అభిప్రాయం
కనీస మద్దతు ధరల చట్టం... దశాబ్దాలుగా రైతులు కంటున్న కల! ప్రపంచంలో గుండు సూది నుంచి విమానం వరకు ఏ వస్తువు కైనా ధరను నిర్ణయించే అధికారం వాటిని ఉత్పత్తి చేసే వారికే ఉంటుంది. కానీ ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసే పంటలకు ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు. రిటైల్ ధరలలో మూడో వంతు కూడా సాగు దారులకు దక్కని దుస్థితి కొనసాగు తోంది. రైతులు పండించే పంట ఉత్పత్తులపై ఆధారపడి జీవించే దళారులు, టోకు, రిటైల్ వ్యాపారులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వర్గాలు మాత్రం కోట్లు గడిస్తు న్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసే కెచప్, మసాలా వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్టులకు ఎమ్మార్పీలు ఉంటాయి. వాటికి ప్రాథమిక ముడి సరుకైన రైతు పండించే పంటలకు ఉండవు. అదే విషాదం!
ఏటా పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే తెగుళ్లు, పురు గులు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్ మాయాజాలం కారణంగా పంట కోతకొచ్చే నాటికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పంట సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ డాక్టర్ స్వామినాథన్ కమిటీ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. వాస్తవానికి 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్పీ)తో చట్టబద్ధత కల్పించాలనీ, ఈ విషయాన్ని ప్రభుత్వం రైతుల ఆర్థిక కోణంలో చూడాలనీ రైతులు కోరుతున్నారు. అయితే ఇందుకు ఏమాత్రం తలొగ్గని కేంద్రం ఏటా 10–15 పంటలకు మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోంది. ఎమ్‌ఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే కేంద్రంపై ఏటా రూ. 12 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని నీతి అయోగ్ చెబుతున్న విషయాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి ముఖం చాటేస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయనం ప్రకారం... డెయిరీ రంగంలో పాడి రైతులు తమ ఉత్పత్తులకు రిటైల్ ధరలలో 60–70 శాతం పొందగలు గుతున్నారు. మాంసం రిటైల్ ధరలో 60 శాతం పొందుతున్నారు. టమోటా రైతులు 33 శాతం, ఉల్లి రైతులు 36 శాతం పొందుతున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లకు 31 శాతం, మామిడి పండ్లకు 43 శాతం, బత్తాయి, కమల వంటి పండ్లకు 40 శాతం పొందుతున్నారు. మార్కెట్లో కిలో రూ. 50–75 మధ్య పలికే బియ్యం (ధాన్యం) పండించే రైతులకు మాత్రం ఆ ధరలో కనీసం 10–20 శాతం కూడా దక్కని దుఃస్థితి నెలకొంది.
రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77 జాతీయ నమూనా సర్వే వెల్లడిస్తోంది. ఈ సర్వే ప్రకారం దేశంలో సన్నకారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4 వేలకు మించిలేదు. ఆదాయాలు పెరగకపోవడంతో వారి రుణభారంలో తగ్గుదల కనిపించడంలేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక, రుణ భారం తట్టుకోలేక రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు ఏటా పెరుగు తున్నాయి.
చదవండి: నీటిలో తేలియాడే రాజధానా?
స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గడచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా... కేంద్రం ప్రకటించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడమే కాదు... మార్కెట్‌లో ధర లేని సమయంలో ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’ కింద మద్దతు ధర దక్కని ఉత్పత్తులను కొను గోలు చేసి మద్దతు ధర దక్కేలా కొంత మేర కృషి చేయగలిగింది ఏపీలో గత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం. గ్రామస్థాయిలో ఏర్పాటైన ఆర్బీకే వ్యవస్థ, రైతులకు వెన్నుదన్నుగా నిలవగా, వాటికి అనుబంధంగా దాదాపు రూ. 16 వేల కోట్ల అంచనా వ్యయంతో కోల్డ్ స్టోరేజ్‌లు, కలెక్షన్ రూములు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు బీజం పడింది. మద్దతు ధరల నిర్ణయం, కల్పన, అమలు కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఏపీ ఫామ్ ప్రొడ్యూస్ సపోర్టు ప్రైస్ ఫిక్సేషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్టు–2023’కు రూపకల్పన చేసింది. కానీ అధికారుల తీరు వల్ల అసెంబ్లీలో చట్టరూపం దాల్చలేక పోయింది.
చదవండి: విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
ఏపీ తయారు చేసిన చట్టాన్ని మరింత పకడ్బందీగా జాతీయ స్థాయిలో తీసుకొస్తే రైతులకు ఎంతోమేలు జరుగుతుంది. ఈ విషయంలో జాప్యం చేసే కొద్దీ మద్దతు ధర దక్కని రైతులు వ్యవసాయానికి మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత వ్యవసాయ దారుల్లో 60 శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదలి వేయాలని నిర్ణయించుకున్నట్లు దేశంలోని 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఓ జాతీయ సర్వే సంస్థ ఇటీవల తేల్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు వేసి ఈ రంగాన్ని బలోపేతం చెయ్యాలి.
- తలకోల రాహుల్ రెడ్డి
మార్కెట్ ఎనలిస్ట్, కన్సల్టెంట్
Comments
Please login to add a commentAdd a comment