శ్వాసా..కష్టమే..!
గ్రేటర్‌లో పెరుగుతున్న శ్వాసకోశ సంబంధిత సమస్యలు
ఐదేళ్లలోపు చిన్నారుల్లో పది శాతం మందికి ఆస్తమా
కాలుష్యం. యాంటిబయోటిక్ మందులతో సమస్య జటిలం
వాతావరణ కాలుష్యం..మారిన జీవనశైలి..అతిగా యాంటిబయాటిక్స్ వాడకంతో సిటిజన్ల శ్వాసనాళాలు దెబ్బతింటున్నాయి. స్వేచ్ఛగా గాలిని పీల్చాల్సిన నాళాలు కుంచించుకుపోతున్నాయి. గ్రేటర్‌లో 20-24 శాతం మంది శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో అత్యధికంగా 10-12 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులే ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
సిటీబ్యూరో: గ్రేటర్‌లో పదిహేనేళ్ల క్రితం పదకొండు లక్షల వాహనాలు ఉండగా, 2015 నాటికి 35 లక్షలకు చేరుకున్నాయి. వీటిలో పది హేనేళ్ల సర్వీసు దాటిన వాహనాలు ఐదు లక్షల వరకు ఉన్నాయి. నగరంలో 40 వేల పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న కాలుష్యం, ఓజోన్‌లెవల్స్ ఫర్ క్యూబిక్ మీటర్ గాలిలో 130-150 మైక్రోగ్రాములుగా నమోదవుతోంది. సల్పర్‌డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్‌మోనాక్సైడ్ తో కలుషితమైన గాలిని పీలుస్తుండటం వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటున్నాయి. అవుట్‌డోర్ పొల్యూషన్‌కు ఇన్‌డోర్ పొల్యూషన్(మస్కిటో కాయిల్స్, ఫర్‌ఫ్యూమ్స్, సిగరెట్స్, పరుపు, తలదిండ్లలో పేరుక పోయిన దుమ్ము)తో పాటు ఇన్‌సైడ్ పొల్యూషన్ (పోతపాలు, జంక్‌ఫుడ్, యాంటిబయాటిక్స్ వాడకం) ఐదేళ్లలోపు చిన్నారుల శ్వాస నాళాలను దెబ్బతీస్తున్నాయి. వయసుతో పాటే తెరుచుకోవాల్సిన శ్వాసనాళాలు మూసుకుపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గ్రేటర్‌లో ఐదేళ్లలోపు సుమారు ఆరు లక్షల మంది చిన్నారులుంటే వీరిలో పది శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది.
నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం..
ఘాటైన వాసనలను పీల్చడం, ఆస్ప్రిన్, బీటాబ్లాకర్స్ వంటి మందులు వాడటం, వ్యర్థ పదార్థాల నుంచి వెలువడే రసాయనాలు, డస్ట్‌మైట్స్, మస్కిటో కాయిల్స్, సువాసన కోసం వాడే ఫర్‌ఫ్యూమ్, పుప్పడి రేణువులు, ధూమపానం వంటి అంశాలు ఆస్తమాకు కారణమవుతున్నాయి. చివరకు బాగా నవ్వినా.. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస కోశసమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా నాడీవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు మంద గిస్తుంది. ఊపిరితిత్తుల జీవిత కాలం తగ్గుతుం ది. హోటల్ మారియట్‌లో ఆస్తమాపై గురు వారం జరిగిన సమావేశంలో వైద్యులు మాట్లాడారు.
పోతపాలతో ఆస్తమా
►తరచు దగ్గడం, ఆయాసం, కడుపు ఉబ్బరంగా ఉం డటం, శ్వాస తీసుకోలేక పోవడం ఆస్తమా లక్షణాలు
►డబ్బాపాల వల్ల పిల్లలు త్వరగా ఆస్తమా బారిన పడే ప్రమాదం ఉంది.
►ఐస్‌క్రీమ్‌లు, శీతల పానియాలు, కూలర్, ఏసీలకు పిల్లలను దూరంగా ఉంచాలి.
►సిగరెట్, వాహన, పారిశ్రామిక కాలుష్యానికి గురికావొద్దు
► సిమెంట్, ఘాటైన వాసనతో కూడిన రంగులు, ఫ్లెక్సీ ప్రింటర్స్‌కు దూరంగా ఉండాలి.
►రోడ్డుపై వెళ్తున్నప్పుడు, పరిశ్రమల్లో పని చేసే సమయంలో మాస్క్‌లు ధరించాలి.
►ఇది పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువు, ఆటలు, తదితర అంశాలపై ప్రభావం చూపుతోంది.
డాక్టర్ సుదర్శన్‌రెడ్డి,
ప్రముఖ చిన్నపిల్లల వైద్యనిపుణుడు
ఇన్‌హేలర్ ఒక్కటే పరిష్కారం
►ఇంట్లో ఇన్‌హేలర్ ఉండాలి. నెబ్లూజన్ ఆస్పత్రిలో ఉండాలి.
► టాబ్లెట్స్, నెబ్లూజర్‌లతో పోలిస్తే ఇన్‌హేలర్‌తోనే ప్రయోజనం ఎక్కువ
► మెడికల్ టెస్టులతో పని లేకుండా కేవలం క్లీనికల్‌గా ఆస్తమాను నిర్ధారించవచ్చు
► వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది మాసాలు మందులు వాడితే సరిపోతుంది.
► పొల్యూషన్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
డాక్టర్ ప్రద్యూవాగ్రే, ఆస్తమా నిపుణుడు