అళగర్ మునగ పాతికేళ్లపాటు దిగుబడినిచ్చే అరుదైన రకం
రైతు శాస్త్రవేత్త అళగర్ స్వామి మునగ వంగడం పీఎవీఎంకు విశేష ప్రాచుర్యం
ఎకరాకు 30 టన్నులకు పైగా మునగ కాయల దిగుబడి
90 లక్షలకుపైగా మునగ మొక్కలను రైతులకందించిన అళగర్ స్వామి
సృష్టి సమ్మాన్ పురస్కారం సహా వందకు పైగా అవార్డులు
ఉద్యోగం వద్దు వ్యవసాయమే ముద్దు అని అతను నమ్మాడు. సాగులోకి దిగింది మొదలు నిరంతర కృషితో రుషిలా తపించి ఒక అద్భుత మునగ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం ఖ్యాతి దేశం నలుమూలలకు విస్తరించింది. అధిక దిగుబడులనిస్తూ అళగర్ స్వామికే కాదు అనేక రాష్ట్రాల్లోని వేలాది మంది రైతులకూ కనక వర్షం కురిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో అళగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం మునగ నర్సరీగా మారిపోయింది.
ఏరోజు కారోజు విధులు ముగించుకొని బాధ్యతలు తీర్చుకునే ఉద్యోగం కాదు రైతు జీవితం. అలాగని పంటలు పండించటం, అమ్ముకోవటంతోనే దింపుకునే తల భారమూ కాదు. ఎంత చాకిరీ చేసినా వద్దనని పొలం సముద్రాన్ని ఈదటంలా అనిపిస్తుంటే.. అలసిపోని చేపలా మారి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితేనే రాణింపు, సంతృప్తి. అళగర్‌స్వామి చేసింది అదే. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పల్లపట్టి గ్రామం స్వామి జన్మస్థలం. ఆర్ట్స్‌లో పీజీ విద్యను పూర్తి చేసిన స్వామి మక్కువతో వ్యవసాయాన్ని చేపట్టారు. మొక్కుబడి వ్యవసాయం చే యకుండా నిరంతరం శాస్త్రవేత్తలతో చర్చిస్తూ ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు.
దిండిగల్ నుంచి మధురైకి వెళ్లే ప్రధాని రహదారి పక్కనే అళగర్ స్వామికి చెందిన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడాన్ని రూ పొందించేందుకు కృషిని మమ్మురం చేసి 2002లో ఒక నూతన మునగ వంగడాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక రకాలను సంకరం చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. దీనికి ‘పళ్లపట్టి అళగర్ స్వామి వెళ్లిమాలై మురుగన్’(పీఏవీఎం) అని తన పేరే పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఈ వంగడం కరవు పరిస్థితులను, చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. సాగులో ఉన్న రకాలకన్నా అధిక దిగుబడులను ఇస్తుండటంతో ఆనోటా ఈనోటా ప్రచారంలోకి వచ్చిన ఈ వంగడం ఖ్యాతి దేశమంతటా పాకింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లయిన ఉత్తర భారతదేశంలోనూ రైతులు ఈ వంగడం సాగుపై మొగ్గు చూపుతున్నారు. (కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా? )
తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు 30 వేల ఎకరాల్లో పీఏవీఎం మునగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. దాదాపు 90 లక్షల పీఏవీఎం మునగ మొక్కలను అళగర్ స్వామి వివిధ రాష్ట్రాల రైతులకు అందించారు. గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయర్ పద్ధతుల్లో అంట్లు కడుతున్నారు.
20 అడుగులకో మొక్క...
మునగను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులను అళగర్ స్వామి అనుసరిస్తున్నారు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. భూమిని దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. తూర్పు పడమర దిశలో మొక్కలు, సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా లబిస్తుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. మునగ మొక్కలు పెళుసుగా ఉంటాయి కాబట్టి రవాణాలోను.. నాటుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 50 సెం. మీ. లోతు వెడల్పుతో గుంతలు తీసుకోవాలి. 20 రోజుల వయసు మొక్కలను నాటుకొని, గాలులకు పడి పోకుండా కర్రతో ఊతమివ్వాలి. ప్రతి మొక్కకు 5 కిలోల కం΄ోస్టు ఎరువు లేదా 10 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. కొత్త మట్టితో గుంతను నింపితే మొక్క త్వరగా వేళ్లూనుకుంటుంది.
నాటిన మరుసటి రోజు నుంచి రెండు నెలల పాటు నీరుపోయాలి. తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగుమాత్రంగా తడులు ఇవ్వాలి. పూత కాత దశలో మాత్రం సమృద్ధిగా నీరందించాలి. మిగతా సమయాల్లో పొలం బెట్టకొచ్చినట్టనిపిస్తే తడి ఇవ్వాలి. వర్షాధార సాగులో నెలకు రెండు తడులు ఇస్తే చాలు. అంతర కృషి చేసి చెట్ల మధ్య కలుపును ఎప్పటికప్పుడు తొలగించాలి. ఒకటిన్నర ఏడాది తర్వాత కొమ్మల కత్తిరింపు చేపట్టాలి. బలంగా ఉన్న నాలుగైదు కొమ్మలను మాత్రమే చెట్టుకు ఉంచాలి. పెద్దగా చీడపీడలు ఆశించవు. పశువుల బారి నుంచి కాపాడుకునేందుకు కంచె వేసుకోవాలి.
లక్షల మొక్కల సరఫరా...
ఆళ్వార్ స్వామి ప్రస్తుతం మునగ కాయల సాగుపైన కన్నా నర్సరీపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకు పైగా మొక్కలను విక్రయించారు. ఏటా రూ. 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
అళగర్ స్వామి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక సృష్టి సమ్మాన్ అవార్డుతోపాటు సీఐఐ అవార్డు, మహీంద్రా టెక్ అవార్డు వంటి దాదాపు వంద అవార్డులు ఆయనను వరించాయి. సిటీ బ్యాంక్ ఉత్తమ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డుతో సత్కరించడం విశేషం. అద్భుతమైన ఆవిష్కరణతో ఖ్యాతి గడించిన అళగర్ స్వామి స్థానిక గ్రామీణ ఆవిష్కర్తల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రైతులకు స్ఫూర్తినిస్తున్నారు.
ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..
ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. పీఏవీఎం మునగ ఆరు, ఏడు నెలల నుంచే కాస్తుంది. సాళ్లు, మొక్కల మధ్య 20 అడులు దూరంలో ఎకరానికి 150 మొక్కలు నాటుకోవాలని అళగర్ స్వామి సూచిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచి ఎకరానికి 10 – 15 టన్నుల కాయల దిగుబడి వస్తుంది. ఐదేళ్ల వయసు చెట్టు సగటున ఏడాదికి 300 కిలోల దిగుబడినిస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏడాదికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల్లో కాయల దిగుబడి 20 టన్నులే. పైగా అవి ఐదారేళ్ల పాటే నిలకడగా దిగుబడులిస్తాయి. పీఏవీఎం మాత్రం ఏడాదికి 8 –9 నెలల చొప్పున 20–25 ఏళ్లపాటు మంచి దిగుబడి నిస్తుంది. తమిళనాడు రైతులు స్థానిక మార్కెట్లలో కాయ రూ. 5 – 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను ఏటా ఎకరాకు రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కొందరు రైతులు కంచె పంటగాను ఈ వంగడాన్ని సాగు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment