నంద్యాల(సెంట్రల్): పురుగు మందులు, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంలా మారుతోంది. ఈ నూతన వ్యవసాయం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం నిజంగానే ‘రైతును రాజు’గా మార్చుతోంది.
ఇందులో భాగంగా ఏటీఎం అనే కార్యక్రమం ద్వారా 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తూ ప్రతి నెలా కనీసం రూ.10–25 వేల ఆదాయం పొందే మార్గం ఉంది. చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ వరం లాంటిది. ఏటీఎం మోడల్ విధానంలో సాగు చేసిన పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసిన 45 రోజుల నుంచే దిగుబడి రావటం ప్రారంభమవుతుంది.
ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు వాటి పంట కాలం బట్టి దిగుబడి వస్తూ ఉంటాయి. ఫలితంగా నిత్యం కోతలే...రోజూ కాసుల గలగలలే వినిపిస్తుంటాయి. ప్రస్తుతం జిల్లాలో ఈ ఏటీఎం మోడల్లో డోన్, బేతంచెర్ల, ఆత్మకూరు, బనగానపల్ల్లె, మహానంది, చాగలమర్రితో పాటు పలు మండలాల్లో రైతులు కూరగాయ పంటలను సాగు చేసి లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 96 ఏటీఎం మోడళ్లను రైతులు సాగు చేస్తున్నారు.
ఏయే పంటలు సాగు చేస్తారంటే..
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 96 ఏటీఎం మోడల్ కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. ఈ ఏటీఎం మోడల్ కింద టమాట, వంగ, మటిక, మిరప, ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్‌తో పాటు గోంగూర, పాలకూర, మెంతాకు, కొత్తిమీర వంటి ఆకుకూరలు పండిస్తారు. వీటితో పాటు తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, చిక్కుడు వంటివి సాగుచేస్తున్నారు. వీటిలో కొన్ని కూరగాయలు సాగు చేసిన 25 నుంచి 30 రోజులకు కోతలు ప్రారంభమవుతాయి. మరికొన్ని 45 రోజులకు ఇంకొన్ని 90 రోజులకు దిగుబడి వస్తుంది. ఇలా ఏడాదంతా కూరగాయలను పండించుకుంటూ డబ్బులను సంపాదిస్తున్నారు.
ఉన్న ఊర్లోనే...
తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కాయగూరలు, ఆకుకూరలను తాము ఉన్న గ్రామంలోనే మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ ధరలకు అనుగుణంగా కిలో చొప్పున వినియోగదారులకు అందిస్తున్నారు. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం కషాయాలు, జీవామృతం, ఘనామృతంతోనే పండించే కూరగాయలు కావటంతో ప్రజలు వీటిని తీసుకునేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారని రైతులు తెలిపారు. అందులోనూ ఉన్న ఊర్లోనే కళ్లెదుటే పండిన కూరగాయలు కాబట్టి తాజాగా ఉండటంతో అందరూ కొంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన ఏటీఎం మోడళ్లలో సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులన్నీ ప్రాచీన ప్రకృతి సేద్య విధానంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తక్కువ విస్తీర్ణంలో సాగు...పైగా ఖర్చు కూడా తక్కువగా ఉండటంతో చాలా మంది సాగు చేస్తున్నారు. పలు దశల్లో ఉన్న ఈ పంటల ఫలితాలు అద్భుతంగా ఉంటున్నాయి. మేము కూడా సిబ్బందితో ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా 96 మోడళ్లు సాగులో ఉన్నాయి.
– నరేంద్రారెడ్డి, ప్రాజెక్టు మేనేజర్, ప్రకృతి సేద్యం
Comments
Please login to add a commentAdd a comment