Sneezing
-
తుమ్మితే పేగులు బయటికొచ్చాయి!
వాషింగ్టన్: ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మూత్రకోశం ఆపరేషన్ చేయించుకున్న 63 ఏళ్ల రోగి అనూహ్యమైన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొన్నారు. గట్టిగా తుమ్మి, దగ్గడంతో పేగులు బయటికొచ్చాయి. దీంతో ఆయనను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకుండా కాపాడారు. ఫ్లోరిడావాసికి జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి. యూరినరీ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ సమయంలో పై నుంచి వేసిన కుట్లను విప్పేశారు. ఆపరేషన్, కుట్లు విప్పడం అంతా సవ్యంగా జరగడంతో చిన్న పార్టీ చేసుకుందామనుకుని ఆ దంపతులు తర్వాతి రోజు ఉదయాన్నే దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్లి అల్పాహారం తినేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి బిగ్గరగా తుమ్మడంతోపాటు దగ్గారు. దీంతో ఆపరేషన్ కోసం గతంలో కోత పెట్టిన ప్రాంతం నుంచి పేగుల్లో కొంతభాగం బయటికొచ్చింది. హుతాశుడైన వ్యక్తి వెంటనే ధైర్యం తెచ్చుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. భార్య వద్దని వారించడంతో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి చూసి అవాక్కవడం వైద్యుల వంతయింది. ముగ్గురు నిష్ణాతులైన యూరాలజీ సర్జన్లు జాగ్రత్తగా వాటిని మళ్లీ యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఇలాంటి ఘటన జరగడం మాకు తెలిసి ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు వ్యాఖ్యానించారు. -
African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!!
ఓటింగ్, మెజారిటీ, ప్రజాస్వామ్యం.. ఇవన్నీ మనషులకు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఈ పద్ధతిని ఆఫ్రిక అడవుల్లోని శునకాలూ పాటిస్తుంటాయి. మద్దతు, ఏకాభిప్రాయం గురించి మాట్లాడుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ అది నిజం. తుమ్ములతో ఏకాభిప్రాయానికి వచ్చి, శునకస్వామ్యాన్ని నిలబెట్టుకుంటాయి. తుమ్ములే వీటి భాష. వేటకు వెళ్లే ముందు అవన్నీ సమావేశమవుతాయి. అందులో పది కుక్కలు తుమ్మితే చాలు, అన్నీ మూకుమ్మడిగా వేట ప్రారంభిస్తాయి. అయితే అన్ని కుక్కల తుమ్ములకు ఒకే ప్రాధాన్యం ఉండదు. నాయకత్వం వహించే కుక్కలు తక్కువ సార్లు తుమ్మినా వేట ప్రారంభించాల్సిందే. సమావేశంలో కనీస హాజరు(కోరం) ఉండేలా చూసుకుంటాయట. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైన విషయాలు అవి. చదవండి: World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే! -
ముక్కు, నోరు మూసుకుని తుమ్మాడు.. ఆపై
తుమ్మేటప్పుడు ఆటోమెటిక్‌గా కళ్లు వాటంతటవే మూతపడతాయి. ఇక ఏదైనా శుభకార్యాల సమయంలో తుమ్ము వస్తే.. బలవంతంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం.. లేదంటే తిట్లు పడతాయి కాబట్టి. అలా బలవంతంగా తుమ్ము ఆపుకుంటే కళ్లలోకి నీళ్లు వస్తాయి. అలాంటిది తుమ్ము వచ్చేటప్పుడు ముక్కు, నోరు మూసుకుంటే.. ఏం జరుగుతుంది?. ఇదిగో ఇలాంటి అనుమానామే ఓ వ్యక్తికి వచ్చింది. దాంతో ఓ సారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో చేరి అపసోపాలు పడుతున్నాడు. మరి అతడి ప్రయోగంలో ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఎందుకు అనిపించిందో ఏమో కానీ ఓ 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపాలనుకున్నాడు. దాంతో తుమ్ము వస్తుండగా ముక్కు, నోరు ఒకే సారి మూసుకున్నాడు. ఈ క్రమంలో ఎముక విరిగిపోయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చింది. అతడి వాయిస్ మారిపోయింది. గొంతులో నొప్పి.. మింగడంలో ఇబ్బంది పడ్డాడు. బాధ భరించలేక ఆస్పత్రికి వెళ్లాడు. దాంతో వైద్యులు అతడి మెడను స్కాన్ చేయగా అక్కడ ఉన్న ఎముకలు పక్కకు కదిలి విరగడంతోపాటు లోతైన కణజాలం, కండరాల లోపల గాలి బుడగలు వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు. (చదవండి: తుమ్మినందుకు చితక్కొట్టారు..) గాలి నిండిన కణజాలానికి వ్యతిరేకంగా గుండె కొట్టుకున్నప్పుడు కూడా ఎముకల పగుళ్లు ఏర్పడుతున్నందున వైద్యులు అతని మృధువైన మెడ కణజాలం, ఛాతీని స్కాన్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికైతే అతడు కోలుకుంటున్నాడు. ఇక మీదట ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయవద్దని వైద్యులు అతడిని హెచ్చరిస్తున్నారు. -
‘ఇలాంటి ఘోరాన్ని ఇంతవరకు చూడలేదు’
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న అతడి పర్సనల్ డిఫెన్స్ న్యాయవాది రూడీ గియులియానికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల్లో జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా ఆయన హెయిర్ డై కరిగి ముఖం మీదకు కారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతుండగా.. దాన్ని తలదన్నే మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇది కూడా రూడీ గియులియానికి చెందినదే కావడం విశేషం. ఇక ఈ వీడియోలో రూడీ గియులియాని చర్యలు చూస్తే.. నవ్వు, ఆసహ్యం రెండు ఒకేసారి వస్తాయి. ఇక ఈ వీడియోలో రూడీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఇంతలో ఓ నాప్కిన్ తీసి ముక్కు చీదుకుంటాడు. అనంతరం దాన్ని పడేయకుండా మరో వైపు మడతపెట్టి.. దానితో నోరు, నుదురు తుడుచుకుంటాడు. ఆ తర్వాత దాన్ని తీసి జేబులో పెట్టుకుంటాడు. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 1.5మిలియన్ల మంది వీక్షించారు. (చదవండి: బైడెన్ గెలిచాడని ఒప్పుకున్న ట్రంప్!) ఇక నెటిజనులు ఆయన్ని ఓ ఆట ఆడేసుకున్నారు. ‘ఓరే నాయన అసలే ఇది కోవిడ్ కాలం. నువ్వేమో ఏ మాత్రం జాగ్రత్త లేకుండా ముక్కు తుడుచుకున్న నాప్కిన్తోనే ముఖం తుడుచుకున్నావ్.. ఏంటి నీ ధైర్యం’.. ‘అరే అక్కడ నాప్కిన్ బండిల్ పెట్టండి’.. ‘ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్ అవుతుంది.. మర్చిపోయావా’.. ‘కోవిడ్, ఇతర జబ్బులు ఎలా వ్యాప్తి చెందుతాయో వివరించడానికి నువ్వు సరైన ఉదాహరణ’ అంటూ నెటిజనులు కామెంట్ చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికి ట్రంప్, అతడి మద్దతుదారులు దాన్ని అంగీకరించడం లేదు. జో బైడెన్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తున్నారు. -
తుంపర్లు.. యమకింకర్లు!
సాక్షి, హైదరాబాద్: మనం మాట్లాడిన ప్రతీసారి నోటి నుంచి తుంపర్లు వెలువడుతాయి. కంటికి కనిపించని సూక్ష్మపరిమాణంలో ఉండే ఈ తుంపర్లే ప్రమాదాన్ని తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ పాజిటివ్ వ్యక్తి నోటి నుంచి వెలువడిన తుంపర్లలో ఉండే వైరస్ దాదాపు పావుగంట వరకు బతికే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తాజా లాక్డౌన్ మార్గదర్శకాలను చాలామంది పాటించడం లేదు. మాస్క్ ధరించాలి.. గుమిగూడకూడదు అన్న ప్రాథమిక హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కరోనా బారినపడుతున్నారు. నగరంలో పలువురు వ్యాపారులు, ఉద్యోగులకు కరోనా వచ్చిన విష యం తెలిసిందే. వీరిలో కొందరు మాస్కులు సరిగా ధరించని కారణంగానే కరోనా వచ్చి ఉం టుందని వైద్యులు అనుమానిస్తున్నారు. తుంపర్ల ద్వారానే కరోనా వచ్చిందనడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. వచ్చే అవకాశాలను మాత్రం కొట్టి పారేయలేమని వైద్యులు చెబుతున్నారు. ఒక్క సెకనుకు 2,600.. : ఎవరైనా ఓ వ్యక్తి మాట్లాడినప్పుడు సెకనుకు దాదాపు 2,600 సూక్ష్మ తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి కంటికి కనిపించవు. అదే నిమిషం పాటు మాట్లాడితే.. లక్షల సంఖ్యలో అవి వెలువడతాయి. అందులో దాదాపు 1,000 తుంపర్ల వరకు వైరస్‌ను మోసుకొచ్చే అవకాశముంది. ఇరుకు గదుల్లో అయితే, ఇవి దాదాపుగా 8 నుంచి 14 నిమిషాల వరకు చైతన్యంగా ఉంటాయి. ఈ క్రమంలో వైరస్ ఎవరికైనా సోకే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యాధి సోకినా.. లక్షణాలు కనిపించని (అసింప్టోమాటిక్) వారితో ఈ వైరస్ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదముందని వివరించారు. వీరిలో లక్షణాలు కనిపించకున్నా.. ఒంట్లో వైరస్ నోట్లోని లాలాజలం ద్వారా మాట్లాడినపుడు తుంపర్ల రూపంలో బయటికి వచ్చి కొత్త వ్యక్తులకు సంక్రమిస్తుందని హెచ్చరిస్తున్నారు. వీరు తుమ్మినపుడు లేదా దగ్గినపుడు వెలువడే ప్రమాదం ఇంకా రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే దగ్గినపుడు లిప్తపాటులో 3 వేల తుంపర్లు, తుమ్మినపుడు ఏకంగా 40 వేల వరకు తుంపర్లు వెలువడతాయట. పోలీసులు, వైద్యులకు వచ్చింది ఇలాగేనా.. తుంపర్ల ద్వారా ఫలానా వారికి కరోనా వచ్చింది అనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేకున్నా.. వచ్చే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమంటున్నారు వైద్యులు. హైదరాబాద్‌లో పోలీసులు, వైద్యులు పదుల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. వీరందరూ తగిన జాగ్రత్తలు పాటించారు. వైద్యులైతే.. పీపీఈ కిట్లు కూడా వాడారు. వీరిలో చాలామందికి అసింప్టోమాటిక్ వ్యక్తుల వల్లే వ్యాధి సంక్రమించి ఉంటుందని, వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అసింప్టోమాటిక్ వ్యక్తుల్లో లక్షణాలు కనిపించకపోవడం వల్ల సంక్రమణకు అధిక అవకాశాలున్నాయంటున్నారు. అందుకే, తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లు, కోవిడ్ చికిత్స కేంద్రాలు, క్వారంటైన్ సెంటర్లలో పనిచేసే వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఎన్–95 మాస్కులతోపాటు పీపీఈ కిట్లు తప్పనిసరి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
కరోనా అయినా మామూలు జలుబైనా
కరోనా సీజన్ కొనసాగుతున్న ఈ తరుణంలో ఎవరైనా కాస్తంత దగ్గినా... ఏమాత్రం తుమ్మినా ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. సమీపంలో ఉన్నవారు దూరంగా తొలగిపోతుంటారు. మనం దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాల్లోకి వ్యాపించే తుంపర్లతో కరోనా వస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా వ్యాపించడం అన్నది ఎంత వేగంగా జరుగుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ⇔ ఎవరైనా దగ్గగానే వారి నోటి నుంచి వచ్చే తుంపర్లు ప్రయాణం చేసే వేగం... గంటకు దాదాపు 60 మైళ్లు. (దాదాపు 96 కిలోమీటర్లు/గంటకు) ⇔ ఇక తుమ్మువల్లనైతే ఈ తుంపర్లు ప్రయాణం చేసే వేగం... గంటకు 100 మైళ్లు (దాదాపు 160 కి.మీ./గంటకు) ఉంటుంది. ⇔ జలుబు సమయంలో తుమ్మినప్పుడు సమీపంలోని గాల్లోకి వెలువడే తుంపర్ల సంఖ్య దాదాపు 40,000 వరకు ఉంటుంది. ⇔ ఈ తుంపర్లు గరిష్టంగా 200 అడుగులు (60 మీటర్ల) వరకు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది. ⇔ తుమ్మినప్పుడు 30 సెకండ్లపాటు కర్చిఫ్ అడ్డుగా పెట్టుకున్నప్పుడు ఆ కర్చిఫ్పై ఒక చదరపు సెం.మీ. భాగంలో చేరే సూక్ష్మజీవుల సంఖ్య దాదాపు లక్ష వరకు ఉంటుంది. ⇔ ఒకవేళ అప్పటికే ఆ తుమ్మిన వ్యక్తికి కరోనా సోకి ఉందనుకుంటే... సూదిమోపినంత స్థలంలోనే మిలియన్ల కొద్దీ వైరస్లు ఉండి... అవి కళ్లు, ముక్కు, నోటికి తగలగానే వెంటనే జబ్బును వ్యాప్తి చేయగలుగుతాయి. ⇔ అందుకే దగ్గు వచ్చినా లేదా తుమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడ్డా పొడవు చేతుల చొక్కా (లాంగ్‌స్లీవ్స్) దగ్గర మోచేతి మడతలో దగ్గడం, తుమ్మడం చేయాలి. అక్కడే ఎందుకంటే... మనం ఆ ప్రదేశాన్ని దాదాపుగా ముట్టుకోం. అలాగే ఒకవేళ చేతులతో షేక్ హ్యాండ్ ఇచ్చినా... వాటి మీద వైరస్ ఉండదు. ఈ కారణం చేతనే దగ్గడం లేదా తమ్ముడం వంటివి చేసినప్పుడు చేతులు ఎంతమాత్రమూ అడ్డుపెట్టుకోకూడదు. -
తుమ్మినందుకు చితక్కొట్టారు..
సాక్షి, కొల్లాపూర్: కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలీక జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కరచాలనం చేసినప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ప్రతి ఒక్కరికి మాస్క్‌లు తప్పనిసరిగా మారాయి. అయితే మాస్క్ ధరించకుండా తుమ్మినందుకు ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన గురువారం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కొల్లాపూర్‌లోని గుజారి ప్రాంతానికి చెందిన వ్యక్తి పబ్లిక్‌లో తుమ్మాడు. కానీ ఆ సమయంలో చేతులు అడ్డుపెట్టుకోవడం కానీ, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించలేదు. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయి.. అతన్ని వెంబడించాడు. (బ్లాక్ మార్కెట్లో మ..మ..మాస్క్!) బైక్‌పై వెళుతున్న అతన్ని రోడ్డుపై ఆపి మాస్క్ పెట్టుకోకుండా ఎందుకు తుమ్మావని ప్రశ్నించాడు. దానికి అతను నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. తుమ్మిన వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌జామ్ అయింది. స్థానిక వ్యక్తులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేశారు. ఈ దాడి అక్కడి సీసీ టీవీలో రికార్డైంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కాగా దేశంలో ఇప్పటివరకు 194 కరోనా కేసులు నమోదవగా అత్యధికంగా ఒక్క మహారాష్ట్రలోనే 49 కోవిడ్-19 పాజిటివ్ కేసులున్నాయి. (అలర్ట్ హైదరాబాద్: ఆయువుపై వాయువు దెబ్బ) -
అలర్జిక్ రైనైటిస్... వాతావరణంతో పెద్ద రణం!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. చాలాకాలంగా దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది, వెంటనే తుమ్ములు వస్తున్నాయి. కాస్త చల్లగా ఉన్నప్పుడు ఆ వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ముక్కు బిగుసుకుపోతోంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? – సంజీవ్, ఖమ్మం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు అలర్జిక్ రైనైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి అంశాలు ఈ సమస్యను మరింత దుర్భరం చేస్తాయి. అలర్జిక్ రైనైటిస్ ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు మనకు సరిపడని పదార్థాలు ఒంట్లోకి ప్రవేశంచగానే ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్నే అలర్జిక్ రైనైటిస్ అంటారు. కారణాలు : ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది. ∙పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ ఆరోగ్య చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు. ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు : ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స : హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
అలర్జీలకు చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు ఇటీవల వరుసగా తుమ్ములు రావడం, ఆ తర్వాత కాసేపు ముక్కు కారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే అలర్జీ అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - రవి, నరసన్నపేట అలర్జీ అంటే మన సొంత రోగనిరోధక వ్యవస్థే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎన్నో అంశాలు మనకు అలర్జీ కలిగించవచ్చు. ఉదాహరణకు పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, కొన్ని ఆహారాలు (పాలు, గుడ్లు, చేపలు వంటివి), కొన్ని రకాల మందులు (యాంటీబయాటిక్స్, బీపీ పందులు మొ.) రబ్బరు లేదా ఇతర సరిపడని పదార్థాలను తాకడం, జంతుస్పర్శ, వాతావరణ మార్పులు మొదలైన అంశాల వల్ల మన శరీరం అసాధారణంగా స్పందిస్తుంది. ఇలా మన శరీరం ప్రదర్శించే అసాధారణ ప్రతిచర్యనే అలర్జీ అంటారు. ఇలా మన శరీరం అతిగా స్పందించడాన్ని ‘హైపర్ సెన్సిటివిటీ’ అని కూడా అంటారు. మనకు అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. వాటిని వల్ల మన శరీరంలో కలిగే ప్రతిక్రియను ‘అలర్జిక్ రియాక్షన్’ అంటారు. కారణాలు: అలర్జీకి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే జన్యుపరమైన అంశాలు, వాతావరణంలో మార్పుల వల్ల అలర్జీ వచ్చేందుకు అవకాశం ఉంది. రకాలు: అలర్జీ వ్యక్తమయ్యే తీరును బట్టి దాన్ని అనేక రకాలుగా వర్గీకరించి, దానికి అనుగుణంగా పేరుపెడతారు. ఉదాహరణకు మీకు ఉన్న సమస్యలో కనిపించినట్లుగా వరసగా తుమ్ములు రావడం, ముక్కు కారడాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా పేర్కొంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ఈ ‘అలర్జిక్ రైనైటిస్’ మరిన్ని సమస్యలకు కారణం కావచ్చు. ఉదాహరణకు ముక్కుదిబ్బడ, శ్వాస ఆడకపోవడం, కళ్లెపడటం, ముఖం వాపునకు గురికావడం, తలనొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు. అటుపై ఈ వ్యాధి గాలిగొట్టాల్లోకి చేరి, ఊపిరితిత్తులకు సోకడం వల్ల దగ్గు ప్రారంభమై, కళ్లెతో కూడిన దగ్గుగా మారుతుంది. వైద్యపరిభాషలో దీన్ని ‘అలర్జిక్ బ్రాంకైటిస్’ అని అంటారు. ఈ పరిస్థితికి ఆయాసం, పిల్లికూతలు తోడైతే దాన్ని ‘అలర్జిక్ ఆస్తమా’ అంటారు. స్కిన్ అలర్జీ: అలర్జీ అనేది చర్మం ద్వారా కూడా వ్యక్తమవుతుంది. కొన్ని రకాల మందులు వాడటం, ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల ఆహారాలు, సరిపడని వస్తువులు తగిలితే చర్మం కూడా ప్రభావితమవుతుంది. అలాంటప్పుడు చర్మంపై దురద, దద్దుర్లు, చర్మం ఎర్రబారడం జరుగుతాయి. ఇది కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉండొచ్చు. చాలా సందర్భాల్లో సమస్య దానంతట అదే తగ్గుతుంది. కానీ ఒక్కోసారి అది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. జీర్ణకోశం అలర్జీ: కొన్ని రకాల ఆహారపదార్థాలు ఒంటికి సరిపడకపోవడంతో జీర్ణకోశ అలర్జీలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో నీరసం, వికారం, మలబద్దకం వంటి లక్షణాలతో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్ష, ఎక్స్-రే, సీటీస్కాన్, పీఎఫ్‌టీ... వంటి పరీక్షలు అవసరం. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా అలర్జిక్ వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. హోమియో వైద్య విధానంలో అలర్జ్జీలకు నమ్మకమైన చికిత్స ఉంది. కాబట్టి మీరు నిపుణులైన హోమియో వైద్యులను కలిసి, చికిత్స తీసుకోండి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ పెద్ద పేగు క్యాన్సర్ వంశపారంపర్యమా? గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. గృహిణిని. మా నాన్న పెద్దపేగు క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలాగైతే ముందే గుర్తించే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? , - పార్వతి, నిజామాబాద్ పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్ విషయంలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువే. కాబట్టి మీరు ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రస్తుతం క్యాన్సర్ లక్షణాలు లేనప్పటికీ ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్ లక్షణాలు బయటపడకముందే క్యాన్సర్‌ను గుర్తించడాన్ని స్క్రీనింగ్ అంటారు. పెద్దపేగుల క్యాన్సర్‌ను కొలనోస్కోపీ అనే పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోండి. అది నార్మల్‌గా ఉంటే మీరు భయపడాల్సిన అవవసరం లేదు. మళ్లీ పదేళ్ల తర్వాత మరోసారి స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా క్యాన్సర్‌ను మొదటే గుర్తించవచ్చు. నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఆర్నెల్ల నుంచి మలవిసర్జనలో మార్పు కనిపిస్తోంది. మలవిసర్జనకు ముందు రక్తం పడుతోంది. ఆకలి కూడా బాగా తగ్గింది. మలవిసర్జనకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? - పద్మనాభరావు, విజయవాడ మలవిసర్జనకు ముందు రక్తం పడటానికి చాలా కారణాలు ఉంటాయి. హెమరాయిడ్స్ (పైల్స్) అంటే మొలలు, పెద్దపేగుల్లో కణితులు, క్యాన్సర్ కణితులు, పుండ్లు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్‌లో ఇలా రక్తం పడటం కనిపిస్తుంది. మీ వయసునూ, ఆకలి మందగించడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటే మీరు పెద్దపేగుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనిపిస్తోంది. మలవిసర్జనలో మార్పు కనిపిస్తోందని రాశారుగానీ, అది ఏ రకమైన మార్పు అన్నది రాయలేదు. పెద్దపేగుల్లో కణితులు ఉంటే మొదట మల విసర్జన ప్రక్రియలో తేడా వస్తుంది. రానురానుపూర్తిగా మలవిసర్జన కష్టమవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోండి. దీని వల్ల రక్తం పడటానికి కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. కళ్లు తిరిగి పడిపోయాడు.. సమస్య ఏమిటి? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు పదేళ్లు. ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడని స్కూల్లో టీచర్ పిలిపించి చెప్పారు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ అనిపించలేదు. కానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - భవాని, కోదాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఉన్న రుగ్మత సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పవచ్చు. చాలా మంది పిల్లల్లో ఏదో ఒక సమయంలో కనిపించే సమస్యే ఇది. అయితే పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలాపడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి. అయితే ఇదెంత సాధారణమైన సమస్య అయినప్పటికీ ఇలా పడిపోవడం మాటిమాటికీ కనిపిస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్‌కూడా ఈ రకంగానే కనిపించవచ్చు. సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు తోడ్పడతాయి. మీ బాబు విషయంలో పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అంతా చక్కబడుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరోసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
తుమ్ము వేగం...!
ఈ చలికాలంలో అలర్జీ వల్ల తుమ్ములు చాలా సాధారణం. తుమ్ము వచ్చినప్పుడు నోటి ద్వారా వచ్చే తుంపర్లు గంటకు 160 కి.మీ. (దాదాపు గంటకు వంద మైళ్లు) వేగంతో ప్రయణిస్తాయి.ఒకసారి తుమ్మినప్పుడు ఆ క్షణ కాలంలోనే కనీసం నోటి నుంచి లక్ష జీవులు బయటకు వెలువడతాయి. అందుకే మనం లాంగ్ స్లీవ్స్ దుస్తులు ధరించి ఉంటే... తుమ్మే సమయంలో మోచేతి మడత వద్ద ఉండే ఆ లాంగ్ స్లీవ్స్‌ను మన నోటికి అడ్డుగా ఉండేలా జాగ్రత్త పడాలి.