హోమియో కౌన్సెలింగ్
నాకు ఇటీవల వరుసగా తుమ్ములు రావడం, ఆ తర్వాత కాసేపు ముక్కు కారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే అలర్జీ అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - రవి, నరసన్నపేట
అలర్జీ అంటే మన సొంత రోగనిరోధక వ్యవస్థే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎన్నో అంశాలు మనకు అలర్జీ కలిగించవచ్చు. ఉదాహరణకు పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, కొన్ని ఆహారాలు (పాలు, గుడ్లు, చేపలు వంటివి), కొన్ని రకాల మందులు (యాంటీబయాటిక్స్, బీపీ పందులు మొ.) రబ్బరు లేదా ఇతర సరిపడని పదార్థాలను తాకడం, జంతుస్పర్శ, వాతావరణ మార్పులు మొదలైన అంశాల వల్ల మన శరీరం అసాధారణంగా స్పందిస్తుంది. ఇలా మన శరీరం ప్రదర్శించే అసాధారణ ప్రతిచర్యనే అలర్జీ అంటారు. ఇలా మన శరీరం అతిగా స్పందించడాన్ని ‘హైపర్ సెన్సిటివిటీ’ అని కూడా అంటారు. మనకు అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. వాటిని వల్ల మన శరీరంలో కలిగే ప్రతిక్రియను ‘అలర్జిక్ రియాక్షన్’ అంటారు.
కారణాలు: అలర్జీకి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే జన్యుపరమైన అంశాలు, వాతావరణంలో మార్పుల వల్ల అలర్జీ వచ్చేందుకు అవకాశం ఉంది.
రకాలు: అలర్జీ వ్యక్తమయ్యే తీరును బట్టి దాన్ని అనేక రకాలుగా వర్గీకరించి, దానికి అనుగుణంగా పేరుపెడతారు. ఉదాహరణకు మీకు ఉన్న సమస్యలో కనిపించినట్లుగా వరసగా తుమ్ములు రావడం, ముక్కు కారడాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా పేర్కొంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ఈ ‘అలర్జిక్ రైనైటిస్’ మరిన్ని సమస్యలకు కారణం కావచ్చు. ఉదాహరణకు ముక్కుదిబ్బడ, శ్వాస ఆడకపోవడం, కళ్లెపడటం, ముఖం వాపునకు గురికావడం, తలనొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు. అటుపై ఈ వ్యాధి గాలిగొట్టాల్లోకి చేరి, ఊపిరితిత్తులకు సోకడం వల్ల దగ్గు ప్రారంభమై, కళ్లెతో కూడిన దగ్గుగా మారుతుంది. వైద్యపరిభాషలో దీన్ని ‘అలర్జిక్ బ్రాంకైటిస్’ అని అంటారు. ఈ పరిస్థితికి ఆయాసం, పిల్లికూతలు తోడైతే దాన్ని ‘అలర్జిక్ ఆస్తమా’ అంటారు.
స్కిన్ అలర్జీ: అలర్జీ అనేది చర్మం ద్వారా కూడా వ్యక్తమవుతుంది. కొన్ని రకాల మందులు వాడటం, ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల ఆహారాలు, సరిపడని వస్తువులు తగిలితే చర్మం కూడా ప్రభావితమవుతుంది. అలాంటప్పుడు చర్మంపై దురద, దద్దుర్లు, చర్మం ఎర్రబారడం జరుగుతాయి. ఇది కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉండొచ్చు. చాలా సందర్భాల్లో సమస్య దానంతట అదే తగ్గుతుంది. కానీ ఒక్కోసారి అది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది.
జీర్ణకోశం అలర్జీ: కొన్ని రకాల ఆహారపదార్థాలు ఒంటికి సరిపడకపోవడంతో జీర్ణకోశ అలర్జీలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో నీరసం, వికారం, మలబద్దకం వంటి లక్షణాలతో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాలు కనిపిస్తాయి.
నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్ష, ఎక్స్-రే, సీటీస్కాన్, పీఎఫ్‌టీ... వంటి పరీక్షలు అవసరం.
చికిత్స: జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా అలర్జిక్ వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. హోమియో వైద్య విధానంలో అలర్జ్జీలకు నమ్మకమైన చికిత్స ఉంది. కాబట్టి మీరు నిపుణులైన హోమియో వైద్యులను కలిసి, చికిత్స తీసుకోండి.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్
పెద్ద పేగు క్యాన్సర్ వంశపారంపర్యమా?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. గృహిణిని. మా నాన్న పెద్దపేగు క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలాగైతే ముందే గుర్తించే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? , - పార్వతి, నిజామాబాద్
పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్ విషయంలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువే. కాబట్టి మీరు ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రస్తుతం క్యాన్సర్ లక్షణాలు లేనప్పటికీ ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్ లక్షణాలు బయటపడకముందే క్యాన్సర్‌ను గుర్తించడాన్ని స్క్రీనింగ్ అంటారు. పెద్దపేగుల క్యాన్సర్‌ను కొలనోస్కోపీ అనే పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోండి. అది నార్మల్‌గా ఉంటే మీరు భయపడాల్సిన అవవసరం లేదు. మళ్లీ పదేళ్ల తర్వాత మరోసారి స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా క్యాన్సర్‌ను మొదటే గుర్తించవచ్చు.
నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఆర్నెల్ల నుంచి మలవిసర్జనలో మార్పు కనిపిస్తోంది. మలవిసర్జనకు ముందు రక్తం పడుతోంది. ఆకలి కూడా బాగా తగ్గింది. మలవిసర్జనకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? - పద్మనాభరావు, విజయవాడ
మలవిసర్జనకు ముందు రక్తం పడటానికి చాలా కారణాలు ఉంటాయి. హెమరాయిడ్స్ (పైల్స్) అంటే మొలలు, పెద్దపేగుల్లో కణితులు, క్యాన్సర్ కణితులు, పుండ్లు, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్‌లో ఇలా రక్తం పడటం కనిపిస్తుంది. మీ వయసునూ, ఆకలి మందగించడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటే మీరు పెద్దపేగుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనిపిస్తోంది. మలవిసర్జనలో మార్పు కనిపిస్తోందని రాశారుగానీ, అది ఏ రకమైన మార్పు అన్నది రాయలేదు. పెద్దపేగుల్లో కణితులు ఉంటే మొదట మల విసర్జన ప్రక్రియలో తేడా వస్తుంది. రానురానుపూర్తిగా మలవిసర్జన కష్టమవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోండి. దీని వల్ల రక్తం పడటానికి కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి.
కళ్లు తిరిగి పడిపోయాడు.. సమస్య ఏమిటి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబుకు పదేళ్లు. ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడని స్కూల్లో టీచర్ పిలిపించి చెప్పారు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ అనిపించలేదు. కానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - భవాని, కోదాడ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఉన్న రుగ్మత సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని చెప్పవచ్చు. చాలా మంది పిల్లల్లో ఏదో ఒక సమయంలో కనిపించే సమస్యే ఇది. అయితే పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా ఇలాపడిపోడానికి కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి.
అయితే ఇదెంత సాధారణమైన సమస్య అయినప్పటికీ ఇలా పడిపోవడం మాటిమాటికీ కనిపిస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ఇటువంటి పిల్లల్లో గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్‌కూడా ఈ రకంగానే కనిపించవచ్చు.
సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగిస్తూ ఉండటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు తోడ్పడతాయి. మీ బాబు విషయంలో పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అంతా చక్కబడుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరోసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్
విజయనగర్ కాలనీ, హైదరాబాద్