టమీ’ అనే శస్త్రచికిత్స చేయించుకున్న 190 మంది పురుషులను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వీళ్లందరి సగటు వయసు 64 ఏళ్లు. వారిలో దాదాపు సగం మందికి ప్రొస్టేట్ క్యాన్సర్ మరింత తీవ్రతరమైందని గుర్తించారు. వాళ్లందరికీ రెండు నెలల ముందు ఓసారి, రెండు నెలల తర్వాత మరోసారి విటమిన్ -డి పాళ్లు పరీక్షించారు. ఈ అధ్యయనం ద్వారా తేలిన సంగతేమిటంటే ప్రొస్టేట్ క్యాన్సర్ తీవ్రతరమైన వారందరిలోనూ విటమిన్-డి పాళ్లు చాలా తక్కువని తేలింది. దాంతో విటమిన్-డి తగ్గడం ప్రొస్టేట్ క్యాన్సర్‌ను మరింత ప్రేరేపిస్తుందని తెలిసింది. -
రోబో సర్జరీలకు భారత్ దే అగ్రస్థానం
న్యూఢిల్లీ: ప్రాణాపాయమైన కేన్సర్లకు రోబోల సహాయంతో అత్యాధునిక చికిత్స అందించడంలో భారత్ కేంద్రబిందువుగా మారింది. మన దేశంలో రోబో సర్జరీలు.. చౌక ధర కావచ్చు, చికిత్స సమయంలో తక్కువ నొప్పి ఉండటం, శస్త్రచికిత్స అనంతరం తొందరగా కోలుకోవడం.. అవగాహన పెరగడం ఇలా ఏమైనా కావచ్చు.. భారత్‌ను మాత్రం ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టిందని కొందరు రోబో శస్త్రచికిత్స నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటీవల నమోదైన తాజా సమాచారం ప్రకారం.. 2015 ముంబైలో 70వేల రోబొటిక్ సర్జరీలు జరిగినట్టు అంచనా. అయితే సర్జరీలు చేయించుకున్న వారిలో ఎక్కువమంది విదేశీయులే ఉండటం గమనార్హం. ఇక దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో 20 నుంచి 25 వేల వరకు రోబో శస్త్రచికిత్సలు జరిగినట్టు రికార్డుల్లో వెల్లడయ్యాయి. ప్రత్యేకంగా.. రోగుల్లో దాదాపు చాలామంది మధ్య తూర్పు ఆఫ్రికా దేశీయులే భారత్‌లో సర్జరీలు చేయించుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వారి స్వదేశాల్లో అడ్వాన్స్ రోబో సర్జీరీలు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఉన్నా, చాలా ఖర్చుతో కూడినవి అయి ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ముంబైలోని షఫీ ఆస్పత్రి, బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి కన్సల్టెంట్ రోబొటిక్ సర్జన్ డాక్టర్ అనూప్ రమణి ఐఏఎన్ఎస్తో మాట్లాడుతూ.. తాను ప్రతివారం కనీసం ఒకటి నుంచి రెండు రోబో సర్జరీ రోగులను పరీక్షిస్తాననీ, వచ్చే వారిలో మధ్య తూర్పు ఆఫ్రికా నుంచి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు. గత రెండునెలల క్రితం ప్రోస్టేట్ గ్రంథి కేన్సర్‌తో బాధపడుతున్న ఏడుగురు విదేశీయులకు తాను ఒంటిరిగా రోబో సర్జరీ చేశాననీ పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఉన్న ప్రోస్టేట్ గ్రంథి కేన్సర్‌కు రోబో సర్జరీ ద్వారా శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమైనదిగా చెప్పారు. భారత్‌లో ప్రోస్టేట్ కేన్సర్.. పేద, ధనికుల్లో ఎక్కువ పెరిగిపోయిందన్నారు. కావునా 50 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒక్కసారైనా ప్రోస్టేట్ నిర్దిష్ట యాంటిజెన్(పీఎస్ఏ) పరీక్ష చేయించుకోవాలని రమణి సూచించారు. -
ఏటా 2.33 లక్షల మందికి ప్రొస్టేట్ కేన్సర్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): దేశంలో ఏటా సుమారు 2.33 లక్షల మంది పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ బారిన పడుతున్నారని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రొస్టేట్ కేన్సర్ అవగాహన మాసం సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూరాలజీ వైద్యులు డాక్టర్ ఉపేంద్రకుమార్, డాక్టర్ గోపీచంద్, డాక్టర్ ఎన్.త్రివేది మాట్లాడారు. కేవలం పురుషుల్లోనే కనిపించే ఈ కేన్సర్ మూత్రాశయం కింద ఉండే ప్రొస్టేట్ గ్రంథిలో మొదలై శరీరమంతా వ్యాపిస్తుందన్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కువ మంది పురుషుల మరణానికి కారణమవుతున్న రెండో కేన్సర్ ఇదేనని చెప్పారు. వ్యాధి సోకిన వ్యక్తులకు పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండా నాలుగో స్టేజీ వరకు వెళుతుందన్నారు. 50 ఏళ్లు దాటిన పురుషులకు ముందస్తుగా పీఎస్ఏ, ట్రస్ బయాప్సీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఈ కేన్సర్‌ను గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సులభమని చెప్పారు. కిమ్స్ ఆస్పత్రిలో ఈ నెల మొత్తం ప్రొస్టేట్ కేన్సర్ పరీక్షలు, కన్సల్టేషన్‌కు రాయితీలు అందిస్తున్నామని వివరించారు. -
మెడి క్షనరీ
అమ్మో! ఒకటి కాదు... ఐదు అట! అమ్మో! ఒక్కటి కాదు... ఇకపై ఐదు! ప్రోస్టేట్ క్యాన్సర్‌లో కొత్త రకాలు...! ఇప్పటివరకూ ఒక్క రకం అంటేనే ఎంతో అందోళన. కానీ ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఐదుగా వర్గీకరించారు సైంటిస్టులు. ఇందుకోసం 259 మంది పురుషులపై పరిశోధనలు నిర్వహించి, వారిలో సాధారణంగా లేని అనేక క్రోమోజోములను పరిశీలించారు. ఈ పరిశీలనల ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దోహదపడే 100 వేర్వేరు రకాల జన్యువులను పరిశీలించి, వాటి జెనెటిక్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ ఐదు రకాల ప్రోస్టేట్ క్యాన్సర్లను వర్గీకరించారు. ‘‘గతంతో పోలిస్తే దీని వల్ల ఇందులో ఏ రకం ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా తీవ్రమైనదో, ఏది కాస్తంత తీవ్రత తక్కువదో... ఇలా గుర్తించి, దానికి అనుగుణంగా ట్యూమర్ తీవ్రతను బట్టి చేయాల్సిన నిర్దిష్టమైన చికిత్సను నిర్ణయించే సౌలభ్యం డాక్టర్లకు కలుగుతుంద’’ని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లోని ఈ ఐదు రకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ‘ఇ-బయో మెడిసిన్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరచినట్లు పరిశోధకులు వెల్లడించారు. -
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి... ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించుకోండి!
కొత్త పరిశోధన ఎక్కువ కొవ్వులు, అధిక మాంసాహారం, పొట్టు తీసిన ధాన్యాలు (రిఫైన్డ్ గ్రెయిన్స్) తీసుకునేవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలు వెల్లడించాయి. ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు, ఇతర అనేక క్యాన్సర్లు, వ్యాధులు నివారించడానికి ఆహారంలో ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, తాజాపండ్లు, చేపలు, పొట్టు ఉన్న ఆహారధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనవేత్తలు సలహా ఇస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన 926 మంది పురుషులపై ఒక అధ్యయనం నిర్వహిస్తూ, వారి ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో దాదాపు అందరూ కొవ్వులు, మాంసాహారం, రిఫైన్డ్ ధాన్యాలు తీసుకునేవారే. పైన పేర్కొన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారితో పోలిస్తే, మంచి జీవనశైలిని పాటించనివారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండున్నర రెట్లు ఎక్కువ. పొగతాగే అలవాటు మానుకొని, జీవనశైలి మార్పులు చేసుకున్నవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ అవకాశాలు తగ్గాయనీ, ఈ విషయాలన్నింటినీ ‘క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరచినట్లుగా హార్వర్డ్ అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. -
'లీ' కి విజయవంతంగా శస్త్ర చికిత్స
సింగపూర్: ప్రోస్టేట్ కేన్సర్‌తో బాధపడుతున్న సింగపూర్ ప్రధానమంత్రి లీ హిజైన్ లూంగ్ కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స అనంతరం తాను పూర్తిగా కోలుకుంటానని లీ ఆశాభావం వ్యక్తం చేశారు. రోబోట్ సహాయంతో శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ కణాలను తొలగించినట్టు వైద్యులు సోమవారమిక్కడ తెలిపారు. 63 ఏళ్ల 'లీ' ప్రోస్టేట్ కేన్సర్ గా నిర్ధారణ కావడంతో ఆయన శస్త్రచికిత్స చేయించు కోవాలని నిర్ణయించుకున్నారు. గతనెలలో ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా కేన్సర్ నిర్ధారక పరీక్షలు నిర్వహించారు. నిర్ధారక పరీక్షల్లో ఒకటి నుంచి 38పైగా ప్రోస్టేట్ కేన్సర్ కారక కణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ప్రొపెసర్ క్రిష్టోపర్ చింగ్ యురాలిజిస్ట్ పర్యవేక్షణలో ప్రధాని 'లీ' కి సింగపూర్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ నిర్వహించారు. సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందని, త్వరలో లీ పూర్తిగా కోలుకుంటారని చింగ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రధాని లీ కి కేన్సర్ రావడం ఇది రెండోసారిగా చింగ్ చెప్పారు. లీ కి 1992లో లింఫోమా వచ్చింది. దాంతో ఆయన కెమోథెరఫీ చేయించుకున్నారు. కాగా లీ కి వచ్చిన ప్రోస్టేట్ కేన్సర్‌కు గతంలో వచ్చిన లింఫోమాతో ఎలాంటి సంబంధం లేదని చింగ్ స్పష్టం చేశారు. కాగా, ప్రధాని లీ ఒక వారంపాటు సెలవులో ఉన్నట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. ప్రధాని కోలుకునేవరకు డిప్యూటీ ప్రధాని టీయో చీ హీన్ ప్రధానిగా విధులు నిర్వర్తించనున్నట్టు తెలిపింది. -
ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత టీవీ దేశ్‌ముఖ్ కన్నుమూత
ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు టీవీ దేశ్‌ముఖ్ (68) మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఆయన క్షేత్ర సంఘచాలక్‌గా వ్యవహరించారు. గత రెండేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు నగరంలోని ఆయన ఇంట్లో సంతాప సభ నిర్వహించారు. ఆ సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు.