పెరట్లో నాటు కోళ్ల పెంపకం ద్వారా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు, ముఖ్యంగా మహిళా రైతులకు, ఏడాది పొడవునా స్థిరంగా ఆదాయంతో పాటు కుటుంబ స్థాయిలో పౌష్టికాహార లభ్యతను సైతం పెంపొందించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి వాసన్ తదితర స్వచ్ఛంద సంస్థలు గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా నిర్థారణైంది. పెరటి కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 70% కుటుంబాలు అన్నో ఇన్నో పెరటి కోళ్లు పెంచుకుంటూనే ఉంటాయి. అయితే, కోళ్లు పరిసర ప్రాంతాల్లో తిరిగి రావటంతో పాటు రాత్రుళ్లు చెట్ల మీదో, పందిళ్ల మీదో నిద్రించటం వల్ల కుక్కలు, పిల్లుల బారిన పడి మరణిస్తూ ఉంటాయి.
ఈ సమస్యలను అధిగమించడానికి వాసన్ సంస్థ దేశవాళీ పెరటి కోళ్లను అరెకరం విస్తీర్ణంలో చుట్టూ ప్రత్యేకంగా కంచె వేసి అందులో స్థానికంగా లభించే జాతుల నాటు కోళ్లు పెంచటంపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల తోడ్పాటుతో అమలు చేస్తోంది. కోళ్లు రాత్రి పూట భద్రంగా విశ్రమించడానికి షెడ్డు నిర్మించటం.. చిరుధాన్యాలు, అజొల్లా, చెద పురుగులను మేపటం.. వ్యాక్సిన్లు వేయటం ద్వారా నాటు కోడి పిల్లల మరణాలను తగ్గించి, ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం కల్పించటం.. ప్రతి 25 కుటుంబాలకు ఒకటి చొప్పున స్థానిక మహిళా రైతు ద్వారానే బ్రీడింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయించటం.. వంటి చర్యల ద్వారా చక్కటి ఫలితాలు వస్తున్నాయని వాసన్ చెబుతోంది.
అరెకరం పెరటి కోళ్ల నుంచి రూ. 70–80 వేలు, ఆ అరెకరంలో పండ్లు, కూరగాయలు, దుంప పంటల ద్వారా మరో రూ. 20 వేల వరకు రైతు కుటుంబానికి ఆదాయం వస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు వాసన్ తెలిపింది. ఏపీ గిరిజన ప్రాంతాల్లో మహిళా రైతుల అనుభవాలు దేశవ్యాప్తంగా అమలు చేయదగినవిగా ఉన్నాయని వాసన్ చెబుతోంది. ఈ అనుభవాలపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన విశాఖలో వాసన్, ఏపీ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చర్చాగోష్టి జరగనుంది. ఈ సందర్భంగా అరెకరంలో నాటు కోళ్లను పెంచుతూ ఏడాదికి దాదాపు రూ. లక్ష ఆదాయం గడిస్తున్న చిన్నమ్మి, చంద్రయ్య గిరిజన దంపతుల అనుభవాలను ఇక్కడ పరిశీలిద్దాం.
చిన్నమ్మి నాటు కోళ్ల బ్రీడింగ్ ఫామ్
కుండంగి చిన్నమ్మి(58), చంద్రయ్య గిరిజన దంపతులది మన్యం పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం చినరామ గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుడు రవికుమార్ డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులతో కలసి గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. వారికి 70 సెంట్ల మాగాణి, ఎకరంన్నర మెట్ట పొలంతో పాటు 2 ఎకరాల కొండ పోడు భూములు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వాసన్ సంస్థ తోడ్పాటుతో అరెకరం పెరట్లో నాటు కోళ్ల పెంపకం చేపట్టారు. భర్త, కుమారుడు ఇతర పొలాల్లో పనులు చూసుకుంటూ ఉంటే చిన్నమ్మి పెరటి కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. మరో 25 కుటుంబాలకు కూడా కోడి పిల్లలను అందించే బ్రీడింగ్ ఫామ్‌ను చిన్నమ్మి నిర్వహిస్తుండటం విశేషం.
అరెకరం స్థలంలో చుట్టూ 4 అడుగుల ఎత్తు గ్రీన్ మెష్‌తో పాటు కొండ చీపురు గడ్డి, వెదరు బొంగులతో గట్టి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. 50 కోళ్లతో ప్రారంభించారు. ఇప్పుడు 80 కోళ్లు ఉన్నాయి. కొన్ని పందెం కోళ్లు కూడా పెంచుతున్నారు. 18“24 అడుగుల స్థలంలో 200 కోళ్లు రాత్రిళ్లు నిద్రించడానికి సరిపోయే రేకుల షెడ్‌ను 3 సెంట్లలో నిర్మించారు. వాసన్ అందించిన రేకులు తదితర సామగ్రిని ఉపయోగించారు. కోళ్లు ఆరుబయట తిరిగి మేస్తూ ఉంటాయి. అదనంగా తమ పొలాల్లో పండించిన చోళ్లు తదితర చిరుధాన్యాలు కోళ్లకు వేస్తున్నారు. చిన్న కుంటలో పెంచిన అజొల్లాను కోళ్లకు, మట్టి కుండల్లో పెంచిన చెద పురుగులను కోడి పిల్లలకు మేతగా వేస్తుండటంతో అవి బలంగా పెరుగుతున్నాయి.
వారం కోడి పిల్లలకు విధిగా లసోట వాక్సిన్‌తో పాటు రెండు నెలలకోసారి ఇతర వాక్సిన్లు వేస్తున్నారు. ఈ అరెకరంలో కోళ్ల పెంపకంతో పాటు అదనపు ఆదాయం కోసం 43 రకాల పండ్లు, కూరగాయలు, దుంప పంటలను 5 దొంతర్లలో పండిస్తుండటం విశేషం. పసుపు, అల్లం, సీతాఫలాలు, బొప్పాయి, చింతపండుతో పాటు ఆగాకర తదితర తీగ జాతి కూరగాయలను సైతం పండిస్తున్నారు. కోడి మాంసం, గుడ్లు, కూరగాయలు, పండ్లను తాము తినటంతో పాటు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి రూ. 70–80 వేల వరకు నాటుకోళ్లు, గుడ్ల ద్వారా, మరో రూ. 20 వేలు పంటల ద్వారా ఈ అరెకరం నుంచి ఆదాయం పొందుతున్నామని రవి(94915 42102) తెలిపారు. చిన్నమ్మి శ్రద్ధగా పనిచేస్తూ ఆదర్శ నాటుకోళ్ల బ్రీడింగ్ ఫామ్ రైతుగా గుర్తింపు పొందటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment