సురక్షితంగా లోపల పెట్టేసిన వైద్యులు
అమెరికాలో అరుదైన ఘటన
వాషింగ్టన్: ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మూత్రకోశం ఆపరేషన్ చేయించుకున్న 63 ఏళ్ల రోగి అనూహ్యమైన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొన్నారు. గట్టిగా తుమ్మి, దగ్గడంతో పేగులు బయటికొచ్చాయి. దీంతో ఆయనను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకుండా కాపాడారు. ఫ్లోరిడావాసికి జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి.
యూరినరీ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ సమయంలో పై నుంచి వేసిన కుట్లను విప్పేశారు. ఆపరేషన్, కుట్లు విప్పడం అంతా సవ్యంగా జరగడంతో చిన్న పార్టీ చేసుకుందామనుకుని ఆ దంపతులు తర్వాతి రోజు ఉదయాన్నే దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్లి అల్పాహారం తినేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి బిగ్గరగా తుమ్మడంతోపాటు దగ్గారు.
దీంతో ఆపరేషన్ కోసం గతంలో కోత పెట్టిన ప్రాంతం నుంచి పేగుల్లో కొంతభాగం బయటికొచ్చింది. హుతాశుడైన వ్యక్తి వెంటనే ధైర్యం తెచ్చుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. భార్య వద్దని వారించడంతో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి చూసి అవాక్కవడం వైద్యుల వంతయింది. ముగ్గురు నిష్ణాతులైన యూరాలజీ సర్జన్లు జాగ్రత్తగా వాటిని మళ్లీ యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఇలాంటి ఘటన జరగడం మాకు తెలిసి ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment