కొండ ప్రాంత వాగుల పరిసరాల్లోని రైతుల్లో
ఆశలు రేపుతున్న ‘హైడ్రో లిఫ్ట్’
విద్యుత్ లేకుండానే వాగు నీటిని పొలాల్లోకి ఎత్తిపోసేందుకు
దోహదపడుతున్న వినూత్న ఆవిష్కరణ
ప్రభుత్వం ప్రోత్సహిస్తే నీటి కొరతతో పాటు విద్యుత్తు కొరత కూడా
తీర్చవచ్చంటున్న ఆవిష్కర్త శ్రీనివాస్
కొండ్ర ప్రాంత వాగుల్లో ఎత్తయిన ప్రాంతం నుంచి వాలుకు ఉరకలెత్తుతూ ప్రవహించే సెలయేళ్లు సందర్శకులకు కనువిందు చేస్తూ మనోల్లాసం కలిగిస్తుంటాయి. అయితే, ఆయా కొండల్లో వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులకు మాత్రం ఈ సెలయేళ్లలో నీరు ఏ మాత్రం ఉపయోగపడదు. పొలాలు ఎత్తులో ఉండటమే కారణం. విద్యుత్ మోటార్లతో వాగుల్లో నిటిని రైతులు తోడుకోవచ్చు. అయితే, చాలా కొండ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం ఉండదు.
డీజిల్ ఇంజన్లు పెట్టుకునే స్థోమత రెక్కాడితే గాని డొక్కడని అక్కడి చిన్న, సన్నకారు రైతులకు అసలే ఉండదు. కళ్ల ముందు నీరున్నా ఆ పక్కనే కొద్ది ఎత్తులో ఉన్న తమ పొలాల్లో పంటలకు పెట్టుకోలేని అశక్తత ఆ రైతుల పేదరికాన్ని పరిహసిస్తూ ఉంటుంది. ఏజన్సీవాసులకు శాశ్వతంగా మేలు జరిగేలా వాగుల్లో పారే నీటిని విద్యుత్తు అవసరం లేకుండా ఎత్తిపోసేందుకు తన శక్తిమేరకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని గ్రామీణ ఆవిష్కర్త పంపన శ్రీనివాస్(47) లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ జిల్లా కైకవోలు ఆయన స్వగ్రామం. చదివింది ఐటిఐ మాత్రమే అయినా, లక్ష్యసాధన కోసం అనేక ఏళ్ల పాటు అనేక ప్రయోగాలు చేస్తూ చివరికి విజయం సాధించారు.
వాగుల్లో నుంచి నీటిని విద్యుత్ లేకుండా పరిసర పొలాల్లోకి ఎత్తిపోయటంలో ఆయన సాధించిన విజయాలు రెండు: 1. పాతకాలపు ర్యాం పంపు సాంకేతికతను మెరుగుపరచి వాగుల్లో ర్యాం పంపులను ఏర్పాటు చేయటం. 2. హైడ్రో లిఫ్ట్ అనే కొత్త యంత్రాన్ని ఆవిష్కరించటం.
హైడ్రో లిఫ్ట్ ఆవిష్కరణ
వాగులో 4–5 అడుగుల ఎత్తు నుంచి చెంగు చెంగున కిందికి దూకే నీటిని ఒడిసిపట్టి పరిసర పంట పొలాల్లోకి ఎత్తి΄ోసే ‘హైడ్రో లిఫ్ట్’ అనే వినూత్న యంత్రాన్ని శ్రీనివాస్ సొంత ఆలోచనతో, సొంత ఖర్చుతో ఆవిష్కరించారు. ఈ గ్రామీణ ఆవిష్కర్త రూపొందించిన చిన్న నమూనా ప్రొటోటైప్) యంత్రాన్ని ఉమ్మడి తూ.గో. జిల్లా దివిలికి సమీపంలోని ముక్కోలు చెక్‌డ్యామ్ వద్ద విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దీని పనితీరును నిపుణులు ప్రశంసించారు.
ఇది మూడు అడుగుల పొడవు, ఒక డయామీటర్‌తో ఉంది. దీని చుట్టూతా అంగుళం బ్లేడ్లు వాలుగా అమర్చి వుంటాయి. నీటి ఉధృతికి లేదా వరదకు దుంగలు, రాళ్లు కొట్టుకొచ్చినా కదిలి΄ోకుండా ఉండేలా ఇనుప చట్రంలో ఈ చక్రాన్ని అమర్చారు. హైడ్రో లిఫ్ట్‌తో కూడిన ఈ చట్రాన్ని చెక్‌డ్యామ్ కింది భాగాన ఏర్పాటు చేశారు. సెకనుకు 20 లీటర్ల చొప్పున ఈ చక్రంపై పడేలా నీటి ప్రవాహం ఉంటే సెకనుకు 1 లీటరు నీటిని పొలంలోకి ఎత్తి΄ోయటానికి వీలవుతుందని శ్రీనివాస్ తెలి΄ారు. నీటి ప్రవాహ వేగం తక్కువగా వున్నా నిమిషానికి 40 సార్లు (ఆర్‌పిఎం) ఇది శక్తివంతంగా తిరుగుతోంది. ఈ బాక్స్ షాఫ్ట్‌నకు అమర్చిన పిస్టన్ 300 ఆర్‌పిఎంతో నడుస్తుంది.
చిన్న హైడ్రో లిఫ్ట్‌తో ఎకరానికి నీరు
నిమిషానికి 60 లీటర్ల నీటిని వాగులో నుంచి 20 అడుగుల ఎత్తుకు (40 అడుగుల ఎత్తుకైతే నిమిషానికి 40 లీటర్లు) తోడే శక్తి ఈ ప్రోటోటైప్ హైడ్రో లిఫ్ట్‌కు ఉంది. ఈ నీరు పారగడితే ఎకరంలో కూరగాయల సాగుకు సరిపోతుందని, డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఎకరానికి సరిపోతుందని శ్రీనివాస్ తెలిపారు. దీని తయారీకి రూ. 35 వేలు ఖర్చవుతుందని, వాగులో ఇన్‌స్టాల్ చేయటానికి అదనంగా ఖర్చవుతుందన్నారు. వాగు నీటి ఉధృతిని బట్టి, అధిక విస్తీర్ణంలో సాగు భూమి నీటి అవసరాలను బట్టి హైడ్రో లిఫ్ట్ పొడవు 9–16 అడుగుల పొడవు, 2–4 అడుగుల డయామీటర్ సైజులో తయారు చేసుకుంటే అధిక పరిమాణంలో నీటిని ఎత్తిపోయవచ్చునని శ్రీనివాస్ వివరించారు. గత అక్టోబర్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శోధాయాత్రలో భాగంగా పల్లెసృజన అధ్యక్షులు పోగుల గణేశం బృందం ఈ హైడ్రో లిఫ్ట్ పనితీరును పరిశీలించి మెచ్చుకున్నారన్నారు. పల్లెసృజన తోడ్పాటుతో పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నాన్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించి పెద్ద హైడ్రో లిఫ్టులను తయారు చేసి పెడితే కొండ ప్రాంతవాసుల సాగు నీటి కష్టాలు కొంతైనా తీరుతాయి.
ర్యాం పంపుతో పదెకరాలకు నీరు
ఎత్తు నుంచి లోతట్టు ప్రాంతాలకు పారే వాగు నీటిని ఒడిసిపట్టే ర్యాం పంపు సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏజన్సీవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఈ ర్యాం పంపును మెరుగైన రీతిలో వినియోగంపై శ్రీనివాస్ తొలుత కృషి చేశారు. వివిధ సంస్థల తోడ్పాటుతో కొన్ని చోట్ల ర్యాం పంపులు ఏర్పాటు చేశారు. అయితే, ర్యాం పంపు సాంకేతికతకు ఉన్న పరిమితులు కూడా ఎక్కువేనని శ్రీనివాస్ గ్రహించారు.
ర్యాం పంపు అమర్చాలి అంటే.. వాగులో 4 నుండి 6 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి పారే చిన్నసైజు జలపాతం ఉండాలి. ఆ నీటిని ప్రవాహానికి ఎదురుగా పొడవాటి ఇనుప గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం ద్వారా ఒడిసిపట్టిన నీటిని పిస్టన్ల ద్వారా ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో ర్యాం పంపు బెడ్‌పైన రెండు పిస్టన్లు అమర్చుతారు. ఒక పిస్టన్‌ను కాలితో లేదా చేతితో రెండు మూడు సార్లు కిందికి నొక్కితే చాలా ఇక వాటంతట అవే రెండు పిస్టన్లు ఒకదాని తర్వాత మరొకటి, పైకి కిందకు లేచి పడుతూ ఉంటాయి. అలా పిస్టన్లు పనిచేయటం వల్ల నీరు వత్తిడి ద్వారా పక్కనే ఏర్పాటు చేసిన ఒక నాన్ రిటర్న్ వాల్వ్‌కు అమర్చిన పైపు ద్వారా పంట పొలాలకు నీరు ఎత్తి΄ోస్తారు. రెండున్నర అంగుళాల పైపు ద్వారా నీరు వెళ్తుంది. ర్యాం పంపు నెలకొల్పడానికి రూ. 2.5–3.5 లక్షలు ఖర్చవుతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే రోజుకు కనీసం 10 ఎకరాలకు నీటిని పారించవచ్చు. విద్యుత్తు అవసరం లేదు. పిస్టన్లకు ఆయిల్ సీల్స్ లాంటి విడి భాగాలు ఏవీ ఉండవు కాబట్టి, నిర్వహణ ఖర్చేమీ ఉండదు. ర్యాం పంప్‌ల తయారీకి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (సీడీఆర్), టాటా ట్రస్టు విసిఎఫ్, సిసిఎల్ తదితర సంస్థలు ఆర్థిక సహాయాన్నందించాయి.
ర్యాం పంపుల పరిమితులు
అయితే, కనీసం 8–10 అడుగుల ఎత్తు నుంచి కిందికి నీరు పారే చోట్ల మాత్రమే ర్యాం పంపును నిర్మించగలం. ఇందుకు అనుకూలమైన చోట్లు చాలా తక్కువే ఉంటాయి. దీన్ని నెలకొల్పడానికి సిమెంటు కాంక్రీటుతో పునాదిని నిర్మించాలి. బండ రాళ్లు అనువైన రీతిలో ఉంటేనే సివిల్ వర్క్ చేయడానికి అనుకూలం. అందువల్ల కాంక్రీట్ వర్క్ కొన్నిచోట్ల విఫలమవుతూ ఉంటుంది. ర్యాం పంపులకు ఉన్న ఈ పరిమితుల దృష్ట్యా తక్కువ ఎత్తు నుంచి నీరు పారే చోట్ల నుంచి నీటిని ఎత్తిపోసే కొత్త యంత్రాన్ని తయారు చేస్తే ఎక్కువ భూములకు సాగు నీరందించవచ్చన్న ఆలోచన శ్రీనివాస్ మదిలో మెదిలింది. అలా పుట్టిన ఆవిష్కరణే ‘హైడ్రో లిఫ్ట్’.
ఇటు పొలాలకు నీరు.. అటు ఇళ్లకు విద్యుత్తు!
రంపచోడవరం, చింతూరు, పాడేరు ఐటిడిఏల పరిధిలో కొండలపై నుంచి వాగులు, వంకలు నిత్యం ప్రవహిస్తున్నాయి. వాగు నీటి ప్రవాహ శక్తిని బట్టి వాగు ఇరువైపులా ఉన్నటు భూమి ఎత్తు, స్వభావాన్ని బట్టి తగినంత రూ. 15–20 లక్షల ఖర్చుతో 9–16 అడుగుల వరకు పొడవైన హైడ్రో లిఫ్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా 6 అంగుళాల పంపుతో విద్యుత్ లేకుండానే వాగు ఇరువైపులా 50 నుంచి 100 ఎకరాల భూమికి సాగు నీరు అందించవచ్చు. అంతేకాకుండా, ఒక్కో వాటర్ వీల్ ద్వారా 15 కెవి విద్యుత్‌ను తయారు చేసి సుమారు 20–30 కుటుంబాలకు అందించవచ్చు. ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, గిరిజనాభివృద్ధి శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు హైడ్రో లిఫ్ట్ పద్ధతిని ప్రోత్సహిస్తే నా వంతు కృషి చేస్తా.
– పంపన శ్రీనివాస్ (79895 99512),
గ్రామీణ ఆవిష్కర్త, కైకవోలు, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా
– లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, ప్రతినిధి కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment