Atmospheric pollution
-
2050 నాటికి కర్బన ఉద్గారాల తటస్థీకరణ
రోమ్: భూగోళంపై జీవజాలం మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పుల పట్ల జి–20 దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం పెరగడంతోపాటు భూమి వేడెక్కడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలని తీర్మానించారు. కర్బన ఉద్గారాల తటస్థీకరణ కచ్చితంగా సాధించాలని నిర్ణయానికొచ్చారు. అంతేకాకుండా విదేశాల్లో బొగ్గు ఆధారిత(థర్మల్) విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు ఇకపై ఎలాంటి ఆర్థిక సాయం అందించరాదని ప్రతిన బూనారు. కోవిడ్–19 మహమ్మారిపై పోరాటంలో వ్యాక్సిన్లే అతిపెద్ద ఆయుధాలని అంగీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీని పెంచడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇటలీ రాజధాని రోమ్‌లో రెండు రోజులపాటు జరిగిన జి–20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల గురించి వివరిస్తూ ‘రోమ్ డిక్లరేషన్’ జారీ చేశారు. అవేమిటంటే... ► బొగ్గును మండించి, విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీని అడ్డుకోవడానికి విదేశాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు రుణ సాయంనిలిపివేయాలి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరుత్సాహపర్చాలి. ఈ ఏడాది ఆఖరి నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలి. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు ఇప్పటికే ఈ తరహా తీర్మానాలు చేసుకున్నాయి. అయితే, సొంత దేశాల్లో బొగ్గు వాడకం తగ్గించుకోవడంపై జి–20 నేతలు లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. ► వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద దేశాలకు సాయం చేయడానికి గతంలోనే అంగీకరించినట్లుగా ధనిక దేశాలు ప్రతిఏటా 100 బిలియన్ డాలర్లు సమీకరించాలి. పేద దేశాలకు రుణ సాయాన్ని పెంచాలి. ► కర్బన తటస్థీకరణ లేదా ‘నెట్ జీరో’ ఉద్గారాల లక్ష్య సాధనకు అందరూ కట్టుబడి ఉండాలి. ఈ శతాబ్ధి మధ్య నాటికి..అంటే 2050 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, వాతావరణం నుంచి తొలగించే ఉద్గారాల మధ్య సమతూకం ఉండడమే కర్బన తటస్థీకరణ. అంటే ఏ మేరకు ఉద్గారాలు విడుదలవుతాయో అంతేస్థాయిలో వాటిని వాతావరణం నుంచి తొలగించాలి. ► 2021 ఆఖరుకల్లా ప్రపంచంలో కనీసం 40% మందికి కరోనా టీకా ఇవ్వాలి. 2022 జూన్ ఆఖ రుకి 70% మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. టీకా సరఫరాలో అవరోధాలను తొలగించాలి. ► కరోనాతో నిలిచిపోయిన అంతర్జాతీయ ప్రయాణాలను తగిన రీతిలో పునఃప్రారంభించాలి. ► కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు, అంతర్జాతీయ సంస్థలకు, సైంటిస్టులకు కృతజ్ఞతలు. ► ఆహార భద్రతను సాధించాలి. ప్రజలందరికీ అవసరమైన పౌష్టికాహారం అందించాలి. ఈ విషయంలో ఎవరినీ విస్మరించడానికి వీల్లేదు. స్పెయిన్ ప్రధాని శాంచెజ్‌తో మోదీ భేటీ భారత్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మ రిన్ని పెట్టుబడులు పెట్టాలని స్పెయిన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయన రోమ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఏంజెలా మెర్కెల్‌తో సమావేశం ప్రధాని మోదీ రోమ్‌లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తోనూ సమావేశమయ్యారు. భారత్–జర్మనీ నడుమ ద్వైపాక్షిక సంబంధాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతోనూ మోదీ సమావేశమయ్యారు. జి–20 భేటీకి హాజరైన నేతలు ఆదివారం రోమ్‌లోని ప్రముఖ ట్రెవి ఫౌంటెయిన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వీరు తమ భుజాలపై నుంచి నాణేన్ని ఫౌంటెయిన్లోకి విసిరారు. ఫౌంటెయిన్‌లో పడేలా నాణెం విసిరిన వారు రోమ్కు మరోసారి వస్తారనే నమ్మిక ఉంది. భారత ప్రధాని మోదీతోపాటు నాణేన్ని విసిరిన వారిలో స్పెయిన్ ప్రధాని శాంచెజ్, ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్, జర్మనీ ఛాన్సెలర్ మెర్కెల్, ఇటలీ ప్రధాని ద్రాఘి ఉన్నారు. -
నేను నేనే
లిసీప్రియా కంగుజం వయసు 8 ఏళ్లు. వాతావరణ కాలుష్యం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకుంది. ఆ వయసుకు కంకణం అనేది పెద్ద మాటే కానీ.. లిసీప్రియా మాటల్ని వింటే అది చాలా చిన్నమాటగా అనిపిస్తుంది. లిసీ మణిపూర్ అమ్మాయి. గ్రెటా థన్‌బర్గ్‌లా ఈ భూగోళాన్ని కాలుష్యం నుంచి కాపాడే ఉద్యమాన్ని చేతుల్లోకి ప్లకార్డులా తీసుకుంది. దాంతో మీడియా ఆమెను ‘గ్రెటా థన్‌బర్గ్ ఆఫ్ ఇండియా’ అని కీర్తిస్తోంది. ఇదే నచ్చడం లేదు లిసీకి! నాకో పేరు లేదా? నాకో వ్యక్తిత్వం లేదా? నాకో గుర్తింపు లేదా? అని మీడియాపై కోపగించుకుంటోంది ఆ చిన్నారి. ‘‘స్వీడన్ అమ్మాయి గ్రెటా 2019లో మాత్రమే క్లెయిమేట్ ఉద్యమం చేపట్టింది. నేను అంతకంటే ముందరే 2018 జూలై నుంచీ మన ప్రధానికి, దేశాధినేతలకు లేఖలు రాస్తున్నాను. కనుక ఇక నుంచీ నన్ను ‘గ్రెటా ఆఫ్ ఇండియా’ అని పిలవకండి’’అని ట్వీట్ పెట్టింది. ‘‘మా ఇద్దరి లక్ష్యాలూ ఒకటే అయినా నేను నేనే’’ అని కూడా అంది! చూస్తుంటే లిసీప్రియా గ్రెటాను మించిపోయేలా ఉంది. -
కాలుష్యం బతికి ‘బట్ట’కట్టదు!
రెండు వందల కోట్లు.. ఏటా అమ్ముడయ్యే టీషర్ట్‌ల సంఖ్య ఇది. 440 పార్ట్స్ పర్ మిలియన్.. రికార్డుస్థాయికి చేరిన వాతావరణ కాలుష్యానికి ఓ లెక్క ఇది. టీషర్ట్‌లకు.. కాలుష్యానికి సంబంధం ఏమిటి? అనుకుంటున్నారా..! ఇప్పటివరకూ లేదు.. ఇకపై మాత్రం బోలెడంత ఉంటుంది. ఎందుకంటారా? టీషర్ట్ వేసుకుంటే కాలుష్యం తగ్గిపోతుంది కాబట్టి..!!! ఆగండాగండి.. మీరు మామూలుగా వేసుకునే టీషర్ట్‌తో ప్రయోజనం ఒక్కటే. ఒళ్లు కప్పుతుందంతే. అదే ఈ ఫొటోలో చూపించిన టీషర్ట్ వాడటం మొదలుపెట్టారనుకోండి. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్లు గాల్లోని కాలుష్యాన్ని కూడా శుభ్రం చేసేయొవచ్చు. ఇటలీ కంపెనీ క్లాటర్స్ తయారు చేసిన ఈ వినూత్న టీషర్ట్ పేరు ‘రిపేయిర్’. ఛాతీ భాగంలో మూడు పొరలు ఉన్న వస్త్రాన్ని ఉంచుకుంటే చాలు.. మీరు అటు ఇటూ కదిలేటప్పుడు సోకే గాలిలో ఉండే ప్రమాదకరమైన విషవాయువులను పీల్చేసు కుంటుంది. స్వచ్ఛమైన గాలి మాత్రమే విడుదలయ్యేలా చేస్తుంది. ఫ్యాషన్ ఆసరాగా కాలుష్యంపై అవగాహన పెంచడం రిపేయిర్ అభివృద్ధి వెనుక ఉన్న లక్ష్యమని అంటున్నారు క్లాటర్స్ వ్యవస్థాపకులు ఫెడ్రికో సురియా, మార్కో లోగ్రీకో, సిల్వియో పెరుకాలు. మూడు పొరలు.. ఆరు రకాల కాలుష్యాలు.. రిపేయిర్ టీషర్ట్ ఛాతీ భాగంలో ఉండే ప్రత్యేక వస్త్రాన్ని ‘ద బ్రీత్’అని పిలుస్తున్నారు. అనిమోటెక్ అనే కంపెనీ తయారు చేసింది దీన్ని. ముందుగా చెప్పుకున్నట్లు ఇందులో మూడు పొరలు ఉంటాయి. ఒక్కోటి అతిసూక్ష్మమైన జల్లెడలాంటిది. ఎంత సూక్ష్మమంటే.. నానోస్థాయిలో ఉండే కాలుష్యాలను కూడా ఒడిసి పట్టగలిగేంత. గాల్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్లు, బెంజీన్ వంటి ప్రమాదకరమైన, కేన్సర్ కారకమైన వాయువులు ఒక పొరలోని జల్లెడలో చిక్కుకుపోతాయి. రెండోపొరలో ఉన్న ప్రత్యేకమైన పోగులు బ్యాక్టీరియాను చంపేస్తాయి. మూడో పొరకు దుర్వాసనలను పీల్చేసుకునే లక్షణం ఉంటుంది. ఈ మూడు ఒక్కటిగా పనిచేయడం ద్వారా ఎక్కడికక్కడ గాలి శుభ్రమవుతూంటుంది. స్వచ్ఛమైన గాలి మాత్రమే బయటకు వస్తూంటుంది. అనిమోటెక్ ద బ్రీత్ను ఇప్పటికే యూనివర్సిటీ పాలిటెక్నికా డెల్లే మార్సేలో పరీక్షించింది కూడా. సల్ఫర్ డయాక్సైడ్లను ఈ వస్త్రం 92 శాతం వరకూ ఒడిసి పట్టగలదని.. అదే సమయంలో నైట్రోజన్ ఆక్సైడ్లను 86 శాతం, ప్రమాదకరమైన సేంద్రీయ కణాలను 97 శాతం వరకూ తనలో నిక్షిప్తం చేసుకోగలదని ఈ పరీక్షల్లో రుజువైంది. టీషర్ట్లోని పొరలో పెట్టుకునే ద బ్రీత్ను ఏడాదికి ఒకసారి మార్చుకుంటే చాలు. ఎలాంటి శక్తిని వాడకుండా గాలిని శుభ్రం చేస్తూ ఉండవచ్చు. ద బ్రీత్ను ఇళ్లల్లో ఎయిర్ ప్యూరిఫయర్ల మాదిరిగా, బహిరంగ ప్రదేశాల్లో భారీ హోర్డింగ్‌లపై ప్రకటనల కోసమూ వాడుకోవచ్చని అనిమోటెక్ అంటోంది. ఒక టీషర్ట్.. రెండు కార్ల కాలుష్యం.. ద బ్రీత్‌తో కూడిన రిపేయిర్ టీషర్ట్‌ను ఏడాదిపాటు వాడితే దాదాపు రెండు కార్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చని క్లాటర్స్ అంటోంది. భూమ్మీద మొత్తం వంద కోట్ల కార్లు ఉన్నాయనుకుంటే.. రెండు వందల కోట్ల టీషర్ట్‌లలో ద బ్రీత్ ఏర్పాటైతే వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోతుందని ఫెడ్రికో సురియా అంటున్నారు. క్లాటర్స్ ప్రస్తుతం నిధుల సేకరణ కోసం కిక్‌స్టార్టర్‌లో ప్రత్యేకమైన ప్రచారాన్ని చేపట్టింది. ఒక్కో రిపేయిర్ టీషర్ట్‌ను 29 యూరోల (రూ.2,400)కు అమ్ముతోంది. వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తే దీని ధర రూ.3,600 అవుతుందని సురియా అంటున్నారు. ఇంకొన్ని నెలల్లో టీషర్ట్‌లతోపాటు ట్రాక్ సూట్లు, జాకెట్లను విడుదల చేస్తామని చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అలర్జిక్ రైనైటిస్... వాతావరణంతో పెద్ద రణం!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. చాలాకాలంగా దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది, వెంటనే తుమ్ములు వస్తున్నాయి. కాస్త చల్లగా ఉన్నప్పుడు ఆ వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ముక్కు బిగుసుకుపోతోంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? – సంజీవ్, ఖమ్మం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు అలర్జిక్ రైనైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి అంశాలు ఈ సమస్యను మరింత దుర్భరం చేస్తాయి. అలర్జిక్ రైనైటిస్ ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు మనకు సరిపడని పదార్థాలు ఒంట్లోకి ప్రవేశంచగానే ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్నే అలర్జిక్ రైనైటిస్ అంటారు. కారణాలు : ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది. ∙పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ ఆరోగ్య చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు. ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు : ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స : హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
నిగనిగలాడే కురుల కోసం
బ్యూటిప్స్ సౌందర్య పోషణలో అతివల జుట్టుకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మన జుట్టుని చూసి చెప్పవచ్చు. ఒత్తయిన నిగనిగలాడే జుట్టు ఆరోగ్యానికి సంకేతం. వాతావరణ కాలుష్యం వల్ల, సరైన పోషణ లేక జుట్టు పొడిబారిపోయి రాలుతుంది. ఈ చిట్కాలతో దీన్ని అరికట్టి మెరిసే జుట్టు మీ సొంతం చేసుకోండి ఇలా... ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి కుదుళ్ల నుండి పట్టించాలి. 20 నిమిషాల తరవాత తల స్నానం చెయ్యాలి. ఒక కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చేయాలి. కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసేయాలి. ఆ తరువాత దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. చల్లారిన తరువాత నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయా లి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, అర కప్పు నిమ్మరసం తీసుకుని హెన్నా పౌడర్‌లో వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. తయారయిన పేస్ట్‌ని మాడుకు, కేశాలకు పట్టించి అరగంటపాటు ఉంచుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. -
ప్రతి ఉద్యోగి మొక్కలు నాటాలి
ఆదిలాబాద్ అగ్రికల్చర్: జిల్లాలో పనిచేస్తున్న ప్రతి విద్యుత్ శాఖ ఉద్యోగి మొక్కలు నాటాలని తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణి ప్రాజెక్టు హెచ్ఆర్డి డెరైక్టర్ బి వెంకటేశ్వర్రావు, అపరేషన్ డెరైక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం జిల్లా కేద్రంలోని విద్యుత్ కార్యాలయ అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారం రెండోవిడిత కార్యక్రమం ఎంతో ప్రతిష్టత్మంగా చెపడుతుందని..ఇందులో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. చెట్లు అంతరించి పోవడం మూలంగా వాతావరణ కాలుష్యం, గ్లోబల్వార్మ్షన్ పెరగడంతో ఎండలు మండిపోతున్నాయని దీంతో విద్యుత్ వినియోగం కూడ అధికంగా ఉంటుందన్నారు. చెట్లను పెంచడం వలన వాతావరణ చల్లగా ఉండడంతో పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్టంలో విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ఇతర రాష్ట్రలనుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. అడవులను పెంచడం వలన వర్షాలు సమృద్దిగా కురిసి జలవనరులు పెరిగి విద్యుత్ ప్రాజెక్టులు సైతం అభివృద్ది చెందతాయని పేర్కొన్నారు. విద్యుత్ప్రాజెక్టులు పెరిగితే రాష్ట్రానికి అవసరాలకు అనుగుణంగా మనమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునన్నారు. జిల్లాలో ప్రతి సబ్‌స్టేషన్ పరిధిలో వంద మొక్కలునాటలన్నారు. దీంతో పాటు ఇంటి అవరణలో మొక్కలు నాటి సంసరంక్షణ భావితరాలుకు ఉపయోగకరంగా ఉండేలా చూడలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్చౌహన్, డిఈలు ఏడిలు, ఏఈలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్.. కబలిస్తోంది..
యలమంచిలిని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందించింది. ఆ తర్వాత పాలిథిన్ కవర్ల అమ్మకాలను కూడా నిషేధించింది. కానీ పరిస్థితి మారలేదు. ప్లాస్టిక్ భూతం పట్టణాన్ని కబళిస్తోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. భవిష్యత్ ఎలా ఉంటుంది.. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి.. ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలు గురించి చెప్పే ప్రయత్నమే ఈ కథనం. -యలమంచిలి - విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం - పెరుగుతున్న వాతావరణ కాలుష్యం - ప్రకృతి సిద్ధమైన వస్తువులకు లేని ప్రచారం - భవిష్యత్ అంధకారమే అంటున్న నిపుణులు అది 2050.. స్కూల్‌కు వెళ్లేందుకు రాజేష్ శరీరానికి ‘యాంటీ డేంజరస్ మాస్క్’తో సిద్ధమయ్యాడు. స్కూల్ బస్సులోని పిల్లలందరిదీ అదే పరిస్థితి. పాఠశాల చేరుకోగానే సెక్యూరిటీ గార్డు రాజేష్‌ను యాంటీ రేస్ కేబిన్‌లోకి తీసుకెళ్లి అతణ్ని పూర్తిగా చెక్ చేసి అతనిలో పర్యావరణ హానికారకాలు లేవని నిర్ధారించి లోపలికి పంపాడు. తరగతి గదిలో సైన్స ఉపాధ్యాయినీ మాస్క్ ధరించి బోధిస్తోంది. ఆమె చెబుతోంది ఇలా.. ఆ రోజుల్లో (35 ఏళ్ల కిందట) మున్సిపాలిటీలో కేవలం 25 శాతం మాత్రమే ప్లాస్టిక్ కాలుష్యం ఉండేది. నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగ్‌లు వినియోగించడం మానలేదు. దీంతో 2025 నాటికి కాలుష్య స్థాయి 50 శాతానికి చేరింది. భూమి సారం కోల్పోయి పంటలు పండలేదు. భూగర్భజలాలు లేకపోవడంతో నీళ్లు కరవయ్యాయి. 2040నాటికి కాలుష్యం 90 శాతానికి చేరింది. ప్రజలంతా ప్లాస్టిక్ వినియోగం మానేశారు. జనపనార, కాగితం, బంగాళ దుంప గుజ్జుతో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులు వాడటం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది.. ఇప్పటికీ 2 శాతం మాత్రమే కాలుష్యాన్ని నియంత్రించగలిగాం. ఇలా.. మరో 50 ఏళ్లు మనం కాలుష్య నియంత్రణ పాటిస్తే కానీ.. వాతావరణ కాలుష్యం నుంచి బయటపడలేం. అప్పటి దాకా మనపరిస్థితి ఇంతే.. అనగానే ఆశ్చర్యపోవడం పిల్లల వంతైంది. ఇంటికి వచ్చిన రాజేష్ వాళ్ల అమ్మ లక్ష్మిని ఇలా అడిగాడు. ఇంత హానికరమని తెలిసినా.. అప్పటి వాళ్లు ప్లాస్టిక్‌ను ఎందుకు మానలేదని.. అప్పుడు తల్లి ఇలా జవాబిచ్చింది. ఏదైనా అనుభవంలోకి వస్తేకాని తెలియదు నాన్నా.. మన మాత్రం భావితరానికి ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదు. ఇదంతా అభూత కల్పనకాదు.. చోద్యం అంతకంటే కాదు.. ప్రపంచ పర్యావరణ నిపుణులందరూ గొంతు చించుకొని చాటి చెబుతున్న నిజాలు. వారంతా అరిచి గగ్గోలు పెడుతున్నా ప్లాస్టిక్‌ను మానలేని పరిస్థితిలో ఉన్నాం. అదే భావితరానికి శాపం కాబోతోంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే భవిష్యత్ అంధకారమే. మృత్యుంజయ ప్లాస్టిక్ .. సృష్టిలోని ప్రతిపదార్థం.. జనించి కొంతకాలానికి అవసానం చెందుతుందనేది విజ్ఞానశాస్త్రాలు చెబుతోన్న విషయం. అయితే ప్లాస్టిక్‌కు మాత్రం ఇది అంత తొందరగా వర్తించదు. కొన్ని వందల సంవత్సరాలు గడిస్తేకానీ.. మనం వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు భూమిలో కరిగిపోవు. ఇది అక్షరాల నిజం. ఇదీ ప్రత్యామ్నాయం.. మనం ఇప్పటికీ వీటి వాడకాన్ని అదుపుచేయలేకపోతున్నాం. కానీ చైనా, జపాన్ వంటి దేశాలు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తూనే ప్రత్యామ్నాయాలనూ ప్రోత్సహిస్తున్నాయి. వీటిలో బంగాళ దుంప గుజ్జుతో తయారు చేసిన బ్యాగులు, ప్లేట్లు, గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయి. జనపనార, కాగితంతో పాటు వీటికి గిరాకీ పెరిగింది. అలాగే జనపనార పరిశ్రమలను ప్రోత్సహించి వస్తువుల తయారీని చేపట్టాలి. ఉపయోగించిన ప్లాస్టిక్‌ను రీ-సైక్లింగ్ చేసి మరో వస్తువుగా మారిస్తే పర్యావరణ హానిని కనీసం 20శాతం తగ్గించవచ్చు. తమిళనాడులో ఈ తరహా యూనిట్లకు రాయితీలు కల్పిస్తోంది. మన ప్రభుత్వం కూడా జిల్లాకు కనీసం 5 యూనిట్లయినా కేటాయిస్తే గాని ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టలేం. ప్లాస్టిక్ నిండా రసాయనాలే.. ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తీసే క్రూడాయిల్ నుంచి ఉత్పత్తి చేస్తారు. ముందుగా ఆయిల్‌ను 400 డిగ్రీల వద్ద మరిగించి. నాఫ్తానుగా రూపొందిస్తారు. దీనిని 800డిగ్రీల వరకు వేడిచేసి వచ్చిన పదార్థాన్ని 200 డిగ్రీల వరకు చల్లారుస్తారు. అప్పుడు ప్లాస్టిక్ అణువులు ఏర్పడాయి. వీటిలో పాలిమర్లు, మోనోమర్ల యూనిట్లు ఉంటాయి. వీటికి ఎథిలీన్ కలిపితే పాలిథిన్ రూపొందుతుంది. ఒక కణం, మరొక కణంతో పెనవేసుకుని జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంట్లో కలిపే పిగ్మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎజోడైలు కలిపేకొద్దీ రకరకాల వస్తువులుగా రూపుదాలుస్తాయి. వాటర్ బాటిళ్లకూ అంతే. అవి భూమిలో కలవాలంటే వందల ఏళ్లు పడుతుంది. వాటిని కాల్చినా విషవాయువులు, భూమిపైనే ఉంటాయి. -
శ్వాసా..కష్టమే..!
గ్రేటర్లో పెరుగుతున్న శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఐదేళ్లలోపు చిన్నారుల్లో పది శాతం మందికి ఆస్తమా కాలుష్యం. యాంటిబయోటిక్ మందులతో సమస్య జటిలం వాతావరణ కాలుష్యం..మారిన జీవనశైలి..అతిగా యాంటిబయాటిక్స్ వాడకంతో సిటిజన్ల శ్వాసనాళాలు దెబ్బతింటున్నాయి. స్వేచ్ఛగా గాలిని పీల్చాల్సిన నాళాలు కుంచించుకుపోతున్నాయి. గ్రేటర్లో 20-24 శాతం మంది శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో అత్యధికంగా 10-12 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులే ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సిటీబ్యూరో: గ్రేటర్లో పదిహేనేళ్ల క్రితం పదకొండు లక్షల వాహనాలు ఉండగా, 2015 నాటికి 35 లక్షలకు చేరుకున్నాయి. వీటిలో పది హేనేళ్ల సర్వీసు దాటిన వాహనాలు ఐదు లక్షల వరకు ఉన్నాయి. నగరంలో 40 వేల పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న కాలుష్యం, ఓజోన్లెవల్స్ ఫర్ క్యూబిక్ మీటర్ గాలిలో 130-150 మైక్రోగ్రాములుగా నమోదవుతోంది. సల్పర్డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్‌మోనాక్సైడ్ తో కలుషితమైన గాలిని పీలుస్తుండటం వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటున్నాయి. అవుట్డోర్ పొల్యూషన్‌కు ఇన్డోర్ పొల్యూషన్(మస్కిటో కాయిల్స్, ఫర్ఫ్యూమ్స్, సిగరెట్స్, పరుపు, తలదిండ్లలో పేరుక పోయిన దుమ్ము)తో పాటు ఇన్సైడ్ పొల్యూషన్ (పోతపాలు, జంక్‌ఫుడ్, యాంటిబయాటిక్స్ వాడకం) ఐదేళ్లలోపు చిన్నారుల శ్వాస నాళాలను దెబ్బతీస్తున్నాయి. వయసుతో పాటే తెరుచుకోవాల్సిన శ్వాసనాళాలు మూసుకుపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గ్రేటర్లో ఐదేళ్లలోపు సుమారు ఆరు లక్షల మంది చిన్నారులుంటే వీరిలో పది శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. ఘాటైన వాసనలను పీల్చడం, ఆస్ప్రిన్, బీటాబ్లాకర్స్ వంటి మందులు వాడటం, వ్యర్థ పదార్థాల నుంచి వెలువడే రసాయనాలు, డస్ట్‌మైట్స్, మస్కిటో కాయిల్స్, సువాసన కోసం వాడే ఫర్ఫ్యూమ్, పుప్పడి రేణువులు, ధూమపానం వంటి అంశాలు ఆస్తమాకు కారణమవుతున్నాయి. చివరకు బాగా నవ్వినా.. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస కోశసమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా నాడీవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు మంద గిస్తుంది. ఊపిరితిత్తుల జీవిత కాలం తగ్గుతుం ది. హోటల్ మారియట్‌లో ఆస్తమాపై గురు వారం జరిగిన సమావేశంలో వైద్యులు మాట్లాడారు. పోతపాలతో ఆస్తమా ►తరచు దగ్గడం, ఆయాసం, కడుపు ఉబ్బరంగా ఉం డటం, శ్వాస తీసుకోలేక పోవడం ఆస్తమా లక్షణాలు ►డబ్బాపాల వల్ల పిల్లలు త్వరగా ఆస్తమా బారిన పడే ప్రమాదం ఉంది. ►ఐస్‌క్రీమ్‌లు, శీతల పానియాలు, కూలర్, ఏసీలకు పిల్లలను దూరంగా ఉంచాలి. ►సిగరెట్, వాహన, పారిశ్రామిక కాలుష్యానికి గురికావొద్దు ► సిమెంట్, ఘాటైన వాసనతో కూడిన రంగులు, ఫ్లెక్సీ ప్రింటర్స్‌కు దూరంగా ఉండాలి. ►రోడ్డుపై వెళ్తున్నప్పుడు, పరిశ్రమల్లో పని చేసే సమయంలో మాస్క్‌లు ధరించాలి. ►ఇది పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువు, ఆటలు, తదితర అంశాలపై ప్రభావం చూపుతోంది. డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఇన్హేలర్ ఒక్కటే పరిష్కారం ►ఇంట్లో ఇన్హేలర్ ఉండాలి. నెబ్లూజన్ ఆస్పత్రిలో ఉండాలి. ► టాబ్లెట్స్, నెబ్లూజర్లతో పోలిస్తే ఇన్హేలర్తోనే ప్రయోజనం ఎక్కువ ► మెడికల్ టెస్టులతో పని లేకుండా కేవలం క్లీనికల్‌గా ఆస్తమాను నిర్ధారించవచ్చు ► వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది మాసాలు మందులు వాడితే సరిపోతుంది. ► పొల్యూషన్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. డాక్టర్ ప్రద్యూవాగ్రే, ఆస్తమా నిపుణుడు -
అదిరిందయ్యా సూర్యం
మండుతున్న ఎండలు మంగళవారం 35.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత మరింత పెరగనున్నట్టు సంకేతాలు ఫిబ్రవరి మూడో వారంలోనే భయపెడుతున్న భానుడు సిటీబ్యూరో:నగరంలో అప్పుడే వేసవి ప్రభావం కనిపిస్తోంది. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడోవారంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం సిటీజనులకు ఆందోళన కలిగి స్తోంది. సాధారణంగా మార్చి తొలివారం నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. కానీ మంగళవారం నగరంలో గరిష్టంగా 35.5 డిగ్రీలు, కనిష్టంగా 16.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ కాలుష్యం పెరగడం... గాలిలో తేమ శాతం తగ్గడం.. శీతాకాలంలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాకపోవడం ఎండ తీవ్రతకు కారణాలని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో గరిష్టంగా 34.4 డిగ్రీలు... 2013 ఫిబ్రవరి 28న 35.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2005 ఫిబ్రవరి 16న 37.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పదేళ్ల తరవాత మళ్లీ ఇప్పుడు 35 డిగ్రీలకు మించి నమోదవడం విశేషం. ఈసారి మార్చి ఒకటి నుంచి మే 31 వరకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని... వేడిగాలులు సిటీజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇదిలాఉండగా ఉదయం స్వల్పంగా చలి, మధ్యాహ్నం అత్యధిక ఎండ వేడిమి ఉన్నందున ఇంటి నుంచిబయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లాలని, క్యాప్, చలువ కళ్లద్దాలు వాడాలని సూచిస్తున్నారు. కొబ్బరి బోండాలు, లస్సీ వంటి శీతల పానీయాలతో పాటు పుచ్చకాయ వంటి పండ్లను అల్పాహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. చర్మ సంరక్షణకు సన్‌స్క్రీన్ లోషన్లు వాడాలని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో బయటికి వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
సీఎం హామీల్లో కదలిక
సుందర నగరంగా ఓరుగల్లు రోడ్ల వెంట పచ్చదనం.. కాలనీలకు లే అవుట్లు సిద్ధం పక్కా ఇళ్లకు ప్రమాదం లేదు వరంగల్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వాగ్దానానికి అనుగుణంగా చర్యలు మొదలయ్యాయి. వాతావరణ కాలుష్యం నుంచి నగర జీవి ఉపశమనం పొందడానికి.. పచ్చదనం పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా జీ ప్లస్ వన్ పద్ధతిలో మురికివాడల్లో నిర్మించనున్న ఇళ్ల లే అవుట్లు సిద్ధమయ్యాయి. హన్మకొండ : హైదరాబాద్ తరహాలో నగరంలోని ముఖ్యమైన రోడ్లు, జంక్షన్లు పచ్చదనం సంతరించుకోనున్నాయి. నగర పరిధిలో పచ్చదనం పెంచే చర్యల్లో భాగంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) కార్యాలయం లో బుధవారం సమావేశం జరిగింది.జీడబ్ల్యూఎంసీ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నగరాల్లో పచ్చద నం పెం చే పనుల్లో అనుభవం ఉన్న పది కంపెనీల ప్రతి నిధులు పాల్గొన్నారు. నగరంలో ఉన్న రోడ్ల నిడి వి ఎంత? ఎన్ని ప్రధాన కూడళ్లు ఉన్నారుు? అనే అంశాలపై చర్చించారు. తొలివిడతలో కాజీపేట నుంచి పబ్లిక్‌గార్డెన్ వరకు ఉన్న రోడ్డుతోపాటు 17 జంక్షన్ల(ట్రాఫిక్ ఐలాండ్)లో పచ్చదనం పెంచాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన రహదారుల్ల్లో డివైడర్ల ఎత్తు పెంపు, డివైడర్ల మధ్యలో గ్రాస్‌మ్యాట్ ఏర్పాటు, ప్రచార హోర్డింగులు బిగింపు పనులు చేపడతారు. జంక్షన్లలో రంగురంగుల పూలమొక్కలు పెంచుతారు. సిద్ధమైన లే అవుట్లు వరంగల్ నగరాన్ని స్లమ్ లెస్ సిటీగా తీర్చిదిద్దేక్రమంలో భాగంగా మురికివాడల్లో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక లే అవుట్‌ను కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. లే అవుట్ల రూపకల్పనలో మురికివాడల్లో ఉన్న పక్కా నిర్మాణాలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కా ఇళ్ల స్థలాన్ని లే అవుట్ రూపకల్పనలో పూర్తిగా మినహాయించారు. దీనివల్ల కొత్తగా నిర్మించబోయే ఇళ్లు ఒకే వరుసలో, ఒకే చోట క్రమ పద్ధతిలో కాకుండా ఖాళీ స్థలం అనుగుణంగా నిర్మాణం చేస్తారు. వీటికోసం అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలోపాటు ప్రస్తుతం ఉన్న గుడిసెలు, పెంకుటిళ్లు(సెమీ పక్కా)లను తొలగిస్తారు. ఇలా ఏర్పడిన ఖాళీ స్థలాల్లో కొత్తగా జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లను నిర్మిస్తారు. కనీసం 20 అడుగుల వెడల్పు ఉండే కొత్త అంతర్గత రోడ్లు, మంచినీటి ట్యాం కులు, పార్కులు ఉండేలా ఈ లే అవుట్లు రూపొందించారు. ఎంపిక చేసిన తొమ్మిది మురి కివాడలు ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ పోరంబోకు, చెరువు శిఖం, చారిత్రక కట్టడాలు ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి. లే అవుట్లు సిద్ధమైనందున గృహ నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లే అవుట్ రూపకల్పన సర్వేకు స్థానికులు నిరాకరించడంతో గాంధీనగర్ లే అవుట్ సిద్ధం కాలేదు. సర్వే నంబరు 93లో లక్ష్మీపురం ఉంది. రెవె న్యూ రికార్డుల ప్రకారం పోరంబోకు భూమి. ఆరెకరాల స్థలంలో లేఅవుట్‌ను సిద్ధం చేశారు.ఖిలావరంగల్ పరిధిలోని సర్వే నంబర్లు 1714, 1716, 1707లో శాకరాసికుంట ఉంది. 13.12 ఎకరాల్లో లే అవుట్ సిద్ధం చేశారు. రికార్డుల మేరకు పట్టా ఉన్న ప్రైవేటు శిఖం భూమి. ఖిలావరంగ్ పరిధిలోని సర్వేనంబరు 107లో గిరిప్రసాద్‌నగర్ కాలనీ ఉంది. ఈ ప్రాంతంలో 12.44 ఎకరాల స్థలంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి లే అవుట్ రూపొందించాలి. అంతకుముందు పురావస్తుశాఖ నుంచి అనుమతి రావాలి. హన్మకొండ పరిధిలో సర్వేనంబరు 1066 పరిధిలో అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్ ఉ న్నాయి. రికార్డుల ప్రకారం కార్పొరేషన్ పార్కు కోసం కేటాయించిన స్థలం. ఇక్కడ 5.11 ఎకరాల స్థలంలో లే అవుట్‌ను రూపొందించారు. దర్గా కాజీపేట పరిధిలో సర్వే నంబరు 977లో దీన్‌దయాళ్‌నగర్ ఉంది. రికార్డుల ప్రకారం ఇది సర్కారు పోరంబోకు భూమి. వరంగల్ కార్పొరేషన్ ఈ స్థలాన్ని చెరువు శిఖం భూమిగా గుర్తించింది. ఇక్కడ 20.22 ఎకరాల స్థలంలో లే అవుట్‌ను సిద్ధం చేశారు. దర్గాకాజీపేట సర్వే నంబరు 37లో ప్రగతినగర్ ఉంది. రికార్డుల ప్రకారం చెరువశిఖం. 3.79 ఎకరాల్లో లేఅవుట్ రూపొందించారు. గీసుకొండ మండలం గొర్రెకుంట సమీపంలో ఉన్న గరీబ్‌నగర్ సర్వేనంబరు 95 ఉంది. ఇటీవల ఇది గ్రేటర్లో విలీనమైంది. రికార్డుల ప్రకారం ఈ స్థలం మల్లికుంట శిఖం. ఇక్కడ 28 ఎకరాల్లో లేఅవుట్ రూపొందించారు. సర్వేనంబరు 195లో ఎస్సార్‌నగర్ ఉంది. రికార్డుల ప్రకారం చెరువు శిఖం. 18.15 ఎకరాల్లో లే అవుట్ చేశారు. -
భయం.. భయం
నగరంలో విస్తరిస్తోన్న థైరాయిడ్ వాతావరణ కాలుష్యం, పౌష్టికాహార లోపమే కారణం మూడోవంతు బాధితులు మహిళలే ఇందులో హైపోథైరాయిడే అధికం సర్వేలో వెల్లడైన వాస్తవాలు థైరాయిడ్.. ఇప్పుడీ సమస్య గ్రేటర్ నగరాన్ని వణికిస్తోంది. నగర వాసులు తమకు తెలియకుండానే థైరాయిడ్ బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం.. హార్మోన్లలో సమతుల్యత లోపించడం, పౌష్టికాహార లోపం వల్ల చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో మూడోవంతు మంది మహిళలు కావడం ఆందోళన కలిగించే అంశం. నగరంలో హైపోథైరాయిడిజం బాధితులే అధికం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితేనే అన్ని విధాలా మేలంటున్నారు వైద్య నిపుణులు. నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న థైరాయిడ్‌పై ప్రత్యేక కథనం.. - సాక్షి, సిటీబ్యూరో ఒకప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతా ల్లో మాత్రమే కన్పించే థైరాయిడ్ తాజాగా మెట్రో నగరాలకూ విస్తరించింది. పౌష్టికాహారం, అయోడిన్ లోపం.. వాతావరణ కాలుష్యం వల్ల గ్రేటర్లో నేడు అనేకమంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. మధుమేహం, గుండె జబ్బులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో థైరాయిడ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఇండియన్ థైరాయిడ్ ఎపిడమిలాజీ వారు నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యం కలిగిం చే అంశాలు వెలుగు చూ శాయి. సర్వే ప్రకారం 18 ఏళ్లుపైబడిన వారిలో జాతీయ స్థాయిలో సగటున 10.95% మంది హైపోథైరాయిడ్‌తో బాధపడుతున్నారు. రాష్ట్రస్థాయిలో సగటున హైదరాబాద్‌లో 8.88% మంది ఉండగా ఇందులో మూడోవంతు బాధితులు మహిళలు కావడం ఆందోళన కలిగించే అంశం. ఉత్తరాదిన కోల్‌కత.. దక్షిణాన హైదరాబాద్ 2012-13లో దేశరాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూర్, అహ్మదాబాద్, గోవా, చెన్నై, హైదరాబాద్‌లో సర్వే నిర్వహించారు. ఎంపిక చేసిన నగరాల్లో థైరాయిడ్ హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేసి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలిస్తే.. దేశంలోనే అత్యధికంగా ఉత్తర భారత దేశంలోని కోల్‌కతలో 21.6 శాతం, దేశ రాజధాని న్యూఢిల్లీలో 11.07 శాతం, అహ్మదాబాద్‌లో 10.6, ముంబైలో 9.6 శాతం ఉండగా, దక్షిణాది నగరాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్టు తేలిందని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎండోక్రానాలాజీ విభాగం వైద్యుడు డాక్టర్ రాకేష్సహాయ్ స్పష్టం చేశారు. పౌష్టికాహార, అయోడిన్ లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణమంటున్నారు. కాలుష్యం వల్లే... శరీరంలో అయోడిన్ మూలక లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో థైరాయిడ్ బారిన పడే వారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది తమ ఆహారంలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల అనేకమంది దీని బారిన పడుతున్నట్టు తేలింది. థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంతవరకు కాపాడుకోవచ్చు.- డాక్టర్ రాకేష్ సహాయ్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి హైపో థైరాయిడిజం లక్షణాలు హైపర్ థైరాయిడిజం లక్షణాలు హైపో థైరాయిడ్‌ను సులభంగా గుర్తించవచ్చు - హైపర్ థైరాయిడ్‌ను కూడా గుర్తించవచ్చు బరువు పెరగడం - బరువు తగ్గడం జుట్టు రాలిపోతుంది - విపరీతమైన చమట చర్మం పొడిబారుతుంది - గుండె వేగంగా కొట్టుకోవడం విపరీతమైన అలసట - టెన్షన్(ఆందోళన), చేతులు వణకడం మహిళల్లో రుతుచక్ర క్రమం తప్పడం - గుర్తించడంలో రోగులే కాదు వైద్యులు కూడా పొరపాటు పడవచ్చు సంతాన లేమి - టీఎస్‌హెచ్ టెస్టు చేస్తే ఉందో లేదో తెలుస్తుంది థైరాయిడ్ అంటే..? థైరాయిడ్ అనేది రెండు రకాలు. ఒకటి హైపర్ థైరాయిడిజం, మరొకటి హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉపయోగపడటంతోపాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ గ్రంథి సరిగా విధులు నిర్వహించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్ థైరాయిడిజమ్‌కు దారితీస్తుంది. ప్రస్తుతం నగరంలో హైపోథైరాయిడిజం బాధితులు అధికంగా ఉన్నారు. -
తిరుమలలో కాలుష్యం తక్కువ
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: తిరుమలలో పర్యావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయిలో లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో సమీ క్ష సమావేశం నిర్వహించింది. తిరుమల తిరుపతిలో వాతావరణ కాలుష్యం, ని వారణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఈ కమిటీ చైర్మన్ టీ. సుబ్బిరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వాతావరణ కాలుష్యం 60 క్యూబిక్ మీటర్లకు చేరితే ప్రమాదమన్నారు. తిరుమలలో ఈ స్థాయి 40 క్యూబిక్ మీటర్లుగా ఉందన్నారు. తిరుమలలో అన్నదానానికి ఉపయోగించే కూరగాయలు, బియ్యం నిలువ ఉంచే పద్ధతులు భేషుగ్గా ఉన్నాయన్నారు. రోజుకు 50 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నప్పటికీ, అరటి ఆకులను ఉపయోగించడం హర్షించదగ్గ అంశమన్నారు. తిరుమల ఫారెస్ట్‌లో 3 వేల హెక్టార్లు టీటీడీ పరిధి లో ఉందన్నారు. ఇలాంటి పర్యావరణం ఎక్కడా లేదన్నారు. తిరుమలలో ప్రస్తుతం 115 పబ్లిక్ టాయ్లెట్లు ఉన్నాయని, వీటిని 200కు పెంచాల్సి ఉందన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లకు ప్రతి యేటా మర మ్మతులు చేయాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు టీటీడీ చేపడుతున్న చర్యలు బాగున్నాయన్నారు. దీనిని మరింత మెరుగు పరచడానికి సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉందన్నారు. తిరుమలకు చేరే బస్సుల నుంచి వస్తున్న కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో లేదన్నారు. అయితే భవిష్యత్‌ను దృష్టి లో ఉంచుకుని వ్యక్తిగత వాహనాలను అనుమతించాలా? వద్దా? అన్న అం శాన్ని టీటీడీ పునఃసమీక్షించుకోవాలని కోరారు. తిరుమలకు యేడాదికి 5 లక్షల యూనిట్ల విద్యుత్ ఖర్చువుతుందన్నా రు. ప్రస్తుతం పవన విద్యుత్ ద్వారా 1.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసుకోబోతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరో 1.5 లక్షల యూనిట్లకు పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిం చారు. తిరుమలలో రోజుకు 40 టన్నుల చెత్త పోగవుతుందని, దీన్ని సమర్థవంతంగా తొలగిస్తున్నారన్నారు. అలానే ఎన్ ఏఆర్ఎల్(గాదంకి)లో చేపడుతున్న వాతావరణ పరిశోధనలపై కూడా ఈ సమావేశంలో చర్చించామన్నారు. తిరుమలలో భవిష్యత్ నిర్మాణాలకు స్థలాలు లేనందువల్ల తిరుపతిలోనే భక్తులకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను కోరారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులు విజయ జవహర్లాల్, రవి నారాయణ, రామకృష్ణ యాదవ్, ఫణి మనోజ్ పాండియన్, ప్రదీప్ తంతా, రంజన్ ప్రసాద్, రాం శంకర్ రాజ్‌బార్, ఎంబీ.రాజేష్, మణియన్, జయప్రకాష్, సెల్వ గణపతి, టీటీడీ ఈవో ఎంజీ. గోపాల్, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వీర్యకణాలలో లోపాలకుఆయుర్వేదమే పరిష్కారం
30 ఏళ్ల క్రితం భారతీయ పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంతానం కలిగి ఉండడం మానవునికి జీవితంలో అత్యంత తృప్తిని కలిగించే విషయం. స్త్రీ మాతృత్వాన్ని పొందడం, అలాగే పురుషుడు పితృత్వాన్ని పొందడం ఈకాలం చాలా పెద్ద విషయంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కారణం - మానవ జీవన విధానంలో అనేక మార్పులు, మానసిక ఒత్తిడి అనే విషయాల వలన మనిషి జీవన ప్రక్రియలలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో ‘త్రి ఉపస్తంభాలు’ అనే ఒక ఆరోగ్య రహస్యం మహర్షులు చెప్పారు. అవి - ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం. మానవులు ఆరోగ్యకరమైన (సమతుల్య ఆహారం) అహారం, సరియైన సమయంలో తగు ప్రమాణంలో ( 6 గం. - 8గం.) నిద్రపోవడం, అలాగే బ్రహ్మచర్యం పాటించడం (అనగా ప్రాకృతిక నియమాలు) ఉదా: దినచర్య / ఋతుచర్యలను పాటించడం. ఈ మూడు సూత్రాలు పాటిస్తే మానవులకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో సంతానలేమి అనే సమస్య వైద్యులకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా భారతీయులను కూడా ఈ సమస్య పీడిస్తోంది. పురుషులలో సంతాన సామర్థ్యాన్ని కాలుష్యం మింగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. అది తిరిగి మానవులకే హాని కలిగిస్తుంది. తద్వారా పురుషుల్లో వీర్యకణాలలో నాణ్యత, కణాల సంఖ్యలో తగ్గుదల అనే సమస్యలు ఎక్కువగా ఈమధ్యకాలంలో వింటున్నాం. 30 సంవత్సరాల క్రితం భారతీయ పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2 కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పై కారణాలతోపాటు మద్యపానం, ధూమపానం, హర్మోన్లలో లోపాలు, సుఖవ్యాధులు, గవద బిళ్లలు, వేరికోసిల్, అధిక బరువు, మధుమేహం కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గటాన్ని ‘ఓలిగో స్పెర్మియా’ అని, అసలు కణాలు లేనట్లయితే ‘ఆజోస్పెర్మియా’ అని, కదలిక సరిగా లేనిచో ‘అస్తినోస్పెర్మియా’ అని, కణాల స్వరూపం మార్పులు ఉన్నట్లయితే ‘టెరిటో స్పెర్మియా’ అని అంటారు. ఆయుర్వేద శాస్త్రంలో శుద్ధ శుక్రకణాల యొక్క వివరణలు, అలా శుక్ర కణాల దోషాల గురించి అతి విస్తారంగా చరక, సుశ్రుత, వాగ్భట మహర్షులు చర్చించారు. చరక మహర్షి పురుషులలో సంతానలేమికి నాలుగు ప్రధాన కారణాలు చెప్పారు. 1. బీజోపఘాతం (వీర్యకణాలలో సంఖ్య, కదలికల్లో నాణ్యత లోపాలు) 2. శుక్ర సంక్షయ (వీర్య ప్రమాణంలో తగ్గుదల) 3. ధ్వజోపఘాత (అంగ స్తంభన సమస్యలు) 4. జరా (ముసలితనం) పై కారణాలలో బీజదోషం గురించి, ఇంకా సమగ్రత గురించి చర్చించారు. వాటిని శుక్ర దోషాలుగా వర్ణించారు. అవి సంఖ్యాపరంగా చూసినట్లయితే 8 విధాలుగా చెప్పవచ్చు. వాతదోషం వల్ల 3 సమస్యలు - నురుగుతో కూడిన వీర్యం, పలుచగా ఉండే వీర్యం, రూక్షత (dryner) కలిగిన వీర్యం అనేవి. ఈ వాత దోషంచే నొప్పితో కూడిన వీర్యం స్వల్పంగా వెలువడుతుంది. పిత్తదోషం వల్ల 2 సమస్యలు - దుర్గంధయుక్త వీర్యం (pus cell), వివర్ణత (సహజవర్ణం మారుట) అనేవి. ఇక్కడ పిత్తదోషంచే మంటతో కూడిన వీర్యం వెలువడుతుంది. కఫదోషం వల్ల అతి జిగురు కలిగిన వీర్యం (viscosity పెరుగుట) అనే సమస్య. ఇక్కడ వీర్యం చల్లగా వెలువడుతుంది. రక్తదోషంచే వీర్యంలో ఎర్ర రక్తకణాలు వెలువడతాయి. అలాగే - వాత కఫ దోషాలచే వీర్యం త్వరగా ద్రవ స్వభావాన్ని పొందదు. అందుకే ఆయుర్వేదంలో శుద్ధ శుక్ర లక్షణాల గురించి ఈవిధంగా చెప్పారు. ‘స్ఫటికాభం, ద్రవం స్నిగ్ధం మధురం మర్మ గన్ధిచ’ అనగా స్వచ్ఛమైన శుక్రం, పారదర్శకంగా (స్ఫటికంలా), ద్రవత్వాన్ని, స్నిగ్ధత (viscosity)ని, మర్మరం (ph. value 7.2-7.7), గా ఉండాలని ఆచార్యులు చెప్పారు. ఈ లక్షణాలతో కూడిన వీర్యాన్ని కలిగిన పురుషులకు ఎలాంటి సందేహం లేకుండా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఇందుకు ఆయుర్వేద శాస్త్రంలో అనేక అద్భుత చికిత్సా విధానాలు, రసాయన, వాజీకరణ చికిత్సా విభాగంలో మహర్షులు వివరించారు. ముఖ్యంగా శుక్ర రేచకములు (vericocel) లాంటి సమస్యలు శుక్ర శోధకాలు (ఇన్ఫెక్షన్ను తగ్గించేవి), శుక్ర జనకాలు (కణాల వృద్ధికి, నాణ్యతకు)అనే ఔషధాలను ఆచార్యులు వివరించారు. ఇది చూర్ణ రూపంలోనూ, అస్ఫ/అరిష్ట రూపంలోనూ, వటి రూపంలోను, లోహ రూపంలో, భస్మ రూపంలో అనేక అద్భుత ఔషధాలు, అతి సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే హార్మోన్ల సమస్యలలో తక్రధార, శరీర .... విరేచనం, వస్థి, ఉత్తరవస్థి లాంటి అనేక ప్రత్యేక చికిత్సా విధానాలలో ఈ శుక్రకణాల సమస్యలను అధిగమించి సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సరైన దినచర్య, ఋతుచర్య ఇత్యాది విషయాలలో కూడా ఆయుర్వేద వైద్యుల సూచనలు పాటిస్తే పురుషులలో ‘సంతానలేమి’ని జయించవచ్చు. - డాక్టర్ మనోహర్ ఎం.డి (ఆయుర్వేద), సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ఫోన్ : 7416 107 107, 7416 109 109 www.starayurveda.com