అలర్జిక్ రైనైటిస్... వాతావరణంతో పెద్ద రణం!
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 28 ఏళ్లు. చాలాకాలంగా దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది, వెంటనే తుమ్ములు వస్తున్నాయి. కాస్త చల్లగా ఉన్నప్పుడు ఆ వాతావరణానికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా ముక్కు బిగుసుకుపోతోంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా?
– సంజీవ్, ఖమ్మం
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు అలర్జిక్ రైనైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి అంశాలు ఈ సమస్యను మరింత దుర్భరం చేస్తాయి. అలర్జిక్ రైనైటిస్ ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు మనకు సరిపడని పదార్థాలు ఒంట్లోకి ప్రవేశంచగానే ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్నే అలర్జిక్ రైనైటిస్ అంటారు.
కారణాలు : ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది. ∙పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ ఆరోగ్య చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు. ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి.
లక్షణాలు : ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స : హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్