కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని తగ్గించటం ఎలా? | How to reduce the use of antibiotics in poultry farming | Sakshi
Sakshi News home page

కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని తగ్గించటం ఎలా?

Published Fri, Nov 22 2024 7:28 PM | Last Updated on Fri, Nov 22 2024 7:35 PM

How to reduce the use of antibiotics in poultry farming

వ్యాధి నిర్ధారణ అయిన కోళ్లకు, వాటి పక్కన ఉన్న కోళ్లకు చికిత్స చేయడానికి మాత్రమే యాంటీబయాటిక్స్‌ ఉపయోగించండి. వీటిని మేత ద్వారా కంటే నీటిలో కలిపి ఇస్తే బాగా పనిచేస్తాయి. యాంటీబయాటిక్‌ ఔషధాలను వ్యాధి నివారణకు లేదా కోళ్ల పెరుగుదలను పెపొందించడానికి ఉపయోగించవద్దు.

కోళ్ల షెడ్‌లోకి వచ్చే సందర్శకుల సంఖ్యను పరిమితం చేయండి. లోపలికి వెళ్లే ముందు బట్టలు, చెప్పులు/బూట్లు మార్చుకోవాలి. చేతులు కడుక్కోవాలి. ఆవరణలోకి ప్రవేశించే ముందు వాహనాలను క్రిమిసంహారకాలతో శుభ్రపరచండి.  వ్యాధులను వ్యాపింపజేసే ఎలుకలు, పురుగులు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు కోళ్ల ఫారాలల్లోకి రానివ్వకండి.  

నాణ్యతతో కూడిన మంచి వ్యాక్సిన్లను ఉపయోగించండి. తయారీదారు సూచించిన విధంగా వాటిని నిల్వ చేయండి, జాగ్రత్తగా వాడండి.

మీ ఫౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ల ఆరోగ్యాన్ని, ప్రవర్తనను ప్రతిరోజూ తనిఖీ చేయండి. వాటిల్లో అకస్మాత్తుగా లేదా క్రమంగా వస్తున్న మార్పులను వెంటనే గుర్తించండి. చనిపోయిన పక్షులను తొలగించి పారవేయండి.

గాలి, వెల్తురు, మేత, నీటి సరఫరా, కోళ్ల సంఖ్య  (స్టాకింగ్‌ డెన్సిటీ) ఇతర విషయాలకు సంబంధించి నిపుణుల సిఫార్సులను అనుసరించండి.

కోళ్లకు వేసే మేత నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి.  మేతలో తగినంత శక్తినిచ్చే దినుసులు, ఖనిజాలను సమతుల్యంగా ఉండాలి. మేతను జాగ్రత్తగా నిల్వ చేయండి. మొక్కలు, గింజలతో కూడిన మేతను ఇవ్వటమే మేలు.

ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, సుగంధ తైలాలు, ఆర్గానిక్‌ యాసిడ్స్, నీటకరగని పీచు కోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి పేగులలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. సూక్ష్మక్రిములను నిరోధిస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

చ‌ద‌వండి: మ‌నం తింటున్న ఆహార నాణ్య‌త ఎంత‌?

మీ ఫౌల్ట్రీ షెడ్‌ను, పరికరాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేసిన తర్వాత.. మురికిని శుభ్రంచేయటానికి డిటర్జెంట్లు లేదా వేడి నీటిని ఉపయోగించండి. ప్రతి బ్యాచ్‌ తర్వాత తగినన్ని రోజులు షెడ్‌ను ఖాళీగా ఉంచండి.

కొత్తగా కోడి పిల్లలను తెచ్చుకునేటప్పుడు విశ్వసనీయమైన హేచరీల నుంచి తెచ్చుకోండి. టీకాలు వేసి, వ్యాధులు సోకని తల్లి కోళ్ల నుంచి పుట్టిన పిల్లలనే ఎంచుకోండి.

కోడిపిల్లలను తెచ్చిన వెంటనే మేతను, నీటిని అందించండి. వాటికి అవసరమైన అన్ని పోషకాలు ఇవ్వండి. శారీరక అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేయండి.

చ‌ద‌వండి: కుమ్‌ఖాత్‌ పండు.. పోషక విలువలు మెండు

శుభ్రమైన, మంచి నాణ్యత గల నీరు అందుబాటులో ఉండేలా చూసుకోండి. నీటి సరఫరా గొట్టాలను తరచుగా శుభ్రపరచండి. డ్రింకింగ్‌ లైన్లను వారానికోసారి శుభ్రపరచండి.

మ‌రిన్ని ముఖ్యాంశాలు
కోడి పిల్లలకు మొదటి నుంచే అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోండి. 
ఆరోగ్యకరమైన కోడి పిల్లలను మాత్రమే పెంచండి. 
మీ కోళ్ల ఫారాన్ని సిద్ధం చేయండి.
మేతలో ప్రత్యేక పోషకాలు కలిపి ఇవ్వండి.
మేత ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
సౌకర్యవంతమైన వాతావరణం కల్పించండి.
ప్రతి రోజూ కోళ్లను పరిశీలించండి.
సకాలంలో టీకాలు వేయండి.
గట్టి జీవ భద్రతా చర్యలు పాటించండి. 
యాంటీ బయాటిక్స్‌ను తగుమాత్రంగా వాడండి.
అధిక నాణ్యత గల నీరివ్వండి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement